నా సంగీతం

 

          మా ఇంట్లో గ్రామ్ ఫోన్ ఉండేది బోలెడన్ని మంచి పాటలు రికార్డులు ఉండేవి .ఆ పాటలు విని నేను బడికి వెళ్ళనంత చిన్నవయసు నుంచి ఎవరైనా అడిగితేచాలు   గొంతెత్తి పాటలు పాడెయ్యడం ,చిందులు వేసి నాట్యం చేసెయ్యడం సిగ్గు పడకుండా చేసేదాన్ని .మా చిన్న మావయ్య అప్పారావు మా వాకిట్లో ఒక నవారు మంచం వాల్చి ,దాని పైకి నన్నెక్కించి గ్రామ్ ఫోన్ లో రికార్డు పెట్టి ఆ పాటకి నేనెలా  డాన్సు చెయ్యాలో నేర్పిస్తూ ఉండేవాడు .తరచుగా మల్లీశ్వరి లోని కోతిబావకు పెళ్ళంట   చేయించేవాడు .

                         నేను పాడడం చూసి మా నాన్న ముచ్చట పడి ఓ హార్మొని కొని ఓ సంగీతం మాస్టార్ని కుదిర్చేరు .ఆ మాస్టారిది మా ఊరికి దగ్గరలోనే ఉన్న కాట్రావులపల్లి .పెద్ద వయసు  .ము స్లిం  (బహుశా దూదేకుల .ఆయన గొప్పగా క్లారినెట్ వాయించేవారని తర్వాతెప్పుడో నేను పెద్దయ్యాక తెల్సింది .)పొట్టిగా ,చామన ఛాయ గా ,ముందుపళ్ళు ఊడిపోయి ,దట్టమైన కను బొమల్తో చాలా సీరియస్ గా ఊండేవాడాయన .సహనం తక్కువ .అప్పటికి నేను ఒకటో తరగతి లో చేరిన కొత్త .నా దృష్టి ఎప్పుడు చదువు మీదే ఉండేది . ఆయన కనుబొమలు ముడివేసి చూస్తే చాలు నాకు భయంతో వణుకొచ్చేది .అందుకని ఆయనొచ్చే  వేళకి కనబడకుండా దాక్కొనే దాన్ని .ఒక రోజాయన నేను పాఠం సరిగా అప్పగించలేదని ,(అందక)హార్మోనీ మీద పడిపోతున్నానని  గట్టిగా అరచి కొట్టినంత పని చేసారు .అంతే ,నాకు జ్వరం వచ్చేసింది .మర్నాడు ఆయనొచ్చినప్పుడు మా నాన్నమ్మ ఆయనకన్నా సీరియస్ గా మొహం పెట్టి ఆయన మీద కేకలేసింది .అక్కడితో నా సంగీతం అప్పటికి పిళ్ళారి గీతాలు అవుతున్నాయి .

                మా ఇంటికి పుంతవైపు నాలుగు షాపులు (అప్పట్లో కొట్లుఅనే వాళ్ళం )కట్టించారు మా నాన్న. ఆ షాపులకి ఎదురు గా మాల పల్లె తాటాకుల ఇళ్ళుఉండేవి .మాలపల్లెలో ఆడ ,మగ అందరూ పనులకి వెళ్ళిపోయి మరీ కదలలేని ముసలి ముతకా,చిన్నపిల్లలూ మాత్రం ఇళ్ళల్లో ఉండేవారు .అప్పటికది, అలవాటో ,పేదరికమో తెలియదు కాని మగవాళ్ళంతా కేవలం గోచీలు పెట్టుకుని తిరిగే వాళ్ళు .ఆడవాళ్ళూ చాలామంది జాకెట్లు వేసుకోనేవాళ్ళు కాదు .అప్పటికి కూలి చాలా తక్కువ .రోజుకి అయిదు అణాలని గుర్తు .అంటే రూపాయలో మూడవ వంతు కన్నా తక్కువన్నమాట .పేదరికం తాండవిస్తూ ఉండేవి వాళ్ళ ఇళ్ళు .అలా ఉండి కూడా సాయంకాలానికి తెచ్చుకున్న నాలుగు డబ్బుల్తో మగాళ్ళు తాగేసి ఇళ్ళకొచ్చి గొడవలు పెట్టుకొనే వాళ్ళు .ఆడవాళ్ళని కొట్టడం ,బూతులతో వీధులెగరగొట్టడం చేసేవాళ్ళు .

                 ఇదంతా రోజూ చూసి చూసి మా నాన్నకేమని పించిందో మరి !వాళ్ళలో చాలామందిని ఒక చోట చేర్చి నాటకం ట్రూప్ ఒకటి తయారు  చెయ్యాలనుకున్నారు .ఆ రోజుల్లో పౌరాణిక నాటకాలంటే జనం పడిచచ్చేవారు.ఊరిచివరున్న ఒక్క సినిమా హాలులోకి ఎప్పటివో పాత సినిమాలొచ్చేవి ,ఊరికి కరెంటు లేదు .అందుకని రేడియో వినే ప్రసక్తే లేదు .ముఖ్యమైన షరతు ఏమిటంటే ఎవరూ తాగకూడదు ,చుట్టలు వగైరా కాల్చకూడదు ,బూతులు మాట్లాడకూడదు .నాటకం లో నటించాలనే ఉత్సాహంతో అందరూ  అంగీకరించారు .వాళ్ళ చేత సంభాషణలు స్పష్టంగా పలికించడానికి చాలా కష్టపడాల్సివచ్చేది .కాని ,వాళ్ళ గాత్రాలు మాత్రం అద్బుతంగా ఉండేవి .చాలా బాగా పాడేవారు .రోజు సాయంకాలం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ రిహార్సల్స్ జరిగేవి .

             ఇక్కడికి దగ్గరలో ఉన్న రాజపూడి నుంచి కందుల వెంకట్రావు గారు అనే ఒక హర్మోనిస్ట్టునితీసుకొచ్చి మా కొట్టు గదుల్లో ఒక గది ఆయనకిచ్చారు .ఆయన పోలియోతో నడవలేకపోయేవారు .అ గది లోనే రిహార్సల్స్ .ఆయన్ని అందరు గురువుగారు అనేవాళ్ళు .ఆయనికి భోజనం ,టీ,టిఫిన్ అన్నీమా ఇంట్లోంచే .

             ఆయన ట్రూప్  వాళ్ళకి నేర్పించే పద్యాలు వాళ్ళకన్నా ముందు నాకు వచ్చేసేవి .శృతిబద్ధంగా నేను హైపిచ్ లో పద్యాలు పాడటంచూసివాళ్ళ నాటకాల్లో నా చేత కూడా  కేరెక్టర్స్    వేయిద్దామని గురువుగారు మా నాన్నను అడిగేరు .మా నాన్న నన్ను అడిగేరు “చేస్తావా?”అని ,నేను అత్యుత్సాహంగా సరే అన్నాను .

                మా నాన్న యయాతి ,హరిశ్చంద్రుడు లాంటివి వేసిన నాటకాల్లో నా చేత నారదుడు ,లోహితాస్యుడు ,చిన్నికృష్ణుడు లాంటివి వేయించేవారు .ఎవరో ఒకళ్ళు నన్ను ఎత్తుకొని స్టేజ్ పైకి ఎక్కించడం ,దించడం చేసేవాళ్ళు .నాకు మేకప్ కూడా ఎంతో అపురూపంగా నొప్పి కలగకుండా చేసే వారు .పాప గారు ,అమ్మాయిగారు అంటూ అందరు చాలా గారాబంగా చూసే వారు .చాలా చోట్ల నా కేరెక్టర్ కి  బహుమతులు ,మెడల్స్ అందుకున్నాను .స్టేజి మీది నుంచి దించగానే ఒకసారి ,ఇంటికి రాగానే ఒకసారి గుప్పెడు ఉప్పు ,మిరపకాయల్తోదిష్టి తీసేవాళ్ళు .

               నాటకం ముగిసిన తెల్లవారి నేను బడికి వెళ్తూంటే నా నారదుడి కేరెక్టర్ దృష్టిలో పెట్టుకొని కొందరు నన్ను ఎర్రగ్గిపుల్ల !అని పిలిచి టీజ్ చేసేవారు .కొందరు పిల్చి ఏవైనా తినడానికి పెట్టి మళ్ళీ మళ్ళీ అడిగి పద్యాలు ,పాటలు ,కృతులు పాడించుకొనేవారు .

                అలా నా క్లాస్మేట్స్ అందరి ఇళ్ళల్లో నాకో ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది .ముఖ్యంగా మేచినేని రాణీపద్మావతి వాళ్ళమ్మ గారు నాగౌను కున్న  పొడవైన పక్క జేబుల్లో అటుకులు ,సెనగపప్పులాంటివి నింపేవారు .నా బుగ్గలు పుణికి ఎంతో ఆప్యాయంగా చూసేవారు .ఇప్పటికీ ఆవిడ రూపం ,అతి మృదువుగా మాట్లాడే ఆ గొంతు నా కళ్ళల్లో కదలాడుతూనే ఉన్నాయి .ఇంకా ,గిర్రెడ్డి రత్నకుమారి ,కాకర్లపూడి దేవి ,బాల ,కొమ్మోజు వరహాలు ,కింగం లక్ష్మి కాంతం ,కొత్త పాపాజీ అందరూ నన్ను పిల్చుకెళ్ళి నా పాటలు ,పద్యాలు వాళ్ళ తల్లులకి విన్పించే వాళ్ళు .మా ట్రూప్ నాటకాలు కొనసాగుతూండగానే నాకు పదేళ్ళు వచ్చాక నన్ను నటించకుండా ఆపేసారు.ఆ రోజుల్లో పదేళ్లంటే పిల్లలు పెద్దవాళ్ళైనట్టే లెక్క .వంటలు నేర్చుకుని ఇల్లు చక్కబెట్టేసేవారు .మగపిల్లలైతే చదువులు మానేసి పనుల్లోకెళ్ళిపోయేవారు .

                 ఆ రోజుల్లో ఈ చిన్న గ్రామం జగ్గంపేటలో ఫోటో గ్రాఫర్ లేక ఎన్నెన్ని మంచి జ్ఞాపకాల్ని చిత్రాలుగా మలచుకోలేకపోయానో ఇప్పుడు తలచుకుంటే భాదేస్తుంది .నాటకాలకు సంబంధించి ఒక్క ఫోటో కూడా లేదు మరో ఆరేళ్ళకి జరిగిన నా పెళ్లి నాటికి కూడా ఫోటోగ్రాఫరూ లేడు ,ఫోటోలు లేవు .పొరుగూరి నుంచి పిలిపించాలంటే బోలెడంత ఖర్చు అనేవారు .

              వినాయక చవితి ,దసరా లాంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పందిళ్ళలో నాటకం వేసేటప్పుడు స్త్రీ పాత్రలుగా కనకం ,తిలకం ,జి .వరలక్ష్మి గార్లు వచ్చేవారు .మా ఇంట్లోనే బస ,నన్ను ఆదరంగా పలకరించి ,నా పద్యాలు విని మెచ్చుకొనేవారు .ఒకోసారి నన్ను ఒడిలో కూర్చోబెట్టుకొనేవారు .

             ఇంతకీ మొదటి గురువుగారి దగ్గర ఆగిపోయిన సంగీతం రెండో గురువు గారి దగ్గర నిరాటంకంగా నేను హైస్కూల్ కెళ్ళేవరకూ  కొనసాగింది.*

– కె.వరలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, , , , , , , , , , , , , , , , , , , , Permalink

One Response to నా సంగీతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో