చెఱువు ఒడ్డున…

             గురువారం గోణిబీడు సంత! మా తోటపనులకు ఆ రోజు సెలవ ఉంటది. సెలవ దొరికితే కాలం గడిపేది ఎలాగబ్బా అనే చింత నాకు గడచిన ఇరవై ఐదు సంవత్సరాలలో ఒకరోజూ కలగలేదు. సాయంకాలం నిద్ర వచ్చేవరకూ ఏదో ఒకదానిలో తల్లీనుడైయ్యేంతగా నా చుట్టుపక్కల ఏదైనా రోమాంచిక ఘటనలు నడుస్తూనే ఉంటుండేవి. నేను, టామి ఇంటి మెట్లు దిగి బయటపడితే మా మలెనాడులోని నిత్య హరితవర్ణ అడవి ఆకుపచ్చజ్వాలను రేపినట్లుగా శోభాయ మానంగా మెరుస్తుండేది. వానరాని, రాకపోనీ… మే మాసంలో మా మలెనాడులోని పెద్ద పెద్ద వృక్షాలు తమ వేళాపట్టిక ప్రకారం చిగురించి పూలుపూసి నయనానంద కరంగా ప్రజ్వలిస్తుండేవి. బహుశః ఈ వృక్షాల వేళ్ళు నేరుగా బోర్‌వెల్‌లోని రిగ్‌లాగ రంధ్రాన్ని తోడుకొని నీళ్ళు లభించే పాతాళం అంచువరకూ వెళ్ళి ఉంటవి అన్నట్లుగా నాకు తోచుతుండేది. అందుకే ఆ వృక్షాలు వానకని ఎన్నడూ ఎదురుచూసేదే లేదు.

           నాకు టైమ్‌పాస్‌ అయ్యేది ఎలాగబ్బా అనే చింతకన్నా కాలం వేగం వేగంగా గడిచిపోతుంది కదా అనేదే ప్రముఖ చింతగా ఉంటుండేది! నేను మాతోటకు వేసిన కంచెకు కొద్ది దూరంలోనే కుడి పక్కన ఉండే పురాతన కాలంనాటి చెఱువు వద్దకు ఒకరోజు బయల్దేరాను. వెళ్ళేటప్పుడు ఆ దారి మధ్యలో వడ్రంగిపిట్ట వడ్డెర కులస్థుడు ఒక పెద్ద బండరాయి మీద సుత్తితో కొట్తున్నట్లుగా ఎండిన చెట్టులోని కొమ్మకు డమడమ శబ్దం చేస్తూ ముక్కుతో కొట్తుంది విన్పించింది నాకు. చమత్కారంగా ఉన్న ఆ వడ్రంగిపిట్ట పనితనాన్ని కొంచంసేపు చూసేందుకని, నేను ముందస్తుగా చేసుకొన్న నా నిశ్చిత కార్యక్రమాన్ని కొద్దిగా మార్పు చేసుకోవాల్సి వచ్చింది అప్పుడు. ఆ వడ్రంగిపిట్ట ఎంత వేగంగా ఆ చెట్టుకొమ్మను కొట్తుందంటే, ముక్కుతో అది కొట్తున్నప్పుడు దాని తలగాని, గొంతుగాని నాకంటికి కనబడటలేదు. తలనే సుత్తిలాగ చేసుకొని అది ఆ చెట్టుకొమ్మను కొట్టేందుకు ఉపయోగిస్తున్న దాని విధం చూసిన నాకు భయమేసింది. మొన్న మా ఇంటి సింహద్వారం దాటేటప్పుడు, ఆ ద్వారంకున్న పై భాగం నా నుదురుకు మెల్లగానే కొట్టుకొన్నా, నా కళ్ళు బైర్లు కమ్మి పావుగంటసేపు చతికిలబడి ఆ బాధను నివారించుకొన్నాను. ఆ వడ్రంగిపిట్ట రపరపా ఆ చెట్టుకొమ్మను తలనుంచి బాదుతుంది చూసిన నాకు కళ్ళు తిరిగినట్లైంది. ఆ పక్షికుండే తలలోని మెదడు ఏవిధంగా ఆ నిరంతర బాదుడుకు సహకరిస్తదో ఏమో? దాని మెదడు చిట్లి రక్తస్రావం కాకుండా అది ఇంకా చావకనే ఎలాగున బతికే ఉంది? ఈ నా మాటను అటుండనీయండి, ఈ పక్షి ఆ చెట్టుకొమ్మల లోపలే ఉండే పురుగులు (చెదలు) ఇక్కడే, ఈ వైపునే ఉన్నవని అది ఎలాగ కనిపెట్టి రంధ్రాన్ని చేస్తుంది అనే ప్రశ్న నాకు ప్రశ్నగానే మిగిలింది కదా! ఇదంతట్నీ ఆలోచన చేస్తే నా చుట్టు పక్కల ఉండే పర్యావరణం మరింత రహస్యమైందిగా నాకు తోచుతుంది. పుకవోకా (జపాన్‌ దేశంకు చెందిన పర్యావరణ శాస్త్రవేత్త)గారు చెప్పినట్లుగా, ఈ పరిసర పర్యావరణంనంతా పూర్తిగా తెల్సుకొంటానని మున్ముందుకు దూసుకెళ్ళేది మూర్ఖతనంగానే ఉంటదేమో! ఉత్తిగనే మనకు సరిపడేంత మాత్రమే తెల్సుకొని మిగిలినదాన్ని చూసి ఆశ్చర్యపడుతూ నోరెళ్ళ బెట్టేదే ఉత్తమంకదా! వడ్రంగిపిట్ట తలలోపల ఏమేమి ఉపకరణాలు (పనిముట్లు) ఉన్నవో, ఎలాగున అవి దాని శరీరంలో రచన అయినవో ఎవరికి తెలుస్తవండి?

           కొంచం సేపు దాని ముక్కునుంచి సుత్తి దెబ్బలులాగ పడుతున్న వేట్లును చూస్తున్న నేను మరెంతో సమయం అక్కడే నిలిచి కాలం గడిపేది ఆపిట్ట ఏకాగ్రతకు భంగం వాటిల్లుతదని భావించి దృఢంగా మనస్సును మరొకవైపుకు మళ్ళించి ఇక ముందుకే సాగిపోయాను.
మా తోట చెంతనుండే ఆ పురాతన కాలంనాటి చెఱువును నేను ఎంతోకాలం వరకూ చూడనే లేదు. దానిచుట్టూ అడవి గులాబి మరియు గోరింటాకు చెట్లు భయంకర పొదలులాగ దట్టంగా పెరిగి ఉన్నందున అక్కడొక చెఱువు ఉందనేది ఎవరికీ తెల్సేది లేదు. ఒకసారి ఆ లోపల్నుంచి ”అయ్యో” అనే ఒక ఆర్తనాదం పదే పదే వినబడుతున్నందున, అప్పుడు నేను భయంకరంగా పెనవేసుకొన్న ఆ గులాబి పొదల నడుమ నీళ్ళదాహం తీర్చుకొనేందుకని బర్రెలు దారి చేసుకొన్న ఆ సొరంగంలో   పాకుకొంటూ వెళ్ళాను. ఆ సొరంగం దారి నేరుగా నన్ను ఆ చెఱువు ఒడ్డుకు తీసుకెళ్ళింది.  

           నీళ్ళపాము ఒకటి పెద్ద డొంగరు కప్పను పట్టి, దాన్ని మింగేందుకు ఆపసోపాలు పడుతుంది. తననోటిబారు, వెడల్పులలోని జ్ఞానమే లేని ఆ తిక్కలపాము సుమారుగా ఒక కేజి బరువుతో ఉండే ఈ పెద్దసైజ్‌ కప్పను పట్టుకొంది కదా! కప్పేమో గాలిని బాగా పీల్చి పొట్టను ఫుట్‌బాల్‌ బంతిలాగ ఉబ్బించుకొని, నీళ్ళపాము దాన్ని మింగేది ఇక అసాధ్యమన్నట్లుగా చేసి, హహహా అనేటట్లుగా ఒక విధంగా బెక బెక అంటుంది. నన్ను చూసిన ఆ నీళ్ళపాము గలిబిలిగా ఆకప్పను ఊసేసి దూరంగా పారిపోయింది. పాము కోరల్నుంచి బయటపడిన ఆ మొద్దుకప్ప ఇక ఇప్పుడు పరారైయ్యేదాన్ని చేయకనే అక్కడే కూర్చుని పిలిపిలిగా నన్ను చూస్తుంది.

               ఏదో కాలం (యుగం) నాటి పాత చెఱువని మీకు ముందే తెల్పాను కదా! దాని చుట్టూ ఒక చెఱువు ఉందనేది కనబడనట్లుగా ఆ ఒడ్డులో దట్టంగా పొదలు పెరిగినవి కదా! ఆ ఒడ్డు అంచునంతా ఆ పొదల రెమ్మలే వ్యాపించి అలుముకొని ఉన్నవి. మా ఊర్లోని బర్రెలు ఎండవేడి అతిగా అయినప్పుడు ఆ చెఱువు చెంతకు వచ్చి, ఒడ్డునున్న బురదలో ”వాయ్‌” అని సంతోషంగా అరుస్తూ పొర్లుతుండేవి. నాకు ఖాళి సమయం దొరికినప్పుడల్లా అక్కడే ఉన్న నేరేడు చెట్టుకొమ్మ మీద కూర్చుని నిశ్శబ్దంగా చెఱువు ఒడ్డున తిరుగుతుండే నూరారు రకాల జీవుల చలనవలనాల్ని చూస్తుండేవాడ్ని. అక్కడికి చేరిన తక్షణమే మా టామి చేసే మొదటి పని ఏమిటంటే ఆ ఒడ్డున నిలబడి చేపలకని ధ్యానం చేస్తుండే కొంగల వెంటబడి వెళ్తుండేది. టామిలోని ఈ దుందుడుకు చేష్టను ఎన్నో రోజుల్నుంచి చూసి చూసి అభ్యాసమైన ఆ కొంగలు ఏమి బెదరకనే తమ ఎదురులో ఉండే అవతల ఒడ్డు వైపుకు ఎగిరెళ్ళి కూర్చుండేవి. తన కంటికి కనబడేటట్లుగా కూర్చున్న ఆ కొంటె కొంగల్ని విడవరాదు అన్నట్లుగా దృఢ అభిప్రాయంతో టామి మొత్తం ఆ చెఱువుకున్న పొదల బెండును, దిగబడే ఆ జౌగు మట్టిని దాటి ఆ కొంగలున్న చోటుకు వెళ్ళేపొద్దుకు, అవి మళ్ళా ఎగిరి నేను నిలిచిన ఈ వైపుకు వచ్చి వాలుతుండేవి. రెండు మూడుసార్లు ఇలాగున ఆ తుంటరి కొంగలు చేస్తే చాలు, వాటి వెనకబడి అల్సిపోయిన టామి అవి (కొంగలు) ఏమైనా పాడుపడిపోనీ, ఇక అవి తనకు దొరికేది లేదని నిర్లక్షించి ఎదురు రొప్పులు పెట్తూ నేనున్న చోటుకు వచ్చి ఆ చెట్టునీడలో విశ్రమించేది.
            

                ఇక నేను ఈ కొంగలు మీద ఆలోచిస్తే, అవి నీళ్ళలో చేపల్ని ఎలాగ పట్టుకొంటవనే ఆశ్చర్యం నాలో కలుగుతుండేది! ఎందుకంటే రెండు చేతులలో పది వేళ్ళు ఉన్న మనకు చేపల్ని నీళ్ళలో ఉత్తిగనే పట్టుకొనేందుకు సాధ్యం కాదు! ఎంతగానో నుణుపుగా, ముట్టుకొంటే జారిపోయి తప్పించుకొనే ఈ చేపల్ని పట్టేందుకు ఆ కొంగలకుండే ఆయుధ సామాన్లు ఏమిటి? మీరే యోచించండి? కేవలం చిమ్మటంలాగ ఉండే ఒక ముక్కు మాత్రమే దాని ఆయుధం కదా! మనం ఒకటి కాదు… పది చిమ్మటాల్ని తీసుకొని మన జీవితకాలమంతా ఎంత గట్టిగా ప్రయత్నించినా ఒక చేపనూ పట్టేది సాధ్యంకాదుకదా! జీవం ఉన్న చేపల్ని చెఱువులో పట్టేది అటుండనీయండి, చచ్చి తేలిన చేపల్ని సైతం చిమ్మటం నుంచి పట్టేందుకు సాధ్యంకాదండి! కొంగ ఒంటి కాలుమీద నిలబడి నిద్రపోతున్నట్లు నటిస్తూ, చెంతకొచ్చిన చేపల్ని గబక్కనే ముక్కునుంచి పట్టుకోగా, ఆ చేప ఆ ముక్కు చివర్న చిక్కి గిలగిలలాడుతుంటే, నాకళ్ళెదురే ఏదో మాత్ర మింగినట్లుగా గుటుక్కున వాట్ని మింగుతుండేది.

                 ఈ చెఱువులో కొన్ని నీళ్ళబాతులు, కౌజు పిట్టలు స్వేచ్చగా ఉండేవి. టామి రగడనుంచి అవి భయపడి పొదల మాటున దాగేవి. మేము నిశబ్దంగా కూర్చున్నప్పుడు మాత్రం అవి మెల్లగా ధైర్యం చేసుకొని ఆ పొదల మాటులనుంచి బయటకు తొంగి చూస్తుండేవి. నీటికోళ్ళు నీళ్ళలో మునిగి దాక్కొనేవి. అవి మెల్లగా తలెత్తి రెక్కల్ని ముక్కుతో శుభ్రం చేసుకొని కిచకిచమంటూ అరిచి ఈదేందుకు సిద్ధమైతే, వాటిరెక్కల వర్ణం కోడిపుంజులేమో అన్నట్లుగా కనబడే ఆ నీళ్ళ కోళ్ళు తమ పుల్లల లాంటి కాళ్ళను నీళ్ళమీద తేలాడుతుండే తామరాకులమీద తేలిక తేలికగా అడుగుల్ని వేస్తూ ఆ చెఱువంతా తిరుగుతుండేవి.

           నేను మధ్యాహ్నంలో తిండి తినే రెండు గంటల సమయం వరకూ ఈ చెఱువు ఒడ్డునే టామితో ఉత్తిగనే కూర్చుని అక్కడ జరుగుతుండే ఘటనావళిని చూస్తుండేవాళ్ళం. ఒకొకసారి టామికి విసుగేసి నిలబడి అడవిలోపల ఉండే ఉడతలనో, తొండల మీదో వెంటబడి టైమ్‌పాస్‌ చేసుకొంటుండేది.

          చెఱువు నడుమ ఒక చెట్టు దిమ్మె సగంవరకే మునిగి మిగిలిన సగం బయటకొచ్చి తేలి ఉండేది. దభాల్నే చూస్తే ఏదో బర్రె అక్కడ పడుకొంది అన్నట్లుగా ఆ దిమ్మె కనబడుతుండేది. నేను ఈ చెఱువు ఒడ్డుకు వచ్చినప్పుడల్లా ఒకటో రెండో తాబేళ్ళు ఆ చెట్టు మొద్దు మీద ఎక్కి సూర్యరశ్నిని పొందుతూ కూర్చుని ఉండేవి. మా తలలు వాటికి కనబడితే చాలు, అవి ఒక్కసారిగా నీట్లో దుముకి పారిపోతుండేవి. ఆ తర్వాత ఎంతో పొద్దు మేము నిశ్చలంగా కూర్చొని ఉన్నా, ఆ తాబేళ్ళు చెట్టు దిమ్మె వద్దకు వచ్చే ధైర్యం చేసేవి కావు. జలాంతర్గాములు పెరిస్కోప్‌ నుంచి నీటి పై భాగం చూసినట్లుగా అవి కూడా మునిగే, కళ్ళు మాత్రం నీళ్ళపైన నిల్పినట్లుగా తమ బారు మెడను చాపి మమ్మల్ని చూసి మళ్ళా మునిగి మాయమైపోతుండేవి.

                  చెఱువు మూలలో ఒక వైపుకు నీళ్ళ అంచు తాకేంతగా ఒరిగిన ఒక వృక్షంలోని కొమ్మ ఒకదాన్లో గీజుగ పకక్షులు గూళ్ళు కట్టుకొని, వేలాడుతూ కిలకిలా రావాల్ని పెట్తుండేవి. ఆ గూళ్ళ కింద ఉన్న నీట్లో లక్షాంతర సంఖ్యలో గోండ్రు కప్పల గుడ్లు గుంపుకట్టి మేఘాలు చలించినట్లుగా అప్పుడప్పుడు నీళ్ళపైకి వచ్చి గాలి పీల్చుకొని వెళ్తుండేవి. వానాకాలం ఆరంభమయ్యే వేళకు ఈ గుడ్లు అన్నీ తమ రెండో థలోని తోకల్ని విసర్జించుకొని పసుపు పచ్చరంగుతో నలుపు తెలుపు చారల పట్టీలతో ఉన్న గోండ్రు కప్పలుగా రూపాంతరం చెంది, ఆ చెఱువు వదిలి బయటకు వస్తవి. ఆ చెఱువు నీళ్ళలో గుంపు కట్టినట్లుగానే, అడవిలోపలా ఆ కప్పలు గుంపుకట్టి మొత్తం ఆ నేలంతా కదిలినట్లుగా చిన్న చిన్నగా ఎగురుతూ తిరుగుతవి. ఈ కప్పల్ని గాని, వాటి గుడ్లను గాని మరే ఇతర వన్యప్రాణి వాట్ని పట్టి తిన్నదాన్ని నేను చూడలేదు ఇంతవరకూ. వీటి మాంసం ఇతర వన్యప్రాణులకు విషం గావచ్చేమో అనే అభిప్రాయం నాకుంది. ఒకొక వన్యప్రాణికి ఒకొక రకమైన విచిత్ర రక్షణా తంత్రం ఉంటది. ఈ చెఱువు ఒడ్డున నేను చూసిన రెండు మూడు తమాషైన రక్షణా తంత్రాల్ని మీకు తెలియజేస్తాను.

                  ఈ చెఱువు ఒడ్డున ఎప్పుడైనా పెద్ద పెద్ద గొండ్రు కప్పలు ఆ పొదల మాటున దాక్కొని కూర్చుంటుండేవి. కొన్నైతే తిని తిని తెగబలిసి ఒకొక కేజి తూకం తూగుతవి. వీటి కాళ్ళనే ఇప్పుడు బయట దేశాలకు ఎన్నో డాలర్ల విలువలో లెక్కగట్టి ఎగుమతి చేస్తున్నారు కదా! ఈ కప్పల చర్మం గడ్డిలో ఉండే ఆకుపచ్చ రంగులాగ ఉన్నందున వీటి సమీపంకు వెళ్ళేవరకూ ఇవి మన కళ్ళలో పడేదిలేదు. ఆ తర్వాత ఇవి ఒక్కసారిగా  మనం బెదిరిపడేటట్లుగా దుఢుందుఢుం అన్నట్లుగా ఎగిరి చెఱువు నీళ్ళలో దూకుతుండేవి. టామి వీట్ని పట్టుకోవాలని ఎంతగా ప్రయత్నించినా ఇవి దాని నోటికి దొరికేది లేదు. ప్రతిసారి ఇవి నీళ్ళలో దూకేటప్పుడు పిచికారి కొట్టినట్లుగా తమ వెనుక భాగం నుంచి ఉచ్చపోస్తూ నీళ్ళలో దూకి పారిపోయేవి. ఇవి బెదిరిపోయి ఇలాగున ఉచ్చపోసుకొంటూ దూకి వెళ్తున్నవని అనుకొంటున్నాను తప్పితే ఇదొక విధంగా వాట్లోని రక్షణా తంత్రమని నేను భావించలేదు.

                 అయితే ఒకసారి టామి ఒక గోండ్రు కప్పను ఎలాగెలాగో ఒడ్డునుంచే కనుగొని, ఆ కప్పను పట్టుకొనేంత దగ్గరలో నోరు తెరిచింది. అయితే చివరి క్షణంలో ఆ కప్ప అక్కడ్నుంచి రెండు గజాల దూరానున్న చెఱువు నీటిలో చెంగునే ఒకే గెంతులో ఎగిరింది. చెంగున ఎగిరినప్పుడు టామి మూతిమీద సరిగా ఉచ్చను పిచికారి కొట్టినట్లుగా పోసింది. మొదట బహుశః టామి గమనంకు ఆ ఉచ్చ పడేది కనబడలేదు. ఎందుకంటే టామి ఆ కప్ప ఎగురుతున్నదాన్నే చూస్తూ, ఏమి తెలియని దానిలాగ ఆ కప్ప వెంటబడింది. అయితే సుమారుగా ఐదు నిమిషాల తర్వాత తలను అటు ఇటు నేలమీద రుద్దుకొంటూ జొల్లుకార్చుతూ దిగాలు ముఖం పెట్టుకొని నా దగ్గరకు పారిపోయి వచ్చింది. కుక్కలకు మనుషులలాగనే ఉమ్మి మింగేందుకు చేతకాదు కదా! అందుచేత టామి పిచ్చికుక్కలాగ నోటినుంచి జొల్లు కార్చుకొంటూ గడ్డిమీద నోరు రుద్దుకొంటూ పొర్లుతుంది. కప్ప టామి మూతిమీద ఉచ్చపోసినదాన్ని నేను చూడకున్నట్లైతే కచ్చితంగా టామీకి ఏదో రోగం వచ్చిందని శంకించేవాడ్నేమో!

              కప్ప కురిపించిన ఆ ఉచ్చధార పరిణామంనుంచి మరలా యథాస్థితికి రావాలంటే టామీకి సుమారుగా ఒక గంట పట్టింది. అది కార్చుతుండే జొల్లును, గడ్డిమీద నోటిని రుద్దుకొనే దాని గోలను చూడలేక దాన్ని లాక్కొని వెళ్ళి చెఱువు నీళ్ళలో దాని మూతి కడిగాను. టామి ఆ తర్వాత కప్పల్ని వేటాడే ప్రయత్నాన్ని పూర్తిగా వదిలేసింది. అంతే కాదు, టామి మా ఇంటి మెట్లమీద కూర్చున్నప్పుడు ఎక్కడైనా పూలకుండీల చాటు నుంచి కప్పలేమైనా దాని దగ్గరకు గెంతుకొంటూ వస్తే చాలు, అక్కడ్నుంచి పారిపోయి దూరానెక్కడో దాగి కూర్చుండేది.

           కప్పకార్చిన ఉచ్చ టామి జిహ్వేంద్రియాల మీద చేసిన దాడికి అది ఇక జన్మ జన్మాంతరంకు కప్పల సాహసం వద్దని తీర్మానించుకొంది. అయితే దీనికన్నా మరొక తమాషా సంగతి ఏమిటంటే తాబేలు… నాకు, ప్యారడికి, టామీకి బుద్ధి నేర్పింది మరొక ప్రహసనం లాగ ఉందిలే!.

             తాబేలును నేను నిరపాయకరమైన, నిస్సహాయకమైన జీవిగా భావించు కొంటుండేవాడ్ని. భూమిమీద అది తిరిగితే, దానికి వేగంగా పారిపోయి తప్పించు కొనేది కుదరదు. చెఱువు నడుమ పడియున్న మొద్దుమీద కూర్చుండే తాబేళ్ళను చూసినప్పుడల్లా వాట్ని ఇంకా ఎంతో దగ్గరలో చూడాలని అన్పిస్తుండేది. ఒకసారి చెఱువు ఒడ్డునున్న పచ్చిక మీద తాబేలు ఒకటి కూర్చుని ఉంది. మూతి పోగొట్టుకొని  అడుగు భాగం మాత్రమే మిగిలిన కుండలాగ దాని ఆకారం కనబడుతున్నందున, దాన్ని నేను గమనించకనే చెఱువు అవతల ఒడ్డు వైపుకు వెళ్ళాను. నావెనకే ఉన్న ప్యారడు, టామి ఆ వైపుకు వచ్చే సమయంకు ఆ తాబేలు మెల్లగా కాళ్ళు చేతులు బయటకు చాపి చెఱువు వైపుకు పాకుతూ పోసాగింది. చలిస్తుండే ఈ కుండ కళ్ళలో పడిందే తడవుగా ప్యారడు ”చు ఛూ టామి” అని కుక్కను ఉసిగొల్పుతూ ఆ తాబేలు వద్దకు చేరాడు. చెఱువు కొంచం దూరానే ఉన్నందున ఇక వేగంగా ప్రాకి తప్పించుకొనేది అసాధ్యమని భావించిన ఆ తాబేలు తక్షణమే తల, కాళ్ళు, చేతుల్ని లోపలికి లాక్కొని ఆగిపోయినచోటే ఆగిపోయింది. ప్యారడు, టామి తాబేలు చెంతకు వచ్చినప్పుడు అది వైశ్యుల ఇళ్ళలో ఉండే ఇనప్పెట్టెలాగ చలన రహితంగా పడి ఉంది. మెట్ట తాబేళ్ళకు అడుగు భాగంలోనూ, వెన్ను మీద ఉండే గట్టి రక్షణా కవచంలాగ ఒక కవచం ఉంటది. ఏ జంతువైనా ఆ తాబేలును ఏమి చేయలేదు.

                చెఱువుకు అటు వైపున ఉండే ఒడ్డులో ఉన్న నాకు ప్యారడు, టామి తాబేలు వద్దకు పరిగెత్తింది, తాబేలు స్థబ్దుగా నిలిచింది… అంతా కనబడుతుంది. టామి ముడుచుకుపోయిన తాబేలును చూసి ఇదేమైనా బండరాయో లేకపోతే ఏదైనా వన్యప్రాణో అనేది తెల్వక ప్యారడి ముఖం చూస్తుంది. ప్యారడు కుతూహలంనుంచో లేకపోతే దాన్ని ఇంటికి మోసుకొని వెళ్ళేందుకో దాన్ని ఎత్తుతున్నాడు. నేను చూస్తుండగా ఆ తాబేలును సగం ఎత్తుకు ఎత్తినోడు, దభాల్నే దాన్ని కిందకు పడేసి అసహనం చెందుతూ ముక్కు మూసుకొన్నాడు. టామి దగ్గుతూ, తుమ్ముతూ, తల అటు ఇటు కొట్టుకొంటూ నేనున్న చోటుకు పరిగెత్తుకొని వచ్చింది. నాకప్పుడు భలేగా ఆశ్చర్యమైంది.

”ఏందిరో, ఏమైందిరో?” అని నిల్చున్న చోటునుంచే బిగ్గరగా కేకపెట్టి అడిగాను.
”దీన్ని ముట్టుకొనేందుకు వీలుకావట్లేదు… ఎంతో దుర్వాసన వస్తుంది” అని వేళ్ళనుంచి ముక్కును బలంగా మూసుకొని అరిచాడు.
”పోరా… పో! నువ్వే నీ వాసన ఏదో దాని మీద ప్రసరింపజేసి, ఏవేవో మాటల్ని పలుకుతున్నావు… అంతేకదా!”
”ఛి… ఛీ! నేనెందుకు దానిమీద నా చెడు వాసన ప్రసరింపజేస్తాను. యథావిధిగానే నేను ఉదయానే మల విసర్జన చేసాను. ఇక ఎంత ప్రయత్నించినా నానుంచి అపాన వాయువులు బయటకు విడుదలైయ్యేది లేదు. మీరే వచ్చి చూడండి ఈ తాబేలు వ్యవహారంను” అని ప్యారడు ఆవైపునుంచి అరిచి చెప్పాడు.
నేనిప్పుడు ఆ తాబేలు వద్దకు వెళ్ళగా ఏ వాసనా రావట్లేదు. ప్యారడు మూసుకొన్న ముక్కు పుటాల్ని సడలింపు చేసుకొని బలంగా గాలి పీల్చి, ”అరెరే! ఎక్కడికి పోయింది ఆ పెంటవాసన!” అంటూ మళ్ళీ ఆ తాబేలు వాసన కొట్టుతదేమోనని దాన్ని పైకి ఎత్తాడు.

         మరొకసారి వాసన గాఢంగా బయటకు వచ్చింది. కుళ్ళిన ఎలుకను ముక్కు పుటాల చెంతకు చేర్చినట్లుగా నా కడుపులో దేవినట్లైంది. ”థూ! థూ! పడేయ్‌ దాన్ని కిందకు” అంటూ కేకపెట్టి ముక్కు మూసుకొని పరిగెత్తాను. ఇక ఇప్పుడు దాన్ని మరోమారు ముట్టేందుకు అసహ్యమై, అది చెఱువులోకి వెళ్ళిపడేటట్లుగా కాలినుంచి దాన్ని తన్ని ఊపిరి బిగబెట్టి అక్కడ్నుంచి పారిపోయాడు ప్యారడు.
కప్పేమో టామిలోని జిహ్వేంద్రియాలమీద దాడిచేస్తే, ఈ తాబేలేమో మా ఘ్రాణేంద్రియాల్ని అస్తవ్యస్తం చేసింది కదా!

     ఇటువంటిదే అయినా మరొక తమాషా సంగతి ఏమిటంటే అది అడవి పంది పిల్లల నుంచి జరిగిన ఘటనే సుమా! ఒకసారి చెఱువునుంచి నేను, టామి ఇంకేంటి ఇంటిదారి పట్టేందుకు సిద్దమైయ్యాము. అంతలో ఏదో దఢేల్‌ అనే సప్పుడు అయ్యింది. చెఱువుకు ఆ వైపున దట్టంగా పెరిగిన పొదలనుంచి ఒక అడవి పందిపిల్ల బయటకొచ్చి వాయువేగంగా అడవివైపుకు పారిపోయింది. నిన్న మా ఇంటి వెనుక ఉండే అడవిలోకి ‘మకానుహళ్ళి’ నుంచి వేటకని వెళ్ళినోళ్ళు పిల్లల తల్లైన ఒక ఆడపందిని చంపారట. పంది పిల్లలన్నీ తప్పించుకొన్నవని మా మేస్త్రీ చెప్పాడు. బహుశః చనిపోయిన ఆడ పందికి చెందిన పిల్లలే ఈ చెఱువు వద్దకొచ్చి దాక్కొన్నవని నేను ఆలోచిస్తుండగా దభీల్నే మరొక పందిపిల్ల ప్రత్యక్షమై వాయువేగంగా అడవి వైపుకు పారిపోయింది. దాన్నే చూస్తున్న నేను ఇంకా నా కళ్ళను తిరిగించలేదు. మరొక పందిపిల్ల ప్రత్యక్షమై చెంగునే ఎగిరి అదే దిక్కులో వెళ్ళిపోయింది.

           ఎంతగానో ఆకలేస్తున్నందున ఇంటివైపుకు బయల్దేరాను. అయినా ఆ పొదల మాటున ఇకనూ దాక్కొని ఉన్న ఇవి ఏమి చేస్తున్నవో చూడాలని అన్పించింది. అడ్డుగా ఉన్న నీటి మడుగును దాటి ఆ వైపునున్న గోరింటాకు పొదల మాటుకు వెళ్ళాను. అక్కడున్న పందిపిల్లలు అంతగానేమి చిన్నవికావు. ఐదారు నెలల వయసు ఉండొచ్చు వాటికి. టామి అంత ఎత్తులోనే అవి ఉన్నవి. నేను పొదల్ని చేరుతుండగా టామీకి ఇంతక్రితమే పారిపోయిన పందుల వాసన దొరికి ఉండొచ్చు. ఆ వాసన పట్టుకొని టామి అటు ఇటు పందికని తిరిగేది చేయసాగింది. నేను పొదల్ని అటు ఇటు నెట్టి లోన మరెన్ని పంది పిల్లలు ఉన్నవేమోనని చూస్తుండగా మరొక పందిపిల్ల చెంగునే ఎగిరి పారిపోసాగింది. నా దగ్గర తుపాకి లేదు. నేనైతే వేటకని రాలేదు. అయితే అడవి పందులు నా కళ్ళెదురే చెంగుచెంగునే ఎగిరి దూసుకెళ్తుంటే ఎవరికి సహనం నుంచి నిధానించుకొనేది సాధ్యమౌతది? టామీని పిలుస్తూ ఆ పందిపిల్ల వెనకే పరిగెత్తాను.

               ఆ పందిపిల్ల మిగిలిన పంది పిల్లలలాగ నేరుగా అడవిలోకి వెళ్ళుంటే నా నుంచి దాని వెంటబడేది సాధ్యమైయ్యేది లేదు. అయితే గొడవపెట్తూ నేను దాని వెంటపడింది గమనించిన ఆ పందిపిల్ల అక్కడే ఉన్న మరొక పొదమాటున దాగి కూర్చుంది. అంతలో ఎక్కడో ఉన్న టామి నా వద్దకొచ్చి ఆ పొదలోకి దూరింది. అక్కడ్నుంచి ప్రాణరక్షణకని బయటకు దూసుకొచ్చిన పందిపిల్ల వెంటబడింది టామి. అయితే సులువుగానే ఇప్పుడు ఆ పందిపిల్ల పరిగెత్తి అడవిలోకి చేరుకోవచ్చు. అయితే ఆ దార్లో దాని దురదృష్టంకు టామితో పాటుగా మరోకుక్క ఎదురైంది. ఇక ఇప్పుడు ఆ పంది పిల్లకు దిక్కుతోచక భయంగా మా తోటవైపుకు తిరిగింది. టామీతో జతగా ఆ కొత్త కుక్క జతై ఆ పందిపిల్లను వేటాడి పట్టేందుకు ప్రారంభాల్ని చేసినవి. దిక్కేకానని ఆ పందిపిల్ల మా తోటలో అడ్డదిడ్డంగా తిరిగి సుస్తైపోయింది.

       అరటి చెట్ల నడుమ అరటి పిలకల్ని దాటుతున్నప్పుడు టామి పరిగెత్తి ఆ పందిపిల్ల గొంతుమీద నోరువేసింది. నాకు దాన్ని పట్టుకోవాలని ఉంది కాని దాన్ని చంపేందుకు ఇష్టంలేదు. రెండు కుక్కలూ ఒకటై కొరికి చంపి పడేస్తవని దాన్ని రక్షించేందుకని నేనూ పరిగెత్తాను. పందిపిల్ల తిరగబడిందంటే కుక్కల మీద కుమ్మో, కొరికో బెదిరించొచ్చని నేను భావించాను. అయితే ఆ పందిపిల్ల అలా చేయకుండా ”కొర్యో” అంటూ భయంకరంగా అరిచింది. చెవులలో కాచిన సీసం పోసినట్లుగా ఉన్న ఈ భీకర అరుపు నుంచి ఆ రెండు కుక్కలలో అవ్యక్తమైన భయం పుట్టింది. టామీకి నరకంలోని భీకర ఘర్జన లాగ ఉన్న ఈ సప్పుడుకు బెదిరి ఆ పందిపిల్ల గొంతును కొరికేదాన్ని వదిలేసింది. పారిపోకనే గట్టిగా తిరగబడి నిల్చేందుకు సిద్ధమైన ఆ పందిపిల్ల కుక్కల మీద ఎదురుదాడి చేయకనే మరోమారు నోరు తెరచి కుక్కల ముఖంమీద ”కొర్యో” అంటూ  భీకరంగా అరిచింది. తల పగిలిపోయేంతగా వచ్చిన ఈ భీకర సప్పుడుకు భయపడిన ఆ రెండు కుక్కలూ తత్తరపోయి నాలుగు అడుగులు వెనక్కి వేసినవి. అవి అప్పటికే ఒక తీర్మానంకు వచ్చినట్లుగా నాకు కనబడుతుంది. మూడోసారి ఆ పందిపిల్ల నుంచి ఆ అరుపు వినబడగా ఆ రౌరవ నరకంలోని నినాదం వినలేక తోకలు ముడ్చుకొని పారిపోయినవి.

                 కుక్కలు అటు వెళ్ళిన తక్షణమే ఆ పందిపిల్ల నిర్భయంగా అడవిలోకి వెళ్ళిపోయింది. అయితే కొంచంసేపులోనే మా తోట్లో పనుల్ని చేస్తున్న జనం, వరి మళ్ళలో కలుపుల్ని తీస్తున్న జనం, పశువుల్ని మేపుతుండే రామ… పరిగెత్తుకొంటూ వచ్చారు. అందరూ ఏమైంది, ఏమైందని నన్ను అడిగారు. బహుశః వాళ్ళెవరూ ఇటువంటి కర్కశ శబ్దాన్ని వారి జీవితంలో ఇంతకు ముందెన్నడూ వినియుండలేదని నాకు కనబడుతుంది. నేను పందిపిల్ల అరిచిందని చెప్పినప్పుడు, ”అవి ఇంత భీకరంగా  భయంకరంగా అరుస్తవా?” అని ఆశ్చర్యపడ్డారు.*

కన్నడ మూలం:కెరెయ దడ దల్లి 

పూర్ణ చంద్ర తేజస్వి 

అనువాదం: శాఖమూరి రామ గోపాల్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

2 Responses to చెఱువు ఒడ్డున…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో