స్త్రీ యాత్రికులు

     అలెగ్జాండ్రాకి మాత్రం ఇది నిజమైన యాత్ర. చిన్నప్పుడు ఎలాంటి యాత్రలు చేయాలని కలలు కన్నదో అలాంటిది. మారు వేషంలో తిరగటం ఇదే మొదటిసారి. కానీ తన యాత్ర సఫలం కావాలంటే ఇలా చేయక తప్పలేదు. టిబెట్‌ దేశంలోని మార్మిక ప్రదేశాలు, చిత్రమైన ప్రజలు, వారి ఆలయాల్లోని పూజా విధానం ఒక ఐరోపాదేశ స్త్రీ చూడాలంటే సాధ్యమయ్యే విషయం కాదు. దానికి ఎంతో ధైర్యం కావాలి. ఏవో వింత గాథల్లో వర్ణించి నట్లుగా ఉండే ఆ ప్రదేశాల్లోకి వెళ్ళాలంటే పరాయివారికి అసలు అవకాశం లేదు. ఏ మాత్రం వారి వేషాలు బయటపడినా మరణశిక్ష తప్పదు. అనుకోకుండా ప్రమాదాలు ఎదురైనప్పుడు సమయ స్ఫూర్తితో వ్యవహ రించటం తప్ప వేరే మార్గం లేదు.    

        పెకింగ్‌కి ఉన్న పెద్ద బాటల్ని తప్పించుకుంటూ చిన్న బాటల్లోకి చేరుకొన్నారు. ఆ దారుల్లో ఏడు నెలలు ప్రయాణించిన తరవాత అలెగ్జాండ్రా తన జుట్టుకి నల్లరంగు పూసుకొని, జడలు బాగా పొడుగ్గా రావటానికి యాక్‌ జంతువు వెంట్రుకల్ని తగిలించుకొంటుంది. ముఖానికి మసి రాసుకొని, పెద్ద చెవిరింగులు, ముతక బట్టలు వేసుకొని లాసా స్త్రీ మాదిరిగా తన వేషాన్ని మార్చుకొంటుంది.
     

        ఆ దారిలో పదిహేనువేల ఎత్తులో ఉన్న డోకార్‌కనుమ దాటుకుని టిబెట్‌, చైనా సరిహద్దుల్లోకి చేరగలిగారు. అక్కడినుండి మరో 500 మైళ్ళ దూరం నరసంచారం లేని కొండ ప్రాంతాల్లో ప్రయాణం చేసి మంచు పొంగే నదులు దాటుకొంటూ వెళ్తారు. ఒకసారి అన్నం లేకుండా రెండు రోజులు ఉండాల్సి వస్తుంది. గ్రామస్థులు చూసి, ఎవరో గ్రామీణ స్త్రీ తన కొడుకుతో తీర్ధయాత్రలు చేస్తుంది అనుకొని తినటానికి కాస్త పిండి, వెన్న ఇస్తారు.
      

    లాసా సరిహద్దులు దగ్గిరపడే కొద్దీ, దారిలో ఎవరైనా ఎదురు పడినప్పుడు పొలాలు, పశువుల మేత, వ్యవసాయం గురించీ మాట్లాడుతూ వారిని పక్కదారి పట్టించేవారు. స్థానికులైన డ్రోక్‌-పా పశువుల కాపర్ల మాదిరిగా నటించేవారు. కాబట్టి ఎవ్వరికీ అనుమానం రాలేదు.
   

    టిబెట్‌ వారికి మరుగుదొడ్లు ఉండవు. వాళ్ళు బహిరంగంగానే ఆ పనులు చేసుకొంటారు. అందు కని విశాలమైన మైదానాల్లో తిరుగుతున్నప్పుడే తన ప్రకృతి సమస్యలు తీర్చుకొనేది అలెగ్జాండ్రా.‘ఓం మణి పద్మేహం’ అని గొణుక్కొంటూ, ప్రార్ధనా చక్రాన్ని తిప్పుతూ ఒక మూల కూర్చోవటం ఆమె అలవాటు చేసుకొంది. చెట్ల కింద నిద్ర పోవటం, మంచు గుహల్లో తల దాచుకోవటం సహజమైన అలవాట్లుగా మారాయి.
   

   ఒక రోజు పంధొమ్మిది గంటల సేపు మంచులో నడవాల్సి వస్తుంది. ఆరాత్రి ఇద్దరికీ విపరీతమైన చలివేసింది. యాంగ్డెన్‌ తన చేతులు, కాళ్ళు విపరీతంగా ఊపటం ద్వారా రక్త ప్రసరణ అయ్యేలా చేసుకొన్నాడు. మంట వేద్దామనుకుంటే యాంగ్డెన్‌ వద్ద ఉన్న నిప్పురాయి, దూది కూడా బాగా తడిసిపోతాయి. ఆ పరిస్థితుల్లో అలెగ్జాండ్రా ‘థూమో రెస్కియాంగ్‌’ అనే ప్రాచీన టిబెట్‌ ధ్యాన పద్ధతిని ప్రయోగించి తన చుట్టూతా మంటలు ఉన్నట్లుగా ఊహించుకొని, శరీరంలోకి వేడిని రప్పించుకొని బతకగలిగింది. వెంటనే యాంగ్డెన్‌ ఏరుకొచ్చిన పిడకలతో నిప్పురాజేసి నిజమైన మంటని తయారుచేసుకొన్నారు. మంచు పర్వతాలతో నిండిన టిబెట్‌ దేశంలో ఈనాటికీ ఈ ప్రత్యేక పద్ధతిద్వారానే ప్రజలు, లామాలు చలినుండి తప్పించుకొనగలుగుతున్నారు.
    వారు వెళ్ళే దారిలో ముఖ్యమైన ప్రదేశం జియామ్‌దో జోంగ్‌. అది లాసాకి 400 మైళ్ళ దూరంలో ఉంది. ఈ జోంగ్‌ నుండి లాసా వెళ్ళేవారికి తప్పనిసరిగా పాస్‌ ఉండాలి. ఈ చివరిగేటు దాటితే టిబెట్‌ సరిహద్దులోకి ప్రవేశించినట్లే. యాంగ్డెన్‌ పాస్‌ల కోసం ఆఫీసరు వద్దకి వెళ్ళేటప్పుడు వాళ్ళ ముసలి అమ్మగారు ఆ ద్వారం పక్కనే మంత్రాలు గొణుక్కుంటూ కూర్చుని ఉంది. అదృష్టం కొద్దీ ఎవ్వరూ ఏమీ అడగలేదు. అంత పెద్ద గండాన్ని ఇంత సులభంగా దాటిపోగలనని అనుకోలేదు అలెగ్జాండ్రా.
   

       సముద్రమట్టానికి 11,830 అడుగుల ఎత్తున ఉన్న కొండలమీద ఉన్న చదరపు ప్రాంతాలలో నిర్మించిన నగరం లాసా. చుట్టూ గోధుమ రంగులో ఉండే కొండల వరుసలు. అలాంటి ఒక కొండమీద పోతాళ రాజభవనం. అందులోనే టిబెట్‌కు ఆధిపత్యం వహించే దలైలామా నివాసం. లోపల వందలకొద్దీ గదులు, మెట్లు. అదంతా ఒక పెద్ద చిక్కుముడి మాదిరిగా ఉంటుంది. వాటిలో ఎన్నో రహస్యమార్గాలు. అవి ఎక్కడికి పోతాయో తెలియదు. ఎత్తైన కొండల మీద నిర్మించటం మూలాన చాలా దూరం నుండీ కనిపించటమేకాకుండా, అది ప్రజల్ని నిర్దేశిస్తున్నట్లుగా, దైవాన్ని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది.
   

     యాంగ్డెన్‌ తోడుగా లాసానగర ద్వారం వద్దకి చేరుకున్న అలెగ్జాండ్రాకి భయంతో గుండెల్లో రైళ్ళు పరుగులు తీస్తుంటాయి. తన మారువేషం తెలిస్తే ఎంత ప్రమాదానికి దారితీస్తుందోనని. కానీ ఆరోజున నగరం అంతా ఇసుక దుమారం చెలరేగింది. కాబట్టి ఆమెను ఎవరూ ప్రత్యేకంగా పరిశీలించి చూడలేదు. ఎవరైనా వారి బూట్ల లోపల చూసినట్లయితే వాటి చుట్టూతా మ్యాపులు ఉండేవి. వారి కోటు లోపల జేబులో చెయ్యిపెడితే పిస్తోలు తగిలేది. ఆమెని గుర్తుపట్టకుండా ఉండటం కోసం ప్రకృతి, లాసా నగరాన్ని ఇసుక ముసుగులో కప్పిందేమో అనిపిస్తుంది. అప్పుడే కొత్త సంవత్సరం ఉత్సవాలు కూడా మొదలుపెట్టారు. ఈ ఇద్దరు భిక్షగాళ్ళు స్థానికులతో కలసిపోవటం చాలా సులభం అయింది. మాస్క్‌లు వేసుకున్న లామాల నృత్యం, గుర్రప్పందాలు ఇలాంటి వినోదాలు చూస్తూ ఉండి పోయారు ప్రజలు.  ఈ  ఇద్దర్ని గురించి ఎవ్వరూ అంతగా పట్టించుకునే స్థితిలో లేరు.
    ఆ విధంగా వారు ఎవ్వరి దృష్టిలో పడకుండా లాసా అంతా తిరిగి చాలా పుస్తకాలు, బొమ్మలుకకొంటారు. దలైలామా నివాసం అయిన పోతాళ రాజభవనంలోకి ప్రవేశించకుండా లాసా చూసినట్లేకాదు. ఎలాగైనా లోపలికి వెళ్ళాలి. అలెగ్జాండ్రాని మంగోలియన్‌ లేదా లఢాకీ అనుకొంటారు. తన వేషం మీద తనకి నమ్మకం ఉంది. ఇద్దరే వెళితే ఎవరైనా చూస్తారు.
   

       దానికోసం యాంగ్డెన్‌ ఒక ఉపాయం చెప్పాడు. లాసా బజార్లో బార్లీ అమ్ముకోవటానికి వచ్చిన ఇద్దరు గ్రామస్థులను వెతికి పట్టుకొని ‘పోతాళా రాజభవనం అంతా ఊరికే చూపిస్తాను, రండి!’ అని ఆశచూపాడు. అందుకు వాళ్ళు సులభంగానే ఒప్పుకొంటారు. పైగా వారిని ఒక లామా ఆహ్వానిస్తు న్నాడు. పుణ్యం కూడా వస్తుంది, దాన్ని ఊరికే ఇస్తానంటే ఎందుకు వద్దనాలి?
   

            ఇలాగా అందరూ కలిసి భవనంలోకి ప్రవేశిస్తారు. అలెగ్జాండ్రా ఆనందానికి అంతులేదు. లోపలిగదుల్లో కొన్ని వందల శిల్పాలు, చైనా వారి విగ్రహాలు, రాజుల వద్దనుండి సేకరించిన బహుమతులు ఎన్నో ఉన్నాయి. ఆ వెన్నదీపాల మసక వెలుతురులో వాటిని కళ్ళు పెద్దవి చేసుకుని చూసి ఆనందించింది.తాను దేన్ని చూడాలని ఇంతకాలం ఆశపడిందో, ఆరాటం చెందిందో ఆ కోరిక తీరి అనిర్వచనీయమైన యాత్రానంద కెరటాల్లో చిన్న పడవ మాదిరిగా ఊగులాడింది ఆమె మనసు. రెండు నెలలపాటు లాసాలోనే ఇద్దరూ తిరిగారు ఆ మారువేషాల్లోనే. అయినా దలైలామాని కలుసుకొనే ప్రయత్నం చేయలేదు.
   

         లాసాలో అనేక విలువైన పుస్తకాలు, చిత్రపటాలు తీసుకుని వారికి తోడుగా మరో సేవకుడిని కూడా ఏర్పాటు చేసుకొని, తిరుగు ప్రయాణంలో పుస్తకాలను మోయటానికి గుర్రాల్ని, గాడిదలని కూడా సమకూర్చుకొంటారు. ఈ తిరుగు ప్రయాణంలో అలెగ్జాండ్రా ఒక మధ్య తరగతి స్త్రీ మాదిరిగా తన వేషాన్ని మార్చుకొంది. తాను చిన్నప్పుడు నాటకాల కంపెనీలో పనిచేయటం వలన ఇలాగా వేషాలు మార్చుకోవటం ఆమెకి చాలా తేలికయింది.     1924 వ సంవత్సరం ఏప్రిల్‌లో గయాంట్‌జేలోని తన నివాసంలో అలెగ్జాండ్రాని చూసిన బ్రిటీష్‌ ట్రేడ్‌ ఏజంట్‌, డేవిడ్‌ మేక్‌ డొనాల్డ్‌ ఎంతో ఆశ్చర్యపోతాడు. ఆవిడ తన నివాసానికి లాసా నుండి వచ్చినట్లుగా ఒక ధృవీకరణ పత్రాన్ని ఇస్తాడు. తన శపథం నెరవేరిందనే ఆనందాన్ని సిక్కిం రాజాతో పంచుకొందామని సిక్కిం వెళుతుంది. అక్కడే ప్రఖ్యాత చరిత్ర కారుడు సిల్వియన్‌ లెవి తనకు రాసిన ఆహ్వానాన్ని అందుకొంటుంది. తాను టిబెట్‌ నుండి తెచ్చిన పుస్తకాలు, వస్తువులు అన్నీ కేటలాగ్‌ చేయమని ఆయన కోరతాడు.
  

     అలెగ్జాండ్రా సిక్కిం నుండి టిబెటన్‌ బట్టలతోనే కలకత్తా చేరుకొని, చౌరంగీలేన్‌లో ఒక ఫొటోకూడా తీయించుకొని, తాను ఫ్రాన్సుకి వస్తున్న ట్లుగా, తన ప్రయాణాలు అన్నీ పూర్తయినట్లుగా భర్తకి ఉత్తరం రాస్తుంది. ఇన్నాళ్ళూ తాను చేసింది ఒక ‘స్వచ్ఛమైన పిచ్చిపని’ అనికూడా చెబుతుంది. అప్పటికి అలెగ్జాండ్రా వయస్సు యాభైఆరుకి చేరుకొంది. ఈ పరిస్థితుల్లో యాంగ్డెన్‌ అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అతన్ని తీసుకొని పారిస్‌కి బయలుదేరుతుంది.
         

       అలెగ్జాండ్రా 1925 వ సం|| జనవరిలో ఇండియాలో బయలుదేరి, మే నెలలో ఫ్రాన్స్‌కి చేరుతుంది యాంగ్డెన్‌తో సహా. అప్పటికి తన యాత్రలు మొదలుపెట్టి దాదాపు పధ్నాలుగు సంవత్సరాలు పూర్తి అయిపోయాయిఅలెగ్జాండ్రా పారిస్‌లో అడుగుపెట్టగానే ఆమె చేసిన సాహస యాత్రల్ని ప్రభుత్వం గుర్తించి, అవార్డుల వర్షం కురిపించింది. ప్రపంచంలో ఒక గొప్ప యాత్రికురాలిగా అలెగ్జాండ్రా డేవిడ్‌నీల్‌ని గుర్తించి, గౌరవించారు. ఆమె రాసిన వఖగి అళితిజీదీలిగి ఊళి ఉనీబిరీబివ అనే యాత్రాగ్రంథం 1927 వ సం||లో ముద్రింపబడి, ప్రపంచ వ్యాప్తంగా చదవబడింది.
   

       అలెగ్జాండ్రా తన భర్తతో అన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడి యాంగ్డెన్‌ను తన వారసుడిగా ప్రకటించింది. తన విజయానికి నిజమైన కారకుడు యాంగ్డెన్‌ అనే విషయం తనకి తప్ప మరెవరికీ తెలియదు. ఒక ఉత్తమ సేవకుడికి అలాంటి గౌరవం లభించటం చాలా అరుదు.అలెగ్జాండ్రా తన మిగిలిన జీవితాన్నంతా సాహిత్య సేవకి అంకితం చేయాలని నిర్ణయించుకొంది. అలాంటి ఆలోచనతో ఫ్రాన్సుకి దక్షిణంగా కొండ ప్రాంతాల్లో ఒక పెద్ద ఇల్లుకొని, దానికి ‘సేమ్‌టన్‌ డ్జోంగ్‌’ (ధ్యానకోట) అని పేరుపెడుతుంది. టిబెటన్‌ పద్ధతిలో నిర్మించబడిన ఆ ఇంట్లో పది సంవత్సరాలు నివాసం ఉండి, తన అనుభవాల్ని రాస్తుంది.
   

       అలెగ్జాండ్రా ఇక తన యాత్రలని ఆపివేసినట్లే అనుకున్నారు అభిమా నులందరూ. కానీ నిజంకాదు. ఆమె ఒక యాత్రాశక్తి లాంటిది. కింద నుండి పైకి పెల్లుబికే నీటిబుగ్గ.అప్పటివరకూ రాసిన పుస్తకాలు, చేసిన యాత్రలు చాలవు అన్నట్లుగా మరో గొప్ప యాత్రకి శ్రీకారం చుట్టింది. దీనికి కారణం ఒక బౌద్ధమత గ్రంధం. దాని అనువాదానికి ఒక లామా అవసరం ఏర్పడుతుంది. అతడేమో పెకింగ్‌లో ఉన్నాడు. అందుకోసం 1936 వ సం||లో యాంగ్డెన్‌ని తోడు తీసుకుని పెకింగ్‌ బయలుదేరింది. ఒక చోట స్థిరంగా ఉండటానికి ఒప్పుకోని ప్రాణం ఆమెది. ఏమాత్రం వీలు దొరికినా ప్రయాణాలు చేయాలనే కోరుకొనేది.
   

       తన అరవై ఎనిమిదవ సంవత్సరంలో అలెగ్జాండ్రా అలాంటి సుదీర్ఘ యాత్రకి బయలుదేరటం ఆశ్చర్యంగా ఉంటుంది అందరికీ. ఎంతో పట్టుదల ఉంటేగానీ ఆ పని జరగదు. ‘తిరిగేకాలు ఊరుకోదు’ అనే సామెతని నిజం చేస్తూ ఆమె తన నోమాడిక్‌ జీవితానికి మరోసారి రంగం సిద్ధం చేసుకొంది.పెకింగ్‌ చేరాక అలెగ్జాండ్రా ఒక దుర్వార్త వినాల్సివచ్చింది. అది ఫిలిప్‌ మరణం. ఎంతో బాధపడుతుంది. చేస్తున్న గొప్ప పనిని ఆపేసి చైనా నుండి మధ్యలో వెళ్ళటం కష్టం. తాను ఒక మంచి స్నేహితుడిని కోల్పోయి నందుకు ఎంతో బాధపడుతుంది. తన చైనా యాత్ర అంతా పూర్తిచేసుకుని వచ్చేసరికి అలెగ్జాండ్రాకి డెభ్భై ఆరు సంవత్సరాలు వస్తాయి.
   

       పారిస్‌కి తిరిగి వచ్చాక ఎంతో ఒంటరితనం అనుభవించింది. తాను రాస్తున్న పుస్తకాలే ఆమెకు తోడు అనుకొని ధైర్యంగా జీవించింది. ఆ తరవాత మరో పది సంవత్సరాలకి, 1955 వ సం||లో యాంగ్డెన్‌ మరణి స్తాడు. అప్పటికి అతని వయస్సు కూడా సరిగ్గా యాభై ఐదు సంవత్సరాలే. ఎనభై ఏడు సంవత్సరాల అలెగ్జాండ్రా, యాంగ్డెన్‌ అస్తికలని గంగానదిలో నిమజ్జనం చేయటానికి తగిన ఏర్పాట్లు చేయిస్తుంది.
   

     ఫ్రెంచి గవర్నమెంట్‌ ఒకసారి అలెగ్జాండ్రా పుట్టిన రోజు బహుమతిగా ‘లీజియన్‌ ఆఫ్‌ హానర్‌’ బిరుదుని ప్రధానం చేస్తారు. ఆ రోజుకూడా ఆమె రచన ఆపలేదు. అలా నిరంతరం రచనలు చేస్తూ 1969 వ సం|| సెప్టెంబరు ఎనిమిదవ తేదీన, తన నూట ఒకటవ పుట్టినరోజుకి ఏడు వారాల ముందుగా కన్నుమూస్తుంది అలెగ్జాండ్రా. అప్పటికి ఆమె రాసిన యాత్రా సాహిత్యం ఇరవై పుస్తకాలకి చేరుకొంటుంది. ఆమె మరణంతో అటు ఫ్రెంచి యాత్రా సాహిత్యానికి, ఇటు టిబెట్‌ బౌద్ధ మత సాహిత్యానికి కూడా ఒక పెద్ద దిక్కు లేకుండా పోయింది.
   

      టిబెట్‌ సంస్కృతి గురించి ప్రపంచానికి సంపూర్ణంగా తెలియజేసిన మాహా యాత్రికురాలు అలెగ్జాండ్రా డేవిడ్‌నీల్‌. ఆమె జీవితం అంతా ఒక నమ్మశక్యంగాని రీతిలో నడుస్తుంది. అన్ని సంవత్సరాలు జీవించటం, బిడ్డలువద్దు అనుకోవటం, భర్త కూడా మంచివాడు దొరకటం ఇవన్నీ ఈమెకు వచ్చిన అవకాశాలు. విసుగులేకుండా సంచారాలు చేయటం, తన ఆలోచనలకి ఒక నిర్దిష్టరూపం ఏర్పరచుకోవటం, ఒక ప్రణాళిక ప్రకారం తన కార్యక్రమాలన్నీ నిర్వర్తించటం వలన అలెగ్జాండ్రా డేవిడ్‌నీల్‌ ప్రపంచ యాత్రా సాహిత్య చరిత్రలో ప్రధమ స్థానంలోకి చేరగలిగింది.

– ప్రొ.ఆదినారాయణ

 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

115

పురుషుల కోసం ప్రత్యేకం, యాత్రా సాహిత్యం, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

One Response to స్త్రీ యాత్రికులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో