“సిర్నవ్వు” (కథ)-డా. మజ్జి భారతి
“ఆ సూపేటి? మాడిసి మసి సేసేద్దామనే! కాలు సెయ్యి పడిపోయినా, గోరోజనానికేవీ తక్కువనేదు. యేదో నాను మంచిదాయిని గాబట్టి, యీమాత్రమయినా సేత్తన్నాను. అదే యింకొకర్తయితే, యిన్నాళ్ళూ నువ్వు సేసిన పనులకి, యీపాటికి నిన్నీడ్సి బయిటికి తోస్సేది. పైన దేవుడ్నేడా! సూడ్డా! నాలుగు డబ్బులు కళ్ళ సూసామని, కళ్ళు నెత్తినెట్టుకుంటే యిలగె ఔతాది మరి. యేమ్మిడిసిపడ్డావే! ఒళ్ళు, పై తెలిసేది కాదు. నేన్నీ అంతత్తుకు సరిపోనా! పల్లెటూరి బైతునా! ఓయబ్బో పట్నందాయి దిగొచ్చింది. నీ కొడుక్కి నదరగా కనబడబట్టే కదా నా యెంటబడ్డాడు. మద్దెలో నీకేటే! మొగుడూ పెళ్ళాలు సక్కగుంటే వోర్సుకోనేకపోనావు. యిప్పుడేటయిందీ! నోర్మూసుకొని వో మూల పడుండమని ఆ బగమంతుడే నీ నుదుట రాసాడిలగ! వుప్పుడేటి సేత్తావే” అత్త కనకమ్మకి తినిపిస్తున్నంతసేపూ, కోడలు రంగి తిట్లలాంటి మాటల ప్రవాహం సాగుతూనే వుంటుంది. పెళ్లయ్యాక అత్త తనను పెట్టిన బాధలకి, యిలాగ బదులు తీర్చుకుంటుంది. “ఆ సేసిందెదో సేత్తన్నావు కదా! యెందుకీ మాటలని” మొగుడన్నా, అత్తనేదైనా అనకుండా రంగి నోరూరుకోదు.
ప్రతి పూటా ఈ మాటలింటున్నా, యేమీ సెయ్యలేని పరిత్తితిలో వున్నా, ఆ మాటలిన్నప్పుడల్లా గుండె రగిలిపోతానే వుంటాది కనకమ్మకి. కళ్ళు నిప్పులు కురుత్తానే వుంటాయి. అదే కావాలి రంగికి. తన పెళ్లైన నుండి, కాలు సెయ్యి పడిపోయిన వరకూ అత్త తన్నెంత సాదించిందో, నిమస నిమసం గురుతు సెయ్యకుండా వుండనేదు రంగి. తనకే యిలాగుంటే, తన్సేసిందానికి ఆ యమ్మకెలా గుండాలి? పదేనేళ్ల కిందట జరిగింది, గురుతుకొత్తూనే వుంటాది కనకమ్మకి. అప్పుడు రంగి తానంలో తాను. తన తానంలో ఆయమ్మ.
తల్లంటే పేనం పెట్టే కలిగిన మారాజుకమ్మ. తనకినాగే కాలు, సెయ్యి, నోరు పడిపోయి… కాదు, కాదు నోరు పడిపోనేదు… యిప్పటికీ ఆ యిసయం గురుతుకొత్తే తాంజేసిన తప్పు గురుతుకొచ్చి… అందుకే గావాల తనకిలాగయినాది. ఆ యమ్మ మంచిదాయి గాబట్టి తాను బతికిపోనాది, తన బతుకో దారిన పడింది. నేప్పోతే… తలసుకుంటేనే గుండె గుబేలుమంటాది.
యే సిన్నతేడా వొచ్చినా వూరుకోనని పనిలో పెట్టుకోక మునుపే సెప్పాడా మారాజు. తల్లంటే వొల్లమాలిన పేమ. కడిగిన ముత్తెంలా వుంచాలనేవోడు. అలాగే పెతిరోజూ ఆపీసుకెళ్లే ముందు, ఆపీసునుండి వచ్చినెమ్మటే, ఆయమ్మ గదిలోకొచ్చి కాస్సేపుండి యెళ్ళేవోడు. తల్లి మాటాడదని తెల్సినా యేవేవో, యానాటివో మాటలు సెప్పీవోడు. యెన్ని సెప్పినా ఆయమ్మ సిర్నవ్వు తప్పించి, మారు పలికేది కాదు. అందుకే ఆ అమ్మకు నోరు కూడా పడిపోయిందని అనుకుంది తాను. ఆ టైములో కొడుక్కి కూడా తెలిసింది కాదా ఆళ్ళమ్మ మాటాడగలదని? లేప్పోతే కొడుక్కి కూడా తెలుసా, ఆయమ్మ మాటాడతాదని?
ఓలమ్మోలమ్మ యెంత పనైపోనాది? నా నోరు పడిపోనూ! అందుకే గావాల, తన్నోరు పడిపోనాది. ఐనా అంత కావరమేల తనలాటి దానికి? కోడలన్నట్టు నాలుగు డబ్బులు కళ్ళ సూసేసరికి వొళ్ళూ పై తెల్సినాది గాదు.
ముందు, ముందు బానే సేసేది ఆయమ్మ కింద. ఆళ్ళమ్మని బాగా సూసుకుంటన్నానని ఆ బాబు డబ్బులు గూడా పెంచాడు. ఆ బాబు ఆపీసు యేరే వూరికి, మారిపోగానే తనకి మొదలైంది కావరం. ఆ బాబెప్పుడో ఆదివారమొచ్చీవోడు. ఆ బాబు లేనప్పుడు, ఆయనగారి పెళ్ళాము యింట్లో కన్న బయటే యెక్కువుండేది. యింట్లో వున్నప్పుడైనా, గదిలోకి యిలావచ్చి, అలా సూసెళ్ళిపోయేది. దాంతో యింటి పెత్తనం తనదేనని పేలిపోయేది. యింట్లో యెవురూ లేనప్పుడు, ఆయమ్మ మోచేతి నీళ్లు తాగుతూ, ఆయమ్మనే అనేది. ఇదిగో యిప్పుడు కోడలు, తనకింద సేసి తన్నంటన్నట్టు.
“ఇంకేటి సూడాలని వుండిపోనావమ్మా? ఆలతోను, యీలతోను సేయించుకుంటూ యీ బాదేల? ఆయిగా పోరాదా?” అనేసేది యేదో వుట్టినే సేసేసినట్టు, తన సొమ్ము ఆయమ్మేదో తినేసినట్టు. ఆయమ్మే లేకపోతే జీతం డబ్బులుండవనే యింగితం గూడా పోనాది.
తానేటన్నా యెవురికీ తెలీదని, తనని పనినుండి తియ్యరని దీమా యెక్కువైపోయి, యింకా పేలిపోయేది. యెన్ని మాటలన్నా నవ్వు తప్పి, యేరే బావముండేది కాదు ఆయమ్మలో. యేటీ ముసిల్దానికి సెవులు కూడా పోనాయా, అని యింకా గట్టిగా అనేది. యెన్నన్నా, యెంత గట్టిగన్నా సిర్నవ్వే. ముసిల్దానికి సెవులు కూడా పోనాయని, నిద్దారణకొచ్చాక, తన్నోటికి అడ్డు లేకపోనాది.
ఓర్నాయనో! ఆయమ్మ మాటాడగలదని యెప్పుడు తెలిసింది? సెల్లి కూతురు పెళ్లుందని, రెండు రోజులు సెలవెట్టి తిరిగొచ్చేసరికి, యింకేటుంది. ఆ ముందు రోజే ఆయమ్మ పోనాదట. అప్పుడు నిజంగే ఏడ్సింది. ఆయమ్మ కోసమా యేడుపనుకున్నారు సూసినోళ్ళంతా. ఆయమ్మ లేప్పోతే నెలనెలా జీతం డబ్బులెలా వత్తాయని ఏడ్సింది తాను. అప్పుడు తెలిసింది సుట్టాలు మాటాడుకుంటంటే. సనిపోయిన ముందు రాత్రి కొడుకుతో సానాసేపు మాటాడిందట. తన గురించి ఏదో సెప్పిందట.
ఆ మాటలు సెవిలో పడగానే, జరగబోయేది తల్సుకొని, యెవురూ సూడకుండా వొకటే పరుగింటికి… ఆడ్నుండి సెల్లిలింటికి. ఆ పోడం రొండునెల్లు తిరిగి రానేదు. రొండుసార్లు ఆ బాబు కబురెట్టాడట, వూర్నుండి రాగానే వచ్చి కలవమని. యెన్నాళ్ళని దాక్కొగలదెక్కడైనా? యిక తప్పక, బయం బయంగానే యెల్లింది. అడిగితే, నేనేటన్లేదని దబాయించేద్దామనుకుంది. తీరా యెళ్లాక, ఆ బాబు సెప్పిన మాట యిన్నాక మల్లా ఏడ్సింది ఆ యమ్మ మంచితనాన్ని తల్సుకొని. వాళ్ళమ్మన్నదని ఆ బాబు సెప్పిన మాటలు “నా కింద కనకమ్మ యెంతో చేసింది. నేను చనిపోయాక యివి కనకమ్మ కిమ్మని అందట ఆ మహాతల్లి. వాటితో చిన్నకొట్టు పెట్టుకొని, జీవితానికి డోకా లేకుండా సాగిపోతుంటే, పచ్చవాతమొచ్చి యిలా మూలబడింది.
తాను సేసిందానికి కోడలిప్పుడు బదులు తీర్సుకుంటేనే మండిపోతంటాది. మరట్టాటిది… సేతి కింద పనిసేసిన మనిసి, నోటికొచ్చినట్టు పేలితే, ఆ యమ్మకా నవ్వెట్టా వొచ్చేది? ఎన్ని మాటలన్నా, సిర్నవ్వు నవ్వీడమే గాక, కోపంనేకండా, యేమీ సుట్టరికం లేని తనలాంటి దానికి డబ్బు, బంగారం యెట్టా యిచ్చిందాయమ్మ? ఎంతాలోసించినా సమాధానం సిక్కడం నేదు కనకమ్మకి. ఆ సిర్నవ్వు గుర్తుకొస్తే యిప్పటికీ వొళ్ళు జల్లుమంటాది కనకమ్మకు.
“మీ అత్తేటి సేస్తంది? పడుకుందా ” అంటూ వచ్చిన ఎదిరింటి సాయమ్మతో, “యేటి సేత్తాది! కాలు సెయ్యి ఆడనేదు గాబట్టి ఓ మూల పడున్నాది” అన్న కోడలితో “నువ్వు మంచిదానివి గాబట్టి, జరిగిపోతంది మీ యత్తకి. కొంచెం టీవీ పెడుదూ! పొద్దు పోడంలేదు” అన్న సాయమ్మ మాటలు యినిపిస్తన్నాయి. ముండకేమీ పని లేప్పోతే, దాని బాబుగాడి యిల్లులా వచ్చి కూసుంటాది మనసులోనే తిట్టుకుంది కనకమ్మ. యే టీవీ యెట్టుకున్నారో! ఒక సెవి అటే పడేసింది.
” చావు పుట్టుకలు మన చేతిలో లేవు. కాని మనమీ లోకంలో లేకపోయినా, నలుగురూ మనలను గుర్తు పెట్టుకోవాలంటే, బ్రతికున్నప్పుడు మంచి పనులు చెయ్యాలి” టీవీలో యెవరివో మాటలు. బక్తి టీవీ గావాల. సావు, పుటకలు మన సేతిలో నేవు. బతికున్నప్పుడే మంచి పనులు సెయ్యాల… మాటిమాటికి, అవే మాటలు కనకమ్మ సెవుల్లో గింగురుమంటన్నాయి.
“పిచ్చిదానా! సావే మన సేతిలో వుంటే యిలా బతకాలని యెవురైనా యెందుకనుకుంటారు. కాలు, సెయ్యి పడిపోయి… నాకు రావల్సిందిది కాదని కొందరు కన్నీరు కారుస్తుంటే… ఈ నరకం నుండి నాకెప్పుడు విముక్తా అని కొందరెదురు సూస్తంటే… ఎవరెవరితోనో సేయించుకుంటూ… యిలా బతికేకంటే సావే మేలనుకోనా! సావు మన సేతిలో లేదు. ఆ బగమంతుడెప్పుడు రాసిపెడితే అప్పుడే. మనం సనిపోయాక్కూడా నలుగురూ గుర్తెట్టుకోవాలంటే మంచిపనులు సెయ్యాల” అనా ఆ సిర్నవ్వుకర్థం.
ఓలమ్మోలమ్మ! ఆయమ్మ సిర్నవ్వుకర్దమిదా! వుప్పుడేటి సెయ్యాలో తెల్సిపోనాది. ఆ సాయంకాలం కోడలు కూడు పట్టుకొచ్చి, నోరిప్పక ముందే, సైగలు సేసి మెళ్ళోని తాళమిచ్చి పెట్టె తెరిపించింది. అందులో మిలమిల మెరుస్తూ గొలుసు. ఆయమ్మ మెళ్ళోని గొలుసు. డబ్బుతోపాటు, తనకిమ్మని ఆయమ్మ తనకిచ్చిన గొలుసు. పెళ్లైనరోజు తప్ప, యే ఒక్క రోజూ కోడలి మెడలో యెయ్యని గొలుసు. కోడలిని మెడలో యేసుకోమని సైగ సేసింది. అయోమయంగా సూస్తన్న కోడలితో సైగల ద్వారా నీదేనని సెప్పి, గొలుసేసుకుని, ఎలిగిపోతన్న కోడలి ముకాన్ని ముచ్చటగా సూసింది. అత్త మొకంలోని ఆనందాన్ని సూసిన కోడలు, దగ్గరికి వచ్చి ప్రేమగా అత్త సెయ్యి పట్టుకుంది. యియ్యడంలోవున్న ఆనందం, సెమించడంలోవున్న ఆనందం, అర్దమయింది కనకమ్మకిప్పుడు.
-డా.మజ్జి భారతి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
“సిర్నవ్వు” (కథ)-డా. మజ్జి భారతి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>