నా కళ్లతో అమెరికా-13

నాపా వేలీ

నాపా వేలీ మా ఊరి నుంచి దాదాపు 80 మైళ్లు- మాములుగా గంటన్నర, రెండు గంటల్లో వెళ్లిపోవచ్చు. ట్రాఫిక్ బాగా ఉంటే రెండు గంటల  కంటే ఎక్కువే పడుతుంది.
అసలు నాపా వేలీ అనగానే అందరూ చెప్పేది వైన్ గురించే. ఎన్నో సార్లు వెళదామని మళ్లీ మానేసుకోవడం, అయినా వెళ్లేం చేస్తాం? అది మందుప్రియులకు తప్ప మనకు లాంటి వాళ్లకు కాదు-అనుకునే వాళ్లం.  ఇంతకు ముందు మౌంట్ శాస్తాకు  తప్పిపోయి వెళ్లామన్నానే,   అప్పుడు నాపా వేలీ కి కూత వేటు దూరం లోంచి వెళ్లి పోయాం.

ప్రయాణం: అచ్చు మచ్చు పల్లెటూళ్లలా ఉన్న సన్నని రోడ్లు, చిన్న చిన్న కొండలు, కనుచూపుమేర వేళ్లాడే ద్రాక్షలతో నోరూరిస్తూన్న ద్రాక్ష తోటలు చూడగానే ఇక ఐటినరీ సిద్ధం చేసాను. ప్రపంచ ప్రఖ్యాతమైన  వైన్ తయారీ ప్రదేశం అది. ఒక సారి పరికిస్తే  ప్రసిద్ధి గాంచిన వైనరీస్ చూడడం, తియ్యని ద్రాక్షఫళ్లు తినడం, ద్రాక్ష జ్యూస్ తాగడమే కాకుండా పిల్లలకూ చూపించదగ్గవి ఎన్నో ఉన్నాయి ఆ చుట్టూ పక్కల. ఇంకేం మూడు రోజుల వారంతానికి హోటల్ బుక్ చేసుకుని నాపా వేలీ కి ప్రయాణం కట్టాం. ఇంటర్నెట్టులో అన్నీ వెతికి అడ్రసులు రాసుకోవడం, ఏ రోజు ఏం చెయ్యాలో ప్లానింగు వారం ముందుగానే సిద్ధమైంది. ఏప్రిల్ నెలలో స్ప్రింగు బ్రేక్ లో బయలుదేరేం.
 
ఇంటి నుంచి సముద్రపు పాయల బ్రిడ్జిల గుండా మాంచి జన సమ్మర్దం ఉన్న రోడ్ల వెంబడి ప్రయాణం చేసి శుక్రవారం సాయంత్రం అయిదున్నర కల్లా హోటలుకి చేరుకున్నాం. నాపా వేలీ లో హోటళ్ల ధరలు ఆకాశాన్నంటే లా ఉండడం వల్ల కాస్త ఇవతలగా 10 మైళ్ల ముందే అమెరికన్ కాన్యన్ లో తీసుకున్నాం. ఆ రోజుకి విశ్రమించి మర్నాటి నుంచి బయట తిరగడమన్నమాట. వరు హోటల్ డిస్క్రిప్షన్ లో చూసినప్పటి నుంచి మసాజ్ కు, స్పా కు వెళదమాని గోల మొదలు పెట్టింది. వివరాలు చూద్దుము కదా ఖరీదులన్నీ  మూడంకెల్లోనే ఉన్నాయి.  ఇక్కడ ఇలా మసాజ్ లు, స్పాలు, బ్యూటీ సర్వీసులు చాలా ఖరీదైనవి. అయినా చాలా  మంది  డబ్బుకు వెరవకుండా వీటి కోసం  అలా ఖర్చు చేస్తూ ఉంటారు.   “మనం ఒక పనిచేద్దాం. కాళ్లు నొప్పులుగా ఉంటే ఒకరి కాళ్లు మరొకళ్లం  మసాజ్ చేసుకుందాం. అయ్యేక హోటల్ స్విమ్మింగు పూల్  హాట్ జకూజీ కి వెళ్దాం.”  అని సులభమైన ప్రపోజల్ పెట్టి ఆ పిల్ల మనసు మళ్లించేను.

దగ్గర్లోనే ఉన్న చైనీస్ హోటల్ కు వెళ్లి భోజనం చేసి వచ్చి పిల్లలు నిద్రపోయేక గదిలో ఉన్న మందు గ్లాసుల్లో బ్లాక్ కాఫీ కలుపుకుని ఫోటోలు తీసుకున్నాం సర్దాకి. మర్నాడు ఉదయం మొదటి కార్యక్రమం కాసిలో ది అమరోసా  వైనరీస్ సందర్శన-

Castello Di Amerosa: Dario Sattui  అనే పెద్దాయన మరో వైనరీని కలిగి ఉన్నా ఎప్పటి నుంచో తనను వెంటాడే కలను నిజం చేసుకోవడానికి ఈ కోట తరహా నిర్మాణంలో ఉన్న వైనరీని నిర్మించాడట.   13 వ శతాబ్దపు టస్కన్ నిర్మణా పద్ధతిలో పూర్తి ఇటలీ సంస్కృతిని ప్రతిబింబించేలా 14 స.రాల పాటు కట్టారట ఈ నిర్మానాన్ని.  సందర్శకుల్ని  విపరీతంగా ఆకట్టుకుంటుందీ నిర్మాణం. రోడ్డు మీంచి లోపలికి అడుగు పెడుతూనే అదేదో యూరప్ లో కథల్లో చదివిన ప్రాచీన కట్టడం కళ్ల ముందు నిలబడుతుంది. 

నిజంగానే ఇదెప్పుడో 700 వందల ఏళ్ల కిందట కట్టబడిందని అనిపిస్తుంది. అయితే అమెరికా చరిత్ర తెలిసిన ఎవరికైనా ఇక్కడ వందేళ్ల కిందట కూడా ఏమీ లేదని తెలుసు కాబట్టి అది కొత్తగా కట్టిందని నమ్మాల్సి వస్తుందంతే.   అంత ప్రాచీన రూపం తీసుకు రావడానికి అక్కడ వాడిన ప్రతీదీ చేతితో తయారు చేయబడినదే కాక ,  యూరప్ నుంచి అన్నీ తెప్పించారట.     
కాజిల్ నిర్మణం  నిజానికి 2007 లో పూర్తయ్యింది.   కారు పార్కింగు నుంచి చూడగానే  ఎప్పటిదో పాత కాలపు కోట హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమైన అనుభూతి .  ఆ కోట మొత్తం చుట్టి చూసేందుకు ఒక టిక్కెట్టూ,  పూర్తిగా వైన్ తయారీ  మొ.నవన్నీ  చూసేందుకు మరో టిక్కెట్టూ. రెండవ దానికి చిన్న పిల్లల్ని రానివ్వరు.  అయితే రెండు టూర్ల లోనూ వైన్ టేస్టింగ్ ఫ్రీ. తాగని వారికి గ్రేప్ జ్యూస్ ఫ్రీ( కేవలం పావు గ్లాసెడు). అక్కడ గోడల్ని తడిమితే నాకు మరల గోల్కొండ లో  ప్రాకారాల్ని చూసినట్లు చాలా సంతోషంగా అనిపించింది. పూర్వకాలపు గదులు, వాకిళ్లు, గోడలు, వేళ్లాడే ఇనుప దీపాలు మధ్యయుగం నాటి చెక్క తొట్టెలు,  కప్పీలు ఒకటేమిటి సమస్తం ప్రాచీనతను చాటుతుంటాయి.   ఈ కట్టడానికి రూపకల్పన, నిర్మాణం  చేసిన గొప్ప కళాకారులందరికీ  జోహార్లు అనిపించక మానదు.  కింద ఒక అంతస్తు వరకు దిగితే గిఫ్ట్ షాపు, వైన్ టేస్టింగు. అవన్నీ దాటి  బయటికెళ్తే అటూ ఇటూ తిరుగుతూ కోడి పెట్టలు,  మేక పిల్లలు, బాతులు అచ్చు మచ్చు పల్లె. మా పిల్లల ముఖాల్లో అదేదో గొప్ప చోటు చూసామన్న  ఆనందం బాగా కనిపించింది.

మేం కింద సెల్లార్ లో వైన్ టేస్టింగ్ దగ్గర జ్యూస్ అని అడిగితే కౌంటర్ లో పెద్ద మనిషి “ఆర్యు ష్యూర్” అని మళ్ళీ మళ్ళీ అడిగేడు.  అక్కడ మామూలు గ్రేప్ జ్యూసు కూడా పారదర్శకంగా తెల్లగా ఉంది. పుల్లని బ్రెడ్డు తో పొడవాటి జంతికల్లా తయారు చేసిన వైన్ ఫుడ్ డబ్బాను, ఒక జ్యూసు సీసాను కొన్నాం  అక్కడి కెళ్లిన గుర్తుగా.
నాపా వేలీ చుట్టూ పక్కల ద్రాక్ష తోటలు వాటినుంచి తయారు చేసే ద్రాక్ష సారా తయారీ సంస్థలు చాలానే ఉంటాయి. సందర్శకులను ఆకర్షించేందుకు ఇలా రక రకాల ఆకృతుల్లో వైనరీస్ ను నిర్మించడం ఇక్కడ కొత్తేమీ కాదు.  వేలీకి దగ్గర లోనే బస ఉంటే అక్కడ నుండి కొన్ని నిర్ణీత వైనరీస్ కు వైన్ టేస్టింగు కోసం పెద్ద లిమోల లో తీసుకెళ్ళే వైన్ టూర్ లు కూడా ఉన్నాయక్కడ.
 మద్య ప్రియులకు స్వర్గం అది. ఎటు చూసినా విశాలమైన కుదురైన బారులు తీరిన తోటల్లో వేళ్లాడే ద్రాక్ష తీగెల తోటలు చూసేందుకైనా వెళ్లాలక్కడికి. ఒక చోట రోడ్డు వారగా ఉన్న ఇంటి ఫెన్సింగు కూడా ద్రాక్ష తీగెలతోనే నిండి ఉండడం భలే తమాషాగా అనిపించింది. ఇదే నేను పుట్టిన  ఊర్లో మా వీధిలో ఉండి ఉంటే మంచి పంట కాలంలో అటు వారగా నడుస్తూ నాలుగు ద్రాక్షలు తుంపుకుని నోట్లో వేసుకునో, ఇంటి వాళ్ల కుక్క పిల్ల తరుముతుంటే పరుగెడుతూ, నవ్వుతూ ఆ పళ్ల కంచె చుట్టూ  గిరికీలు కొట్టే వాళ్లం కదా- అని కొంటె ఆలోచనలు వచ్చాయి.
అక్కడి నుంచి ఆ మధ్యాహ్నం అక్కడికి దగ్గర్లో ఉన్న వృక్ష శిలాజాల పార్కు Petrified Forest, వేడి నీటి బుగ్గ California’s Old Faithful Geyser ను చూసేందుకెళ్ళేం.
 పిల్లలతో నాపా వేలీ వెళ్లినపుడు ముఖ్యంగా మా వరు వయసు వాళ్లకు బాగా ఆసక్తిని కలింగించేవి ఇలాంటి స్థలాలు. అయితే ఇవి పెద్దలకు కూడా బాగా నచ్చుతాయనడం లో అతిశయోక్తి ఏమీ లేదు.

Petrified Forest: ఒక చిన్న పర్వత పాద ప్రాంతమది. మొత్తం అరమైలు దూరం లో ఎక్కడికక్కడ అబ్బుర పరిచే వృక్ష శిలాజాల్ని చాలా జాగ్రత్తగా కాపాడుతున్న స్థలమది. వృక్షాలంటే ఏవో చిన్న మరుగుజ్జులనుకుంటే పొరబాటే.    దాదాపు యాబై అడుగుల పొడవున్న వృక్షాలు, వందలవేల  సంవత్సరాల వయస్సు కలిగినవి. ఒకప్పుడు అక్కడికి పదిమైళ్ల దూరం లో ఉన్న అగ్ని పర్వతం ప్రజ్వరిల్లినపుడు ప్రవహించిన లావా వల్ల నేల కూలి,  చరిత్ర గతిలో రాతి చాటున గుంభనంగా నిద్రపోతున్న శిలాజాలవి.

California’s Old Faithful Geyser-వేడి నీటి బుగ్గ: దగ్గర్లోనే ఉన్న సహజ వేడి నీటి బుగ్గ ఉన్న ప్రాంతాన్ని చుట్టూ వన్య ప్రాణుల నిలయంగా తీర్చిదిద్దారు.  ఆ ప్రాంగణం లోకి అడుగు పెట్టే ముందు గిఫ్ట్  షాపు కట్టడం వల్ల బయటి నుంచి అసలక్కడేదో ఉన్నట్టే కనిపించదు. షాపు లో నుంచి టిక్కెట్టు తీసుకుని లోపలికి చిన్న దారి గుండా నడిస్తే నాలుగడుగుల్లో పొగలు చిమ్ముతున్న మడుగు కనిపించింది.  మేం వెళ్లే సరికి చుట్టూ ఉన్న బెంచీల మీద పది మంది వరకూ కూర్చుని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మేమూ వాళ్లతో బాటూ కూర్చున్నాం. సరిగ్గా పది నిమిషాల్లో ఒక్క సారిగా పైకి ఫౌంటెన్ లాగా నీరు దాదాపు పదిహేనడుగుల ఎత్తు వరకు రావడం మొదలెట్టింది.  పిల్లలు హేయ్ అని ఒకటే కేరింతలు కొట్టేరు. సరిగ్గా రెండు మూడు నిమిషాల్లో ఆగి పోయింది. నీళ్లు పరుచుకున్నంత మేరా వెచ్చని ఆవిరి అవి భుగభుగా పొంగుతున్న నీళ్లని తెలియచెప్తుంది. ఆ దృశ్యం చూడడానికి అత్యద్భుతం గా ఉంది. ఎప్పుడో ఒక వెచ్చని ఆవిరేదో గరళంలో దాచుకుని ఉండుండి పైకి నీటి ఈలలేస్తున్నట్లు.  నిజానికి అక్కడ కిందెక్కడో మరుగుతున్న రాళ్ల మధ్య, ఖనిజాల నడుమ సలసలా ప్రవహించే నీరు. ఉగ్రమై మహోగ్రమై తాళని కోపంతో ప్రజ్వరిల్లుతున్న జల ధార అది. నాకైతే ఆ అద్భుత దృశ్యాన్ని ఎంత సేపు చూసినా తనివి తీరలేదు. అలా మరలా మరలా నీటి బుగ్గ వచ్చి పోతున్న చిత్రాన్ని కళ్ల కద్దుకుంటూ అక్కడే కూర్చున్నాను. పిల్లలు రెండు, మూడు సార్లు చూసి ఇక చుట్టూ పరుగెత్తి ఆడడం మొదలు పెట్టారు. పక్కనే చిన్న బావి లాంటి నిర్మాణం కట్టేరు. తీరా చూస్తే అది కుండీ లాంటిది. అయితే ఒక మూలగా భూమి లోకి రాళ్లు కదిలి అతి చిన్న ద్వారం ఉంది. బహుశా: అది ప్రమాదకరమని అలా చుట్టూ కట్టి ఉంటారని అనుకున్నాను. అయితే అంత కంటే చెప్పుకోదగ్గ విశేషం అక్కడొక టుంది.  బూడిద పోసినట్టున్న ఆ బావి లో లెక్కలేనన్ని చెల్లా చెదరుగా విసిరేసిన దుమ్ముకొట్టుకు పోయిన నాణేలు.  దేశాలు మారినా నమ్మకాలు మారవని అర్థం అయ్యింది నాకు. సత్య తో అన్నాను అక్కడ విసిరేసిన ఈ నాణేల్ని రూపాయిల్లోకి మారిస్తే వచ్చే వేల ధనంతో అక్కడ మన దేశంలో ఎందరి పొట్టో నింపొచ్చు అని.

     సాయంత్రం  ఇక ఆ ప్రాంగణం మూసి వేసే సమయం కావడం తో బయటికి నడవవలసి వచ్చింది. దానిని ఆనుకుని ఉన్న జంతువుల ప్రాంగణం లోకి వెళ్ళి అప్పటికే పిల్లలు మేక పిల్లలకు అక్కడ ఉన్న మిషన్ లో నుంచి కాస్త మేత కొని వేస్తూ ఆడుకుంటున్నారు. ప్రాంగణం లో ఉన్న అన్నిటికంటే  అక్కడ ఉన్న లామా బాగా ఆకర్షించింది. అక్కడ  ఉన్న జంతువులు కొన్నే అయినా బాగా సంరక్షిస్తున్నారు వాటిని.

ఆ సాయంత్రం కలిస్టోగా నుంచి తిరిగి వస్తూంటే మా ఐపాడ్ కింద పడి ముక్కలైంది. తిరిగి సగం దూరం  వచ్చే వరకూ మా అందరి మధ్యా నిశ్శబ్దం అలుముకుంది. సంజె వెలుగు పచ్చని ద్రాక్ష తోటల మీద నుంచి ప్రతిఫలిస్తూ నారింజ నవ్వులు రువ్వుతూంది. పల్లెటూరి రోడ్ల వెంబడి వాహనాలు రయ్యి రయ్యిన వెంబడిస్తూ ఉన్నాయి. చిక్కని తోటల మధ్య చిన్న చిన్న వంపులు తిరిగే రహదారుల సౌందర్యం ముందు ప్రాపంచిక బాధలేపాటి? మార్గ మధ్యం లోనే అన్నీ మర్చిపోయాం. నా చిన్న తనం లో మా ఊరి చుట్టు పక్కల సన్నని రోడ్ల మీద గంటకోసారి వచ్చే ఎర్ర బస్సు, ఎన్ని సార్లు వేసినా ఎప్పుడూ గతుకులు పడే రోడ్లు జ్ఞాపకం వచ్చాయి నాకు. ఇక్కడి రోడ్లు అసలు గతుకులు పడవా? పడినా వెంటనే సరి చేస్తారా! అని ఆశ్చర్యం వేస్తుంది.    స్నేహితులతో కలిసి సైకిలు పందేలు వేసుకున్న గతపు రహదారులన్నీ నా కళ్ల ముందు నీటి తెమ్మెరని తెప్పిస్తూండగా హోటలుకి వచ్చాం. 

దార్లో బోల్డు లిమోలు కనిపించాయి.  వీళ్లందరికీ ఇక్కడేం ఉందో అంత తాగడానికి అనిపించింది.  మరలా ఏమో మనకు తెలీని ఒక విచిత్రమైన ఆనందం, అనుభూతి వాళ్లకు ఉండి ఉండొచ్చని కూడా తోచింది. ఏదేమైనప్పటికీ ఆ ప్రాంతం మాకు బాగా నచ్చింది.
మా వరు కోసం మర్నాడు అక్కడికి ఇరవై, ముప్పై మైళ్ళ దూరం లో ఉన్న సొనోమా అనే ఊరికి వెళ్లాం. ఇక ఆ రోజు మా తిరుగు ప్రయాణం లో  సాయంత్రం లొగా దారిలో అన్నీ చూసుకుంటూ వెళ్లాలని  ఆలోచన. 
ముందు సొనోమా ట్రైన్ టవున్ రైల్ రోడ్ కు వెళ్లాం.

Sonoma Traintown Railroad :   ఇది చాలా చిన్న థీం పార్కు. అయినప్పటికీ పిల్లల్లు కాస్సేపు బానే ఆడుకున్నారు. చిన్న రైలు ప్రయాణం, పార్కుకి  ఆ చివర కట్టిన బొమ్మ ఈళ్లు, దుకాణాలు, బడి, ఆసుపత్రి వగైరా పిల్లల్ని బాగా ఆకట్టుకుంటాయి.   మేక పిల్లల మేత కార్య క్రమం  ఇక్కడా ఉండడం మరో మంచి విషయం. వరు మేకల్ని తడిమీ తడీమీ ఎంతకూ వెనక్కు రాదు.  ప్రతీ సారీ చిన్ని చిన్ని కళ్లేసుకుని ఆశగా వాళ్ల నాన్న వైపు చూస్తుంది. తను నవ్వుకుంటూ 25 సెంట్లు చేతిలో పెడతాడు.  గెంతుకుంటూ  మేక పిల్లల మేత కొనడానికి వెళ్లిపోతుంది. తిరిగొచ్చేటప్పుడు నిరాశగా “నాకొక పెట్టు(Pet) లేదూ” అని జీరగా  అంటుంది. మనం ఉండే అపార్టుమెంటు వాళ్లు పెంపుడు జంతువుల్ని ఉంచుకోనివ్వరమ్మా అని చెప్పినా  “మీరెప్పుడూ ఇంతే” అని వాపోతుంది.   ఎప్పుడూ ఇదంతా జరిగేదే.  మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడ గడిపేం. రెండు మూడు గంటలు ఈజీగా పిల్లల్తో గడిపే మంచి స్థలం ఆ చుట్టుపక్కల. 


Point Reyes Light House:
బ్రేక్ ఫాస్టు బాగా ఎక్కువగా తిన్నందువల్ల ఎవరికీ ఆకలి లేకపోవడం తో మా తర్వాతి ప్రదేశానికి ప్రయాణం కట్టాం.   ఎక్కి  దిగే చిన్న చిన్న గుట్టల పర్వతాల మధ్య, కనుచూపు మేర కనిపించే పచ్చని తోటల మధ్య,  వంపులు తిరిగే రహదార్ల  వెంబడి ప్రయాణం.  మేమిప్పుడు పశ్చిమానికి సముద్ర తీరం వైపు ప్రయాణిస్తున్నాం. అక్కడ ఉన్న పాయింట్ రేయాస్(Point Reyes)   లైట్ హౌస్ చూడడానికి. గూగుల్ బాబాయినడిగి రాసుకొచ్చిన అడ్రసుకి మరో రెండు గంట ల్లో చేరుకున్నాం.   చిట్ట చివరీ ఊరు దాటి రోడ్డు రెండుగా విడిపోయేచోట GPS  ఇక మీరు వచ్చేసేరు,  దిగండంది.  తీరా చూద్దుము కదా-  అక్కడ ఎడమ కొక దారీ, కుడి కొక దారీ ఉంది.   ఎటు వెళ్లాలో తెలీని అయోమయం.  “అయిపోయామురా” అన్నాడు సత్య. 

కుడికేదో లైట్ హౌసని బోర్డు చూసి అటు వెళ్లేం.  కొంత దూరం వెళ్లగానే మరలా కొండ మీదకొక దారీ, పక్కకు మరో దారీ. అక్కడ బోర్డు కూడా లేదు. కొండ మీదకు వెళ్లి  మూణ్ణాలుగు మైళ్లలో  తిరిగి కారు రివర్సు చేసుకునే పరిస్థితి కనపడగానే మరలా వెనక్కు వచ్చేం. మళ్ళీ ఇంకొక దారి పట్టుకుని,  మరొక అయిదారు  మైళ్లు  వెళ్లి,   ఇక  మరలా అక్కడి   నుంచి ఏమీ దారీ తెన్నూ కనిపించక మరలా ఊరు వరకూ,  ఇలా  చుట్టు పక్కల అన్ని దారులూ టాం సాయర్ గుహలో తప్పి పోయి తిరిగినట్టు తిరిగాం.  సాయంత్రం 4 గంటలకు ఇక అందరికీ ఓపికలు నశించి,   ఆకలి వేస్తుండడంతో  అక్కడ కనబడ్డ చెజ్ రెస్టారెంటు  లోకి వెళ్లి  భోజనం  ఆర్డరు   చేసాం. వాళ్లకు మేం తప్ప బేరాలు లేవు. అయినా అరగంట లో త్వరగానే ఆర్డరు చేసిన బర్గర్లు, ఫ్రెంచి ఫ్రైస్ పట్టుకొచ్చారు. కానీ ఎందుకో సరిగా తినలేక పోయాం.  ఆకలితో  ఉన్నా రుచికరంగా లేవు.   ఇక పిల్లలు అంత సేపు ప్రయాణం వంపుల కొండల మీంచి చేసి చేసి తల తిరుగుతూందని ఏమీ తినలేదు.  కాసిన్ని బిస్కట్లు తిని కడుపు నింపుకున్నారు.  ఇక వెనక్కు వెళ్లిపోవడమే  శరణ్యం అని సత్య అన్నాడు.   నాకింకా ఆశ మిగిలుంది.   అసలేదైనా అంతు తేలే వరకు వదిలి పెట్టను నేను. సాయంత్రం నాలుగు కావస్తూన్నా, ఇంకా ఇంటికి మూణ్ణాలుగు గంటల దూరం ప్రయాణం చేయాల్సి ఉన్నా   నేను డ్రైవ్  చేస్తానని మొండికేసి మరలా వెనక్కు తీసుకెళ్లాను. 

నిజానికి ఆ లైట్ హౌస్ పాయింటు అక్కడి నుండి ఇంకా 15 మైళ్ల దూరం లో ఉంటుంది. దగ్గర్లో ఉండదు. ఇక ఈ సారి దారి కనిపించినా కనిపించక పోయినా ముందుకే తీసుకెళ్లడం మొదలు పెట్టాను. దాదాపు అయిదు మైళ్ల లో లైట్ హౌస్ వస్తుందనగా దారికి అడ్డం కట్టిన వాహనాలు, పక్కన బీచ్ రోడ్ కు వెళ్లమని ఆదేశాలిస్తూ కాపలా వారు కనిపించారు.  అక్కడి నుంచి మొత్తం  సింగిల్ రోడ్ కావడం వల్ల ముందు వెళ్లిన పెద్ద బస్సుల వంటివి తిరిగొచ్చే వరకు కార్లు అనుమతించరు.  అదీ సారాంశం. మరలా అరగంట తర్వాత రమ్మన్నారు.  మేమిక గత్యంతరం లేక పక్క దారి పట్టుకుని సముద్ర తీరం వైపు దారి తీసాం.  దాదాపు పది పదిహేను  కార్లు మాలాగే వచ్చిన వాళ్లు  కనబడేసరికి హుషారు వచ్చింది మాకు.  “హమ్మయ్య- చివరికి అనుకున్నది సాధిస్తున్నాం” అని. ఎత్తైన ప్రదేశం నుంచి కిందంతా సముద్రం. అలలై కదిలే సమ్మోహనమైన  చల్లని గాలి తెరలు, ఎగిసి పడే భీకర రూపంతో ఉత్తుంగ సముద్రం.  పిల్లలు ప్రయాణపు బడలిక మర్చిపోయి సంతోషంగా బయటకు దుమికారు.   బడలిక మర్చిపోయి కాస్సేపు అలల నురుగు పూసుకున్న ఒడ్డున ఆడుకున్నారు. మధ్య మధ్యలో మబ్బు కమ్ముకొస్తున్న ఆకాశం.  ఆ కాస్సేపూ  అదృష్టం కొలదీ వెలుగు బయటికొచ్చింది.   కాస్త ఎండ నును వెచ్చగా తగులుతూన్న తీరమ్మీద నుంచి   దూరం గా కనిపించే పర్వత శిఖరానికి వెళ్లడం  కోసం సంతోషంగా ఎదురు చూసాం. 
అయిదుగంటలు దాతుతూన్న వేళ రోడ్డు వదిలిపెట్టారు. ఇక ఆగకుండా మరలా మరో అరగంట కొండ మలుపుల్లో ప్రయాణించాం.  పెద్ద పెద్ద ఫాములున్నాయి అక్కడక్కడా.  దారిలో  ఆవులు రోడ్డు దాటడానికి వీలుగా రోడ్డుకడ్డుగా  చెక్క గేట్లు కనిపించాయి.  అక్కడ ఒక ఫాం లో మనం ఉండి, ఉన్నన్నాళ్లు జంతువుల్ని సంరక్షించి వెళ్లే ఏర్పాటు కూడా ఉంది.  కానీ నాకు నవ్వు వచ్చింది.  ఈ దేశం లో అన్నీ విచిత్రమే.  మనం డబ్బులు కట్టి అక్కడ ఉండి వాళ్లకు సేవ చేసి రావడమన్న మాట.  అదీ గాక ఇంత కష్టమైన రహదారుల్లో దేవుడోమని డ్రైవ్ చేసుకు రావడానికే  సగం ఓపిక అయిపోతుంది.  ఇక అక్కడ మూణ్ణాలుగు  రోజులుండడమా.   అయినా ఆగి ఫోన్ నంబర్ రాసుకుని ముందుకు కదిలాం.  ఇక మరో అరమైలు లో లైట్ హౌస్ అనగా ఇక కారు వదిలి నడవాల్సిందే. అది చిట్ట చివరి కొండ. ఆరుగంటలకు సూర్య కాంతి పోతుంది.  ఇక మేం పరుగులాంటి నడకతో బయలుదేరాం.  అది అరమైలే అయినా మా పాలిటి అనంతమైన నడక అనిపించింది. దారిలో మమ్మల్ని చూసినా బెదరకుండా సముద్రం వైపు చూస్తూ ఏదో ఆలోచించుకుంటూన్న లేళ్లు కనిపించాయి.  చివరకు ఎట్టకేలకు తుట్టతుదకు గమ్యం చేరుకున్నాం.  అయినా అక్కడా ఏమీ కనిపించలేదు. మరో చిన్న కొండ కొమ్ము తప్ప. దానిని చుట్టి ముందుకు వెళ్లాలి.  సుద్ద రాయి వంటి తెల్లని కొండ కొమ్మున కట్టిన సన్నని రెయిలింగు మీద అటు వైపుగా వెల్ళి చూద్దుము కదా-   ఆ అద్భుత దృశ్యం  కోసం  ఇన్నేమి ఖర్మ,  ఎన్ని వేల మైళ్లయినా తిరిగి రావొచ్చనిపించింది.  ఇంతకీ లైట్ హౌస్ కొండ పైన లేదు.  మనం నిలబడ్డ కొండకు దిగువన ఉన్న మరో కొండ మీద ఉంది.  అక్కడకు వెళ్లేందుకున్న సన్నని 2000 మెట్లు దిగేందుకు ఆ సమయం లో ఇక వీలు లేదు.  బతుకు జీవుడా అనుకున్నాను నేను.  అయినా  అక్కడ నుంచి చూసినా చాలు. మూడు వైపులా నీళ్ళు, మధ్య కొమ్ములా ముందుకు సాగిన రాతి పర్వతపు కొస మీద ఉన్నాం మేం.  మహా సముద్రమ్మీద ఏదో ఒక గొప్ప మహా నౌక లో ముందుకు దూసుకెళ్తున్నట్టు అనుభూతి. నౌక  ముందుకెళ్తూన్నప్పుడు నీళ్లు చప్పున ముఖానికి కొడ్తున్నట్టు అంత దిగువన  నీళ్ల లోకి ప్రతిఫలించి  కళ్లలోకి సూటిగా ప్రసరిస్తున్న సూర్య కిరణాలు.  కనుచూపు మేర కాంతి నీరార బోసినట్టున్న కదిలే సన్నని అలల అద్భుత స్వరూపం.   నా కళ్లల్లో ఏదో  వదలని జ్ఞాపకం తాలూకు తెమ్మెర. కళ్లు మూసుకుని సూర్య నమస్కారం చేస్తూన్న మా అమ్మమ్మ జ్ఞాపకానికి వచ్చింది. భగవంతుడా నీ అనంత కోటి కిరణాలతో ఈ లోకాన్ని రక్షించు! అని ఎవరో మంత్రోచ్చారణ చేస్తున్నట్లు గాలి గిరికీలు కొడుతూంది.   నిజంగా సూర్యునికి,  సముద్రానికి అక్కడ మోకరిల్లాలనిపించింది.    అనంతమైన శక్తి కలిగిన  ప్రకృతి  మన చుట్టూ అభయ వలయంలా ఉన్న ప్రత్యక్ష అనుభూతి.  వెల్తురు కిరణాలు మరలా జారెళ్లి పోయేలోగా  వెనక్కు వెళ్లాల్సిన  ఆతృత.  అయినా కదిలి రావాలనిపించడం లేదు. దు:ఖం, కన్నీరు. కళ్లల్లో అద్భుత దృశ్యాన్ని ఇంకాస్సేపు ఇముడ్చుకోలేని కన్నీరు.   అమాంతం రెక్కలొచ్చి, ఆ  కొండ కొమ్ము నుంచి గహనాంతరం  లోకి ఎగిరెళ్లినా  తనివి తీరని అనుభూతి.  పాయింట్ రేయాస్ – ఈ ప్రదేశాన్ని నిర్మాణానికి ఎంచుకున్న వారికి  జోహార్.  అక్కడ లైట్ హౌస్ నిర్మించడం లో శాస్త్రీయత ఎంతున్నా,  ఔచిత్యం ఎంతున్నా ఆ కళాత్మక హృదయానికి నమోవాకాలనిపించక మానదు.

తిరుగు ప్రయాణం: వదలని తన్మయంతో చాలా సేపు నిశ్శబ్దంగా డ్రెవ్ చేస్తూ ఉన్నాను.  మనసింకా అక్కడే ఉంది.  అరగంట లో చీకటి పడిపోయింది.  అక్కడి నుంచి ఇంకా ఇంటికి 90 మైళ్ల పైనే.  మొదటి యాభై మెళ్లూ జనసంచారం లేని దుర్భేద్యమైన పర్వాతాల మీద సముద్రాన్ని ఒరుసుకుంటూ ప్రయాణం.  కొన్ని చోట్ల సింగిల్ రోడ్ల పక్కనే జారే రాళ్ల అంచులు,   మరి కాస్సేపు పక్కనే రోడ్డునొరుసుకుని వీధి కాలువ  ఉన్నట్టు  రోడ్డు పక్కనే సముద్రం . విచిత్రమైన దారుల్లో సాహాసోపేతమైన డ్రైవ్ అది.  ‘ఇంకా శాన్ ఫ్రాన్సిస్కో  రాలేదా ” అని పిల్లలు  పదిసార్లు అడిగారు.  ఏం చెయ్యగలం? ఆ రోడ్ల పై 10, 15 మైళ్ల కంటే అధికమైన వేగం తో వెళ్లే వీలు లేదాయె.  కొన్ని గంటల తర్వాత దూరంగా శాన్ ఫ్రాన్సిస్కో  ధగద్ధగమానమైన   లైట్ల కాంతితో   కనిపించే  వరకు నాకూ నమ్మకం లేదు ఆ రోజు ఇంటికి చేరుతామని. అంత పెద్ద నగరానికి ఉత్తర ప్రాంతమైన ఈ చుట్టు పక్కల ఇలా ఉండడం చాలా విచిత్రంగా అనిపించింది.  మంచి నియాన్ లైట్ల అందమైన   కాంతులీనే  గోల్డెన్ గేట్ బ్రిడ్జిని దాటుకుని నగరం లోకి వచ్చి పడ్డాం-  వెనుక చీకటిలో స్మృతుల్ని నెమరేసుకుంటూ.   ఇంకా నలభై మైళ్లున్నా పిల్లలు ‘వచ్చేసాం ఇంటికి ‘  అన్నారు సంతోషంగా .

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

యాత్రా సాహిత్యం, Permalink

3 Responses to నా కళ్లతో అమెరికా-13

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో