భూకంపం

 తెల్లారగట్ల శ్రామికదినోత్సవమైన మే ఒకటి తెల్లారగట్ల ` ‘‘ఏయ్‌ మొద్దూ! ఏం రోగమొచ్చిందీ రోజు. ఇంకా దున్నపోతులా పడుకున్నావ్‌? లేచి త్వరగా టిఫిన్‌ చేసి తగలడు’’ విమల జబ్బమీద కొట్టినట్లుగా తట్టి లేపి చెప్పాడు వెంకట్రావ్‌.
    వెల్లకిలా తిరిగి, లైటు వెలుతురికి ఇబ్బందిగా మోచేతులు రెండూ ముఖానికడ్డు పెట్టుకుంది విమల. గడియారం ఐదు చూపిస్తోంది.
    ఎంత మార్ధవంగా లేపాడు! తనెప్పుడూ ఐదు ముందే లేస్తుంది. లేకపోతే పనులు తెమలడం కష్టం. ఈ మధ్య ఎందుకో ఇదివరలా ఉదయమే లేవ లేకపోతోంది.
    వెంకట్రావ్‌ లేపిన తీరు, లేపుతూ చిట్లించిన అతని వికారపు ముఖం చూస్తే ` వీధి చివర మొగలో మున్సిపాలిటీ చెత్త కుండీలో పడిన ఎంగిలి విస్తరాకుల కోసం వాటాకొచ్చిన ఇతర వూరకుక్కల్ని తరిమేసేటందుకు కోరలన్నీ వికృతంగా బయటపెట్టి గుర్‌మంటూ బెదిరించే పెద్ద గజ్జివూరకుక్క ముఖం గుర్తొస్తుంది. మొగుడి ముఖార విందాన్ని భారతనారి అలా వూరకుక్క ముఖంతో పోల్చడం ఎంతవరకూ సబబో తనకి తెలీదు. కానీ ముఖం అలా వికారంగా చిట్లించి భార్యతో మా(పో)ట్లాడే ఏ మొగాడి ముఖమైన సరే కాట్లాడే ఊరకుక్క ముఖాన్నే గుర్తుకు తెస్తుందనిపిస్తుంది.
    పెళ్ళికి ముందు తను వైవాహిక జీవితం గురించి కలల్లో తేలిపోతూ.
    జనవరి ఫస్ట్‌న తన మొగుడు ` బుచ్చిబాబు లాంటి తన మొగుడు తన చెవిలో గుసగుసగా ‘‘విష్యూ ద హేపీ యస్ట్‌ న్యూయిర్‌ డార్లింగ్‌ విమ్మీ! అపుడే లేవకు, నాకోసం రోజూ నువ్వు బోలెడంత కష్టపడిపోతున్నావ్‌. ఇవ్వాళ నువ్వసలు వంటింట్లోకి అడుగుపెట్టొద్దు. నేనే నీకివాళ నీకిష్టమైనవన్నీ వండిపెడతా. ముందీ బెడ్‌ కాఫీ తీసుకో. నీకు తీపెక్కువ వుండాలంటావని డబ్బాడు చక్కెర కలిపాను’’ అంటాడు తనని సుతారంగా లేపుతూ.
    ‘‘నా బుచ్చిప్రియే! లోకంలో ఇంకే సంగతులూ లేనట్టు ప్రొద్దుట లేస్తూనే వెధవ వంటిల్లూ, తిండి సంగతేనా పాడు పొట్టలకి? నువ్వు వండి పెట్టింది నేను తిని బతికి బట్టకట్టడమే! ఇది కాఫీయా ` కుంకుడు కాయల పులుసా? డబ్బాడు చక్కెర కలిపావా నాధా! నయం డికాక్షన్‌కి బదులు కిరసనాయిల్‌ కలపలేదు. అసలు కొత్త సంవత్సరం రోజున వంటేమిటి? వంటింటికి తాళం వేసెయ్‌! ఈవాళ మేఘమాల రెస్టారెంట్లో లంచ్‌! అట్నుంచి మాట్నీకి రాత్రి జురాసిక్‌ పార్క్‌ రెస్టారెంట్‌లో డిన్నర్‌. ప్రస్తుతానికి బ్రేక్‌ఫాస్ట్‌గా నిన్ను ముద్దుల్లో నంచుకుని కొరక్కుతింటా. ఆ తలకాయనిలా వంచు’’ అంటుంది.
    అంతేకాదు అసలే రోజయినా వంట చేయాలనిపించకపోతే `
    ‘‘ఇదిగో! బుచ్చీ! ఈవాళ నాకు పెసరట్టు వేసే మూడ్‌ లేదు. పప్పు నానబోశాను. రుబ్బుకుని కావాల్సినన్ని  పెసరట్లు  వేసుకో.  ఆఖర్న నాకో రెండుంచు. ఉల్లిపాయలు అడ్డంగా తరిగితే కళ్ళు మండి ఏడుస్తావ్‌. నేనీ బాల్కనీలో కూర్చుని దారినబోయే మగాళ్ళందర్నీ ఎగాదిగా చూస్తుంటాను. పిల్లల్నీ, ముసలాళ్ళనీ వదిలేస్తాన్లే’’ అంటుంది.    ‘‘షరే నీ ఇష్టం. పెసరపప్పు చేతుల్తో రుబ్బాలా? కాళ్ళతో రుబ్బాలో చెప్పి వెళ్ళు’’ అంటాడు.
    తనకి జాలేసి ‘‘కాళ్ళతో కాదు ` తలకాయతో రుబ్బాలి. నన్నుద్ధరించడానికి పిడత మొఖం వేసుకుని ఎలా పుట్టావో కదా! అల్లం, జీలకర్రా, ఉల్లిపాయలూ వేసి ఎర్రగా నేను చేసి పెడతాను కానీ, నేన పప్పు రుబ్బుతూంటే నువ్వు ఎదురుగా పొత్రం మీద ఓ చెయ్యేసి తోడు కూర్చో నా కళ్ళలోకి చూస్తూ పిండి మాత్రం నా బుగ్గలకి పామబోకు’’ అంటాను అనుకునేది.
    తన తెలివితేటలు, చురుకుదనం, హాస్యప్రియత్వం చూసి స్వీట్‌హోం బుచ్చిబాబు లాంటి సున్నిత హృదయుడైన ప్రేమికుడు భర్తగా దొరుకుతాడనికలలుకంది. కానీ లాటరీలాంటి పెళ్ళిలో తండ్రివ్వగలిగే కట్నానికి సరసం విరసం తెలీని, పనికి వళ్లొంగని, గంట్లు కొట్టిన కొత్త రుబ్బురోల్లాంటి ముఖం వున్న సీరియస్‌ వెంకట్రావ్‌ తన మొగుడై కూర్చున్నాడు.
    కన్నెకలలు భళ్ళున ముక్కలై మనసంతా గుచ్చుకున్నాయి.
    పెళ్ళయిన కొత్తలోనే ` దొడ్లో పనిచేసుకుంటూ `
    వంటింట్లో స్టౌ మీద పాలు పొంగుతాయేమో ఒక్కక్షణం చూడమని కోరినందుకు వెంకట్రావ్‌` ‘‘అటువంటి ఆడపన్లు నాకు పురమాయించబోకు నాకసహ్యం!’’ అనేశాడు. తనతో సీరియస్‌గా వుండే వెంకట్రావ్‌ తల్లితో మాత్రం గంటల తరబడి నవ్వుతూ సరదాగా కబుర్లు చెబుతాడు!
    విత్తనం ఒకటేస్తే మొక్క మరొకటి మొలుస్తుందా అన్నట్టు ముగ్గురు మొగపిల్లలూ తండ్రికి డిటో! వాళ్ళు నాన్న కొడుకులు. నానమ్మ మనవలు. తనకేమీ కారు! బుచ్చిబాబునీ, పిల్లల్నీ తన కనుసన్నల్లో తిప్పుకుంటూ పిల్లల కోడిలా తిరగాలని సంబరపడేది. పిల్లలు ఎపుడైనా వంటింట్లోకి వస్తే తన అత్తగారు పిప్పళ్ళ బస్తాలాటి తన అత్తగారు `
    ‘‘మగ వెధవలు. మీకు వంటింట్లో ఏం పనిరా?’’ అని తరిమేసేది. తను వంటింట్లో అడుగు పెట్టదు. కొడుకునీ, మనవల్నీ పెట్టనీయదు.
    వెంకట్రావ్‌ ఏడున్నరకి బద్ధకంగా కొండచిలువలా వళ్ళు విరుచుకుంటూ లేచే వేళకి బెడ్‌కాఫీ ప్రత్యక్షం కావాలి. పళ్ళు తోముకొచ్చేసరికి టిఫినూ, మళ్ళా కాఫీ రెడీ కావాలి. ఎనిమిదన్నర అయ్యేసరికి మళ్ళీ టిఫిన్‌ రెడీ కావాలి. రాత్రి ఎనిమిదన్నర అయ్యేసరికి డిన్నర్‌ రెడీ అవ్వాలి. ఏది ఆలస్యమైనా, సరిగా లేకపోయినా, రుచులు తుక్కువైనా గణాచారిలా చిందులు తొక్కేస్తాడు.
    అతగాడూ, పిల్లలూ ఆఫీసుకీ, స్కూళ్ళకీ వెళ్ళాకా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ విసిరేసే విడిచిన బట్టలూ, తడి తువాళ్ళు ఏరి చాకిరేవుకి ఉపక్రమిస్తుంది. ఆఫీసు నుండి వచ్చే దార్లోనే కూరల మార్కెట్టున్నా, కూరల సంచీ మోసుకురావడం అతనికి నామోషీ అట. తనే బయటకు దూరం వెళ్ళి కూరలూ, కిరాణాలూ తెచ్చుకోవాలి.
    తన కలల్లోని బుచ్చిబాబు చచ్చిపోయాడు. ‘‘ఇంతేనా! ఇక ఈ జీవితమింతేనా?’’ అని విరక్తిగానే రాగయుక్తంగా పాడుకునేది. ఇపుడు ఆ పాటా మానేసింది. జీవితం యాంత్రికంగా, నిస్సారంగా దొర్లిపోతోంది.
    నాలుగు నెలల క్రితం జనవరి ఒకటో తారీకు తెల్లారగట్టా ఇలాగే తనకి నలతగా వళ్ళు నెప్పులుగా వుండి తెల్లారగట్ల ఐదు గంటలకీ లేవలేక పోయినందుకు వెంకట్రావ్‌ కొట్టినట్టుగా తట్టి లేపాడు ముఖం వికారంగా చిట్లించి. భార్యకి ఎంత గొప్ప విష్యూ హేపీ న్యూ ఇయర్‌! బారెడు పొద్దెక్కితే గానే లేవని వెంకట్రావ్‌ ఐదుకల్లా లేచి తనని లేపడం చాలా విస్మయపరచింది. కారణం విన్నాకా తనకి నవ్వొచ్చింది. మోకాల్లోతు అశుద్ధంతో నిండి వుండే రాష్ట్రాన్ని అర్జంటుగా శ్రమదాన కార్యక్రమాలతో ఉతికారేసి జన్మభూమిని తళతళలాడే ధవళభూమిగా మార్చెయ్యాలని కొత్త బిచ్చగాడి ఉత్సాహంతో ముఖ్యమంత్రి ఉద్యోగస్థుల ముడ్డిమీద తన్తే, తప్పని సరి తద్దినంలా విసుక్కుంటూ, తిట్టుకుంటూ శ్రమదాన కార్యక్రమానికి వెళ్ళడానికి లేచాడన్నమాట!
    తను లేచి తయారయ్యే సరికల్లాభార్య ముందే లేచి జీడిపప్పు వేసిన ఉప్మా పెసరట్టు రెడీ చెయ్యనందుకు నానా రాద్ధాంతం చేసి కోపంతో వెళ్ళిపోయాడు. కష్టపడే వెర్రినాగన్నకి కాస్త టిఫిన్‌ చేసి పెట్టే దిక్కు లేకపోయిందని అత్తగారు ఆ రోజంతా సాధిస్తూనే వుంది.
    తను జవాబివ్వలేదు ఇద్దరికి కూడా. ఇంగితం లేకుండా మాట్లాడేవాళ్ళకి జవాబివ్వడం కన్నా బుద్ధి తక్కువ మరొకటి వుండదని తనకి తెలుసు. కానీ ఎక్కడో మనసు లోపలి పొరలు బాగా గీరుకుపోయాయి.
    జన్మభూమి శ్రమదాన కార్యక్రమాల కోసం అసలే అంతంత మాత్రం సాగే స్కూళ్ళలోని మాష్టర్లని రోడ్లమీదకు తోలెయ్యడంతో పిల్ల వెధవలు ముగ్గురూ స్కూల్లేక నానా అల్లరీ మొదలెట్టారు. పెద్ద వెధవ ఎలా ఉచ్చువేసి పట్టాడో గానీ, దొడ్లో వేపచెట్టుమీద తారట్లాడే ఉడత పిల్లని పట్టాడు. దాన్ని వెదురు పుల్లల్తో చేసిన పంజరంలో బంధించాడు అసలు ఆ కుర్రవెధవకి అంత నేర్పు ఎక్కడిదో తనకే తెలీదు. తనకాశ్చర్యం వేసింది. చిన్నప్పుడు తనకోసారి సీతాకోక చిలుకని పట్టుకోవాలనిపించి, కూడా పడి పరిగెత్తి బోర్లా పడి దెబ్బలు తగిలించకుందేగానీ దాన్ని మాత్రం పట్టుకోలేకపోయింది.
    పదమూడేళ్ళ కొడుకుని చూసి ఈ మగవెధవలకి లోకువ. జీవుల్ని ఉచ్చువేసి పట్టి స్వేచ్ఛను హరించే నేర్పు పుట్టుకతోటే వస్తుంది కాబోలని ఆశ్చర్యపడిరది.
    పాపం రా! దాన్ని వదిలెయ్‌! అంటే వాడు పేచీ. కాసేపు వాడు దాంతో ఆడుకుంటే నీ సొమ్మేం పోయిందే అని నాయనమ్మ వాడికి వత్తాసు.
    ఆ పిల్ల ఉడతని చూసి తనకి జాలేసింది. ఉచ్చులోంచి ఎలా తప్పించుకోవాలా అని దాని చిన్న పరిధిలో అది విశ్వప్రయత్నాలు చేస్తోంది. బుల్లి బుల్లి పళ్ళతో వెదురుపుల్లల్ని చీల్చి బయట పడాలని అది చేస్తున్న ప్రయత్నాలని చూసి తనకి ముచ్చటేసింది. పెద్దాడు దానికి శెనగపప్పు తీసుకొచ్చి వేస్తే తినకుండా నిరాహార దీక్ష మొదలెట్టింది. కిందటి జన్మలో గాంధీగారి ఆశ్రమంలో పుట్టిందేమో!
    నవ్వుతూ ‘‘భయంలేదే! నేనున్నానుగా నీకు!’’ అంటూ దానివీపు మీద మెల్లిగా నిమరాలనిపించింది. తనకి. కానీ తను దాన్ని ముట్టుకోబోతే తన వంక ఎంత రోషంగా చూసింది. బుల్లి బుల్లి మెరిసే గుండ్రని చిన్న కళ్ళతో!
    దాని రోషపు కళ్ళల్లో…
    ‘‘నన్ను చూసి నవ్వుతున్నావా గురివింద పూస లాగ? నువ్వూ నాలాటి బందీవే! వంటింటి వుచ్చులో బతుకుతున్న బందీవి!’’ అన్నట్లుంది దాని చూపు. అది మాట్లాడగలిగితే తప్పకుండా ఆ రెండు మాటలే అంటుందనిపించింది.
    రెండ్రోజుల తర్వాత అది పంజరంలో లేకపోవడం గమనించింది. బందిఖానా ఓడిపోయి స్వేచ్ఛ నెగ్గినందుకు తనకి చాలా సంతోషం వేసింది. కానీ ఉడతని తనే తప్పించేసిందని పెద్ద కొడుకు చాలా పేచీ పెట్టాడు. ఆ ఉడత ఛస్తే మళ్ళా వాడికి దొరకకూడదనుకుంది. అప్పటి నుంచీ ఎందుకో చాలాసార్లు ఆ ఉడత ఉదంతం గుర్తొచ్చి మనసు బాధతో మూల్గేది. ఈ తెల్లారగట్లే అదెందుకు గుర్తొచ్చినట్టు!?
    వెంకట్రావ్‌ బాత్రూంలో నీళ్ళాడుతున్నాడు కాబోలు బకెట్ల దబదబ శబ్దం వినిపిస్తోంది. ఈ రోజు నుంచి రెండో విడత జన్మభూమి కార్యక్రమాల ప్రహసనం మొదలు కాబోలు. ఫెడీల్మని తన్నే వాళ్ళుంటే ఈ సోమరిపోతులు కూడా సుప్రభాతాన్నే లేచి శ్రమదాన విధులకి హాజరవుతారన్నమాట!
    స్వంత ఇంట్లో చీపురు పట్టుకోవడం ఆడంగి పనిగా భావించే ఈ వీరులు వీధుల్లో పడి రోడ్లు ఊడుస్తారట! తన కంచం తను కడుక్కోవడం నామోషీగా భావించే ఈ ధీరులు వీధుల్లోని పెంట కుప్పలు ఎత్తుతారట!
    కట్టుకున్నదానికి ముక్కు పుడకచేయించలేని వాడు ఉంచుకున్నదానికి వడ్డాణం చేయించినట్టు. ఏ వర్కు కల్చరైనా మొదట వంటిళ్ళల్లో పని పంపకంతో మొదలవ్వాలనే ఇంగిత జ్ఞానం లేని ఈ హంగామా గాళ్ళు జన్మభూముల్ని శ్రమదానాల్తో నందనవనాలు చేస్తారట!
    ‘‘ఏయ్‌ మొద్దూ! ఇంకా లేవలేదూ? నీకేమైనా పిచ్చెక్కిందా? ఇందాకటి నుండి లేపుతుంటే ఎప్పుడు టిఫిన్‌ తయారుచేస్తావింక?’’
    వెంకట్రావ్‌ లోపలికొచ్చి తడి తువ్వాలు ముద్దగా పక్కమీదకు విసిరేసి షూటింగ్‌కీ తయారయ్యే ఎక్‌స్ట్రా నటుడిలా దట్టంగా పౌడర్‌ అద్దుకుంటూ అరిచాడు.
    ‘‘మిస్టర్‌ వెంకట్రావ్‌!’’
    ముఖం మీద నుండి మోచేతులు తియ్యకుండానే జవాబిచ్చింది విమల. కొత్త పిలుపుతో నెత్తిన పిడుగుపడ్డట్టు తుళ్ళిపడ్డాడు వెంకట్రావ్‌.
    ‘‘…చాలాకాలం పిచ్చిదానిగానే బతికాను. మీ జన్మభూమి శ్రమదాన కార్యక్రమాలు ఇపుడిపుడే నా పిచ్చిని వదలగొట్టాయ్‌. ఈ ఇంట్లో తినే నోళ్ళు ఎన్నున్నాయో వాటికి రెట్టింపు చేతులున్నాయ్‌. అయినా అందరి పొట్టలకి కావలసిన తిండి తయారీకీ, ఇల్లు ఇల్లులా వుంచడానికీ శ్రమదానం చేసేవి నా రెండు చేతులు మాత్రమే. అర్థం లేని నా అనవసర శ్రమదానానికి ఇంక మంగళం పాడక తప్పదు.
    ఈ రోజు నుండి ఇంట్లో ఎవరెవరు ఏ పన్లు పంచుకుంటారో నిర్ణయించకుని వంటకు అన్నీ రెడీగా చేసి వుంచితే లేచి వంట చేస్తాను. లేకపోతే ఎవరి పొట్ట సంగతి వారు చూసుకోవాల్సిందే!’’
    రంగులు మారుతున్న వెంకట్రావ్‌ ముఖారవిందాన్ని రెండు చేతుల సందుల్లోంచి గమనిస్తోంది విమల. ఉచ్చుల్లో పడ్డ గుంటనక్కలా బిత్తరిచూపులు చూస్తూ వెలవెలబోతున్న వెంకట్రావ్‌ ముఖాన్ని చూస్తూంటే తెరలు తెరలుగా పొంగుకు వస్తూన్న నవ్వుని ఆపుకోడానికి ప్రయత్నిస్తోంది. వెంకట్రావ్‌ లాతూర్‌ భూకంపంలో సర్వస్వం కోల్పోయి ఏకాకైనా బికారిలా వెర్రిచూపులు చూస్తూ జుట్టు పీక్కుంటుంటే విమలకి నవ్వు బరస్టయి కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి.
    భూకంపాలు తెల్లారగట్లేగా వచ్చేది!

 

  – వైశాలి డి.ఆర్.ఇంద్ర

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

5 Responses to భూకంపం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో