జెండర్
సెక్స్ / ప్రాకృతిక లింగం
1. జీవ సంబంధమైనది
2. ప్రకృతిచే చేయబడినది
3. శాశ్వతమైనది
4. దీనిని మార్చలేము
జెండర్ / సామాజిక లింగం
1. ఇదిసమాజంచే నిర్ణయించబడినది
2. సమాజం, సంస్కృతితో చేయబడినది
3. ఇది మారుతూ వుంటుంది
4. దీనిని మార్చుకోగలము
జెండర్ / సామాజిక లింగం
* జెండర్ అంటే స్త్రీ పురుషుల సామాజిక, సాంస్కృతిక తేడాలు
* ఇది కుటుంబానికి, మరొక కుటుంబానికి, కమ్యూనిటీకి మరొక కమ్యూనిటీకి, ప్రాంతానికి, మరొక ప్రాంతానికీ, సంస్కృతికి మరొక సంస్కృతికీ మారుతుంది.
* భాషలో, ప్రవర్తనలో, పరిసరాలలో, వనరులలో, పని విభజనలో, దుస్తులలో జెండర్ తేడాలు, వివక్ష వున్నాయి.
* బాలురు, బాలికలు తమ కుటుంబం, స్నేహితులు, మీడియా, సమాజం నుండి తాము బాలురుగా లేక బాలికలుగా ఎలా ప్రవర్తించాలో సందేశాల్ని అందుకుంటారు.
* వివిధ సంస్కృతులలో బాలబాలికల సద్వర్తన గురించి ధోరణులు భిన్నంగా ఉంటాయి.
* వ్యక్తులందరూ న్యాయమైన, సమానమైన స్థాయిని, గౌరవాన్ని పొందాలి.
* జెండర్ పాత్ర నమూనాలు హానికరమైనవి, వ్యక్తి జీవన పరిధిని ఇరుకు చేస్తాయి.
* పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ అధీనురాలు, తక్కువ స్థాయి కలది, సహాయక పాత్ర మాత్రమే కలది. పోషణలో వివక్ష అధిక సంఖ్యలో బాలికలు రక్తహీనతకు గురవడానికి, వైద్య సదుపాయాన్ని అందించడంలో వివక్ష బాలుర కంటే అధిక సంఖ్యలో బాలికలు చనిపోవడానికి, విద్యావకాశాలలో వివక్ష బాలికలు విజ్ఞాన, వికాసాలకు దూరమవడానికి కారణమవుతున్నాయి. కుటుంబంలోనూ, సమాజంలోనూ స్త్రీల పట్ల వున్న చులకన భావం వారు ఇంటా, బయటా తీవ్రమైన శారీరక, మానసిక, హింసలకు గురవడానికి కారణమవుతోంది. స్త్రీలు భోగ వస్తువులనే భావన వల్ల వారు దారుణమైన లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురవుతున్నారు.
* జెండర్ అసమానత వలన దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడుతోంది, కుటుంబ సంతోషం తరిగిపోతోంది, బాలికలు, స్త్రీలు అనేక జీవిత పర్యంత, తీవ్రమైన ఆరోగ్యపర నష్టాలకు గురవుతున్నారు.
* జెండర్ అసమానత వారి గౌరవాన్ని, హుందాతనాన్ని హీనపరుస్తోంది, వారి జీవించే హక్కునే హరించివేస్తోంది.
ఆధునిక సమాజంలో కౌమార బాలికలు ఎదుర్కొంటున్న కొన్ని అంశాలు
* అందం అంటే అతి సన్నగా, అతి పొడవుగా, అతి తెల్లగా వుండడం అని వేల కోట్ల లాభాలకోసం సౌందర్య ఉత్పత్తుల పరిశ్రమలు, ఆహార పరిశ్రమలు తమ ప్రచారంతో ఊదరగొడుతున్న ‘నమూనా’లో ఇమిడిపోవడానికి బాలికలు, యువతులు పడుతున్న ఆరాటం అనేక శారీరక, మానసిక అనారోగ్యాలకు గురిచేస్తోంది.
* సమయ పరిమితి లేకుండా టి.వి. చూడడం, ఇంటర్నెట్ ఛాటింగ్, సెల్‌ఫోన్లో మాట్లాడడం ఒక వ్యసనంగా మారి, వారి ఆరోగ్యంమీద, వికాసంమీద, భవిష్యత్తుమీద చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి.
* శరీరాన్ని, మనసుని ఉత్తేజితం చేసే క్రీడలు, వ్యాయామం అసలే వుండడం లేదు.
* ర్యాంకులు, ఉన్నతోద్యోగాలు, రాక్షస పోటీ, పెద్దగా శ్రమ పడకుండా సులభంగా డబ్బు సంపాదించాలనే వెంపర్లాట, తనను తప్ప మరెవరినీ పట్టించుకోని స్వార్ధ జీవులుగా యువతను మారుస్తోంది.
* మానవ విలువలు, ఆధ్యాత్మిక విలువల స్పర్శ పొందని బాలబాలికలు జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించడంలో విఫలమయి ఆత్మహత్యలకు పాల్పడడం, భావోద్రేకాలను అదుపుచేసుకోలేని స్థితిలో హత్యలు చేయడం జరుగుతోంది.
* కౌమార థలో శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ల సంచలనంతో పాటు మీడియా ప్రభావం టీనేజ్ ప్రేమల్ని ఆకర్షణీయంగా చేస్తోంది.
* దీక్షతో చదువుకోవలసిన సమయంలో పరిణతిలేని, తాత్కాలిక ఆకర్షణతో కూడిన ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకుంటున్నారు. కొంతమంది హద్దులు మీరిన ప్రవర్తనతో అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.
* కొంతమంది యువకులు ప్రేమించడం, ప్రేమించమని వెంటాడడం, వేధించడం, తమ ప్రేమను అంగీకరించకపోతే తమకు దక్కనిదాన్ని వేరెవ్వరికీ దక్కనివ్వకూడదనే వికృత ఆలోచనతో తెగనరికి చంపడం, ఏసిడ్ దాడులు చెయ్యడం మొదలైన దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
* ఈవ్‌టీజింగ్ కేవలం బాలురలో ఉత్పత్తి అయ్యే టెస్టోస్టిరాన్ హార్మోన్ ప్రభావం
కాదు. ఇది పురుష స్వామ్య నమూనాలోని ”పురుషత్వం” అనే అంశంతో ముడిపడి
వుంది, స్త్రీల మీద పురుషుల పెత్తనం సహజం అనే జెండర్ భావనతో ముడి
పడివుంది.
* బాల్యం నుండి బాలబాలికల్ని వేరుచేసి పెంచడం, తల్లిదండ్రుల మధ్య సంబంధాలలోని జెండర్ అసమానత, సినిమాల్లోనూ, సాహిత్యంలోనూ, పాఠ్యాంశాలలోనూ స్త్రీ పురుష సంబంధాలను చిత్రీకరించే విధానం బాలుడు పెరుగుతున్న థలో అతనిలో పితృస్వామ్య పురుష నమూనాను ప్రతిష్టిస్తున్నాయి.
ఈ నమూనాలో పెరిగే బాలుడు తన తల్లిని, ఆమె జెండర్ చెందిన ఇతర వ్యక్తిని ఒక స్త్రీగా, ఒక మనిషిగా, ఒక గౌరవించదగిన మానవిగా చూడడు, ఒక అబలగా, ఇతరులపై ఆధారపడి బ్రతికే దీనురాలిగా, శిక్షించవలసిన లేక రక్షించవలసినదానిగా పరిగణిస్తాడు.
* కౌమార థలో బాలుడు కేవలం లైంగిక సంతృప్తిని పొందడానికి కాక తన పితృస్వామ్య హక్కును కాపాడుకోవడానికి, స్థిరపరచుకోవడానికి చేసే ప్రయత్నం ఫలితమే ఆడపిల్లలపై నేడు అమలవుతున్న జెండర్ హింస.
* స్వార్ధం, భావోద్వేగాలు లేకపోవడం, పోటీ పడడం, దూకుడుగా, దురుసుగా వ్యవహరించడం, స్త్రీలపట్ల చులకన భావం వుండడం, పరిణతిలేని లైంగిక ప్రవర్తన మొదలైన సంప్రదాయ పురుష లక్షణాలను, పురుషత్వ నిర్వచనాన్ని మార్చుకున్నప్పుడే స్త్రీ పురుషులు సంతోషంగా జీవించగలుగుతారు, ఆరోగ్యంగా వుండగలుగుతారు.
* సమాజం, స్త్రీలను, బాలికలను చూసే దృష్టిలో మార్పు రావాలి.
* విలువల వ్యవస్థను మార్చి స్త్రీ పురుషుల మధ్య ఆధిపత్య సంబంధాలను తొలగించి సహచర సంబంధాలను నెలకొల్పాలి.
మీడియా-సామాజిక బాధ్యత
* టెలివిజన్, వాణిజ్య ప్రకటనలు స్త్రీలు, అణచివేతకు, వివక్షకు గురవుతున్న ఇతర తరగతులకు చెందిన వారు సమాజంలో నిర్వహించే పాత్ర గురించీ, వాటి గుర్తింపు గురించీ సామాజిక దృక్పథాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయి. స్త్రీలను స్వేచ్ఛకు, స్వావలంబనకు, సామర్ధ్యానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలుగా కాక అధీనతకు, విశృంఖలతకు, దుర్బలతకు ప్రతీకలుగా, విక్రయ వస్తువులుగా చిత్రించడం వలన, స్త్రీల పట్ల చులకనభావంతో కొంత, స్త్రీలు అన్ని రకాలుగా శక్తిమంతులయితే తమ ఆధిపత్యానికి, పెత్తనానికి గండి పడుతుందనే అభద్రతాభావంతో కొంత బాలురు, పురుషులు, బాలికలను, స్త్రీలను వేధిస్తున్నారు. దాడులకు పాల్పడుతున్నారు.
* పౌర సమాజపుఅభిప్రాయాలను ప్రతిబింబించడమే కాక పౌర సమాజపు అభిప్రాయాల్ని, భావాలను, ప్రవర్తనలను మలిచేంత ఎక్కువ ప్రభావశీలంగా వున్న మీడియా, తన సామాజిక బాధ్యతను మరిచి యువతకు హానికరంగా పరిణమించ కుండా బాలబాలికల మధ్య స్నేహం, సుహృద్భావం, ఒకరి హక్కుల్ని, అభిప్రాయాల్ని మరొకరు గౌరవించడం మొదలైన సానుకూల అంశాల్ని పెంపొందిచేలా వుండాలి.
కుటుంబం బాధ్యత
* మనిషికి మొదటి పాఠశాల కుటుంబం, మొదటి గురువు తల్లి, తరువాత తండ్రి. వారు తమ బిడ్డలకు విలువల్ని నేర్పడమే కాక తమ జీవితంలో ఆ విలువలను నెలకొల్పుకుని ఆదర్శంగా నిలవాలి. తమ పిల్లలకు మార్గదర్శకత్వం వహించాలి. వారికోసం కేవలం ధనాన్ని కేటాయిస్తే చాలదు, కోరిన సౌఖ్యాల్ని, సౌకర్యాలను సమకూరిస్తే చాలదు, వారికి సమయాన్ని కేటాయించాలి. వారికి డబ్బు విలువను, సమయం విలువను నేర్పాలి. వారి కలల్నీ, కలవరాల్నీ పంచుకోవాలి. ఆడపిల్ల, మగపిల్లాడు అంటే వున్న జెండర్ నిర్వచనాల్ని మార్చి ఇద్దరూ సమానస్థాయి, సమాన గౌరవం, సమాన హక్కులు, సమాన అవకాశాలు పొందవలసిన వ్యక్తులు అనే భావన బాల్యంలోనే వారి మెదళ్ళలో బలంగా నాటాలి. ఆశాభంగాల్ని, నైరాశ్యాల్ని, ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకోగల శక్తిమంతుల్ని చెయ్యాలి.
* బాలురు మంచి మార్గంలో నడవడానికి తండ్రి ప్రేమ, ఆసరా, మార్గదర్శకత్వం, పర్యవేక్షణ తప్పనిసరి అవసరం.
ఉపాధ్యాయుల బాధ్యత
* బాలబాలికలపై పాఠశాల, ఉపాధ్యాయుల ప్రభావం కూడా బలంగా వుంటుంది, వారి భావాల్ని, ప్రవర్తనలను మలచడంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర వహించగలరు. పాఠశాలల్లో నైతిక విలువల, మానవ విలువల బోధన జరగాలి. బాలబాలికలు స్నేహంతో, పరస్పర గౌరవంతో మెలిగే వాతావరణం వుండాలి. అప్పుడే బాలబాలికలు బాధ్యతాయుత పౌరులుగా రూపొందుతారు.
* పాఠ్య పుస్తకాలలో జెండర్ స్టీరియో టైప్స్‌ని తొలగించాలి. *
మహిళలకు సంబంధించిన చట్టపరమైన అంశాలు
* 16 సంవత్సరాలలోపు వయసు ఉన్న వ్యక్తి లైంగిక కలయికకు ఆమోదించినప్పటికీ అది చట్టరీత్యా చెల్లదు.
* కుటుంబ సభ్యుల మధ్య అసంగత లైంగిక సంబంధాలు చట్ట వ్యతిరేకం.
* గర్భ విచ్ఛిత్తి 20 వారాల వరకు చట్ట వ్యతిరేకం కాదు, ప్రభుత్వ అనుమతి పొందిన కేంద్రాలలోనే గర్భ విచ్ఛిత్తి చెయ్యాలి.
* వ్యభిచారం చట్ట వ్యతిరేకం
* అసభ్యకర వస్తువుల్ని కలిగిఉండడం, ప్రదర్శించడం చట్ట వ్యతిరేకం, ఒక కమ్యూనిటీ సభ్య ప్రమాణాల్ని భంగం చేసేవి, సామాజిక, కళ లేక శాస్త్ర పరమైన యోగ్యత లేనివి అసభ్యకరమైన వస్తువులుగా నిర్వచింపడతాయి.
* లైంగిక వేధింపు నేరం
* మానభంగం చెయ్యడం కఠిన శిక్షార్హమైన నేరం.
* వరకట్నాన్ని ఇవ్వడం,తీసుకోవడం, కట్నం తీసుకోవడంలో దోహదపడడం, కట్నం కోసం భార్యని హింసించడం, కట్న చావులు శిక్షార్హం.*
*************************************************************************************************************
”గట్టి ఇటుకలు భవనాన్ని నిలబెట్టినట్లే విద్యార్ధులు సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెట్టాలి”
– బి.ఆర్. అంబేద్కర్
*******************************************
– డా. ఆలూరి విజయ లక్ష్మి,M.S.(Ob./Gy)
(ఈ శీర్షిక ముగిసింది.)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~