సుకన్య

”ఈ రోజే వచ్చావనుకుంటాను. బాగున్నావా?”
”ఏమిటి సుకన్య ఏమిటిదంతా? ఏం జోక్‌ చేస్తున్నావా నాతో? అసలిదంతా నాకర్థం కావటం లేదు. నీవు ఈ ఆశ్రమంలో చేరటమేమిటి?”
”చందు ఆవేశపడకు, చెప్పేది విను. నేను నిన్ను మోసం చేయాలని కాని, నిన్ను మరచిపోయి కాని ఇక్కడ చేరలేదు.”
”మోసం చేయటం కాదా! నీకోసం నా జీవితమంతా అర్పించటానికి సిద్ధంగా ఉన్న నన్ను కాదని నీవిట్లా ఇక్కడ ఒంటరి జీవితాన్ని గడపవలసిన అవసరం ఏమొచ్చింది? చెప్పు. ”చందు కొన్ని కారణాల వల్ల ఇట్లా చేయక తప్పలేదు. మన పెండ్లికి నాన్న ఎంతమాత్రం అంగీకరించలేదు. నిన్ను తప్ప మరెవ్వరిని నేను పెండ్లాడేందుకు సిద్ధంగా లేను. నీతో పెండ్లి కంటే పెండ్లి కాకుండా ఉండటమే మంచిదనిపించింది నాన్నకి. అందుకే నన్నిక్కడికి పంపారు.”
”అంటే నిన్ను ఆశ్రమానికి అంకితం చేసారా?” ఆవేదన కసి కలగలిసిన ప్రశ్న.
”మనం ఏమని ప్రమాణాలు చేసుకున్నామో మరచావా? ఎట్టి స్థితిలోను ఆత్మహత్యలు చేసుకోరాదని. చందూ నీకు తప్ప ఈ హృదయంలో మరెవరికి స్థానం లేదు. నీతో పంచుకోని నా జీవితానికో అర్ధం లేదు. అటువంటపుడు నేను సన్యాసినైనా ఒకటే సంసారినైనా ఒకటే. మన జన్మకు ఓ సార్ధకత అంటూ ఉండాలి కదా! అందుకే కన్న వాళ్ళకయినా తృప్తి కలిగించేలా ఈ జీవితాన్ని వరించాను.
”సుకన్యా! ఇపుడు నన్నేం చేయమంటావ్‌? అసలు నేనీ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను. చెప్పు. నిన్నిక్కడినుండి అమాంతం తీసుకెళ్ళనా? మీ నాన్నతో మాట్లాడి ఒప్పించనా? బాబాతో వాదించనా? చెప్పు… ఏం చెయ్యమంటావో చెప్పు…” అంటూ ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకో బోయాడు చందు.
”చందు కంట్రోల్‌ యువర్‌సెల్ఫ్‌… ప్లీజ్‌.” అంటూ సుకన్య లేచి కూజాలో మంచినీళ్ళని గ్లాసులోకి వంపి తెచ్చి యిచ్చింది.
”చందూ! హాయిగా గొప్ప ఉద్యోగం చూచుకొని మంచి అమ్మాయిని చేసికొని సుఖమయిన జీవితం గడుపు.”
”నీకు నేను పిచ్చివాడిలాగ కనబడుతున్నానా? చెప్పు మీ ఆడవాళ్ళకొక అహంకారం మీరే గొప్ప ప్రేమమూర్తులని మగవాళ్ళంతా మోసగాళ్ళని. మాట మీద నిలబడలేరని మీ అభిప్రాయం ఔనా?” రెట్టించాడు చందు.
”చందూ! నేనట్లా అనటం లేదు. ఈ దేశంలో ఈ కులాల కుళ్ళు ఉన్నంతవరకు మనలాటి స్వతంత్రపు ఆలోచనలు ఉన్నవాళ్ళ మాటలు సాగవు. మనసు నిండా మా కులాన్ని మించిన కులం లేదనే అహంకారాన్ని నింపుకొన్న వాళ్ళని ఎట్లా సమాధాన పరచగలమో చెప్పు… ముఖ్యంగా అన్ని విషయాల్లో పిల్లలకి స్వతంత్రమిచ్చే తల్లిదండ్రులు ఎందుకనో యీ విషయంలో తమ మాటే కొనసాగాలిన పట్టుబడతారు. పెళ్ళిని వ్యక్తిగత విషయం అనే దాని కన్నా సామాజిక విషయమనే అభిప్రాయం ఉండటం వల్ల కావచ్చు. చందూ నన్ను గురించి ఆలోచించకు నాకీ జీవితం బాగుంది. నీవు ఎంతో తెలివైనవాడవు. నీ తెలివితేటలు ఈ ప్రేమ వైఫల్యానికి వ్యయపరచకు సమాజానికి నీ సేవలు చాలా అవసరం.”
”నీవు నా తోడు లేకుండా నేను బలహీనుడ్ని. నేనేం సాధించలేను. నేను ఇక్కడే నీతో పాటే ఈ ఆశ్రమంలో ఉండిపోతా…” దీనంగా అన్నాడు చందు.
”చందూ ఏమిటి? నీ ధోరణి నాకు నచ్చలేదు. మనం అనుకున్నట్లుగా అన్నీ జరిగితే జీవితం ఏముంది! మన యోగం బాగా లేదు. నేను ఎంతో ఆలోచించి మనసు స్థిరపరచుకొన్నాను. బహుశా ఇంత వరకే మన ప్రయాణం అని భగవంతుడు నిర్దేశించి ఉంటాడు. దాన్ని అధిగమించటం మన శక్తికి మించిన పని.
”నో… ఇది భగవంతుడు నిర్దేశం కాదు. మీ నాన్న ఆ బాబా కలిసి చేసిన నిర్ణయం. దీన్ని శిరసావహించవలసిన అవసరం మనకు లేదు. నీవు నాతో వచ్చేయ్‌. నీవు లేని నేను ఊహించలేను.”
ఇంకా ఇద్దరి సంభాషణ కొనసాగేదే. కాని ఇంతలోనే రామేశం వచ్చాడు లోపలకు. ”సుకన్య గారు ఎవరితను? బాబా అనుమతి లేనిదే ఇక్కడుండే వారు ఎవరితో సంభాషించ కూడదు.” అన్నాడు.
సుకన్య కొంచెం సిగ్గుపడింది. తను అలా చెప్పించుకోవలసి వచ్చినందుకు. ”నాకిక్కడ నియమ నిబంధనలు తెలీవు.” అంది వినమ్రంగా.
అక్కడ కొనసాగుతున్న నియంతృత్వ ధోరణి చందూకి అర్ధం అయింది. అంటే తానికపై సుకన్యను కలుసుకోవటానికి కూడా లేదన్నమాట! చందు కూర్చున్న చోట నుంచి లేచాడు.
అసలు జరిగింది ఏమిటంటే చందు తమ యింటి వద్దకు వచ్చి సుకన్య కోసం అడిగి వెళ్ళిన వెంటనే వెంకయ్యకు అతను తప్పని సరిగా ఆశ్రమానికి వెళ్ళి ఉంటాడన్న అనుమానం వచ్చింది. అందుకే కొంత సమయం ఆలోచించి ఫోన్‌ చేసాడు రామేశానికి. రామేశం బాబా అనుమతి మీద సుకన్యని పరిశీలించటానికి వచ్చాడు.
చందు అక్కడి నుండి చాలా పెద్ద పెద్ద అంగలు వేసుకొంటూ గేట్‌ దాటి బయటకు వచ్చాడు. అతని గుండెల్లో అనుమానపు జ్వాలలు రగులుకొన్నాయి. చివరికి సుకన్య తీసికొన్న పిచ్చి నిర్ణయం వల్ల తమ జీవితాలు ఎంత చిన్నాభిన్నమయినాయో అతనికి అర్థం అవుతూ ఉంది. ఏదైనా వాహనం వస్తుందేమోనని ఎదురు చూస్తూ నిలుచున్నాడు. ఓ పది నిముషాల్లో పై నుండి కారు వస్తునట్లు చూచాడు గేటు ముందు కారు అగింది. దాంట్లో నుండి ఓ అరవై ఏండ్ల వ్యక్తి బ్యాగ్‌తో దిగాడు.
చందూ డ్రైవింగ్‌ సీట్‌లో ఉన్నతని దగ్గరకు వెళ్ళి ”కొంచెం నన్ను సిరిపురంలో డ్రాప్‌ చేయగలరా” అని అడిగాడు. అతను చదువుకున్నవాడే. చందూని చూడగానే ఎక్కడో చూచినట్లు అనిపించింది.
    చందు అతని ప్రక్కనే కూర్చున్నాడు.
”మీరీ ఊరికి క్రొత్తా” కారు స్టార్టు చేస్తూ అడిగాడు అతను.
”ఈ ఆశ్రమానికి క్రొత్త. మాది సిరిపురం. మిమ్మల్ని ఎక్కడో చూచాను” అన్నాడు చందు.
”మాది సిరిపురమే! అయితే నేను ప్రక్కనే ఉన్న పట్నంలో మా అమ్మమ్మ గారింటి వద్ద ఉంటూ ఇంజనీరింగ్‌ పూర్తిచేసాను. నా పేరు వివేక్‌. అట్లాగయితే నేను మిమ్మల్ని సిరిపురంలో చూచి ఉంటాను పద్మనాభంగారి అబ్బాయిని. మీరు.”

”నేను కనకయ్య కొడుకిని. శివాలయం దగ్గర మా ఇల్లు.”
వివేక్‌కి అతనెవరో అర్ధం అయింది.
అయినా అందరిలాగ కనకయ్య అంటే ‘కుమ్మరి కనకయ్య కొడుకువా?’ అనలేదు. అతను అట్లా అనలేదని. అంటాడేమోనని ఎదురు చూస్తున్నాడు చందు. చందుతో ఎక్కువగా మన దేశ పరిస్థితులు గురించే మాట్లాడాడు. మాట్లాడుతూ మధ్యలో ”మీకీ ఆశ్రమంలో పనేమిటి? ఎవరయినా ఉన్నారా మీ వాళ్ళిక్కడ?” అని అడిగాడు.
”ఎవరో ఉండటం ఏమిటి నా ప్రాణమే ఇక్కడ ఉంది” అని అనాలనుకున్నాడు చందు. ”తెలిసిన వాళ్ళు ఉంటే చూద్దామని వచ్చాను. మాటల్లో పడి టైము గమనించలేదు.”
”కాని ఈ సమయంలో మీకు ఏ విధమైన వాహనాలు దొరకవు సిరిపురం వెళ్ళటానికి. నేను రాకుంటే బాగా యిబ్బంది పడేవారు. ఇపుడు ఆశ్రమంలో వెళ్ళినాయన మా తాతగారి స్నేహితుడు. వాళ్ళ పిల్లలు హాస్టల్లో ఉన్నారు. అందులో ఒకడికి బాగా జ్వరం వచ్చిందట. అందుకే చుద్దామని వచ్చారు.
”ఆశ్రమంలో హాస్టలు కూడా ఉందా?” చందు ప్రశ్నించాడు. ”మీకు తెలియదా? మొదట్లో ఇది బాబాగారి ఆశ్రమం. భజనలు ఆధ్యాత్మిక చింతన. అదీ ఇదీ అని మొదలయింది. క్రమంగా భక్తులమంటూ చేరి చాలా మంది పోగయినారు. వాళ్ళు ఒక స్కూలు నడుపుతున్నారు. ఉచితంగా మాత్రం కాదు. చాల ఫీజులు వసూలు చేస్తూనే! దానికి అనుబంధంగా ఒక హాస్టలు కూడా, దానికి ఫీజులు తక్కువేమి కాదు.”
”అదేమిటి? అంత ప్రజా సేవ చేయాలనుకున్న వాళ్ళు ఉచితంగా చదువు చెప్పవచ్చు కదా!”
”అసలు వీళ్ళు ఒక స్కూలు నడపవలసిన అవసరం లేదు. కావలసినన్ని స్కూళ్ళు బోలెడంత ఫీజులు వసూలు చేస్తూ నడుపుతునే ఉన్నాయి. వీళ్ళు నిస్వార్ధ సేవా పరాయణులయితే ఒక అనాధాశ్రమం నడపవచ్చు కదా! ఉచితంగా. దిక్కులేని బాల బాలికలకు చదువు చెప్పవచ్చు కదా! ఇపుడు ఆశ్రమానికి ముఖ్యమైన ఆదాయాన్ని కూర్చి పెడుతున్నది. ఈ స్కూలు, హాస్టలే. ముందు ముందు ఇంకా ఎంత వ్యాపారాత్మకంగా ఈ ఆశ్రమం మారిపోతుందో మీరే చూస్తారు.”

అప్పటికే చందూకి సుకన్య ఎట్లా ఎక్స్‌ప్లాయిట్‌ చేయబడిందో అర్ధ అయింది.
”ఆ బాబా గారు కులాలు మతాలు లేవంటాడు. కాని ఆశ్రమంలో పాటించేది అవే… ఆయన ట్రస్టులోని సభ్యులంతా ఆయన పిల్లలు ఆయన కులస్ధులే… బయటవాడు ఒక్కడే…” చందు అన్నీ  శ్రద్ధగా వింటున్నాడు. వివేక్‌ ఆశ్చర్యంగా చూస్తూ ”మీకివన్ని తెలియవా? అట్లా ఆశ్చర్యపోతున్నారు”  అన్నాడు. ”లేదు నేనిక్కడుండేది చాలా తక్కువ…” మాటల్లోనే సిరిపురం వచ్చింది. శివాలయం దగ్గర కారు ఆపాడు వివేక్‌, చందు కారు దిగుతూ ”ఒకసారి లోపలకు వచ్చి వెళ్ళండి” అన్నాడు. వివేక్‌ చందూతో పాటు లోపలకు వచ్చాడు. చందు తల్లి కొడుకు రాలేదని అట్లాగే ఎదురు చూస్తూ కూర్చుంది. చందు కిష్టమైనవన్ని తయారు చేసింది. చిక్కటి పాలు పోసి క్షీరాన్నం వండింది. బెండకాయ వేపుడు, పప్పుచారు, కొబ్బరి పచ్చడి, మసాల వడలు చేసింది. అన్నం చల్లారిపోతుందని బొగ్గుల సెగన పక్కనే ఉంచింది. కొడుకు మరో అబ్బాయితో కలసి రాగానే భోజనం పెట్టటానికి ఏర్పాట్లు చేయసాగింది.
కనకయ్య కొడుకు కోసం చూసి చూసి బయట నుండి వచ్చాడు. అప్పటి వరకు రోడ్డు మీద చూస్తున్నాడు వచ్చేపోయే వాహనాలను. కారు శివాలయం వైపు వెళ్ళటం చూచాడు కొడుకు వచ్చుంటాడని. రంగయ్య కిళ్ళి కొట్లో  ఓ డజను చక్కెర కేళీలు కొని తీసుకువచ్చాడు.
”అబ్బాయి వచ్చాడా?” అంటు అడిగాడు మరొక కుర్రాడ్ని చూచి. ”భోజనాలు పెడుతున్నావా?” అని అడిగాడు సాయమ్మని.
”వద్దు… మా ఇల్లు ఇక్కడే కదా! నేవెళతాను” అన్నాడు వివేక్‌.
”అదేంటి బాబు ఇంత పొద్దోయింది నాలుగు ముద్దలు మా అబ్బాయితో పాటు తిని వెళితే మాకు బాగుంటుంది.” అంది సాయమ్మ ప్రేమగా.
”పద్మనాభంగారి అబ్బాయివి కదూ బాబు! మా ఇంట్లో భోజనం చేయకూడదనా” అన్నాడు కనకయ్య.
”అయ్యో! అట్లాంటిదేమి లేదు” అన్నాడు వివేక్‌.
”అసలు అతను భోజనం చేయడని మీరెందుకు అనుకొంటున్నారు. మేమిద్దరం కలసే భోంచేస్తాం” అంటు కాళ్ళు చేతులు కడుక్కోమని బాత్‌రూమ్‌ చూపించాడు చందు.

సాయమ్మ ఎంతో ప్రేమతో కొసరి కొసరి వడ్డించి తినిపించింది. వివేక్‌కి అపుడు అనిపించింది. ఖరీదయిన డైనింగ్‌ సెట్‌తో టేబుల్‌ ముందు కూర్చుని అమ్మ తినిపించే తిండికి దీనికి ఏం భేదం లేదు. కాకుంటే అక్కడ వస్తువులు, పదార్ధాలు అన్ని మోడ్రన్‌ పేర్లతో పిలవబడుతున్నాయి. ఇక్కడంతా ఇంకా గ్రామీణ వాతావరణం… చివర్లో సాయమ్మ ఇంట్లో కుండలో కాచిన పాలు… తోడుబెట్టింది అట్లాగే! ఆ పెరుగు తెచ్చి వేసింది. ఆ రుచి ఎంత బాగుందో! వివేక్‌ అడిగి మరీ కొంచెం వేయించుకొన్నాడు. హడావుడిగా మిల్క్‌ బాయిలర్‌లో కాచిన ప్యాకెట్‌ పాలు పట్నంలో!
ఇది సొంతపాడి సన్నటి సెగన కుండలో ఎఱ్ఱగా కాచిన పాలు ఈ పెరుగు రుచికి ఆ పెరుగు రుచికి తేడా ఉండదు!
ఎందుకో మొదటి పరిచయంలోనే వివేక్‌ చంద్రధర్‌ బాగా దగ్గరయ్యారు. ఎన్నో ఏండ్లుగా ఒకరికొకరు తెలిసున్న వాళ్ళలాగా మెలిగారు. వివేక్‌కి ఆప్యాయంగా చెయ్యి నొక్కుతూ వీడ్కోలు చెప్పాడు చంద్రధర్‌.
అప్పటికి రెండురోజులయింది చందు సుకన్యని కలసి వచ్చి. ఎంత ప్రయత్నించినా ఉత్సాహంగా ఉండలేకపోతున్నాడు. తల్లిదండ్రులతో తాను కలిసుండే ఈ కొద్దిరోజులయిన సంతోషంగా కనిపించాలని అనిపించినా ఆ ఆశ్రమ నిబంధనలు, అక్కడి వ్యవహారాలు అతన్ని పిచ్చివాడ్ని చేసాయి.
ఆ రోజు సాయంత్రం వరండాలో కూర్చుని పుస్తకం చదువుకొంటున్న కొడుకు వద్దకూర్చుంది సాయమ్మ. అరుగు మీద గుంజనానుకొని కూర్చుంది. కొడుకు ఎంత దీక్షగ చదువుకొంటున్నాడు! అతని ముఖం చాల గంభీరంగా ఉంది. ఎందుకో వచ్చిన రోజు ఆ ముఖంలో కనిపించిన ఆనందం ఈరోజు కనిపించటం లేదు. సాయమ్మ మనసులో ఏదో కలవరపాటు…
బాబు! ఏంటిరా చదువుతున్నావ్‌?
ఏదో పుస్తకం… ఏంటమ్మ! తీరికగా కూర్చున్నావ్‌”  అంటు కుర్చీలోంచి లేచి వచ్చి తల్లి ప్రక్కనే కూర్చున్నాడు చందు.
”ఇక నీ చదువు అయిపోయిందిగా! మరి మమ్మల్ని పెండ్లి ప్రయత్నాలలో వుండమంటవా.?

– విజయ బక్ష్

(ఇంకా ఉంది)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సుకన్య, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో