నా చేతుల్తో
ఒకరి శిరస్సుకు కిరీటం అలంకరిస్తాను
మణులో, రత్నాలో పొదిగినది కాదది
ముళ్ళ కిరీటం
లోపలి నరాలను సైతం బాధించగలదది
నేను చూస్తూనే ఉంటాను
ధారగా రక్తం కారుతుంది
గాయాలపాలైన ఆ మన:శరీరాన్ని చూస్తూనే ఉంటాను
నా మనసు కరగదు
కఠిన పాషాణంగా ఎలా మారిపోయానో మరి!
మాటల తూటాలు
నా చిత్తమొచ్చినట్లు పేలుస్తాను
అవి ఎదుటి మనిషిని
తూట్లు పొడుస్తాయి
అవమానిస్తాను
నిందను నచ్చినట్లు మోపుతాను
పాత కథలన్నీ మర్చిపోతాను
అనుబంధాన్ని గాలికొదిలేస్తాను
నాకు వర్తమానమే ముఖ్యం మరి!
నిజమో కాదో అనవసరం
నాకు కలిగిన బాధకు బదులు తీర్చుకోవడమే ప్రధానం
నా కల్పనలు నా తార్కిక శక్తిని చంపేస్తాయి
నా అభిప్రాయాలు నా వివేకాన్ని పొగమంచుతో కప్పేస్తాయి
నేను ద్వేషిస్తాను
అది బాధిస్తుంది
నేను ఒక హేయమైన క్రియకు ప్రాణం పోస్తాను
అది గాయమై జీవితాంతం బాధిస్తుంది
నేను హత్య చేస్తాను
కానీ నన్నెవరూ హంతకి అనరు
నేను మనిషినా?
మాటను వదిలేముందు ఒకసారి తరచి ఆలోచించలేనా?
– విజయ భాను కోటే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
One Response to ముళ్ళ కిరీటం