సుకన్య

(13 వ భాగం)

”చదువు అయింది అంతే! ఇంకా నేను సంపాదనాపరుణ్ణి కాలేదు కదమ్మా! అయినా తర్వాత ఆలోచిద్దాంలే! ఇంకా నేను చిన్నవాడ్నేనమ్మా” అంటూ చందు రెండు చేతులతో తల్లి మెడ కావలించుకొన్నాడు. 
”ఏమోరా! మాకున్నది నీవొక్కడివే! మా పంచ ప్రాణాలన్ని నీమీదనే నీకు పెళ్ళి చేస్తే నీ ఆలనా పాలనా చూచుకొనే ఒకరుంటారు మాకింక దిగులుండదు.”
”నాకిప్పుడొచ్చిన లోటేమి లేదు… ముందు నాకు ఉద్యోగం దొరకని…” 
ఏమో నాయనా! నేను చెప్పవలసింది చెప్పాను…”
”అమ్మా! ఈ ఊళ్ళో వెంకయ్య అనే ఆసామి ఉన్నాడు కదా! అతనెటువంటి వాడో తెలుసా?” అంటు మాట మార్చాడు చందు. 
”ఆయన మంచాయనే! ఇటీవల చాల పెద్ద గండం గడిచి గట్టేక్కాడు. చచ్చిపోతారనుకున్నారు. బతికేడు ఎట్లాగో” 
చందు మనసులో ఏవేవో ఊహలు బహుశా అలాంటి సమయంలోనే బలవంతంగా సుకన్యని ఒప్పించి ఉంటారు. ఏవో అసాధారణ పరిస్థితుల్లో తప్ప ఈ విధమైన నిర్ణయానికి వచ్చి ఉండదు. తానంటే సుకన్యకెంత ప్రేమో తనకు తెలియంది కాదు. బలవంతంగా వెంకయ్యతో పోరాడి ఒప్పించాలా? సుకన్యను తనతో తీసుకువెళ్ళలా? లేక కాలమే ఈ సమస్యను పరిష్కరిస్తుందని వేచి చూడాలా? 
”అదేమిటిరా! మాట్లాడుతూనే కళ్ళుమూసుకున్నావ్‌? నిద్రొస్తుందా?” 
”లేదమ్మా! లేదు” అంటు చంద్రధర్‌ అక్కడి నుండి లేచాడు. ఒకసారి వివేక్‌ని కలసి ఈ సంకటస్థితినంతా వివరిస్తే అతనేమైనా సలహా ఇస్తాడేమో!  ఆ ఆలోచన వచ్చిందే తడవుగా. చందు పుస్తకం తీసి ప్రక్కన ఉన్న అలమారాలో ఉంచాడు. 
”అమ్మ! నేను ఓ ఫ్రెండ్‌ దగ్గరకు వెళ్తున్నాను.” అని చెప్పి గబగబా వెళ్ళాడు. 
వివేక్‌ తండ్రి పద్మనాభం బాగా డబ్బున్నవాడు. ఉన్నపొలమంతా కౌలు కిచ్చి ఆయన సిరామిక్స్‌ ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. చాల మంచివాడని, దయగల వాడని, పనివారిపట్ల ప్రేమా ఆదరణ వున్నవాడని మంచి పేరుంది. అవటానికి అగ్రకులమైన ఎప్పుడు ఆ రకమైన భేషజం ఏమి ప్రకటించడు. వివేక్‌ కాక ఆయనకు ఇద్దరమ్మాయిలున్నారు. వాళ్ళు కూడా సిటిలోనే చదువుతున్నారు. ఏనాడో తాతలు కట్టించిన ఇంటిని ఆయన మోడ్రన్‌గా మార్చివేసాడు. బయట గార్డెన్‌లో దట్టంగా, బలంగా పెరిగిన అనేక రకాలయిన పూల మొక్కలు క్రోటన్లు. వివేక్‌ తల్లిదండ్రులతో కలిసి కాఫీ తాగుతున్నాడు. ఆ సమయంలోనే చంద్రధర్‌ గేట్‌ తీసికొని వచ్చాడు.
వివేక్‌ ఎంతో సంతోషంగా ”రండి రండి” అంటూ ఆదరంగా ఆహ్వానించాడు. 
తండ్రి ఆ కుర్రాడ్ని అంత క్రితమే ఎరిగున్నాడు కాబట్టి ప్రేమ పూర్వకంగా పలకరించాడు ”ఏం బాబు! చదువు పూర్తయిందా” అంటూ. 
”పూర్తవటం ఏముందండీ! రిసెర్చి చేయటానికి ఢిల్లీ యూనివర్సిటీకి అప్లైచేసాను” అన్నాడు చందు.
”మంచి పని చేసావ్‌! ఇంకా బాగా చదివి వృద్ధిలోకి రావాలి” అంటూ ”ఇంకా ఎన్నాళ్ళుంటావ్‌ ఇక్కడ! ఉన్నన్ని రోజులు మా ఇంటికి వస్తుండాలి.” అది ఆజ్ఞ, అభ్యర్ధనో మరి! 
”అలాగే” అన్నాడు చందు.
”మాట్లాడుకోండి బాబు! నీకు కాఫీ పంపుతాను” అంటు వివేక్‌ తల్లి అక్కడి నుండి వెళ్ళింది. 
”చందు! నీవు ఇట్లా రావటం నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకో నిన్ను చూడగానే నీలాటి మిత్రుడుంటే బాగుండుననిపించింది. నిజానికి ఈ పల్లెటూరులో నీవంటి మిత్రుడు దొరకటం నాకెంతో సంతోషంగా వుంది. వివేక్‌ తన ఆనందాన్నంతా ప్రకటించాడు. 
చందు కుర్చీలో కూర్చుంటూ ”గార్డెన్‌ చాలా బాగుంది చాలారకాల పూల మొక్కలున్నాయి” అన్నాడు.
”అంతా మా అమ్మ తీసుకొనే శ్రద్ధే! ఆమెకు చాల యిష్టం మొక్కలంటే…” అన్నాడు వివేక్‌.
పనిమనిషి కాఫీ తెచ్చి చందు కిచ్చింది.
”ఇక్కడే కూర్చుందామా? లేకుంటే అట్లా పొలాలవైపు వెళ్దామా?” అన్నాడు వివేక్‌.
”బయటకు వెళ్దాం” అన్నాడు చందు. 
ఇద్దరు తిన్నగా నడుచుకొంటూ గ్రామసరిహద్దులు దాటారు. అక్కడినుండి రోడ్డుకు అటు యిటు అన్నీ పంటచేలు. భూమాత ఆకుపచ్చటి చీరతో సింగారించుకొన్నట్లుంది. అక్కడక్కడ పంటపొలాల్లో  మందుల కంపెనీ వాళ్ళు అడ్వర్‌టైజ్‌మెంట్‌ కోసం చిన్ని కర్రలకు కట్టిన పసుపు ఎరుపు కాయితాలు ఆ పచ్చటి చీర మధ్య పూలులా భాసిస్తున్నాయి. జ్యేష్ఠ మాసపు ఈదురు గాలులకు కొబ్బరి చెట్లు తలలూపుతున్నాయి. పడమటిదిక్కున మబ్బు దట్టంగా పట్టింది. మిత్రులిద్దరు ఏదో అవ్యక్త మధుర భావనకు లోనయినారు. ఒకరి పట్ల ఒకరికి ఎనలేని ఆదరాభిమానాలు కలిగాయి. ఇద్దరూ ఏదో ఉద్వేగానికి లోనై వేగంగా నడుస్తున్నారు. పొలాల నుండి పనులు ముగించుకొని ఏ గోంగూర కట్ట, పుల్లలో చేతబుచ్చుకొని ఆడవాళ్ళు, మగవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ చకచక నడుస్తున్నారు. మరి కొద్ది సేపటిలో వర్షం పడవచ్చుననే భయంతో ఆ నడక వేగం పుంజుకుంటుంది. వాళ్ళంతా హాయిగా నవ్వుకుంటూ ప్రొద్దుటి నుండి  పడిన శ్రమనంతా మరచిపోవటం చూస్తున్న చందుకు శ్రమైకజీవుల ఆనందమంతా శ్రమలోనే నిక్షిప్తమయి ఉంది కదా అనిపించింది. 
రోడ్డు ప్రక్కనే వ్రవహిస్తున్న చిన్న పంటకాలవ, దాని మీదనుండి పొలం వైపే వెళ్ళటానికి తాటిబోదె… ఇద్దరు మెల్లగా దాటుకుంటూ మామిడి చెట్టు పెద్దది ఒకటుంటే దాని మొదట్లో శుభ్రంగా ఉన్న ప్రాంతం చూచుకొని కూర్చొన్నారు. కాలువలో కాళ్ళుచేతులు కడుకుంటున్న కూలివాడు ”ఎవరు బాబు! ఓ మీరా పద్మనాభయ్యబాబుగారి అబ్బాయి కదూ! దండం దొర! ఆయనెవరు! ఓహో మన కుమ్మరి కనకయ్య కొడుకా! బాగున్నావా అబ్బాయి! అయినా చీకటి పడే వేళకు చేలో కెందుకు బాబు! పాముపుట్రా ఉంటాయి… జాగర్త… బేగా యివతలకి వచ్చేయండి అంత సరదాగా ఉంటే మీరు ఇంకొంచెం దూరం నడిత్తే సాయిబాబా గుడి ఉంది అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు గదా! ఆడ కూడా బాగాను ఉంటది” అని అడగని సలహా ఒకటి ఇచ్చాడు. 
నిజానికి అన్నిటి కంటె చాల సులువయిన పని సలహాలివ్వటమే! కాని అడగందే ఇచ్చిన సలహాకు అసలు విలువ ఉండదు…
”వివేక్‌! నిజం చెప్పమంటావా? నా కెటుచేయటానికి పాలుపోక నీతో మాట్లాడుదామనే వచ్చాను…” 
”చందు నా మీద నీవింత ప్రేమ చూపుతున్నందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను.
”సుకన్య నేను కొంత కాలం ఆగి ఇంకా చదివి ఉద్యోగాలు సంపాదించాక పెద్దల అనుమతితో పెండ్లి చేసుకొందామనుకున్నాం…” అయితే ఏమయిందో… నేను ఢిల్లీ నుంచి వచ్చేలోగా సుకన్య ఇట్లా ఆశ్రమంలో చేరిపోయింది.
”ఏమయేదుంకు ఏమున్నది. నీవు పెండ్లాడటానికి తగవని నిన్నే పెండ్లి చేసుకున్నట్లయితే తాను చచ్చిపోతానని బెదిరించాడట. సుకన్య నిన్ను తప్ప మరొకరితో జీవితం పంచుకోటానికి ఇష్టపడలేదట. ఈలోగా తండ్రి మంచి సంబంధం తెచ్చి ఒత్తిడి ఎక్కువ చేసాడట. ఆ పరిస్థితుల్లో ఏమి చేయాలో తెలీక బాబా ఆశ్రమానికి పంపారట. కొన్నాళ్ళకు ఆమె తన మనస్సు మార్చుకొంటుంది. అపుడు పెండ్లికి ఒప్పుకుంటుందని ఆయన ఆశపడుతున్నాడు. తల్లి మొదట్లో ఈ పెండ్లికి ఒప్పుకోనన్నదట.. ఇప్పడు కూతురు పట్టుదల చూచి ఇక ఎట్టి పరిస్ధితుల్లో ఎవరితో ఆ అమ్మాయి పెండ్లికి ఒప్పుకోదని అర్ధం అయిందట. నిన్న మా అమ్మ వెళ్తె ఒకటే ఏడుపట. ఆ వెంకయ్య ససేమిరా ఒప్పుకోనని మొండికెత్తి కూర్చున్నాడట… తన వల్ల ఇంట్లో అందరికి సుఖశాంతులు లేకుండా పోయాయని ఆ అమ్మాయే వెళ్ళిందట… నిజంగా చందు తనని ఒకసారి చూడాలని ఉంది…” చందుకి పరిస్ధితులన్ని మరికొంత స్పష్టంగా తెలిసాయి. 
”వివేక్‌! ఈ విషయంలో ఇప్పడు నేనేం చేయాలో చెప్పు. ఏమి చేతకాని వాడిలా నోరు మూసుకొని కూర్చోమంటావా? లేదా సుకన్యను ఇక్కడి నుండి బలవంతంగా తీసుకు వెళ్ళమంటావా చెప్పు. 
”ఎలా? ఎలా తీసుకువెళ్తావ్‌? తను ఇష్టపూర్వకంగా ఆశ్రమంలో చేరింది. నువ్వు రమ్మంటే ఇప్పడు వస్తుందా? పైగా తండ్రికి మాట ఇచ్చిందని కూడా విన్నాను.”
హతాశుడయినాడు చందు. తమ ప్రేమ కధ కూడా విషాదాంతమే అవుతుంది. తానెంతో తెలివైనవాడనని ఏ విషయాన్నైనా చాలా జాగ్రత్తగా 
ఆలోచించి ప్లాన్‌ చేసుకుంటానని తన మీదే తనకు చాలా నమ్మకం చందూకి. ఈ సంఘటనతో తానెంత చేతగానివాడో తేలిపోయింది. 
ఆలోచనల్లో పడి వివేక్‌ ఉనికినే మరచిపోయాడు చంద్రధర్‌. అతన్ని మళ్ళి మామూలుగా చేయటానికిక వివేక్‌ కొంత ధైర్యం చెప్పాడు. ”నేను వెళ్ళి మరొక మారు సుకన్యను కలుస్తాను. లేదా ఆ బాబాతోటి డైరక్టుగా మాట్లాడుదాం… ఏమంటావ్‌?”
”నీ యిష్టం కాని సుకన్య ఎప్పటికీ ఒప్పుకోదు తన తండ్రిని కాదని ఏమి చేయలేదు.”
‘ప్రయత్నించి చూద్దాం’ వివేక్‌ చాలా పట్టుదలగా వున్నాడు. ఆ మర్నాడు వివేక్‌ ఆ ఆశ్రమానికి వెళ్ళాడు. తమ బంధువులు పిల్లలు స్కూల్లో చదువుతున్నారని, వారిని చూడటానికి వచ్చానని చెప్పాడు. అతన్ని విజిటర్స్‌ రూమ్‌లో కూర్చోబెట్టారు. బాబాగారి ఆదేశం మేరకు అన్ని వ్యవహారాలు సుకన్యకు అప్పచెప్పబడ్డాయి. వివేక్‌ తమ పిల్లల చదువు గురించి మాట్లాడాలన్నాడు. సుకన్య కొత్త అయినా చాలా ఉత్సాహంగా అన్ని విషయాలు ఇట్టే కనిపెట్టింది. వివేక్‌ అటెండర్‌ని అడగటం అన్నీ వినబడుతునే ఉన్నాయి. 
”ఆయన్ని లోపలకు పంపు” సుకన్య లోపలనుంచి ఆదేశించింది. 
వివేక్‌ లోనకు అడుగు పెడుతునే ఆశ్చర్యపోయాడు. కన్నుచెదిరే అందం సుకన్యది. చాలా సాదాసీదాగా ఉన్నా ఎంతో ఆకర్షణ. ప్రశాంతమైన ముఖం ఆ ముఖసౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తున్న చిరునవ్వు. 
”కూర్చోండి” మర్యాదపూర్వకంగా అతనికి కుర్చీ చూపించింది సుకన్య. 
మాపిల్లలు కవలలు… అంటే నా పిల్లలు కాదు. మా అక్క పిల్లలు రాంకుమార్‌, లక్ష్మణకుమార్‌ ఇద్దరు ఫోర్త్‌ చదువుతున్నారు. ఎట్లా ఉన్నారో చూచి వెళ్దామని… ఇంతకీ నేనవరో చెప్పలేదు. నా పేరు వివేక్‌. మెకానికల్‌ ఇంజనీర్‌ని”
”నా పేరు సుకన్య ఇటీవలనే క్రొత్తగా ఆశ్రమ బాధ్యతలు స్వీకరించాను. ఆపిల్లల్లో రాంకుమార్‌కి రెండురోజుల క్రితం సుస్తీ చేసింది ఇప్పుడు బాగానే ఉన్నాడు. బాగా చదువుతారు. మీరు వారిని గురించి ఏమి ఆందోళన పడవద్దు…”
”సుకన్యగారు! నన్ను మీరు అపార్ధం చేసుకోనంటే ఒక విషయం చెబుతాను నేను చందు తరపున మీతో మాట్లాడటానికి వచ్చాను. అతడు పిచ్చివాడయినా ఆశ్చర్చపడనక్కర్లేదు. మీరుదయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసికోండి. ఇక్కడ నుండి వచ్చేయండి.” ఆవేశంగా గబగబా అన్నాడు వివేక్‌.
”మీరు మరోలా భావించకండి… అసలు ఇటువంటి విషయాలు ఇక్కడ ఇపుడు చర్చించటానికి ఇది సమయంకాదు. అయినా మరెప్పుడు  వీలుండదు కాబట్టి చెబుతున్నాను. చందుతో చెప్పండి నన్ను శాశ్వతంగా మరిచి పొమ్మని… నేను మానాన్నకిచ్చిన మాట జవదాట లేను… నన్ను మనస్ఫూర్తిగా క్షమించ మనండి, మరొక్క విషయం… నన్ను చందు క్షమిస్తేనే నాకు శాంతి… నన్ను క్షమించమని నా ప్రార్థన అని చెప్పండి” సుకన్య రెండు కళ్ళనుండి కన్నీటి చుక్కలు పల్చటి చెంపల మీదికి పాకుతున్నాయి…ఆమె  ఆపై మాట్లాడలేక పోయింది. వివేక్‌ బరువెక్కిన గుండెలతో అక్కడ నుండి లేచాడు. 
వివేక్‌ గారు, చివరిగా నాదొక అభ్యర్ధన ఇకపై ఈ విషయం గురించి చందుకాని మీరు కాని నాతండ్రిని, బాబాని కూడా కలవవద్దు. ఇది నా కోరిక… దీన్ని మన్నించమని వేడుకొంటున్నాను…”
వివేక్‌కి ఆశ్రమం అంటేనే అసహ్యం వేసింది. కొందరు తమ స్వార్ధం కోసం మరికొందరి జీవితాలనెట్లా నాశనం చేస్తారో  అంటానికి సుకన్య జీవితమొక ఉదాహరణ. భగవంతుని ముందు అంతా సమానమేనని చెప్పే బాబా వీరి పెండ్లికెందుకు అనుమతించటంలేదు. వెంకయ్య కులసంకరం జరగకూడదని కోరుకున్నాడు కాబట్టి అతని మాటే నెగ్గింది. లేకుంటే ఇలా ఎన్నో జంటలు ఆశ్రమానికి వచ్చి కులాంతర వివాహాలు జరిపించమని బాబాను కోరుతారని అతను అట్లా జరిపిస్తే సాంప్రదాయవాదులంతా ఆశ్రమానికి రావటం, కానుకలు ఇవ్వటం తగ్గిస్తారని బాబాకు భయమేమో! అసలు ఈ బాబాలు అమ్మలు సమాజాన్నెంతో మోసగిస్తున్నారో తెలిసి ఈ ప్రజలెందుకింత పిచ్చిలో పడిపోతారో! తమ కష్టాలను దుఃఖాలను అన్నింటిని ఇట్లా చిటికిన వేలితో నెట్టి పారేస్తారీ బాబాలని ప్రజల అభిప్రాయం… అసలు అట్లా ఏదో  మహిమల వల్ల ఈ సమస్యలన్ని  తొలగి పోయేట్టయితే ఆ మహిమలను దేశానికే ఉపయోగించుకొని అనేక విపత్తుల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చుకదా!  ఇట్లా ఆలోచిస్తూ వివేక్‌  ఇంటిదారి పట్టాడు. 
చందు తల్లిదండ్రులతో మాట్లాడుతునే సూట్‌కేసులో బట్టలు సర్దుకొంటున్నాడు. వివేక్‌ అది చందు ప్రయాణ సన్నాహమని తెలిసి చాలా విచారపడ్డాడు. 
”రా వివేక్‌” అని ఆహ్వానించాడు. తండ్రి కనకయ్య గబగబా కుర్చీ తెచ్చి వేసి ”కూర్చోబాబు” అన్నాడు. 
”మీరు పెద్దవారు. నేనక్కడున్న కూర్చీ ఇక్కడకు లాక్కోలేనా?” అన్నాడు వివేక్‌ అతన్ని వారిస్తూ.
”మంచి బాబువే! మీలాటోరు మాయింటి కొచ్చారు అదే చాలు” అంటూ కనకయ్య-సాయమ్మ లోపలకు వెళ్ళారు. 
”చందు ఫలితం ఏమిలేదు” నిరాశగా అన్నాడు వివేక్‌. వివేక్‌ మాటలు విన్న చందు చాలా తేలికగా తీసుకొన్నాడు. వ్యవహారాన్ని ”నాకు తెలుసు వివేక్‌”
”అదేమిటి? నీవు అంతతాపీగా వున్నావ్‌? నాకోసం ఎదురు చూడటం లేదా?
”ఎందుకు చూడటం లేదు… అయితే మనసుని మాత్రం నిశ్చలంగా ఉంచుకొన్నాను. పనవుతుందని ఎదురు చూస్త్తూ ఆశగా ఉన్నామనుకో అవలేదని తెలిసినపుడు ఆ నిరాశను తట్టుకోవటం చాలా కష్టం… ఒకవేళ అవదు అని అనుకొంటూ ఉన్న విలువయిన సమయాన్ని కూడా దుఃఖపడుతూ గడపటం ఇంకా కష్టం… అందుకే ఆశనిరాశలకు తావీయకుండా దేన్నయినా సమంగా స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నాను.” స్థిరంగా వున్నాయి చందు మాటలు.
ఎందుకో ఆ మాటలు వింటుంటే వివేక్‌కి తాతయ్య తరచు చెప్పే ‘స్థితప్రజ్ఞుడు’ అనే మాటగుర్తు వచ్చింది. చందు వైపు ప్రశంసాపూర్వకంగా చూచాడు. ”అయితే నీవు ప్రయాణానికి సిద్ధమవుతున్నావా?”
”ఔను! ఎందుకో ఉండాలనిపించటం లేదు. అమ్మ నాన్నా మరి కొన్నిరోజులు ఉండమంటున్నారు. వాళ్ళకు పాపం విషయం తెలీదు కదా! అందుకే వారు నొచ్చుకోకుండా నేను తప్పని సరిగా వెళ్ళాలని నచ్చచెబుతున్నాను.”

– విజయ బక్ష్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

69

సుకన్య, , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో