సుకన్య

         ఇక ఆ సంభాషణ కొనసాగించటం యిష్టం లేక ఆ విషయం మాట్లాడలేదు నిరంజన్‌. సుకన్య కూడా అన్నగారిని వారించింది. నిరంజన్‌ భార్యతో సహా బయలుదేరాడు. మరో నాలుగురోజులు ఉండమన్నా వినిపించుకోలేదు. రాజస్థాన్‌లోని ప్రదేశాలు అన్నీ చూడాలని, ఢిల్లీ. ఆగ్రాలు సందర్శించాలని తామెక్కువ రోజులు ఉండటం కుదరదని అందరి వద్ద సెలవు తీసికొని వెళ్ళారు. జిమ్మి సుకన్యను అమెరికాకు వచ్చేయవలసిందిగా ఆహ్వానించింది.
          సుకన్యకు అన్న జీవన శైలి ఎట్లా మారిపోయిందో అర్ధం అయింది. అచ్చు విదేశాల్లో వారికి మల్లే ఓ రెండురోజులు సరదాగా అమ్మ నాన్నలతో గడిపాడు. తన త్రోవన తాను వెళ్ళాడు.
ఎదురుగా కనబడుతున్నది కాబట్టి తన గురించి పట్టించుకున్నాడు. మగపిల్లల వలె ఆడపిల్లలెందుకు ఆలోచించ లేకపోతున్నారు. అసలిన్ని ఆలోచనలు, నమ్మకాలు, బంధాలు, ఏడుపులు, చుట్టరికాలు, ఇవన్నీ ఆడపిల్లలకే ఎక్కువ కాబోలు! ఊహుఁ అట్లా అనుకొంటానికి వీలులేదు. అబ్బాయిలంతా ఇదే పద్ధతిలో ఎక్కడున్నారు! చందు ఎంత బాధ్యతాయుతంగా ఎంత ప్రేమైకమూర్తిగా కనిపిస్తాడు. తననుండి అతను దూరంగా ఉన్నా అతని ఆలోచనలు తన మనసుని అంటిపెట్టుకొనే ఉన్నాయి… అతను అట్లాగే ఉంటాడు. అందులో సందేహం లేదు. అంతటి సద్గుణ సంపన్నుడ్ని, సౌజన్యమూర్తిని, ప్రేమైకమూర్తిని అసలు తానెట్లా దూరం చేసుకొన్నది… ఎప్పటికయినా తండ్రి మనసు మారదా? చందుని తండ్రిగుర్తించడా? అసలు ఆరోజు ఒకటి వస్తుందా? ఏమో!
సుకన్య మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళిపోయింది. రొటీన్‌ లైఫ్‌లోకి దిగింది. ఉదయమే ఐదుగంటలకే నిద్రలేవటం కొద్దిసేపు ఆ చల్లటి ప్రభాతపు గాలిలో హాయిగా తిరుగాడటం… కాలకృత్యాలు తీర్చుకొని ఓ అరగంట మెడిటేషన్‌… హాష్టలు దాక వెళ్ళి పిల్లల యోగ క్షేమాలు తెలుసుకొని రావటం. అక్కడే ఉదయం టిఫిన్‌్‌ ముగించుకొని తిన్నగా స్కూలుకి వెళ్ళి ఆఫీసు రూమ్‌లో కూర్చోటం… పిల్లలు నోట్సులు ఇంకా ఏమైనా చూడవలసినవి చూడటం… పిల్లలు ఒక్కొక్కరే వచ్చాక క్లాసులు మొదలవ్వటానికి ముందు జరిపే ప్రార్ధన.  అందులో బాబాగారి సూక్తులు రెండు వినిపించటం తప్పనిసరిగా జరుగుతుంది. చాల అరుదుగా మాత్రమే బాబా దర్శనమిస్తారు పిల్లలకి. అన్ని క్లాసులు సరిగా జరుగుతున్నాయో లేదో చూచుకోవటం అవసరాన్ని బట్టి తాను క్లాసులు  తీసుకుంటుంది. మధ్యాహ్నం భోజనం హాస్టలులో పిల్లలతో కలసి చేస్తుంది. నిజానికి ఆ పెట్టే భోజనం అంతగా నచ్చలేదు సుకన్యకి. అది సమతుల ఆహారం కూడా కాదు. ఒక్క కూర, సాంబారు, పెరుగు అంతే! ఎదిగే పిల్లలు ఇంటి వద్ద ఉంటే ఎన్నిరకాల ఆకుకూరలు ఎన్ని తినుబండారాలు తింటారో గుర్తువచ్చి నవ్వుకుంది. వీళ్ళకి ఈ వయసులో నిజంగా ఇదొక పనిష్‌మెంటు వంటిదే! ఇష్టమున్నా లేకపోయినా ఏది పెడితే అది తినవలసిందే. ఎందుకో సుకన్యకు తన బాల్యం గుర్తుకు వచ్చింది!
   రోజూ తను బంగాళ దుంపల వేపుడు కావాలని ఎంత పేచి పెట్టేదో.
‘రోజు అదే తింటానని విసుగుండదటే నీకు’ అని అంటునే అమ్మ రోజు చేసేది… సాయంత్రం స్కూలు నుంచి ఆవురావురుమంటు రాగానే సున్నండలో, జంతికలో, చెక్కలో, మైసూర్‌ పాక్‌లో రడిగా ఉండేవి. అవిగాక ఓ గ్లాసు బోర్న్‌విటా కలిపిన పాలు.. వీళ్ళకో! రెండు క్రీమ్‌ బిస్కెట్లు, రెండు సాల్ట్‌ బిస్కెట్లు. బిస్కెట్లు లేనపుడు ఒక అరటి పండు ఎపుడో వారానికి ఓ సారి పకోడి చేస్తారు… ఈ చదువుల పేరుతో పిల్లల్ని ఇట్లా చిన్నవయసులోనే తల్లి దండ్రులు ఇంత దూరంగా పెట్టటం చాలా బాధ అనిపించింది. పైగా అంతచిన్న పిల్లలకి ఆభోజనానికి నెలకి ఎనిమిది వందలు వసూలు చేయటం అసలు నచ్చలేదు ఈ సారి బాబాని కలిసినపుడు తన అభిప్రాయం చెప్పాలి! ఆశ్రమంలో చేరినప్పటి నుండి సుకన్యకు చదువుకోవటానికి చాలా సమయం దొరికింది. రాత్రంత ఇంచుమించుగ పుస్తకాలు చదవటానికే సరిపోయేది! ఆంగ్ల-తెలుగు సాహిత్యంలో అద్భుతమైన రచనలనెన్నింటినో చదివింది! షేక్స్‌పియర్‌ని చదివినంత ఇష్టంగా గోర్కిని చదివేది… ఠాగూర్‌ని మెచ్చుకొన్నంతగా శరత్‌ని మెచ్చుకోనేది.. రాహుల్‌ సాంకృత్యాయన్‌, ప్రేమచంద్‌, చలం విశ్వనాధ-గోపిచంద్‌-బుచ్చిబాబు.. ఒకరేమిటి ఎందరి రచనలనో చదివే అవకాశం కలిగింది. పట్నంలో ఉన్న లైబ్రరీ నుంచి పాంచజన్యం మాష్టారు పుస్తకాలు తెచ్చి ఇచ్చేవారు. ఏ పుస్తకంలో ప్రేమ సన్నివేశం చదువుతున్నా ఎందుకో చందుయే గుర్తుకు వచ్చేవాడు. అడవుల్లో ఉన్నా, ఆశ్రమాల్లో ఉన్నా మనసు మనతోటే ఉంటుంది. దాన్ని  కట్టి ఉంచటం చాల కష్టమన్న సంగతి సుకన్యకు అర్ధం అయింది. ఈపైకి కనిపించే ప్రవచనాల చాటుమాటున మానసిక ఆర్తి ఒకటి దాగి ఉంటుంది ప్రతిమనిషిలో. అందుకే అనేక చోట్ల బాబాలు, అమ్మల పేర్లతో సాగించే అసాంఘిక కార్యకలాపాలు ఎంత దాచినా బయటపడుతునే ఉంటాయి!
      ‘తలలు బోడులైన తలపులు బోడులా’ అనే వేమన వాక్యం గుర్తు వచ్చి నవ్వుకొంది సుకన్య. నిజానికి మనలో చాలామంది మనశ్శాంతిని వెదుకుతూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. అదొక అపోహా మాత్రమే… ఎంత దూరం వెళ్ళిన మన మనసు మన తోటే ప్రయాణం చేస్తుంటుంది కదా! దాన్ని తీసి ఏ చిలక కొయ్యకో వేలాడ దీస్తే మాత్రమే శాంతి అన్నది దొరుకుతుంది.. కాని అది సాధ్యపడే విషయమా సుకన్య ఒక్కోరోజు చందు జ్ఞాపకాలతో ఉక్కిరిబిక్కిరి అయిపోయేది. మళ్ళి తనకు తానే సర్ది చెప్పుకొనేది. సుకన్య పెండ్లి చేసుకోనని ఖరాఖండిగ తేల్చిచెప్పటంతో వనజ పెండ్లి ఏర్పాట్లు చేసారు ఆమె తల్లిదండ్రులు.
కలిగిన వారింట్లో పెండ్లి! మాటలా మరి! ఆకాశమంత పందిరి, భూదేవంత పీట వేసారా అన్నట్లు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. పల్లెటూరు పొలాల్లో  కావలసినన్నీ తాడిచెట్లు… శాస్త్రోక్తంగా తాటాకులు తెప్పించి పందిరి వేయించారు. అరటిచెట్లు, మామిడి తోరణాలు, పూలు దండలతో చాలా అలంకరించారు. పందిరి వేసిన గుంజలకు కూడ లైట్లు పెట్టి రంగు కాయితాలతో ముస్తాబు చేసారు.
ఆడపిల్ల గలవారు అందరికీ లోకువే పెండ్లిలో అది బాగోలేదని, ఇది బాగోలేదని, సరిగా అన్ని  అందాయని అందలేదని ఏవేవో వంకలు పెట్టడం… అదొక రివాజుగా మారింది. అట్లా అనిపించుకోకూడదని గోవిందయ్య ఎక్కడికక్కడి వారు దిగింది మొదలుకొని పెండ్లి అయి అప్పగింతలు జరిగి పిల్లను తమతో తీసుకొని వెళ్ళేవరకు తనదైన బాణిలో వాళ్ళను తృప్తి పరిచాడు. ఇక విందు భోజనం అంటే ఇదే సుమా! అనే లాగున నాలుగు రకాల స్వీట్లు, రెండు రకాల హాట్లు, నాలుగు కూరలు, రెండు పచ్చళ్ళు, ఐసుక్రీములు ఫ్రూట్‌ సలాడ్‌లు ఒకటేమిటి అంత అద్భుతంగా పెట్టాడు భోజనం.
         అమ్మాయికి పట్టు చీరలన్నీ ‘కంచి’ వెళ్ళి కొనుక్కొని తెచ్చినవే! నగలు ప్రత్యేకంగా బొంబాయిలో తమకు తెలిసిన వర్తకుని నుంచి కొని తెచ్చినవే! ఇట్లా ఎక్కడికక్కడ బంధువులు, వచ్చిన జనాల పొగడ్తలతో ఉబ్బితబ్బిబలయ్యారు అన్నదమ్ములు వెంకయ్య, గోవిందయ్యలు. సీతమ్మ మాత్రం తన కూతురికి కూడా ఇట్లా రంగరంగ వైభవంగా జరగవలసిన పెండ్లి ఎందుకు జరగలేదా అని ఒకింత అసూయకి బాధకి కూడా గురయింది.
సుకన్యకు మాత్రం ఈ పెండ్లి ఏర్పాట్లు, అర్ధంలేని లాంఛనాలని శుద్ధదండుగ అనిపించాయి. మనసులు కలిసిన చోట మనువు ఏ పద్ధతిలో జరిపితే ఏమి! ఇంత హంగు ఆర్భాటం చేయాలా అనిపించింది. విందు పేరిట వండిన పదార్ధాలు వేస్ట్‌ అయిన తీరు చూస్తుంటే అసలు మనది బీదదేశమా? అనిపించింది. పెండ్లి పేరుతో ఆ ఒక్కరోజు ఎన్ని వేల రూపాయలు దండుగ పెడుతున్నారా అని ఆశ్చర్యం వేసింది… పెండ్లి కొడుకు స్నేహితుల మంటు ఓ గ్యాంగ్‌ రావటం అల్లరి కోరికలు డిమాండ్లు. అవన్నీ ఆడపెళ్ళివారు అలోపోలో మంటూ పరుగులెత్తి తీర్చటం… ఛా ఏమిటిదంతా అనిపించింది. అసలు పెళ్ళి దానిపుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోంటే శాస్త్రీయ అవగాహనను పెంపొందించుకుంటే ఎంతో బాగుంటుంది! అనుకుంది. కాని ఎవరు ఆ ప్రయత్నం చేయరు పైగా పెళ్ళి ఇట్లాగే జరగాలి. జరపాలి. అని లేకపోతే అదొక పెద్ద తప్పని సంఘంలో గౌరవ మర్యాదలు దక్కవని భయపడి పోతారు. అంతేకాదు పలానా సుబ్బయ్య కంటే పలానా రామయ్య పెండ్లి ఘనంగా చేసాడు అన్న కితాబు కావాలి ప్రతీ వాడికి! డబ్బులుండి ఖర్చు  చేసుకోవటం వేరు! తగినంత డబ్బు లేకున్నా మధ్య  తరగతి వారు కూడ ధనవంతుల్ని చూచి పులిని చూచి నక్క వాత పెట్టుకొన్న చందంగా ప్రవర్తిస్తున్నారు…. సుకన్య తన అభిప్రాయాన్ని ఒకరిద్దరి దగ్గర  ప్రస్తావించింది. ఆ అమ్మాయిని పెద్దదోషిని చూచినట్లు విచిత్రంగా చూచారందరు. అసలు అదేదో వినకూడని విషయంలాగ అనిపించింది కొందరికి. ఉన్నదాన్ని ఉన్నట్లుగా అనుసరించటంలోని సౌలభ్యం కొత్త మార్గంలో ఉండదు కదా!
          మొత్తం మీద పెండ్లి హడావుడి సద్దుమణగి తగినంత సారెతో వనజను అత్తగారింటికి పంపేసరికే కట్నం కాక గోవిందయ్యకు పైఖర్చు ఆరేడు లక్షలు అయింది. ఆరోజు పెండ్లి ఎంత ఘనంగా జరిగిందో చర్చించుకుంటూ అంతా భోజనాలు చేస్తున్నారు. ఏదో ఒక రకంగా మాట తూలటం అలవాటయిన గోవిందయ్య భార్య పార్వతమ్మ సీతమ్మని సుకన్యను ఉద్దేశించి ”చక్కగ అక్కయ్యకి ఈ పెండ్లిళ్ళు పేరంటాలు  గొడవలేమి లేకుండ అటు పిల్లాడు పిల్లది కూడ పెండ్లి ఖర్చులు లేకుండా డబ్బు మిగిలించారు” అంది సీతమ్మకి వెంటనే సమాధానం తోచలేదు. తోడికోడలు తనను నలుగురిలో అంత తక్కువ చేస్తూ మాట్లాడేసరికి కండ్ల నీళ్ళు పెట్టుకుంది సీతమ్మ. తింటున్న అన్నంలో కంటి నుంచి జారిన నీళ్ళు పడ్డాయి. కంచంలో చేయి కడిగేసుకుంది. సుకన్యకు ఎట్లా సమాధానం చెప్పాలో తెలిసినా తర్కవితర్కాల వల్ల  దూరం పెరగటం తప్ప ప్రయోజనం ఉండదని మౌనంగా ఊరుకొంది. 
మళ్ళీ పార్వతమ్మే కల్పించుకొని అన్నది. ”అయినా నేనేమన్నాననే మీ అమ్మను! మీ అమ్మకు అంత కోపం వచ్చింది! ఉన్న మాటే కదా! నిజానికి అన్నయ్య ఆ దొరసాని పిల్లను పెళ్ళాడి పెండ్లి ఖర్చు లేకుండా చేసాడా, నీవసలే పెండ్లి వద్దని భీష్మించుకు కూచున్నావా…?
”ఔను పిన్ని! నీవన్నది నిజమే! కాని అమ్మ ఇదంత డబ్బు మిగల్చాలని చేసింది కాదుగా! అన్నయ్య నేను తీసుకొన్న నిర్ణయాలను ఆమె మీద రుద్దితే ఎట్లా” అంది సుకన్య.
”బాగుందమ్మ పిల్లలు మంచి చేసినా చెడుచేసినా ఆ పేరు తల్లిదండ్రులకు కాదా వచ్చేది” దీర్ఘం తీస్తూ అంది. తిరిగి సుకన్య ఆమెతో వాదించటం అనవసరంమని మిన్నకుంది. తల్లిని ఓదార్బటానికి కూడా ధైర్యం చాల లేదు. తన నిర్ణయం ఈ విధంగా తల్లి దండ్రులకు అపకీర్తి తెచ్చి పెడుతుందని తానుహించనైనా లేదు! అట్లా అని ఉన్నట్లుండి ఈ రోజుకీ రోజే చందుని మరచి పోయి తన హృదయంలో మరొకరికి స్ధానమూ ఈయలేదు! ఎట్లా ఈ సమస్య పరిష్కరించేది! కాలానికే  వదలి వేయాలి.   
    సీతమ్మ లోపలికెళ్లి మంచం మీద పడుకొంది. మధ్యమధ్యలో కండ్ల వెంట కారుతున్న కన్నీళ్ళు  తుడుచుకుంటున్నది. సుకన్య మెల్లగ తల్లిని సమీపించింది. తల్లి పక్కనే కూర్చుంది.
”అమ్మా” అంది మృదువుగా.
సీతమ్మ మేలుకొనే ఉంది కళ్ళు తెరిచి ఉంది అయినా సమాధానం ఇవ్వలేదు.
”అమ్మా” మరోసారి పిలిచింది సుకన్య.
”ఏమిటి?” విరిచినట్లు మాట్లాడింది సీతమ్మ.
”బాధ పడుతున్నావా పిన్ని అన్నమాటలకు”
”లేదు. సంతోషపడుతున్నాను పిన్ని అన్న మాటలకు”
”ఇద్దరిని కన్నాను కదా ఆణిముత్యాల్లాటి వారిని. వాడట్లా చేసాడు. నీ విట్లా చేసావ్‌! వెళ్ళు ఆశ్రమానికి వెళ్ళు ఇక్కడ నీ కెవరున్నారు… వెళ్ళు…” ఇక మాట్లాడలేక భోరున ఏడ్చింది సీతమ్మ.
తల్లి దుఃఖం ఉపశమించే వరకు మాట్లాడకుండా ఉండటమే మంచిదనిపించింది సుకన్యకు. అప్పటికి ఇక ఎవరితో చెప్పకుండా ఆశ్రమానికి వెళ్లింది.
  
      ఆశ్రమానికి చేరుకొన్న మర్నాడే  ఆమె పేరుతో రిజష్టర్డు లెటరు వచ్చింది. ఎవరబ్బా అని ఆశ్యర్యంగా చూస్తున్న సుకన్యకి అది చంద్రధర్‌ నుండి అని చూచిన తర్వాత మనసు ఉరకలేయటం ప్రారంభించింది ఢిల్లీ నుంచి వ్రాసాడు ఆ ఉత్తరం. ఆశ్రమంలో తన కుటీరానికి వెళ్ళి ఎగసిపడే హృదయాన్ని పదిల పరుచుకొని కవరు చించింది… సంబోధన చూడగానే పరవశించి పోయింది సుకన్య.    
       నాజీవితేశ్వరి సుకన్య! అని మొదలెట్టాడు ఉత్తరాన్ని. గుండెలకు హత్తుకొంది సుకన్య ఎంత బాగా వ్రాసాడు… ఎన్ని విషయాలను విపులంగా  వివరించాడు… ఎంత ఆత్మీయంగా పలకరించాడు… ఎదుట ఉండి మాట్లాడుతున్నాడేమోననే ఫీలింగు కలిగేలా వర్ణించాడు… చందు ఇంత బాగా వ్రాయగలడా!
ఆ ఉత్తరాన్ని ఒకసారి కాదు నాలుగుసార్లు చదివింది. చందు తన హృదయాన్ని పదిల పరచుకొన్నాడు. చాలా ధైర్యంగా తానుంటమే కాక తనకు ధైర్యవచనాలు పలికాడు. అతన్ని అంతగ ప్రభావితం చేసిందేమిటో వివరించాడు. చందుతో పాటుగా రైలు ప్రయాణం సాగించాడట ఒకతను. అతనికి ఒక్క చెయ్యి మాత్రమే ఉందట. అతని పేరు విక్రమ్‌ పట్నాయక్‌. డిగ్రీ చదువు కొనేటపుడు తమ కులం కాని అమ్మాయితో ప్రేమలో పడ్డావట. డిగ్రీ అయిన వెంటనే ఇద్దరు కలసి పెండ్లి చేసుకొవాలని ప్లాన్‌ చేసుకొన్నారట. ఇది తెలిసిన అమ్మాయి అన్నలు అతన్ని చచ్చేట్లు కొట్టటమే కాక కుడిచేయి కూడ నరికివేసారట.
   అయినా సరే విక్రమ్‌ ఏమాత్రం నిరాశ చెందక కృత్రిమమైన చేయితోనే ఢిల్లీ వెళ్ళి యూనివర్సిటీలో చేరి రిసర్చ్‌ చేసి, ఇప్పడు ఆఫీసర్‌ పని చేస్తున్నాడట… ఇప్పుడు తను ప్రేమించిన అమ్మాయి నందిని అన్నలే స్వయంగా వచ్చి తమ చెల్లెల్ని పెండ్లాడమని కోరుతున్నారట. కృషి పట్టుదలల వల్లే తాను జీవితంలో విజయపథాన్ని చేరుకోగలిగానని చెప్పాడట విక్రమ్‌. పైగా చందుని ఏసహాయం కావాలన్నా తనని కలవమని అడ్రసు ఇచ్చాడట…”అతని జీవితాన్నే ఆదర్శంగా తీసికొని నేను ప్రయాణించాలనుకొంటున్నాని’ అన్నాడు చందు విక్రమ్‌ చేయి పోగొట్టుకొని దాదాపు రెండు నెలల పాటు ఆసుపత్రి పాలయి అవిటివాడయినా జీవిత పోరాటంలో ఎట్లా  నెగ్గాడో చూడు మనం కూడా తప్పక జీవితంలో అనుకొన్నది సాధిస్తాం… మనం ఒకటవుతామనే నమ్మకం నాకుంది అంటు ధైర్యం చెప్పాడు చందు సుకన్యకు. ఎందుకో మళ్ళా మరచిపోయిన మధురోహలన్ని మనసుమీద దాడి చేయటం ప్రాదంభించాయి. నిజంగా తామిద్దరు ఒకటయ్యేరోజు వస్తుందా! అసలు ఆ కలయిక ఎట్లా ఉంటుందో! తాను చందు ఇల్లాలిగా… చందు బిడ్డలకు తల్లిగా అట్లా ఊహించుకొంటుంటే ఎక్కడలేని సిగ్గు ఆవరించింది… అదుపులేని మనసు అనంతమైన కలలను కనటం పరిపాటే గదా!
”సుకన్యగారు!” అన్న రామేశం పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది సుకన్య.
”మీకేమి అభ్యంతరం లేకపోతే కొద్దిసేపు అట్లా కాలవగట్టున కూర్చుందాం…”
”ఓ తప్పని సరిగా” మూడ్‌ బాగా ఉండటంతో వెంటనే లేచి రామేశాన్ని అనుసరించింది సుకన్య.
ఇద్దరూ కాలువ గట్టున చెట్టు కింద కూర్చున్నారు.
”సుకన్య గారు! నేను  మీతో ముఖ్యమైన కొన్ని విషయాలు మాట్లాడాలను కొంటున్నారు. మీకేమి అభ్యంతరం లేదు కదా!”
”అడగండి…”
”మీరు మనస్పూర్తిగానే ఇక్కడ వుంటున్నారా? అహఁ ఇట్లా అడిగానని మరోలా అర్ధం చేసుకోకండి…”

– విజయ బక్ష్

 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

83

సుకన్య, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో