అది నేనే – ఇది నేనే

             అదేంటో ఇండియా లో ఉన్నన్నాళ్ళూ ఇంగ్లీష్ గ్రామర్ బై-హార్ట్ చేశానా, అమెరికా వచ్చానో లేదో తెలుగు బడి మొదలెట్టేశాను. అదే నా గుడి అన్నాను. 

వూళ్ళో వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడితే “అదేంట్రా! మీ పిల్లాడికి తెలుగు నేర్పవూ? మన భాషని మనం కాకపోతే ఇంకెవరు బ్రతికిస్తార్రా” అని అడిగి కడిగేశాను. నాపిల్లలకి మాత్రం వాళ్లకి స్పానిషో, ఫ్రెంచో  ఏది ఇష్టమయితే  అది నేర్చుకునే  “ఫ్రీడం” ఇచ్చాను. పిల్లలని కనగలము  కానీ వాళ్ళ రాతలని తెలుగులో కనగలమా అని జోకేసి దాటేశాను.

             ఆఫీసు లో తెలుగువాడు ఎదురుపడితే “హాయ్ మాన్! హౌ  ఇస్ ఇట్ గోయింగ్?” అని అడిగాను. మరి తెలుగులో మాట్లాడితే నొచ్చుకోడూ? అదే హిందీ  వాడు ఎదురైతే “కైసే  హో తుం భాయ్” అని “బోలా”ను. అలా అయితేనే మెచ్చి మేకతోలు కప్పుతాడు  కదా మరి.

         ఎక్కిన ఎలివేటర్ లో తెల్ల వాడి ముందు తెలుగు మాట్లాడను గాక మాట్లాడను. అసలే ఆ తమిళ సోదరులని విసుక్కున్నట్టు నా తెలుగుని కూడా చీదరించుకుంటాడేమో! నా “ఆత్మా” భిమానం దెబ్బతిని పోదూ? అసలే తెలుగు జాతి మనది- నిండుగా వెలుగు జాతి మనది. 

              మా పిల్లాడి వయోలిన్ కాన్సర్ట్ కి వెళ్లి దగ్గితే ఎక్కడ తీగలు బెదిరిపోతాయో అని గబా గబా బయటికి వెళ్ళానా, లేదా? సంగీతాభిమానం మరి. మన తెలుగు వెలుగు సంబరాల్లో నా మాటే కానీ ఏ పిల్లలు పాడిన పాటలూ వినపడలేదు. పోనిద్దురూ! ఇవాళ రేపు మన తెలుగు పాటలు వినేలా వున్నాయా అసలు? కనీసం ఇలా ఇగ్నోర్ చేస్తేనన్నా ఈ పిల్లలు వచ్చే ఏడాది పాటలు పాడడం మానేస్తారు. మనకీ సుఖం. వాళ్ళ అమ్మా నాన్నలకీ సంగీతం క్లాసులనీ, ప్రాక్టీసులనీ తిప్పే తిప్పలు తప్పుతాయి.

               వచ్చేవారం ఇండియా వెళ్తున్నామండోయ్! అదొక తమాషా. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కుతానా అసలు మనింట్లో  ఉన్నట్టే వుంటుంది. పెట్టినవన్నీ తినేసి అలా కాళ్ళ దగ్గర పడేసుకున్నా అడిగేవాడు లేదు. పైగా ఫ్లైట్ ల్యాండ్ అవుతూ వుండగానే మన లగేజ్ తీసేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. ఆ! ఆ ఎయిర్ హోస్టెస్ మొత్తుకుంటూనే వుంటుంది లెండి- ఆ సీట్ బెల్ట్ సైన్ ఆఫ్ అయేదాకా కదలొద్దు అని. మనం వింటామేంటి! ఆహా! మనకొకళ్లు చెప్పడం మనం వినడం అసలు మన జాతకం లోనే లేదు…హహ్హహ్హ! పైగా బిజినెస్ క్లాసు, ఫస్ట్ క్లాసు కన్నా మనమే ముందు దిగిపోవచ్చు. అబ్బే! మీకు గుర్తు లేదూ శ్రీ శ్రీ ఏం చెప్పాడో – పదండి ముందుకు, పదండి తోసుకు అని .  మన పెద్ద వాళ్ళు చెప్పినది మనమే ఆచరించకపోతే ఇంకా పిల్లలకి ఏం నేర్పుతాం రేపు?

                 మరి లుఫ్తాన్స ఎక్కితే ఇంకో రకం గా ఉంటాను. వాడు రాస్తాడా ప్రతీ టాయిలెట్ సింక్ మీద  “మే వి అస్క్ యు టు వైప్  ది సింక్ క్లీన్ ఆఫ్టర్ యూస్ ఫర్ అథర్ పాసెంజర్స్ కన్వీనియెన్స్” అని ? మరి మనం పట్టించుకోకుండా వచ్చేస్తే ఎంత నామోషీ- మనం పల్లెటూరి బైతులు అనేసుకోడూ? అందుకే శుభ్రంగా తుడిచేసి వస్తాను. ఇంకా మిగిలినవన్నీ కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో చేసినదానికి పొంతన లేకుండా అన్ని రూల్సూ ఫాలో అయిపోతాను. అసలే జర్మనీ వాడి విమానం- వీపు మోత మోగించీ గలడు.

                 ఇంక ఇండియా లో దిగుతానా , ఆ ముంబై లో డొమెస్టిక్ ఫ్లైట్ ప్రహసనం వినండి మరి. ఆ పైలట్ గాడు రన్వే మీంచి ఎప్పటికీ విమానం కదపడు. అంతే ఒళ్ళు మండిపోయి వాడిని పిలిచి ఛడా-మడా తిట్టేశాను. ఏంటి అడుగుతున్నారు- ఇదే అమెరికాలో అయితే ఎం చేస్తానా అనా? ఏం చేస్తాను- నోరు మూసుకుని అంకీలు లెక్కెట్టుకుంటాను. ఇంక మన దేశానికొచ్చాకకూడా అలా ఉండాలంటే ఇంకెక్కడ మన మనసు విప్పి మాట్లాడతాము. అర్థం చేసుకోవాలి మరి మీరు!

           మా వూళ్ళో ఖర్చు పెట్టడానికి చేతులు రావు. ఎక్కడ డాలరు తక్కువ ఉంటుందా అని కళ్ళు గుచ్చుకుని పేపర్ చిరిగేలా గాలించి చదివేసి, క్యూపాన్స్ (అవే లెండి లెద్దురూ కూపన్లు – మా “మెరక” దేశం లో అలానే అంటాము) చింపేసుకుని, ఒక వేళ ముందు రోజు డబ్బులు ఎక్కువ పెట్టి కొనేస్తే మళ్ళీ ఇవాళ వెళ్లి ఆ వాల్-మార్ట్ అమ్మాయికి నా చాంతాడంత లిస్టు ఇచ్చి అన్నీ రిటర్న్ చేసి మళ్ళీ ఈ రోజు ప్రైసింగ్ లో కొంటానా? ఎంత జాగ్రత్త పడకపోతే ఇండియా షాపింగ్ అవుతుంది మరీ? 

          అదే ఇక్కడ అయితే నేనసలు ప్రైస్-టాగే చూడను. ఇంకేమైనా వుందీ – అసలే నా బాక్పాక్ కి ఇంకా లుఫ్తాన్స ట్యాగ్ ఉందండోయ్. అది చూసే కదా ఈ షాప్ వాడు ఏసి వేసి కోక్ ఇచ్చాడు. 

          ఏంటో! మా “మెరక” దేశంలో తెలుగు మాట్లాడి, మాట్లాడి బోర్ కొట్టేసిందేమో ఇక్కడ ఫర్ ఎ చేంజ్, లెట్ మీ బీ మైసెల్ఫ్! ఓకే ! 

              అబ్బో! ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో, ఎన్నెన్నో! నాకే ఆశ్చర్యం వేస్తూ వుంటుంది నాలో ఇన్ని షేడ్స్ ఉన్నాయా అని? ఏంటి దూకుడు సినిమా లో బ్రహ్మానందం గుర్తుకొస్తున్నాడా? వెరీ గుడ్! అలాక్కానీయండి మరి!

              ఇంతకీ నేనేవరంటారా? ఇదిగిదిగో! బరువైన  పదాలు వాడి ఘనంగా ఉంటుందని నా గురించి ఒక కవిత రాశాను. చదివి మీరే తెలుసుకోండి ….

 ద్వయీ భావంతో మెలిగే అద్వైతాన్ని 

నాకు నేనే అర్థం కాని అనర్థాన్ని 

నా వాక్కుని  నేనే ఖండించే వాదాన్ని 

వెరసి ఓ నయీ తత్పురుష సమాసాన్ని 

తలుచుకోదగని నస్మరంతి గాణ్ణి …

– లలితా TS

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , , , , , , , , , , , , , , , , Permalink

3 Responses to అది నేనే – ఇది నేనే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో