ఇన్స్పిరేషన్!!

           దేన్నో ఒరుసుకుంటూ పోతున్నాను. ఎక్కడో రాపిడికి గురౌతున్నాను. తెలుస్తుంది. అనుభవంలోకి వస్తోంది. కానీ ఏ అంశం దగ్గర ఒక రకమైన దుగ్ధకు గురౌతున్నానో కనిపెట్టలేకపోతున్నాను.
భార్యామణి సినిమా అంటుంది. వీకెండ్లో తీసుకెళ్తాను. పిల్లలు షాపింగ్ అంటారు. వెంట వెళ్తాను. బ్యాంకు బాలెన్సు బాగానే ఉంది ప్రస్తుతం. ఉద్యోగంలో టెన్షన్లున్నా, నా తెలివితేటల ముందు అవెంతని?
ఈ మధ్య ఏదో తేడా! కొన్నాళ్ళుగా నాలోకి నేను జారిపోయి, ప్రపంచంతో నిమిత్త మాత్ర లావాదేవీలు జరుపుతున్న భావన! ఏం వెతుకుతున్నాను? ఏం కోల్పోతున్నాను?
“ఎక్సైట్మెంట్!!” కాసింత దీర్ఘాలోచన చేసి తేల్చేసాడు పాండు. నలభై ఏళ్ళ వయసులో ఎక్సైట్మెంట్ ఏం అవసరం? ఏమో! నిజమేనేమో!
“సెవెన్ ఇయర్స్ ఇచ్” ఏ ఆలోచనా లేకుండా తేల్చేసాడు సుధీర్.
“నాకు పెళ్ళయి పదహారేళ్ళురా బడుద్ధాయ్” అన్నాక సర్దుకున్నాడు.
“అదే! అదే! ఇప్పుడు బయట పడతా ఉంది. ఆ ఫ్రస్ట్రేషనే!” ఇద్దరూ ముక్తకంఠంతో అనేసారు.
ఇపుడు అర్జెంటుగా ఈ పరిస్థితి నుండి నన్ను బయట పడెయ్యాలని తీర్మానించేసారు. స్కెచ్ గీసి దానికి “ఆపరేషన్ ఎక్సైట్మెంట్” అని నామకరణం కూడా చేసేసారు.
నేను కూడా ఊ కొట్టేసాను. ఏం చెయ్యను మరి! ఈ నిర్లిప్తత నుండి బయటపడాలి కదా!
వాళ్ళ స్కెచ్లో భాగంగా నా చేత రకరకాల ప్రయత్నాలు చెయ్యించారు. ఒక సంవత్సర కాలంలో రెక్కలు కట్టుకుని ఎగిరానని చెప్పొచ్చు. గాలిలో గిరికీలు కొట్టానని చెప్పొచ్చు. తలక్రిందులుగా వ్రేళాడుతూ, ప్రపంచాన్నే మరిచానని చెప్పొచ్చు. మందుతో మొదలైన ఎక్సైట్మెంట్, పేకాటకు పాకింది. ప్రక్క ఆఫీసులోని లతతో పరిచయంతో మొదలయ్యి, సంవత్సరాఖరుకు నిధితో ముగిసింది. మధ్య మధ్యలో మెట్రో సిటీల్లో రేసుల వెంట డబ్బులను ఏరులా పారించాను. నలభైల్లో పాతికలా కనిపించడానికి మెన్స్ బ్యూటీ పార్లర్లకు చాలా తగలేసాను.
మొదటిసారి నేను తాగి ఇంటికి వెళ్ళినపుడు నా శ్రీమతి అపనమ్మకంగా చూసింది. నేను తాగానా అని కాదు..మా భవిష్యత్ వైపు!
రోజులు గడిచే కొద్దీ నా వ్యసనాల లిస్టు పెరిగిపోవడం చూసి బెంగ పెట్టుకుంది. ఎన్నో రకాలుగా నన్ను మార్చడానికి ప్రయత్నించింది. పిల్లల మొహాలు చూసి, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నాతో కాపురం చేస్తున్నానని ఒకరోజు నిర్మొహమాటంగా చెప్పేసింది. నాకు పెద్దగా బాధ కలుగలేదు. భార్యా బిడ్డలకు అన్నీ సమకూరుస్తున్నాను. అది చాలదా? వారికేమీ అన్యాయం చెయ్యడం లేదని నన్ను నేను సమర్ధించుకున్నాను.
పిల్లల్తో అటాచ్మెంట్ తగ్గింది. ఇద్దరూ పై చదువులకు వేరు వేరు ఊర్లలో హాస్టళ్ళకు మారారు. ఇంట్లో శ్రీమతి వంటకే పరిమితమైంది.
ఉదయం ఆఫీసని వెళ్ళిన నేను ఏ అర్థరాత్రో ఇంటికి చేరుతాను. పాండు, సుధీర్ నా రెండు కళ్ళు. త్రిమూర్తులుగా బిరుదు అందుకుని సంవత్సరం గడిచింది. ఆఫీసులో పని మీద దృష్టి తక్కువ. సెల్ ఫోన్లో వచ్చే మెసేజీలను చదవడానికి, తిరిగి రిప్లై పంపడానికి వెచ్చించే టైమ్ ఎక్కువ. మధ్యాహ్నం నుండే మా ప్రోగ్రాం లిస్ట్ రాసుకునే వాళ్ళం. రాత్రి చెయ్యబోయే ఘన కార్యాల లిస్టు మరి!
అర్థరాత్రి ఇంటికి చేరిన నేను శ్రీమతితో మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదు. మత్తు ముంచుకొచ్చి, నిద్రపోయేవాడిని.
ఆ రోజు తెల్లవారుఝామున శ్రీమతి హడావుడిగా లేపింది నన్ను. మత్తు విడదే! చన్నీళ్ళు పోసాక గానీ కళ్ళు తెరవలేదు. తెరిచాక మరి వారం రోజులు కళ్ళు ముయ్యలేదు. పెద్దోడికి ఆక్సిడెంట్. బైక్ ను స్పీడుగా నడిపి లారీకి గుద్దేసాడు. వాడు ఎప్పుడూ అంతే! చాలా దుడుకు స్వభావం. వారం రోజులు హాస్పిటల్లో వాడు బ్రతుకుతో పోరాటం చేసాడు. నా బ్యాంకు బ్యాలెన్సు చూస్తే సున్నా ఐపోయింది. వ్యసనల వాసు అని పేరు పడిన నాకు అప్పు పుట్టలేదు. వాడు నా కళ్ళెదురుగా ప్రాణం వదిలేసాడు. వారమంతా వాడి మంచం దగ్గరే ఉన్నానేమో! వాడి చూపులు నాకు వాడిగా గుచ్చుకునేవి. నా భార్య తల గోడకు కొట్టుకుని కొట్టుకుని స్పృహ తప్పిపోయింది. చిన్నోడు చెప్పాపెట్టకుండా చదువు, హాస్టల్ వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు.
నిద్రపోనివ్వని నా పెద్ద కొడుకు చూపులు రోజంతా వెంటాడేవి. రాత్రయితే భయం వేసేది. ఎక్కడో వేదనకు గురౌతున్నాను. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటా! చేసిన తప్పులు వెంటాడుతుంటే వాటినుండి పారిపోవాలనుకుంటున్నాను. ఈ చిరాకుల్లోనే ఆఫీసులో తప్పు చేసాను. సస్పెన్షన్ ఆర్డరు చేతికొచ్చింది.
చిత్రంగా పాండు, సుధీర్ త్రిమూర్తుల బిరుదుకు దూరమయ్యారు. నన్నొదిలి జంట కవులన్న క్రొత్త బిరుదు తగిలించుకున్నారు. నా వెంట ఫైవ్ స్టార్ హోటళ్ళకు తిరిగిన స్నేహితురాళ్ళు మొహం చాటేసారు. మందుకు డబ్బులు లేవు. కవిత ఎక్కడి నుండి తెచ్చి నాకు భోజనం సమకూరుస్తుందో, ఇంటి ఖర్చులు చూస్తుందో తెలీదు.
“మీకు మన:శాంతి కావాలి. దేవుని సన్నిధిలోనే అది దొరుకుతుంది. మన కుల సంఘంలోకి రండి. మన:శాంతిని పొందండి.” రామాచారి ఒక రోజు ఉదయం మా ఇంటికి వచ్చి పీకిన క్లాసు యొక్క తాత్పర్యం ఇది.
నిజమే! ఈ వేదన నుండి బయట పడాలి.
చేరిపోయాను మా సత్సంఘంలో!
గుడిలో భక్తుల వరుసలో నేను కూడా చేరిపోయాను. చిత్రంగా నా భార్య నన్ను చూసి నవ్వింది. గుళ్ళు, గోపురాలు, హరికథా పారాయణాలు, మన:శాంతి, దైవ చింతన అంటూ తిరుగుతున్న నన్ను ఆపలేదు. కొన్నాళ్ళకు నా సస్పెన్షన్ కాలం పూర్తయింది. ఆఫీసులో చేరిపోయాను. చిన్నోడి జాడ తెలియలేదు. ఆఫీసు అయ్యాక గుడి నా ఇష్ట స్థానం అయ్యింది. నా మాటలకు, వాగ్ధాటికి ముగ్ధులైన ఆలయ అధికారులు కొన్ని బృహత్తర కార్యక్రమాలు నాకు అప్పగించారు. తిరిగి సమయం పరుగులు పెట్టడం మొదలైంది. వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకపోయింది.
ఆలయంలో పనులు ముగించుకుని, చర్చా కార్యక్రమాల్లో పాల్గొని ఇంటికి చేరేసరికి మళ్ళీ అర్థరాత్రే అయ్యేది.
“కానీ ఇది స్వామి కార్యం. ఇందులో ఇదివరకటి తప్పులేదు.” క్రొత్తగా సమర్థించుకున్నాను.
ఒక రోజు జ్వరం వచ్చింది. ఎక్కడికీ వెళ్ళలేనంత!
ఆ రోజు నాలోకి ఒక క్రొత్త తర్కం వచ్చి చేరింది.
రాత్రంతా నా జ్వరానికి, నాకు సపర్యలు చేసిన శ్రీమతి, ఉదయం ఆరు గంటలకే నన్ను లేపింది. మొహం కడిగించి, పాలు, రొట్టె తినిపించింది. తిరిగి పడుకోబెట్టింది. ఆమెకంత ఓపిక ఎలా వచ్చిందో! తేరిపార ఆమెను చూసాను. ఆమెపై జాలితో నా మనసు నిండిపోయింది. నేను ఎన్ని వెధవ్వేషాలు వేసినా నన్ను భరించింది. ఇకనైనా ఈమెను ఉద్ధరించాలి. ఆమెతో సమయం గడపాలి. క్రొత్త టైమ్ టేబుల్ ఒకటి రూపొందించుకుని కవితకు అందులో కొంత సమయం కేటాయించాలి.
ఆమె ముంగురులు సవరించాను చాలా కాలం తర్వాత. దగ్గరికి తీసుకున్నాను. చిన్నగా నవ్వి హత్తుకుంది నన్ను. రెండే నిముషాల్లో వేరు పడి వంటింట్లోకి వెళ్ళిపోయింది.
హ్ మ్ మ్ మ్….
కోపం ఉండడంలో తప్పు లేదని సరిపెట్టుకున్నాను.
ఐదునిముషాల్లో తిరిగొచ్చిందామె.
“నేను వెళ్తున్నాను. పాలు ఫ్లాస్క్ లో ఉన్నాయి. బ్రెడ్డు టేబుల్ పై పెడుతున్నాను. మధ్యాహ్నం తిని, ఈ మందులు వేసుకోండి.” అంటూ మందులు నా చేతికిచ్చి, చెప్పులు తొడుక్కుంటున్న ఆమెను, ” ఎక్కడికి?” అని ఆశ్చర్యంగా అడిగాను.
“ఆఫీసుకి” ఆమె చెప్పిన సమాధానం విని అవాక్కయ్యాను.
“నువ్వు ఎప్పటి నుండి ఉద్యోగం చేస్తున్నావు?” ఇంకా ఆశ్చర్యంగా అడిగాను.
“జ్వరం తగ్గనివ్వండి. చెప్తాను. టైమ్ అయింది. సాయంత్రం ఏడు గంటలకు వస్తాను. ఏదయినా అవసరం అయితే ఫోన్ చెయ్యండి.” అంటూ వెళ్ళిపోయింది.
ఇహ నా తర్క శాస్త్రం మొదలయ్యింది. రోజంతా జరిగిపోయిన కాలాన్ని నెమరు వేసుకుంటూనే ఉన్నాను. పాపం కవిత. నేను సస్పెన్షన్ లో ఉన్నపుడు ఉద్యోగంలో చేరి ఉంటుంది. ఇంటి బాధ్యతలు చాలా కాలం మోసింది కదా! ఇకనైనా ఆమెను ఉద్యోగం మాన్పించి రెస్టు ఇవ్వాలి. చిన్నోడి జాడ కనిపెట్టి ఆమెను సంతోషపెట్టాలి. ఇలా ఏవేవో ఆలోచనలు.
అన్న సమయానికి తిరిగొచ్చింది కవిత. జ్వరం ఉన్నదో, లేదో పరీక్షించి, మందులు వేసింది. వళ్ళంతా తడి గుడ్డతో తుడిచి బట్టలు మార్చింది. నేను ఈ రోజంతా నా మనసులో మెదిలిన భావాలన్నీ ఆమె ముందు వాగుతూనే ఉన్నను. ఆమె నిశబ్ధంగా తన పని చేసుకుంటూ ఉంది. మధ్య మధ్యలో చిన్నగా నవ్వుతోంది. అంతే!
జీవితంలో అనుభవించిన బాధల వల్ల అలా ఐపోయిందిలే! అనుకున్నాను.
మర్నాడూ ఇదే రొటీన్ కొనసాగింది. రాత్రి నేను నిద్రపోయేవరకూ నాతోనే ఉండేది. నేను పడుకున్నాక స్టో్ర్ రూంలోకి వెళ్ళిపోయేది. అక్కడ ఏం చేస్తుందోనని సందేహం పీకసాగింది నాకు. మూడో రోజు ఉదయం ఆమె వెళ్ళగానే స్టోర్ రూంలో వెళ్ళాను. నా ఇల్లు నేనే సరిగ్గా చూసి ఎన్నాళ్ళయిందో నాకు అప్పుడు అర్థమైంది. నా ఇంటికి నేనే అతిథిగా వచ్చేవాడి కదా! ఇంటిని, మార్పుల్ని పరికించే తీరికెక్కడిది?
స్టోర్ రూమ్ లో ఒక ప్రక్క రంగు రంగుల అట్టలు, కాగితాలు ఉన్నాయి. ఒక ప్రక్క ఏదో మిషన్, ఇంకో ప్రక్క అలమరలంతా ఏవో సామాను. మా పాత సామాను అంతా ఏమైందో తెలీదు. కవిత బిజినెస్ చేస్తోందా? కవితా??? ఇల్లు, టి.వి, ప్రక్కింటి వాళ్ళతో కబుర్లు తప్ప ఏమీ తెలియని కవిత వ్యాపారం చెయ్యడమా?
కొంచెం నీరసం తగ్గిందేమో, కవితకు ఫోన్ చేసాను. ఆఫీసు అడ్రెసు చెప్పమన్నాను.
ఆటోలో ఆఫీసు చేరాను. ఆఫీసు అనేకన్నా వర్కు షాపు అనొచ్చు దాన్ని. కొందరు ఆడవాళ్ళు పని చేస్తున్నారు. కవిత కూడా వాళ్ళ్తోనే ఉంది. నన్ను ఆఫీసు రూంలోకి తీసుకెళ్ళింది.
“అవును. నేను కాగితపు కవర్ల బిజినెస్ చేస్తున్నాను. షాపింగ్ మాల్స్ కి సప్లై చేస్తున్నాం ప్రస్తుతానికి.”
“పెద్దోడు పోయినపుడు డబ్బు విలువ అర్థమైంది నాకు. మీ ఉద్యోగం పోవడం వల్ల ఇల్లు మేనేజ్ చెయ్యడం కష్టమైంది. సమస్యలు వచ్చినపుడే కదా పరిష్కార మార్గాలు వెతుకుతాం! నేనూ అదే పని చేసాను. ఎందరో స్త్రీలు చేసే పనే నేను చేసింది. “
“మీరు ఏదో పోగొట్టుకున్నట్లు ఫీల్ అయ్యేవారు. ఆ ఖాళీని భర్తీ చేయడానికి వ్యసనాలను మీ జీవితంలోకి ఆహ్వానించారు. నేను కూడా ఆ ఖాళీని అనుభవించాను. ఒక రోజు చాలా ఆలోచించాను. సంతోషం కోసమో, ఎక్సైట్మెంట్ కోసమో, ఎమోషనల్ సపోర్ట్ కోసమో, ఆలోచనలు పంచుకోవడం కొసమో, నవ్వ్డడం కోసమో, ఏడ్వడం కోసమో….దేనికైనా, మనం ఎదుటి వారిపైనో, “మన” అనుకున్న వాళ్ళపైనో ఆధారపడ్తాం. ఫీలింగ్స్ కి అత్యంత ప్రాధాన్యతనిస్తాం. స్నేహితులు, కుటుంబస్తులు, సమాజం….వీటితోనే మన భావాలు ముడిపడిపోతాయి. కానీ మనతో మనం ఎప్పుడు గడుపుతున్నాం? మనిషిగా పుట్టినందుకు, శ్వాసిస్తూ, జీవిస్తూ, ప్రపంచంలోని అత్యుత్తమ జన్మ పొందినందుకు, మనకు మనం ఏమిచ్చుకుంటున్నాం? ఈ ప్రశ్న తలెత్తిన తర్వాత నాకు జవాబులు సులువుగా దొరికాయి. నాతో నేను బ్రతకడం చాలా అవసరం అని గ్రహించాను. అంతే, తర్వాత మన ఇంటి సమస్యలు గానీ, నా వ్యక్తిగత సమస్యలు గానీ నన్ను బాధించలేదు.”
“ఆర్థిక స్వాతంత్ర్యం పొందడం పెద్ద విషయం కాదు నాకు. జీవితాన్ని అర్థం చేసుకోవడం అసలైన విషయం.”
“చిన్నోడిని మన ఇంటి నుండి దూరంగా అందుకే పంపేసాను.”
“అంటే వాడు ఇల్లొదిలి పారిపోలేదా?” ఆశ్చర్యంగా అడిగాను.
“లేదు. నేనే పంపేసాను. వేరే ఊళ్ళో హాస్టల్లో ఉన్నాడు. బాగానే చదువుకుంటున్నాడు. పెద్దోడిలా దుడుకు స్వభావం అలవడకుండా యోగా క్లాసులకు కూడా వెళ్తున్నాడు.”
“మీరు వ్యసనాల బారిన పడినా, గుళ్ళు, గోపురాలంటూ తిరిగినా, ఎస్కేపిజమ్ మీ ఉద్దేశ్యం. మీ నుండే నేను చాలా నేర్చుకున్నాను. బయట కాలు పెట్టాక ప్రపంచం చాలా పెద్దదనీ, మనకు కావల్సినంత ప్రపంచాన్నుంచి తీసుకోవచ్చనీ తెలిసింది. ఆటుపోట్లు తట్టుకునే శక్తిని సంపాదించుకున్నాక, కొన్ని మీటింగ్స్ కి హాజరయ్యాక సంపూర్తిగా నా గమ్యం ఏమిటో తెలుసుకున్నాను. ఈ రోజు పర్యావరణ స్నేహి అయిన వృత్తిని ఎంచుకున్నాను. నాతో పాటు కొంతమందికి ఉపాధినివ్వగలుగుతున్నాను.”
కవిత చాలా కాలం తర్వాత నాతో అంత ఎక్కువగా మాట్లాడింది. నేను ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయాను. నాలోకి నేను జారిపోయి, ఆమె నుండి వేరు పడి, ఏదో లోటుందని భ్రమ పడి జీవితాన్ని వ్యసనాల బాటను పట్టించాను.
ఆమె?
నేను సృష్టించిన సమస్యల మూలాల్లోక్లి వెళ్ళి తనను తాను కనుగొని, కుటుంబాన్ని నిలబెట్టింది.
వ్యత్యాసం?
నక్కకీ, నాగలోకానికీ ఉన్నంత!
నిజానికీ, ప్రలోభానికీ ఉన్నంత!
“మరి నన్నెందుకు ఎస్కేపిజం నుండి బయట పడెయ్యడానికి ప్రయత్నించలేదు?” పేలవంగానే వచ్చింది నా మాట.
“నేను చెప్తే విన్నారా? వింటారా?” సూటిగా అడుగుతున్న ఆమెతో చూపు కలపలేకపోయాను.
నిజమే!
ఎప్పుడు విన్నాను కనుక?
మౌనంగా ఉండిపోయాను.
“నేను” అనే అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని అత్యంత సమర్థవంతంగా తనకనుకూలంగా మార్చుకుని, సామర్థ్యాన్ని పదును పెట్టుకుని మానసికంగా బలాన్ని సమకూర్చుకున్న కవిత ఇపుడు నా ఇన్స్పిరేషన్!!
నాతో నేను బ్రతకడం నేర్చుకుంటున్నానిపుడు!!

– విజయ భాను కోటే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

కథలు, , , , , , , , , , , Permalink

2 Responses to ఇన్స్పిరేషన్!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో