నా జీవితం నా చేతుల్లో..

“అసలు ఈ ఆవకాయ పచ్చళ్ళు ఎవరు కనిపెట్టారో కానీ.. చెడ్డ చిరాకు వేస్తుంది. తినేటప్పుడు ఇంటిల్లపాది లొట్టలు వేసుకుంటూ.. టెంకెని  వడేసి   నములుకుంటూ రసస్వాదనలో మునిగి పోతారు..కాని ఆ ఆవకాయ పట్టేటప్పుడు  ఈ మండుటెండల్లో చెమటలు కక్కుతూ ఎంత కష్టపడాలో వీళ్ళకి ఏం తెలుసు ? ”
ఇద్దరు  పిల్లలు  ఉన్నారన్నమాటే  కాని  కాస్త అమ్మకి సాయం చేద్దామనే ఇంగిత జ్ఞానం అయినా లేదు..ఎప్పుడూ..ఆ నెట్ లో తలదూర్చి చాటింగ్ చేసుకోవడం తప్ప.  తమ చుట్టూ ఉన్న ప్రపంచం  ఏమిటో అన్నది అసలు అక్కరలేదు ”
పైకి అనుకుంటూ  కూతురు,కొడుకు పై  విసుగు నంతా ప్రదర్శించింది సుజాత.
అయినా . వాళ్ళలో వీసమెత్తు  కదలిక  కూడా లేదు. ఇంకా చెప్పాలంటే  మామిడి  కాయలని  ముక్కలగా చేస్తున్న   తల్లి వైపు చూస్తూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నారు.అమ్మ కోపం ఎంత సేపులే!   అన్న అతి రహస్యం ని అర్ధం చేసుకున్నట్లు.
అంతలో.. గుమ్మం ముందు ఎవరో వచ్చిన కదలిక కనిపించి కారుతున్న చెమటని తుడుచుకుంటూ తల పైకి ఎత్తి చూసింది  సుజాత.
“విజయ” కనబడింది. సంతోషం ముఖం లోకి కరంట్ లా ప్రవహించింది.
రా ..రా.. అనుకోకుండా ఏమిటీ.. ఈ హటాత్తు రాక…!?అని అడుగుతూనే.. లేచి నిలబడి ..ప్రిజ్ద్ వైపు అడుగులు వేసింది.
చెప్పులు విడిచి..బయట ఉన్న పంపు వద్ద కాళ్ళు కడుక్కుని కాస్త ముఖం మీద నీళ్ళు చిలకరించుకుని చేత్తో తుడుచుకుంటూ లొపలకి  వచ్చింది విజయ.
“ముందు ఈ చల్లటి నీళ్ళు త్రాగు.ఏమిటి ఇంత ఎండన పడ్డావ్? భోజనం చేసావా!? ప్రశ్నలు గ్రుమ్మరించింది సుజాత.
మంచి నీళ్ళ గ్లాస్ తీసుకుని గట గట తాగేసి మరి కాసిని అన్నట్లు చూసింది.
విజయ  మరి కాస్త నీళ్ళు త్రాగి కాస్త సేదతీరగానే.. చెప్పు అన్నట్లు ..చూసింది
“ఈ రోజు ఓ..స్కూల్ వాళ్ళు టీచర్స్ పోస్ట్ కోసం ఇంటర్యూ  చేస్తున్నారు. అందు కోసమే రావాల్సి వచ్చింది ” చెప్పింది విజయ.
“ఇంటర్యూ బాగా జరిగిందా?బాగా చేసావా?”ఆత్రుతగా అడిగింది.
“ఏదో..పర్వాలేదు. సెలక్ట్ అయ్యినది లేనిది తర్వాత పోన్ చేసి చెపుతాను అన్నారు” చెప్పింది.
కొద్దిగా నిరాశ ..సుజాతకి. “ఈజీగా నే తీసుకున్నానులే!అంది విజయ.
నిజానికి విజయ కంటే.. ఆమెకి వచ్చే ఉద్యోగం పట్ల సుజాత కే ఎక్కువ వర్రీ ఉంది. వాళ్ళిద్దరికీ ఓ..నాలుగేళ్ల పరిచయం. సుజాత పని చేస్తున ఆపీస్ కి విజయ వస్తూ ఉంటుంది.ఓ.పదేళ్ళ వయసు తేడా ఉన్నాఏదో తెలియని బంధం వారిని కలిపింది.మంచి స్నేహితులు అయ్యారు.
“తొందరగా నీకు ఒక ఉద్యోగం దొరికితే బాగుండు” ..అంది సుజాత . విజయ మౌనంగా వింటూ ఆలోచిస్తుంది.
“మోడల్ స్కూల్ టీచర్ పోస్ట్ ల కోసం జరిగే ఎగ్జాం ఎప్పుడు..?”అడిగింది. .
“ఓ..పది రోజులు  తర్వాత ఉంది”చెప్పింది కాస్త అనాసక్తిగా..
ఏమిటమ్మా ! అంత నిరాశగా ఉన్నావు? అడిగింది..
” ఏం చేయను ..అసలు ఎందుకు బ్రతకాలో, ఎందుకు ఈ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలో అర్ధం కావడం లేదు
“రజియా”కి పోన్ చేసావా?
“చేసాను..విషయం చెప్పాను..నీ కూతురితో..నువ్వే మాట్లాడు.. అని  పోన్ ని ఆ పిల్లకి ఇచ్చేసింది .రెండు మూడు మాటలు తర్వాత అడిగాను.నేను వస్తున్నాను ..నువ్వు నాతొ పాటు వచ్చేయి అని చెప్పాను..వెంటనే పోన్ కట్ చేసింది. రెండు నిమిషాలు ఆగి మళ్లీ పోన్ చేసాను..రజియానే మాట్లాడింది. “వదినా ..నేను అప్పు..అమ్మీ అందరు చెప్పి చూసాము. అమ్మ వెంట వెళ్ళు నీకు అక్కడ చాలా  బాగుంటుంది అని. కానీ ఆపిల్ల వినడం లేదు. నేను వెళ్ళనంటే  వెళ్ళను . నేను మీకు అంత బరువైతే,నన్ను మీరు బలవంతంగా పంపించాలనుకుంటే ..నేను ఇంట్లోనుంచి వెళ్ళిపోతాను కాని ..ఆమె దగ్గరకి మాత్రం నన్ను వెళ్ళమని చెప్పొద్దు” అని ఖచ్చితంగా కోపంగా చెప్పింది.అంట.”

ఆ మాటలు చెపుతున్నప్పుడు విజయ కళ్ళల్లో కన్నీరు.

నేను తనని ఏమైనా కావాలని వదిలేసానా? నేను అంటే ఏమిటో.. నాకు తెలియని ఒంటిమీద సృహ లేని    మెదడు మొద్దు బారిపోయిన ఆ పరిస్థితుల్లో..నా వెంట తనని తెచ్చుకోకపోవడం తప్పే! కాని నన్ను ఇలా ద్వేషించుకునే తప్పు నేను ఏమి చేసానో..నాకు అర్ధం కావడం లేదు”అంది విజయ.
ఆ పరిస్థితిలో ఇంకా ఏం మాట్లాడినా విజయని ఇంకా ఎక్కువ బాధ పెట్టడమే అవుతుందని సుజాత కి తెలుసు. కొంచెం కాఫీ కలిపి ఇచ్చింది. త్రాగుతూ..చెప్పింది.”పోయిన సారి నేను తనని చూడటానికి నేను వెళ్ళినప్పుడు నా కూతురు నాకు కాఫీ కలిపి ఇచ్చింది.అంత పెద్దది అయిపొయింది ..తెలుసా..? “అంది నవ్వుతూ
“ఈ సంవత్సరం అయినా స్కూల్ కి పంపుతారా లేదా? లేకపోతే  మదర్సాకే పంపుతారా?” కించిత్ కోపంగా అడిగింది.
“నాకు తెలిసినంతవరకూ ఓ..రెండేళ్ళు ఇళ్ళల్లో పని పాట నేర్పి ..పెళ్లి చేసి పడేస్తారు.అంతకన్నా వేరే సూచనలు వాళ్ల  దగ్గర లేవు అంది.
“నువ్వు అసలు ఎలా  ఊరుకోగాల్గుతున్నావ్? ఆ పిల్ల వయసు పదేళ్ళు నిండినాయి.ఒక చదువు సంధ్య లేదు..మంచి-చెడు తెలియదు  ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గులేదా?”  తీవ్రంగా అడిగింది..సుజాత.
“నన్నేం  చేయమంటావు  చెప్పు “?
“తల్లిగా నీకు అసలు భాద్యత లేదని అనుకుంటున్నావా!? అతను వ్యసనపరుడు..వదిలి పడేసాడు. నీకేమయింది..?”
“నా జీవితమే అలా తగలడింది.. ఇక ఇంతే ప్రాప్తం అనుకుని వదిలేయడమే!”అంది విజయ.
నువ్వు అలా అంటే ఒప్పుకోను నేను.. అసలు ఒకరి జీవితం నాశనం కావడానికి  ఇతరుల మీద తప్పులు రుద్దేయడానికి ..ఇతరుల వల్లనే తమ జీవితం అలా తయారైందని ఏడవడానికి ఓ..కడెవిడు కన్నీళ్లు కార్చడానికి తయారుగా ఉన్నట్లు ఉండే వాళ్ళని చూస్తే నాకు అసహ్యం. అసలు ఇతరులేవరో నాశనం చేయడానికి ప్రయత్నించినా మనకి మనం ఏం చేసుకుంటున్నాం ఏం చేయగల్గుతున్నాం అని ఆలోచించుకోవాలి. ఖర్మ అని,ప్రారభ్డం అని సరిపెట్టుకోవడంని  ఎస్కేపిజం అంటారు.
అయినా నీకు ఈ వైరాగ్య భావనలు రావడం లో ఆశ్చర్యం ఏం లేదులే.. ఎప్పుడూ గుళ్ళు గోపురాలు ,ఊర్లు తిరగడం.  ముప్పయి మూడేళ్ళ వయ్యస్సులో ఇవన్నీ  నీకు అవసరమా!?
నీ జీవితం గురించి నీకు ఆసక్తి,శ్రద్ద లేకపోయినా..ఓ..బిడ్డకి తల్లిగా నీ అవసరం ఉందొ, లేదో అదైనా  తెలుసుకో..కోపంగా చెప్పింది.
ఆ కోపంలో అభిమానం ఉందని విజయ కి తెలుసు కాబట్టి..ఏమి మాట్లాడలేదు.
“నాన్న ..ఓ..సంబంధం చూసారు. వాళ్ళు త్వరగా అవునో,కాదో తేల్చి చెప్పమని   ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు ఏమి చెప్పను . డి.ఎస్ .ఈ.. ఎగ్జాం..అయ్యాక చెపుతాం అన్నారు అట నాన్న” అంది.
“అంటే పరీక్ష బాగా వ్రాసి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా!లేదా?అని తెలుసుకున్నాక చెపుతారు అన్నమాట.బావుంది” అంది సుజాత వ్యంగంగా.
“వరుడు వివరాలు ఏమిటో..”అడిగింది
“వయస్సు 52 .భార్య మరణించింది .  ముగ్గురు కొడుకులు,ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. బాగా ఆస్థి ఉంది మూడవ కొడుకు పెళ్లి అయిపోతే ఆస్తులు అన్నీ పంచేసి ఆయన సెటిల్ అవుదా మనుకుంటూ న్నాడట.
‘బేష్..బ్రహ్మాండంగా ఉంది. మూడవ కొడుకు పెళ్ళికి అత్తగారి పాత్రలో.. తలంబ్రాల చీర ఇచ్చి ,బొట్టు పెట్టి..తర్వాత ఆయనకీ పిల్లలని కంటా వన్నమాట.చాలా బాగుంది”
అసలు మీ నాన్నకి కళ్ళు ఉన్నాయా ? లేకపోతే అప్పుడు చేయలేక పెళ్లిని ఇప్పుడు చేయాలనుకుంటున్నారా!? ఏమైనా ఇది ఏం  బాగోలేదు. నీకు ఎలా అనిపిస్తుందో  కాని.”అంది సుజాత
“నాకు నచ్చలేదు. అసలు వచ్చిన ప్రతి సంబందానికి నువ్వే వంకలు పెడతావు. ఈ వయసులో,నువ్వు చేసిన ఘనకార్యానికి ఇంత  కన్న మంచి సంబంధం వస్తుందా..అని తిట్టి పోస్తుంది అమ్మ. మళ్ళీ కాసేపేమో..దానికి ఈ వయసులో పెళ్లి ఎందుకు..? మనతో పాటు కృష్ణ,రామ అని ఉంటుందిలే ..అంటుంది.
తమ్ముడేమో..అసలు నాతొ మాట్లాడటం మానేసాడు. ఆ ఇంట్లో..నన్ను అర్ధం చేసుకుంది ఒక్క “మాధవి” మాత్రమే! పరాయి ఇంటి పిల్ల .ఆరేళ్లలో నన్ను ఎప్పుడు చిన్నమెత్తు మాట కూడా అనలేదు. అని చెప్పింది మరదలు గురించి.
“సరేలే! వీటి గురించి మనం ఎన్నో  సార్లు మాట్లాడుకుందాం.ఏమి ప్రయోజనం లేదు.భోజనం చేయి. ఈ పచ్చడి పనులు పూర్తి చేయాలి. కదా! “అంది సుజాత.
ఇప్పుడు వద్దు..వెళ్లబోయే ముందు తింటాను. పద పని చేసుకుందాం !అని తనే అక్కడి నుండి లేచింది.
ఏదో చానల్ లో “సీతాకోక చిలుక” సినిమా వస్తుంది చూడు మమ్మీ.అని సుజాత  కూతురు ఇంకో రూంలో నుండి కేకేసి చెప్పింది. ఆ సినిమా అంటే పిచ్చి నాకు . మతాంతర వివాహం  టీనేజ్ ప్రేమ ..సబ్జక్ట్ భలే బాగుంటుంది అంది సుజాత.
అంతకన్నా మంచి కథలు ఉన్నాయి జీవితం లో అంది విజయ.
మామిడి ముక్కలు నరుకుతూ.. ఉండగా  విజయ ఒక మాట అంది . అసలు ఈ ప్రేమ వివాహాలు చేసుకుంటున్న అందరిని ఇలా ముక్కలు నరికినట్లు నరకాలి అంది..అంతులేని కోపం ఆ మాటల్లో .
“ఎందుకులే అంత మాట . అందరి జీవితం నీ జీవితం లా ఉండదు. మీ వివాహ జీవితంలో ఎన్ని అంతరాలు,బేదాలు ఉన్నాయా ఏమిటీ ?అంది సాలోచనగా.
నేను ఎప్పుడు వివరంగా చెప్పలేదు కదూ..అంటూ  విజయ తన వివాహ జీవితం వైపు కబుర్లు మళ్ళించింది. ఉండు ఉండు..అంటూ  సుజాత తన కూతురు ”డాలీ” ని పిలిచింది ..పనిలో సాయం చేసే నెపం తో.. కొంచెం అయిష్టంగానే కూర్చుని మామిడి కాయలోని జీడి ముక్కలని తీస్తూ శుభ్రం చేస్తూ ఆ పిల్ల ..ఓ..చెవి వేసింది
విజయ చెప్పడం మొదలెట్టింది.
డాలీ కూడా శ్రద్దగా వినడానికి రెడీ అయింది.
“నాకు అప్పుడు ఇరవయ్యి ఏళ్ళు ఉన్నాయి డిగ్రీ పూర్తి చేసి సెలవల్లో  కొత్తగా వచ్చిన కంప్యూటర్ క్లాస్స్ లకి వెళుతున్న రోజులు. అప్పుడప్పుడు నేను వెళుతున్న  కంప్యూటర్ సెంటర్ కి బాషా వచ్చే వాడు. అతను చిన్నప్పుడు నుండి నాకు తెలుసు .నాకన్నా ముందు నుండే ఆ స్కూల్ లో చదివే వాడు.పదవ తరగతి చదువుతూ  మధ్యలో మానేసాడు. ఏదో చిన్న చిన్న బిజినెస్ లు చేస్తుండే వాడని  తెలుసు. నేను కంప్యూటర్ క్లాస్ లకి వెళ్లి నన్ని  రోజులు రాక పోయినా ఎక్కువగానే అక్కడికి వచ్చేవాడు. ఇరవయ్యి ఏళ్ళు  వయస్సు వచ్చిన నాకు అతను ఎందుకు వస్తున్నాడో అర్ధం అయ్యేది. మాకు తెలిసిన వాళ్ళ దగ్గర,అతనికి నాకు మాత్రమే   తెలిసిన  కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర  ఆ “విజయ” వప్పు కుంటే పెళ్లి చేసుకుంటాను అనేవాడట. అది విని నేను వాడి మొహం లే!. శుద్ధ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నేనెక్కడా!,ముస్లిం అయిన అతను ఎక్కడ!? అవన్నీ ఏం కుదరవులే..నోర్మూసుకుని పని చూసుకోమను”అని చెప్పేదాన్ని.
కొన్నాళ్ళు అతను నాకు కనిపించలేదు.కళ్ళకి కనబడే ప్రేమ అనే మత్తు  వదిలిపోయింది.నా సమాధానం విని..ఇక అంతే నా జోలికి రావడం వద్దులే అనుకుని వెళ్ళిపోయి ఉంటాడులే అనుకునే దాన్ని” చెప్పింది విజయ.
ఇంటరెస్ట్ గా ఉంది. మరి తర్వాత మీ పెళ్లి ఎలా జరిగింది ?అడిగింది డాలీ
“ఆ రోజు శుక్రవారం..నేను తలంటు  పోసుకుని  పట్టు లంగా కట్టుకుని ..తల లో పూలతో..మెడలో నగలతో. కంప్యూటర్ క్లాస్స్ కి వెళ్లాను. వెళ్ళేటప్పుడు ..మా అమ్మ అచ్చు పెళ్లి కూతురు లా ఉన్నావు అని మురిసి పోయింది. ఆమె మాటకి ఉన్న బలం ఎంతంటే.. ఆరోజు నా పెళ్లి జరిగి పోయింది.
నేను కంప్యూటర్ సెంటర్ కి వెళ్ళగానే మెయిన్ డోర్ దగ్గరే బాషా నా కోసం కాసుకు కూర్చుని ఉన్నాడు. నేను లొపలకి వెళ్లబోతుంటే..చటుక్కున నా చేయి పట్టుకుని.. నన్ను పెళ్ళిచేసుకుంటావా!? నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నీకు ఏ లోటు చేయకుండా బాగా చూసుకుంటాను అని చెప్పాడు. అతని కళ్ళల్లో ప్రేమకో,లేదా అతను అడిగిన విధానానికి సానుభూతి  కలిగో.. వెంటనే తల ఊపేశాను. అతని కళ్ళల్లో సంతోషం.ఓ..పది  నిమిషాల్లో అతను స్నేహ బృందం అంతా కలసి  మూడు ఆటో లలో అక్కడికి వచ్చేసారు.

బాషా కంప్యూటర్ ముందు కూర్చున్న నా దగ్గరకి వచ్చి ‘వెళదాం రా”అన్నాడు. నేను వెనుక ముందు ఏం ఆలోచించలేదు.అక్కడి నుండి లేచి  అతని వెంట వచ్చేసాను.  అతను..నన్ను  ఓ..ఆటోలో ఎక్కించుకుని అమ్మవారి గుడి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. అతని స్నేహితులు ఓ.పది  మంది వరకు మా వెంట వచ్చారు. వాళ్ళందరి సాక్షిగా  ఆ గుళ్ళో నామెడలో తాళి కట్టాడు. నేను అతని భార్య ని అయ్యాను. “బాషా” అతని ఇంటికి నన్ను తీసుకు వెళ్ళ లేదు. వాళ్ళు ఉండే ఏరియా అంతా ముస్లిం లే ఉంటారు అని చెప్పి . అక్కడ నేను ఉండలేను అనుకుని వేరొక ఇల్లు తీసుకున్నాడు.నేను అతనితో కలసి ఆ  ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక ఇంటికి కావాల్సిన సామానులు ఏమైతే కావాలో అన్నీ వివరంగా అమర్చి ఉంచాడు. నాకు చాలా ఆశ్చర్యంగాను,సంతోషం గాను అనిపించింది.

“నీ మనసు నాకు తెలుసు నువ్వు నా కోసం అన్ని అభ్యంతరాలు వదులుకుని వస్తావని నా మనసుకి తెలుసు  “నీ కోసమే ఇవ్వన్నీ  కొని ఉంచాను” అని చెప్పాడు.
అతనికి నా పై యెంత ప్రేమ లేకపోతే..ఇంత ముందు చూపుతో ఇవ్వన్నీ అమర్చగలడు..అని అనుకోగానే అతని పై నాకు ఉవ్వెత్తున ప్రేమ పుట్టుకు వచ్చింది. అతనిని హత్తుకుని మనఃస్పూర్తిగా  “ఐ లవ్ యూ” అని చెప్పాను. మధ్యాహ్నం అయ్యేటప్పటికి రోజూ మాములుగా నేను వెళ్ళే సమయానికి  ఇంటికి చేరుకోక పోయసరికి మా వాళ్లకి అనుమానం వచ్చింది. వెతకడం మొదల పెట్టారు ..విషయం తేలిక గానే తెలిసింది.
“చీ..!అది ఇంతటితో..చచ్చింది అనుకుందాం. ఇలాంటి పనులు  మన ఇంటా వంటా ఉన్నాయా? పోయి పోయి,,

ఓ .. తురక వాడిని కట్టుకుంది.దీనికి ఇంతకన్నా మంచోడు దొరక లేదా!? “

ఇదిగో..ఈ ఇంట్లో దాని ఊసు ఎత్తారా? నరికి పారేస్తాను జాగ్రత్త ..అంటూ నాన్న హుంకరించడం..జరిగిందట.

ఆ సాయంత్రానికి అమ్మ,పెద్ద మామయ్యా వచ్చారు. ఏం జరిగింది..అతనిని నువ్వు ప్రేమించావా? అని అడిగారు.లేదని తలూపాను. మరి అయితే ఎలా జరిగింది  ఈ పెళ్లి ?అని అడిగారు. జరిగిన విషయం చెప్పాను.
అతను అలా అడగ గానే వెళ్ళిపోయావా? నీకేం మాయరోగం వచ్చిందే ఇలా చేసావు.ఇంకా చదువుకుంటే చదివించి మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి  చేద్దామనుకున్నాను. . ఈ పెళ్లి-గిళ్లి ఏమి జరగలేదనుకో.. ఆ తాళి తెంచి పడేసి .మాతో వచ్చెయ్యి ..అని అంది అమ్మ. నేను మాట్లాడలేదు. ఎదురుగా బాషా నిలబడి ఉన్నాడు.  నేను ఏం చేబుతానా అని నా వంకే  చూస్తున్నాడు. పాపం అతను నన్ను యెంత గా ప్రేమించాడు!!. నాకోసం యెంత చేస్తున్నాడు అని గుర్తుకువచ్చి..”నేను రాను మీరు వెళ్ళిపొండి.”.అని చెప్పేసాను.

కాసేపు నాకు నచ్చ చెపుదామని ప్రయత్నం చేసి అది వీలుపడక ..నన్ను తిడుతూ,శపిస్తూ వెళ్ళిపోయారు అమ్మ,మామయ్య.
రెండు  రోజులు గడిచేటప్పటికి బాషా అమ్మ,అతని బందువులు బిల బిల లాడుతూ వచ్చేసారు. మా కోడలు బంగారు బొమ్మలా ఉంది..ఎంతైనా మా బాషా ఎంపిక గొప్పది..అంటూ మెటికలు విరిచుకుని ముచ్చట పడిపోయారు.
నిన్ను కన్నవాళ్ళు  వద్దని వదిలేస్తే ..మేము వదిలేస్తామా? ఒరేయ్..బాషా ..ఏమిటిరా !…కోడలని .ఇక్కడ ఒంటరిగా  ఉంచావ్?  మన ఇంటికి తీసుకుని పోదాం పద. మన ఇంటికి తీసుకుని పోయి.. పెద్దాళ్ళతో మాట్టాడి మళ్లీ మన పద్దతిలో “షాది’ చేసుకోవాలా…అని అన్నారు.
బాషా..అలాగే అన్నాడు. నేను అతని వైపు చూసాను. “నీకు ఇష్టమైతేనే !”..అన్నాడు.
నేను అప్పుడు  కూడా  ఏమి ఆలోచించలేదు.అతనితో కలసి బతకాలనుకున్నప్పుడు అతని మతం లోకి మారితే తప్పు ఏమిటి అనిపించింది.
నేను ,బాషా కలసి అతని తల్లి ఉంటున్న ఇంటికి మారిపోయాం, అతనికి తండ్రి లేడు.ఓ.అక్క మాత్రం ఉంది ఆమెకి పెళ్లి అయిపొయింది ఒక వారంలోపులోనే నన్ను ముస్లిం మతంలోకి మార్చి వేసారు. పుట్టినప్పటి నుండి నన్ను అంటిపెట్టుకున్న తిలకం బొట్టు,ఆ బొట్టు క్రింద పెట్టుకునే కుంకుమ బొట్టు అన్ని తీసివేసేటప్పుడు..ఎక్కడో గుండెలో కలుక్కుమంది. నాకు బొట్టు పెట్టుకోవడం యెంత ఇష్టమో..ప్రతి శుక్రవారం పాదాలకి పసుపు రాసుకోవడం అంటే యెంత ప్రాణమో !ఇవన్నీ  ..ఇక ఉండడని తెలుసుకుని ఏడుపు వచ్చింది. కానీ బయటకి తెలియనివ్వలేదు
నా మెడలో బాషా గుడిలో కట్టిన తాళిని తీసివేసారు. నాలో ఊపిరిపోసుకుని పెరిగిన నా మత విశ్వాసాలు అన్నీ ఒక్కొక్క టిని  నా నుండి దూరం చేస్తున్నారు.  చూడమ్మా! ఇక నువ్వు మీ పద్దతులు అన్నీ పూర్తిగా మర్చి పోవాలి. నిన్ను ముస్లింగా కలుపుకున్న తర్వాత నీకు మీ పద్దతులు ఏవి గుర్తుకు రాకూడదు. . “నీకు  జమీలా” అని పేరు పెడుతున్నాం. ఇక నువ్వు ఆ పేరుతోనే పిలవబడతావు,అని చెప్పారు.. నాకు ఎందుకో  ఆ పేరు నచ్చలేదు. విజయ అన్న పిలుపు మానేసి  బాషా కూడా నన్ను  జమీలా అని పిలవడం చిత్రంగా తోచింది. నాకు ఇవ్వన్నీ వద్దు..నన్ను నాలాగే ఉండనివ్వండి అని గట్టిగా అరచి చెప్పాలనిపించింది. కానీ నా నోరు పెగల లేదు.
ఇరవయ్యి ఏళ్ళపాటు ఉదయం నిద్రలేచినప్పుడు ..అరచేతులు చూసుకుని  “కరాగ్రే వసతే లక్ష్మి,,కర మధ్యే సరస్వతి,కరమూలే తూ గోవిందః ,ప్రభాతే కర దర్శనం”  అంటూ కరదర్శనం చేసుకునే  నేను ..భూమిపై పాదాలు ఆనిస్తూ.. భూమాతను  క్షమాపణ  కోరుతూ ప్రార్దించే  నేను..వాకిలి ఊడ్చి సూర్యదయానికి ముందే కల్లాపి జల్లి అందంగా ముగ్గులు పెట్టే  నేను ..అవన్నీ  చేయక నా చేతులు కట్టేసినట్లు అనిపించింది

కాలకృత్యాలు తీర్చుకుని  స్నానం  చేసివచ్చి తాతయ్య తో కలిపి ..సూర్య నమస్కారం చేస్తూ ఆదిత్య హృదయం ని పఠించే నేను ..విషు శతసహస్ర నామం ని పారాయణం చేసే నేను ..అవన్నీ ఎక్కడో పనికి రాని వస్తువలని పారేసిన విధంగా  మరుగున పడేయడం నా వల్ల కాలేదు. అలవాటు ప్రకారం పారాయణం  గొంతు  పెల్లుబికి వచ్చేస్తుండేది. అలాగే అణచి వేసుకుని  లోలోపలే వల్లెవేస్తూ ఉండేదాన్ని.మళ్ళీ అంతలోనే మతం మారిన గుర్తుకు వచ్చి  ఎవరన్నా చూస్తారేమో అన్న దిగులు ముంచు కొచ్చేది. అదేమిటో..’బిస్మిల్లా ఇర్రహ్మాన్ నిర్రహీమ్” అనుకోవడం వచ్చేదే కాదు.

పెళ్లి అంటే.. ఏమిటో..అనుకున్నాను. క్రొత్త జీవితం బాగుంది అనుకున్నాను. మధ్యలో ఏమిటీ ఇలా మతం మారడం అయిపొయింది అనుకున్నాను.
బాషాని .. అడిగాను.. మళ్ళీ చదువుకోవడం మొదలెడతాను అని.
నీకు..ఎందుకు పరేషాన్? నేను ఉన్నానుకదా! నేను సంపాదిస్తాను నువ్వు ఇంట్లో ఉండి హాయిగా ఉండు చాలు అన్నాడు. నువ్వు పనికూడా చేయనవసరం లేదు. అమ్మీ అన్ని చూసుకుంటుంది అన్నాడు.
తను ప్రొద్దుటే వెళితే.. రాత్రికి రావడమే! ఈ లోపు పగలు ఆంతా మా అత్తా చుట్టాలు వచ్చే వాళ్ళు. చేపలు,మాంసం,రొయ్యలు.. తెచ్చి వంటలు చేసే వాళ్ళు. నాకు  ఆ వాసన చూస్తేనే కడుపులో దేవేసేది. వాళ్ళు అందరు ఆ పదార్ధాలని లొట్టలు వేసుకుని తినడం నాకు వాంతులు తెప్పించేది.
మా అత్త చెల్లెలు.. ఈ కోడలు ఇలా మన తినే తిండిని అసహ్యించుకుంటే ఎట్టా.. రేపు బాషా గాడికి ఏం వండి పెట్టుద్ది.. ఏమైనా సరే మాంసాలు,చేపలు వండటం  నేర్పాల్సిందే అని పట్టు బట్టుకు కూర్చుంది. బతికి ఉన్న చేపలు తీసుకు వచ్చి..నన్ను చేపలు శుభ్రం  చేసే బండ దగ్గర కూర్చో పెట్టి..నా చేత చేపలు రుద్దించడం,ముక్కలు కోయించడం..చేపించేవారు. దగ్గర ఉండి ఆ వంటలు చేయడం నేర్చుకోమని బలవంతం చేసేవారు. ఆ వాసనలకి నాకు కడుపులో త్రిప్పి వికారం తో వాంతులు అయ్యేవి.
అప్పుడు వదిలేసి “సంబడం  ప్రేమించి పెళ్లి చేసుకుంటేనే ,మొగుడు తో పడుకుంటేనే  సరిపోతుందా? వాడికి రుచికరమైన పదార్ధాలు వండి పెట్టడం తెలియవద్దు.అని అనేవారు. వెటకారంగా.
ఎప్పుడైనా బయటకి వెళ్ళా లంటే తప్పని సరిగా ..బురఖా ధరించి,నఖాబ్ కట్టుకుంటేనే  కానీ బయటకి వెళ్ళనిచ్చేవారు కాదు. .నాకు ఆ బురఖాలో బందించినట్లు ఉండేది. ఊపిరి ఆడేది కాదు. వాళ్ళ ఆచారం ప్రకారం ఖురాన్ చదవమనే వారు.రాకపోతే నేర్చుకోమని మదర్సాకి వెళ్ళమని వత్తిడి చేసేవారు. అలా అని మా ఇంట్లో ఆడవాళ్ళందరూ రోజు నమాజు చేయడం నేను చూడలేదు. ఆఖరికి బాషా కూడా  ముస్లిం ఆచారం ప్రకారం పద్దతిగా నమాజ్ చేసే వాడు కాదు. మతం మారడం కి ఎందుకు ప్రాముక్యత ఇచ్చారో కూడా అర్ధం అయ్యేది కాదు.ప్రతి చిన్న విషయానికి మత సంభందమైన విషయమే పోల్చి చూపేవారు. “రమదాన్ “ఆచరించడం జాగారాలు చేయడం నా వల్ల అయ్యేది కాదు. మనసులో లేని భక్తి యెంత ఆచరిస్తే మాత్రం సొంతం అవుతుందా అనుకునేదాన్ని.

అప్పుడపుడు నేను బాషా తో కలసి బయటకి వెళ్ళినప్పుడు అమ్మ,నాన్న ఎవరైనా కనబడతారేమో అని చూసేదాన్ని..చూపులతో చుట్టుపక్కల వెదుక్కునేదాన్ని.. వాళ్ళు ఊరు వదిలేసి విజయవాడకి వెళ్లిపోయారని తెలిసిన రోజు బాగా ఏడ్చాను.
బాషా తో ఏమైనా చెప్పుకోవాలనిపించినా వీలు పడేది కాదు. ఉన్న రెండు గదుల ఇంటిలో  మేము దగ్గరగా ఉండటం కూడా వీలయ్యేది కాదు. వదినా !నేను నీతోనే పడుకుంటాను అని మా చిన్నత్త కూతుర్లు వచ్చేసేవారు. బాషా మధ్య నాకు ఏమిటో తెలియని , చెప్పలేని దూరం ఉండేది. రాత్రుళ్ళు ..బాగా ఏడుపు వచ్చేది. ఏమిటీ ఇలాటి జీవితం  కోసమా!? నేను అందరిని విడిచి  వచ్చేసింది అనుకునే దాన్ని.

అలా రోజులు గడుస్తున్నాయి. “ముస్కాన్ ” కడుపున పడింది. ఆ సంగతి తెలిసినప్పటి  నుండి బాషా ప్రేమగా చూసుకునేవాడు.అన్నీ కొని తెచ్చి ఇచ్చేవాడు. తినమని బలవంతం చేసేవాడు. నేను గర్భంతో ఉన్న రోజుల్లోనే బాషా తల్లి చనిపోయింది
బాషా చేస్తున్న వ్యాపారం లో బాగా నష్టం వచ్చింది. ఎక్కువ వడ్డీకి తెచ్చిన అప్పులు,బంధువులు   చేసిన మోసం వల్ల ..మేము ఉంటున్న ఇల్లు కోల్పోవలసి వచ్చింది. మా కోడలు మంచిది అన్న మా  చిన్నత్త అత్త నోటివెంట.. “దరిద్రపు గొట్టు”ది ఇది వచ్చింది ఆంతా ఊడ్చుకు పోయింది,ఆఖరికి మా అక్క కూడా చచ్చింది.” అని తిట్టి పోసేది. “ముస్కాన్  ” పుట్టింది. అప్పుడైనా చూడటానికి రాని అమ్మానాన్నల గురించి బాషా వాదులాడేవాడు. ఎక్కడినా తల్లిదండ్రులు మీ వళ్ళు ఉన్నట్టు  ఉన్నారా? మీ వాళ్లకి ఏమిటీ అంత పట్టుదల అనేవాడు.

ఎపుడైనా సరదాకి త్రాగే బాషా  క్రమంగా రోజు తాగడం మొదలెట్టాడు.వేరొక ముస్లిం అమ్మాయి తో సంబంధం పెట్టుకుని నేరుగా ఆ అమ్మాయినే ఇంటికి తీసుకు వచ్చి కాపురం పెట్టాడు. వాళ్ళిద్దరూ ప్రక్క గదిలో కులుకుతూ ఉంటే..నాకు అడ్డు చెప్పాలనిపించేది కూడా కాదు. అందుకు అందరు తిట్టేవారు.అలా మొగుడుని వదిలేస్తావా? తీసుకుని వచ్చిన “ఆ చినాల్ రండ్ ” ని తరిమి కొట్టాలి  కాని అనేవారు.  ఆమెకి నేనే వంట చేసి పెట్టవలసి  వచ్చినప్పుడు మాత్రం మనసు ఎదురు తిరిగేది. ఏమైనా అంటే..నువ్వు నాకు నచ్చినట్లు ఉండటం లేదు.మొగుడిని సుఖ  పెట్టడం నీకు చేతకాదు.  అందుకే ఆమెని షాదీ చేసుకున్నాను.అయినా పోషించేది నేను. నోర్మూసుకుని దానికి కూడా వండి పెట్టు అనేవాడు. అలా మనసుని చంపేసుకుని బ్రతకడం  అలవాటు చేసుకున్నాను. “ముస్కాన్” చూస్తే నేను ఏం అయిపోయినా పర్వాలేదు నా బిడ్డ నాకుంది చాలు అనుకునేదాన్ని.  ఏమి జరిగిందో ఏమో కాని  ఇంట్లో ఉండే  ఆమె  ఓ..రెండు నెలలకి వెళ్ళిపోయింది.  తిరిగి రాలేదు. కాని వెళ్ళేటప్పుడు మాత్రేం బాగా డబ్బు చేజికించుకుని వెళ్ళింది అని చెప్పేవారు. డబ్బు పొతే పోయిందిలే,దాని పీడా  పోయింది అనుకున్నాను.
ఒకసారి ఆరునెల పాపగా ఉన్నప్పుడు అనుకుంటాను. “ముస్కాన్ ” బాగా జబ్బు పడింది. హాస్పిటల్ లో జాయిన్ చేసాం అక్కడే ఉంచాలన్నారు. చేతిలో చిల్లిగవ్వ లేని ఆరోజున బిడ్డ ప్రాణాల కొరకు అభిమానం చంపుకుని నాన్నకి కబురు పంపాను. నాన్న డబ్బు తీసుకు వచ్చి హాస్పిటల్ బిల్ కట్టి..మనుమరాలిని చూసి మరి కొంత డబ్బు ఇచ్చి వెళ్ళారు.

. బాషా  మాత్రం నాన్న ఇంటికి  ఎందుకు రాలేదని గొడవ చేసాడు. మెల్ల మెల్లగా నన్ను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమని బలవంత పెట్టసాగాడు.కులాంతర వివాహం,మతాంతర వివాహం మనమే కొత్తగా చేసుకున్నామా? ఎందరో చేసుకుంటున్నారు..పెళ్లి అయి మూడేళ్ళు దాటినా ఓ..బిడ్డ పుట్టినా మీ వాళ్ళు రారు ఎందుకు? అని గొడవ పడేవాడు.వాళ్లు రాకపోతే పోనీ ..నువ్వే వెళ్ళు. కనీసం నీకు అక్కడ ఆస్తిలో వాటా అయినా వస్తుంది అనేవాడు.  ఆ మాటలు వింటుంటే బాషాలో అనేక రకాల క్రొత్త మనుషులు కనబడసాగారు. అతను ఎంత వత్తిడికి గురిచేసినా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళ లేదు. ఎన్నోరోజులు పస్తులు ఉన్నాం.కనీసం పిల్లదానికి పాలు కూడా ఉండేవి కావు. అయినా రోజు భాషా మాత్రం త్రాగే ఇంటికి వచ్చేవాడు.
“ముస్కాన్”‘ ని మా చిన్నత్త పిల్లలు తీసుకువెళ్ళి ఆలనా పాలన చూసేవారు. “ముస్కాన్ ‘ కి నాలుగో ఏడు వచ్చాక ఒక చిన్న కాన్వెంట్లో టీచర్గా చేరాను. పొద్దున్నే లేచి వండుకుని పిల్లకి పెట్టుకుని  కేరేజ్ కట్టుకుని స్కూల్కి  వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం కి వచ్చేదాన్ని.  బాషా వచ్చి తింటే తినేవాడు..లేకపోతే  లేదు. ..నాకు భుక్తికి గడచి పోయేది. కాబట్టి పెద్ద సమస్యలు లేవు అనిపించేవి.
సుఖాలు లేకున్నా పర్వాలేదు..కష్టాలు లేకుంటే చాలు అనుకుని తృప్తితో జీవించడంకూడా  ఇష్టం లేకపోయిందేమో.. నువ్వు ఉద్యోగం  చేయవద్దు మానేయమని గొడవ పెట్టుకునే వాడు. నా సర్టిఫికెట్స్ చింపి పారేస్తాను  అని    బెదిరించే వాడు.. ఇవన్నీ చూసిన ఇంటి ప్రక్కవాళ్ళు కాస్త సాయంగా ఉండేవారు. ఎప్పుడైనా అవసర పడితే  డబ్బు అప్పు ఇచ్చేవారు.

ఒకసారి బాషా ముప్పయి వేలు డబ్బు కావాలని అడిగాడు..మనకి ఎవరు ఇస్తారు..! నేను ఎవరిని అడగాలి ?అన్నాను.మీ ఇంటికి వెళ్లి పట్టుకుని రా..!అన్నాడు.

నేను  అక్కడికి వెళ్ళను,అడగను అని గట్టిగా చెప్పేసాను.
అర్ధరాత్రి సమయంలో నన్ను ఇంట్లోనుండి బయటకి నెట్టేసి తలుపులు మూసుకున్నాడు. ఆ రాత్రంతా కటిక చీకతో గడిపాను. నా జీవితమే కాళ రాత్రి అయిపోయిందని అనుకున్నాను. అలా రెండు మూడు సార్లు జరిగాయి.ఇవన్నీ నాన్నకి తెలిసి.. ఆయన స్నేహితుడు ద్వారా డబ్బు పంపించి .. అప్పుగా ఇప్పించామని చెప్పమన్నారు. నాన్న స్నేహితుడు  అప్పుగా  డబ్బు  ఇస్తున్నట్లు   చెప్పి భాషా కే డబ్బు  ఇచ్చి వెళ్ళారు. ఎవరెవరో తన మీద నమ్మకం తో డబ్బు అప్పు ఇచ్చారు  కానీ మావాళ్ళు సాయం చేయలేదని తిట్టేసేవాడు. నన్ను ఉద్యోగం చేయడం మానేయ మన్నాడు. అతనితో వాదన ఎందుకు అని ఉద్యోగం మానేసాను. రెండు మూడు నెలలకే  పిల్లకు కూడా పట్టెడు మెతుకులు పెట్టలేని స్థితి వచ్చింది.

నేను మళ్ళీ స్కూల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఉద్యోగం చేయడం మొదలెట్టాను. స్కూల్ నుండి వచ్చాక చిన్న చిన్న పనులు చేయడం చేసి డబ్బు సమకూర్చి ప్రయత్నం చేసాను.
ఆ రోజు ఎనిమిది  గంటలకే  ఇంటికి వచ్చేసాడు బాష. నేను అప్పటికి వంట చేయలేదు. తనని చూసి వంట చేయడం మొదలేట్టాను .అప్పటికే ‘పిల్లని తీసుకుని బయటకి వెళ్లి బిర్యాని పేకెట్ కొనుక్కుని  ఇద్దరూ తినేసి వచ్చారు.
బాషా తాగి వచ్చి ఉన్నాడేమో ..విపరీతంగా తిట్టడం మొదలెట్టాడు. నా ఓపిక నశించి ఎదురు ప్రశ్న వేసాను.మా నాన్న ఇచ్చి పంపిన డబ్బు గురించి చెప్పాను. అంతే..ఒక్క ఉదుటున లేచి..నా జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చి పడేసి విపరీతంగా కొట్టి లొపలకి వెళ్లి  తలుపులు వేసుకున్నాడు.
ప్రక్క ఇంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆ సమయంలో మెదడు మొద్దు బారిపోయిన స్థితిలో రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడ రైలు ఎక్కేసి పెద్దనాన్న ఇంటికి చేరుకున్నాను.అర్ధరాత్రి ఆ స్థితిలో వచ్చిన నన్ను చూసి పెద్దమ్మ పెద్దనాన్న  చాలా బాధ పడ్డారు. తెల్లవారేసరికి  నాన్నరానే  వచ్చారు. నన్ను ఆ స్థితిలో చూసి ఏడ్చారు.
ఒక ఆరు నెలల కాలం పెద్ద నాన్న ఇంట్లో ఉన్నాను. మధ్యలో ఒకసారి “ముస్కాన్ ” ని తీసుకుని బాషా పెద్దనాన్న ఇంటికి వచ్చాడు.వాళ్ళు  మంచిగానే మాట్లాడి..అమ్మాయి వస్తానంటే తీసుకుని వెళ్ళమని చెప్పారు. ముస్కాన్ వాళ్ళ నాన్న ఒడిలో కూర్చుని ఉంది బెరుకుగా అపరిచితురాలిని చూస్తున్నట్లు నన్ను చూస్తుంది కానీ నా దగ్గరకి రాలేదు. బిడ్డని దగ్గరకు తీయాలని నాకు అనిపించలేదు. అప్పటికే ఓ..నాలుగు నెలలు దూరం అవడం వల్ల కావచ్చు అనుకుంటాను
“జమీలా ఇంటికి వెళదాం  రా..అని పిలిచాడు.బాషా.
“నేను రాను నాకు అసలు ఇల్లే లేదు” చెప్పాను.
మనకి ఇవన్నీ కొత్తవి అయినట్లు మాట్లాడతావు ఏమిటి? ఎన్ని సార్లు మనం గొడవ పడలేదు.కలసి ఉండలేదు. వచ్చేయి!!  వెళ్లి పోదాం ..అన్నాడు
“నేను రాను.” స్థిరంగా చెప్పాను. నా మాటలు విన్న బాషా నిజంగా  ఏడుస్తూనో లేక ఏడుపు నటిస్తూనో..నువ్వు లేకపోతె నేను బ్రతకలేను ..నువ్వు వచ్చేయి  ..అంటూ..నా చేయి పట్టుకున్నాడు.
ఇలా చేయి పట్టుకుని అడిగినందుకే కదా ..నేను నీ వెంటబడి నన్ను నేను మర్చిపోయి  నీ వెంట బడి  వచ్చేసాను. అలా ఇప్పుడు మాత్రం  నీ వెంట నేను రాలేను ..అన్నాను. ఇదేనా నీ ఆఖరి  మాట? అని అడిగాడు.నేను సమాధానం కూడా చెప్పలేదు.ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాను బాషా ఏడుస్తూ ఉంటే.. “అబ్బాజాన్..మత్ రో, జాయేంగే .చలో .”అంటూ అతని కన్నీళ్లు తుడుస్తూ కనబడింది. కబ్ బీ లడ్లేతే హై! క్యోం?   అంటూ తండ్రి చేయి పట్టుకుని తీసుకు వెళ్ళింది వెళుతూ నావైపు ఓ..చూపు చూసింది.

    అబ్బాకే  పాస్ పైసే నహీ హై తేరే కనే హైనా! టు దే!అంది.

తన వయసు అప్పుడు ఆరేళ్ళు
నేను అలా ఓ..ఆర్నెల్లపాటు పెదనాన్న ఇంట్లో ఉన్నాను.నన్ను వాళ్ళు కన్న కూతురికన్నా ఎక్కువగానే చూసుకున్నారు.నాన్న అమ్మకి,తమ్ముడికి నచ్చ చెప్పి నన్ను విజయవాడలో మా ఇంటికి తీసుకు వచ్చారు.
అప్పటికి తమ్ముడి పెళ్ళయి ఓ.రెండు నెలలే అయింది.కొత్తగా పెళ్ళయిన తమ్ముడు -అతని భార్యతో కలసి అమ్మ-నాన్న నేను రెండు గదుల మధ్య ఇరుక్కుని ఎలా ఉన్నామో!  అక్కడికి వెళ్ళగానే నన్ను గుడుల వెంట తిప్పారు. నా ఇష్టాలతో పని లేదు. నా ఆలోచనలు ఏమిటో వారికి కనుక్కోవలసిన అవసరం లేడు. నా పేరును మళ్లీ “విజయ’గా మార్చేసారు. మతం మార్చుకున్నందుకు యేవో ప్రత్యెక పూజలు చేసి సంప్రోక్షణ చేయించారు.  శ్రీ వైష్ణవం లో కి మార్పించారు. ఎప్పుడైనా మనసు  మారి  మళ్ళీ బాషాతో..కలసి బ్రతకడానికి అక్కడికి   వెళ్లి పోతానో అన్న అనుమానం అమ్మది. నాకు శరీరం మీద శ్రీ చక్ర చిహ్నాలు వేయించారు. ఇప్పుడు..నా మతం నన్ను బాహ్యంగా అంటిపెట్టుకునే ఉంటుంది. నిత్యం గుడులకి తిరగడం పూజా కార్యక్రమాలో పాల్గొనడం..ఎవరైనా   తెలిసిన వారు నా గురించి అడిగితే .. “ఆ తురక దరిద్రాన్ని వదిలించుకున్నాం ”  అని చెప్పేవారు.

పగలంతా ఎలా ఉన్నా రాత్రయ్యే సరికి “ముస్కాన్” గుర్తుకు వచ్చేది. నాకు ఉన్న ఒకే ఒక వారధి రజియా. ఆమె “ముస్కాన్ ” ని పెంచుతుంది. ఆమె భర్త “రాజు’ అతను బాషాకి  ప్రాణ స్నేహితుడు కావడం వల్ల “ముస్కాన్” భాద్యతని ప్రేమగా స్వీకరించాడు.అతను  హిందూ కన్వర్తేడ్ క్రిస్టియన్,. ముస్లిం అయిన రజియాని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతను క్రైస్తవం ఆచరిస్తాడు. ఇంట్లో..ఉర్దూ మాట్లాడనివ్వాడు. చర్చిలకి తీసుకు వెళతారు.వారి పెంపకంలో ఐదేళ్ళు పెరిగింది. స్కూల్ కి పంపలేదు. రజియాకి పుట్టిన పిల్లలు ఇద్దరినీ మోస్తూ..అంట్లు తోముతూ..బట్టలు ఉతుకుతూ.. పదకొండు ఏళ్ళు వచ్చేసరికి వంట చేస్తూ.. టి.వి చూస్తూ పెరుగుతుంది.
ఈ అయిదేళ్ళలో.. స్కూల్ లో టీచర్గా పని చేసాను. ఎమ్.బి.ఏ..చదువు కుంటాను. పీజ్ కట్టు అమ్మా! ..అని అడిగితె,,ఇంకా నీకు  చదువు ఎందుకు ?అంది అమ్మ.
తమ్ముడు బాగానే ఉంటాడు. ఎప్పుడైనా చిరాకు పడినప్పుడో,అమ్మ-మాధవి కి జరిగిన గొడవలు వచ్చినప్పుడో..ఆ దరిద్రాన్ని ఇంకా ఎన్నేళ్ళు ఇంట్లో ఉంచుకుంటారు..ఏదో ఒక సంబందం చూసి పెళ్లి చేయండి అంటాడు.
అమ్మ పెళ్లి వద్దంటుంది. నాన్న పెళ్లి చేయాలి అంటాడు..ఇలా అయిదేళ్ళు.. ఏం జరుగుతుందో.నేను ఏం చేయాలో తెలియకుండా గడచిపోయాయి. ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీలో ఏజంట్ గా చేరి..పాలసీలు చేయించడం, ఎదుగు బొదుగులేని టీచర్ ఉద్యోగం చేస్తూ  అప్పుడప్పుడు గుంటూరు మామయ్యా వాళ్ళింటికి వెళ్ళినప్పుడు సమయం చూసుకుని.. “ముస్కాన్” చూసి రావడం చేస్తుంటాను.

నా కూతురు  నేను చూడటానికి వెళ్ళినప్పుడు నన్ను చూసి దగ్గరికి రాదు.నేను దగ్గరికి తీసుకుందామన్న నన్ను దూరంగా తోసేస్తుంది. నేను తీసుకువెళ్ళినవి తీసుకుంటుంది  కాని నాతొ మాట్లాడాడు.  తండ్రి వచ్చినప్పుడు మాత్రం ప్రేమగా దగ్గరకు వెళుతుంది. అతను తెచ్చి ఇచ్చిన వాటిని తీసుకుంటుంది.ఇద్దరు కలసి బయటకి వెళతారు.ఏమేమి కావాలో అడిగి  అతని చేత కొనిపించికుంటుంది
ఒక ఏడాది క్రితం నేను వెళ్ళినప్పుడు.. చెప్పాను. ఇన్నేళ్ళు నుండి నాకు తనని తీసుకువెళ్ళడం కుదరలేదు అని.. కొద్ది నెలలో తనను తీసుకుని వెళతానని చెప్పాను. సరేనని తల ఊపింది. “ముస్కాన్” ని నేను తీసుకువెళతాను.బాషాతో నాకు సంబంధం లేకుండా చేయండి అంతే చాలు అని అడిగాను. విడాకులు ఇప్పించే మార్గం చేస్తానని అని చెప్పాడు రాజు.

అబ్బాజాన్ ని వద్దంటే..అమ్మ నాకు వద్దు. నేను వెళ్ళను అని చెప్పింది.అంట. నేను స్థాణువు అయ్యాను. “ముస్కాన్ ‘ చిన్న పిల్ల. ఏం జరిగిందో అర్ధం చేసుకునే వయసు రాలేదు. కాని నా పట్ల వ్యతిరేక భావం మనసులో నాటుకుని పోయింది. బిడ్డని వదిలేసి వెళ్ళిపోయిన తల్లిగా నా పట్ల యెంత ద్వేషం ఉందొ..నాకు అర్ధం అయింది. నేను నా కూతురిని తీసుకుని వస్తాను అంటే..నా తల్లిదండ్రులు,తమ్ముడు ఒప్పుకోరు,వల్ల పోనీ “ముస్కాన్”ని తీసుకుని వచ్చి నా దారిన నేను వేరుగా ఉండి  అయినా నా బిడ్డని చూసుకోవాలని ఉన్నా తండ్రిని వద్దంటే..పిల్ల ..నా వద్దకు రావడానికి ఇష్ట పడక పోవడం…అంతా అయోమయం. నేను ఏం చేయాలో తెలియని ఆలోచించుకోలేని తనం.

ఈ మధ్యలో మరి కొన్ని విషయాలు ఎవరి ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి.బాషా కొన్ని గొడవలలో తలదూర్చి.. హత్యా ప్రయత్న  నేరం క్రింద జైలు కి వెళ్లి శిక్ష అనుభవించడం.. అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. నాకు భవిష్యత్ లేదు. నా బిడ్డకి భవిష్యత్తు లేదు
ఇలా కాలం జరుగుతూ ఉండగానే తర్వాత ..రాజు .కి కాలం చెల్లి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతని భార్య,ఇద్దరు పిల్లలు, ముస్కాన్  కలిపి వీధిన  పడ్డారు.పదకొండో  సంవత్సరం రాగానే  “ముస్కాన్’ శరీరం వికశించిన వార్తలు. దాని మెదడు వికశించనేలేదు. చదువు లేదు..మంచి సంస్కారం లేదు. కూతురిని  బడికి  పంపి చదివాల్సిన అమ్మని నేను ఇక్కడ కొత్త చదువు చదువుతున్నాను. అక్కడ నా బిడ్డ అజ్ఞానంలో  బ్రతుకుతుంది. నా బిడ్డ ఎదిగి ఎదగ కుండానే మేనత్త కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలంటున్నారు. ఇక్కడ ముప్పైమూడేళ్ళ నాకు ఓ..పిల్ల తల్లినైనా నాకు ఆ పిల్లని అనాధగా వదిలేసి మరో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు.
నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడినవాడు..నా బిడ్డని తన బిడ్డగా అంగీకరిస్తాడా? అసలు మానాన్న చేయాలనుకున్న నాకు పెళ్లి అవుతుందా? ఓ..వంట మనిషి,పనిమనిషి కోసం పెళ్లి చేసుకునే వారు..నాకు మళ్ళీ  జీవితం ఇస్తాడా? గత జీవితం  గురించి ప్రశ్నించకుండా ఉండగలడా? నాకు అసలు పెళ్లి అవసరమా! చేదు అనుభవాలతో మనసే కాదు శరీరం బండబారిపోయింది.
నా బిడ్డని అమాంతం  ఆ మూర్ఖత్వపు చట్రం నుంచి బయటకి తీసుకుని వచ్చి  నా నీడలో ఆరోగ్యంగా పెంచుకోవాలి. నేను పస్తులు ఉన్నా సరే!అనిపిస్తుంటుంది
ఆ పట్టుదలతోనే బి.ఈ.డి పూర్తి చేసాను.ఇప్పుడు ఏం.ఏ కి కట్టాను. డి.ఎస్ సి  రాస్తున్నాను. నా ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో చెప్పలేను.
అమ్మ..  తిరువనంతపురం  వెళ్లి ఒక నెల రోజులు  ఉండి వద్దాం రా..అంటుంది ఆహోబిలం లో..విష్ణు సహస్ర పారాయణం చేయాలట.వెళదాం పద అంటుంది..ఆమె నన్ను  గుళ్ళు  గోపురాలు తిప్పే సహాయకురాలిగానే  చూస్తుంది.తమ్ముడు ఈ శని ఎప్పుడు  వదిలి పోతుంది ? అన్నట్టు చూస్తాడు. నాన్న పెళ్లి చేసి పంపటానికి  ప్రయత్నం  చేస్తున్నాడు.వచ్చేవాడు ఎలాటి వాడు అయినా సరే!  ఎవరి దోరణి వారిది నా..అభిప్రాయం వాళ్లకి అక్కర్లేదు. ఇంట్లో ఏ విషయాల్లో నేను తలదూర్చ కూడదు. తినడం,ఉద్యోగం చేయడం,పడుకోవడం అంతే.. నా  పరిది.

నేను ఎవరికి పనికి రాని వస్తువుని.మనసు లేకుండా జీవత్సవంలా  బ్రతికే మనిషిని.అసలు ఆ ఇంట్లో ఉండకూడదు అనిపిస్తుంది. బయట బతికే దైర్యం లేదు. ఎవడెవడో దగ్గరకి రావాలని చూస్తాడు.నా కన్నా చిన్నవాడు నా తమ్ముడి స్నేహితుడు ..పెళ్లి అయింది.అయితేనేం..మన ఇద్దరం సహ జీవనం చేద్దాం అంటాడు.ప్రతి ఒక్కడు ఓ..రాయి వేసి చూద్దాం పడుద్దేమో ..అన్నట్టు ప్రవర్తిస్తారు.మనసు ని ,శరీరాన్ని కాపాడుకోవడం కష్టం అయిపోతుంది.
అక్కడ చూస్తే ..రాజు చచ్చిపోయాడు కాబట్టి..రజియా కి అభ్యంతరం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. “ముస్కాన్” ని మదర్సాకి పంపుతుంది. ఓ..రెండేళ్ళకి ..మేనత్త కొడుకు కి ఇచ్చి పెళ్లి చేస్తుంది. నేను ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. బాషా తాగి తాగి ఏ పేవ్మెంట్ల పైనో..పార్కులలోనో పడి ఉంటాడు  నన్ను సాదించే ఉద్దేశ్యం తోనే .. నేను విడాకులకి అప్లై చేసినా నాకు విడాకులు ఇవ్వడు. ఇంట్లో నాకు పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. “ముస్కాన్’ ని నా వెంట పంపితే..ఆ ప్రయత్నాలు ఆగిపోతాయి ఎలాగోలా నచ్చ జెప్పి పంపించే ప్రయత్నం చేయమని  రజియాకి చెప్పాను.

 వదినా !పెళ్లీడు కి వచ్చిన పిల్లని పెట్టుకుని మళ్ళీ నీకు పెళ్లి ఏమిటి ? అంటుంది.నేను ఏం చేయను? ఏమిటీ నా జీవితం అనిపిస్తుంది..అని దీర్ఘమైన కథ చెప్పి  భారంగా నిట్టూర్చింది.
కుటుంబంలో జరిగే గొడవలు, తండ్రుల బేడ్ హాబిట్స్..అమ్మల పేషియన్సీ గురించి నేను నా ఫ్రెండ్స్ కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉంటాం. కానీ మతాంతర వివాహాల మధ్య ఇన్ని సమస్యలు ఉన్నాయా!? మీ కథ వల్ల చాలా  విషయాలు తెలుస్తున్నాయి.
అసలు మతం అంటే ఈ మనుషులు  ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తారు..అడిగింది. డాలీ.
ఈ విషయం నాకన్నా.. మీ అమ్మ బాగా చెప్పగలరు ..ఆమెనే అడుగు అంది విజయ.” చెప్పమ్మా.. “అడిగింది డాలీ. విజయ జీవితం లో జరిగిన సంఘటనల గూర్చి ఆలోచిస్తున్న సుజాత ఉలికి పడింది.
ఏమిటి..అడుగుతున్నావు.?.అంది.
వివాహం లో మనుషుల మధ్య ఎందుకంత మత ప్రాముఖ్యత ? అని మళ్ళీ అడిగింది.
ఎందుకంటే .. మనిషి మతం అన్నది అవలంభించడం వల్ల కొన్ని మంచి సంస్కారాలు అలవడతాయి. మంచి-చెడు తేడా తెలుస్తుంది. చెడ్డ పనులు చేయకుండా మతం మనిషిని నియంత్రిస్తుంది. దాదాపు  అన్ని మతాలూ ఒకటే చెబుతాయి. ఆంతా  మనం అర్ధం చేసుకోవడం లోనే ఉంది.
కొన్ని చోట్ల మతం మనుషులని కలవనీయ కుండా అడ్డు కట్ట వేస్తుంది..అని అంది సుజాత.
అదే..ఎలా  అన్నది నాకు అర్ధం కావాలి !అని అడిగింది  డాలీ.  మళ్ళీ ఎవరైనా సమాధానం చెప్పే లోపే
“మా మేడం ఒకరు ఉన్నారు ఆవిడ పి.హెచ్ డి.చేసారు. ఒక ముస్లిం ని వివాహం చేసుకున్నారట. వివాహం అప్పుడు ఆమె అతని మతం లోకి మారి ముస్లింగా పేరు మార్చుకుంటేనే.. ఆ పెళ్లి జరిగింది అంట. అసలు ఆవిడకి ఓ..స్వంత ఆలోచన అయినా ఉందా? .వివాహానికి  మతం కి ఏమిటీ సంబంధం అని ఆలోచించలేదా?
అలాగే.. మా సర్..ఒకరు. ఆయన  కెమిస్ట్రీ అద్భుతంగా బోధిస్తారు. ఆయన వివాహం అయ్యాక వేరొక స్త్రీ తో ప్రేమలో పడ్డారట. ఆమెని చట్టబద్దంగా పెళ్లి చేసుకోవడానికి గాను  ఆయన  ముస్లిం గా మారి .ద్వితీయ వివాహం చేసుకున్నారు అని చెబుతారు. మతాలూ మార్చుకుని ఒకరిని మోసం చేసి చేసుకునే వివాహాల విలువ ఏమిటి? ఎందుకు వీళ్ళంతా ఇలా ప్రవర్తిస్తారు. వీళ్ళా మాకు గురువు లు అంది. ఆవేశంగా.
చాలా మంది విద్యాధికులు కూడా ప్రేమ వివాహాలు చేసుకున్నప్పుడు మతం ఒక సమ్యగా ఉంటుంది. అదే పురుషుడు అయితే మతం మార్చుకోవాల్సిన పని లేదు. స్త్రీ అయితే తప్పని సరిగా పురుషుడి మతం లోకి మారిపోతుంది.ఆ మారడం ఇష్టా పూర్వకం కావచ్చు,బలవంతం కావచ్చు. అయితే..మతం మారిన తర్వాత కూడా వారిలో ఉన్న ఆచార వ్యవహారాలూ,రక్తం లో జీర్ణించుకు పోయిన కొన్ని భావాలు రూపు మాసి పోతాయని అనుకోవడం పొరబాటే! వాళ్ళల్లో పుట్టుకతో వచ్చిన మతం ఆచారవ్యవహారాలు,ఆహారపు అలవాట్లు అలాగే ఉంటాయి. మతం మారామని మోసం చేసుకోవడం తప్ప అక్కడ ఏమి ఉండదు.”అంది సుజాత.
అసలు ఒక స్త్రీ-ఒక పురుషుడు కలసి బ్రతకడానికి ఏ ఒక్క మతమో..ఎందుకు అవసరం? ఎవరి మతాన్ని వారు ఆచరించుకుంటూ  ..ఎదుటి వారి మతాన్ని గౌరవిస్తూ..పరస్పర అభిప్రాయాలని గౌరవించుకుంటూ. ఉండటంలో ఉన్న విశాల దృక్పధం ఎందుకు అలవరచుకోరు?  కనీసం మతం మారడం అనవసరం అన్న జ్ఞానం కలుగదు..?
ఈ మతం రంగులు,ఊసరవెల్లి తనాలు ఏమిటో..నాకు అర్ధం కాదు ..ఐ హేట్ ట్ థిస్ అంది.

అలా అంటూనే అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ.. అక్కా!మీరు మీ పర్సనల్ లైఫ్ గురించి శ్రద్ద తీసుకోండి..అక్కా. నేను చిన్నదానినే.. అయినా  నాకు అన్ని విషయాలు తెలుస్తాయి. .
మీ అమ్మాయి గురిచి వర్రీ అవకండి  తప్పకుండా  “ముస్కాన్” ..మీ దగ్గరకి తిరిగి వస్తుంది. అయితే ఆ రావడానికి మాత్రం  సమయం పడుతుంది. అని చెప్పి..తన గదిలోకి వెళ్లి పోయింది.
హుమ్మ్మ్.. సీతాకోక చిలుక సినిమా కన్నా  ఎక్కువ జరిగింది ఇక్కడ ..అంది సుజాత.
మళ్ళీ తనే మాట్లాడుతూ ..అవును విజయా.. “ఎవరో..నీ జీవితం నాశనం కావడానికి కారణం అని ఆలోచించక ..నీ జీవితం గురించి నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నావు..నీకు నువ్వు ఏమాత్రం విలువ ఇచ్చు కుంటున్నావు?. నీ  బిడ్డకి ఎలాంటి భవిష్యత్ ఇవ్వాలను కుంటు న్నావో  బాగా ఆలోచించి అడుగు వేయి . ఇప్పుడు నీ జీవితం నీ చేతిలోనే ఉంది..అని అని చెప్పింది.
“ఈ మాత్రం సలహా చెప్పేవారు లేక నేను ఓ..అయిదేళ్ళు నా బిడ్డకి దూరం అయ్యాను ‘అని చెప్పింది.బాధగా విజయ
“ఏం పర్వాలేదు. నీకు అండగా ఎప్పుడూ నేను తోడుంటాను. ముందు డి.ఎస్.సి  ఎగ్జామ్స్ వ్రాసి రా. తర్వాత ముస్కాన్ దగ్గరకి వెళదాం. పాప తప్పక నీతో  వస్తుంది చెప్పింది భరోసాగా ..

    విజయ   కాస్త నిశ్చింతగా కనబడింది.

. ఇక నేను వెళతాను ..రేపు ఉదయం ఆరుగంటలకే  క్లాస్స్ ఉంది .అంత ఉదయాన్నే ఇక్కడినుండి బయలుదేరి వెళ్లి క్లాస్స్ కి అందుకోలేను అని లేచింది విజయ
“భోజనం చేసి వెళ్ళు..రా..”.అంటూ బలవంతంగా కూర్చోబెట్టి భోజనం వడ్డించింది తింటూ చెప్పింది..ఏం చేయాలో ఆలో చించు కోలేకపోతున్నాను అందుకే నీ సలహా కోసం వచ్చాను .ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. నా కర్తవ్యం ఏమిటో..నాకు స్పష్టంగా   కనబడుతుంది అని చెప్పింది. చిన్న చిరునవ్వుతో..
అమ్మయ్య అనుకుని సుజాత నవ్వుతూ  చూస్తూ ఉండగా “అవును .. ఇప్పుడు నా జీవితం నా చేతుల్లోనే ఉంది.  నేను ఇంకా బాగా చదవాలి.తర్వాత  నా బిడ్డని బాగా చదివించడానికి, తనకి మంచి భవిష్యత్ ఇవ్వడానికి “అని చెప్పింది
విజయ వెళ్ళిపోయాక ..ఆవకాయ పచ్చడి మిశ్రమం  కలుపుతూ ..అనుకుంది. వివాహ .జీవితం కూడా ఆవకాయ పచ్చడి  లాంటిదే. అన్నీ సరిగ్గా కుదిరితేనే.. మంచి రుచికరం గా ఉంటుంది ఏది తక్కువైనా..అది చూడాటానికి,తినడానికి కూడా  బాగోదు. అని .విజయ జీవితం కూడా  అన్నీ సమంగా పడని ఆవకాయ  పచ్చడి లాంటిదే అని .

– వనజ వనమాలి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

7 Responses to నా జీవితం నా చేతుల్లో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో