యోగా క్లాసు నుండి వచ్చి, లంచ్ తినేసి, పేపర్ వర్క్ కూడా పూర్తి చేసుకుని, ఓ కునుకు తీయడం నాకు పరిపాటయింది. నా కునుకుని అప్పుడప్పుడు పాడు చేస్తూ ఎడతెరపి లేకుండా ఫోన్ మోగడం కూడా పరిపాటే. ఆ రోజు లంచ్ తినబోతుంటే, ఆగకుండా మ్రోగుతున్న ఫోన్, తీయక తప్పలేదు. “హలో” అన్నాను అసహనంగా. అటునుండి, “10-10-1962”, “అదే, అక్టోబర్ టెన్త్ 1962,” గంభీరంగా ఉన్నా, ఆడమనిషి గొంతే. అది నా పుట్టిన తేది. ఫోన్ నెంబర్ చూస్తే న్యూయార్క్ నెంబర్. అనుమానం వచ్చింది, ఒకవేళ కల్యాణి కాదు కదా! ఆమె అమెరికాలోనే ఉంటుంది ఎప్పటినుంచో, కాని నాకసలు కళ్యాణి ఫోన్ చేసే ప్రశక్తే లేదే?
“టైం తీసుకో, గుర్తు వస్తానులే” మళ్ళీ అటునుండి, ఫోన్లో గంభీరంగా ఆ గొంతు. ఫోన్ చేసి, బర్త్ డేట్ గుర్తు చేయడమంటే? కళ్యాణి, నేను ఒకే రోజు పుట్టాము. అనుమానం అక్కరలేదు. తప్పక కళ్యాణి అయి ఉండాలి. “ఎవరు? కళ్యాణీ,” అన్నాను. అటు నుండి ఉత్సాహంగా, “ఆ నేనే, కళ్యాణినే, నువ్వు బాగున్నావా? ఎంతో కష్టపడి నీ నెంబర్ సంపాదించాను,” అంటూ మొదలైన సంభాషణ ఐదు నిముషాలన్నా సాగి, “మళ్ళీ ఫోన్ చేస్తానే,” అన్న కళ్యాణి మాటతోనే ముగిసింది.
ఎంతో కాలంగా తనిప్పుడు న్యూయార్క్ లో ఉన్నానని చెబుతూ, గత పాతిక సంవత్సరాలుగా తన జీవితంలో ఎన్నో అసాధారణ మలుపులు తరువాత ఇప్పుడిప్పుడే కాస్త తేరుకున్నానని వాపోవడం, వీలు చేసుకొని, మా ఇంటికి వస్తానని అనడం, ఆ ఐదు నిముషాల సంభాషణ సారాంశం. నేనెక్కువ మాట్లాడలేదు. ఏమనాలో, ఎలా అనాలో తెలియక మిన్నకుండిపోయాను.
ఫోన్ పెట్టేసి కళ్యాణి గురించి ఆలోచనలో పడ్డాను. నా నెంబర్ దొరకపుచ్చుకోవడం అంత కష్టమా? ఏమో, ఎప్పుడు ఏమాట ఎందుకంటుందో, అర్ధం కాదుగా, అంతు పట్టని మనస్తత్వం కళ్యాణిది.కళ్యాణి గురించి జ్ఞాపకాలు నన్ను చుట్టేసాయి. ఒక్కప్పటి నా చిన్ననాటి ఫ్రెండ్ , కళ్యాణి . కనీసం 30 సంవత్సరాలు అయ్యింది ఆమెని చూసి. అవును, సరిగ్గా ముప్పై సంవత్సరాల క్రితం, అప్పుడే పెళ్ళయి, అమెరికా వచ్చిన నన్నుచూడ్డానికి, నెల రోజుల పసివాడితో, ఫ్లారిడా నుండి మా ఇంటికి వచ్చింది కళ్యాణి. నాలుగు రోజులు మా కొత్త సంసారపు ఆతిధ్యాన్ని స్వీకరించి, కనుమరుగై పోయిన వ్యక్తి కళ్యాణి. నా బాల్య స్నేహితురాలు, మా బంధువే సుమా! ఆనాటి కలయిక పిదప, ఆ వెనువెంటనే కళ్యాణి ఇండియాకి వెళ్ళి, అమ్మా వాళ్ళని కలిసి, నా గురించి ప్రస్తావించడం తెలుసు. అంతే, అటుపై, మళ్ళీ ఇప్పటి వరకు, ఆమె సంగతే తెలియదు. కళ్యాణి గురించి ఏనాడూ అనలేదు, అనుకోలేదు. తలవలేదు, కలవలేదు. మా మధ్య ఎటువంటి కాంటాక్ట్ లేదు.
అలాంటిది, ఇన్నాళకు, ఉన్నట్టుండి ఫోన్ చేసింది. ఎలా స్పందించాలో తోచలేదు. ముప్పై ఏళ్ల క్రితం ఆవిడ రాక, చేదు జ్ఞాపకాలే మిగిల్చింది కనుక. అందుకే ఇప్పటి ఈ ఫోన్ కాల్, కాస్త ఆశ్చర్యం, కాస్త సందేహం, మరి కాస్త అనుమానం కలిగించి నన్ను ఆలోచనలో ముంచేసింది.
*** *** *** ***
కల్యాణితో నలభై ఏళ్ళ నాటి నా చెలిమి ….
కల్యాణి నా చిన్ననాటి ప్రాణ స్నేహితురాలే. 7 నుండి 11 ఏళ్ళ వరకు మంచి స్నేహతులం, జంట కవుల్లా కలసి తిరిగేవాళ్ళం. ఆటల్లో, చదువులో అన్నిటా నాకన్నా కాస్త ముందే ఉండేది. లెక్కల్లో మాత్రం నాకు అత్తెసరు మార్కులు, కల్యాణికి నూటికి నూటపది వచ్చేవి. అందరి మెప్పూ పొందేది. కాని, నలుగురితో కలిసేది కాదు. నేను సంగీతం నేర్చుకోనేదాన్ని. నాకు కళ్యాణి అంటే అభిమానం ఉండేది. వాళ్ళింట్లో ఎంతో సమయం గడిపేదాన్ని. వాళ్ళమ్మ, చేసే వంటలు కూడా ఇష్టమే. చిన్నప్పటి ఆ నాలుగేళ్ళ మా స్నేహం గురించి, నాలో మంచి అనుభవాలు, అనుభూతులే ఉన్నాయి. కల్యాణి లాంటి ఫ్రెండ్ నాకు మళ్ళీ ఉండదని పించేది.
నా పన్నెండవ యేట నుండి, మా నాన్నగారి ఉద్యోగ బదిలీల రీత్యా, చాల సంవత్సరాలు ఆంద్రప్రదేశ్ కి దూరంగా ఉండిపోయాము. కల్యాణిని చూడలేదు. అప్పుడప్పుడు కళ్యాణి వాళ్ళ గురించి, బంధువులు మాట్లాడుకునే సాధారణ విషయాలు వినడం తప్ప.
*** *** *** ***
మళ్ళీ నా పందొమ్మిదవ యేట, షుమారు ఎనిమిదేళ్ళ తరువాత చూసాను నా స్నేహితురాలిని. నాన్న వ్యాపారం మొదలెట్టాక, అప్పటికి రెండేళ్లగా మేము హైదరాబాద్ లో సెటిల్ అయ్యాము. కల్యాణిని తీసుకొని వాళ్ళ అమ్మ, అక్క, హైదరాబాద్ మా ఇంటికే వచ్చారు, ఆమెని పేరున్న సైకియాట్రిస్ట్ (మనస్తత్వవేత్త) కి చూపించాలని. ఏమిటా అని మేము ఆశ్చర్య పోయాము. కళ్యాణి పొడుగ్గా చామనఛాయగా చురుగ్గా కనబడింది. ముభావంగా ఉంది. మెడికల్ కాలేజీ సీట్ సునాయాసంగా వచ్చిందట కళ్యాణికి.
వచ్చిన రెండు రోజులకి గాని కాస్త మాట్లాడ్డం మొదలు పెట్టలేదు ఆమె. ఓ సాయంత్రం, మేము టెర్రెస్ మీద కూర్చుని పిచ్చా పాటీ మాట్లాడుతుండగా, సైకియాట్రిస్ట్ వద్ద మరునాటి అపాయింట్మెంట్, తనకి కాస్త ఆదుర్దా కలిగిస్తుందని అన్నది కళ్యాణి. “నేనిప్పుడు 2 nd ఇయర్ మెడిసిన్ చేస్తున్నాను తెలుసా,” అంది కళ్యాణి. తెలుసన్నట్టు తలూపాను. ఇంకా ఏమన్నా అడగేటంత చనువు గాని, ధైర్యం గాని నాకు లేవు. “మా లెక్చరర్, ఒకాయన తో నాకు స్నేహం, అంటే అఫ్ఫైర్ ఉంది. దానివల్ల తన వాళ్ళతో ఆయనకీ, మా ఇంట్లో వాళ్ళతో నాకు గొడవలు, నేను ఎదురుతిరగడంతో, ఏం చేయాలో తెలియక, నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. సైకియాట్రిస్ట్ ని కన్సల్ట్ చేస్తున్నారు,” అని కాసేపు నిశబ్దంగా ఉండిపోయింది.
ఏమాత్రం సంకోచం లేకుండా నాకు చెప్పేసింది. అసలు ఇన్నాళ్ళ తరువాత కలసిన నాకు ఇవన్నీ చెప్పడం ఏమిటా అని నాకే ఇబ్బందిగా అనిపించింది. మళ్ళీ తానే, “నాకేమన్న భయమా? నాకు తెలిసి కావాలని అతనితో సంబంధం పెట్టుకొన్నాను. అతనికి పెళ్ళైంది. అయితే, ఈ విషయంలో సైకియాట్రిస్ట్ ఏం చేయగలడు?, బుద్ధులు చెబుతాడా?” అంటూ కోపంగా ఉండిపోయింది. ఆ తరువాత, ఉన్న 4 రోజులు అయిష్టంగా, నీరసంగా, అందరికీ దూరంగానే ఉంది కళ్యాణి. డాక్టర్ ని కలిసి, సలహా, మందులు ఏవో తీసుకొని అత్తయ్య వాళ్ళు కళ్యాణితో పాటు తిరిగి వెళ్లి పోయారు.
*** *** *** ***
ఆ తరువాత మళ్ళీ మూడేళ్లకి, చెన్నై నుంచి N.R.I ఇంజినీర్ని పెళ్లి చేసుకొని, కల్యాణి అమెరికా వెళ్ళిపోయిందని విన్నాము. మెడిసిన్ మాత్రం ఆప్పటికి పూర్తి చేయలేదని అన్నారు.
అప్పటికి, నేను శాస్త్రీయ సంగీత కళాకారిణిగా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాను. తరువాత రెండేళ్ళకి, ఎం.ఎ. పూర్తి చేసి, ఉన్నట్టుండి ఊడిపడ్డ అమెరికా పెళ్ళికొడుకు, నచ్చి, పెళ్లి చేసేసుకొని నేనూ అమెరికా చేరాను.
*** *** *** ***
హ్యూస్టన్, టెక్సాస్
హైదరాబాద్ లో పందొమ్మిదేళ్ళప్పుడు కలవడమే కళ్యాణిని. ఆ తరువాత నేను తన గురించి అలోచించిందీ లేదు, అడిగి తెలుసుకున్నదీ లేదు. నాకు వివాహమయిందని తెలిసి, వివరాలు కనుక్కుని, నేను హ్యూస్టన్ కి వచ్చాక ఫోన్ చేసింది, “నిన్ను, మీ ఆయన్ని కలవాలని ఉంది, నిన్ను చూడాలని ఉంది, వచ్చే వారం వస్తాను,” అంది కళ్యాణి.
అప్పటికి నేను అమెరికా వచ్చి నెల రోజులయ్యింది. కొత్త జీవితం, కొత్త సంసారం, సరికొత్త ప్రపంచం. చక్కని సింగిల్ బెడ్రూం అపార్ట్మెంట్ లో ఉన్నాము. నేను రాక మునుపే, ట్రైనింగ్ పూర్తి చేసి, కొత్త ఉద్యోగంలో చేరారు మా వారు. పనికి దగ్గరిలో ఖరీదైన అపార్ట్మెంట్, నాకు నచ్చుతాయో లేదో అనుకుని, కొద్ది వంటింటి సామాను, అవసరమైన ఫర్నిచర్ మాత్రం తీసుకొన్నారు.
అన్న ప్రకారం మరో వారానికి, ఫ్లోరిడా నుండి ఐదు వారాల పసిపిల్లవాడిని తీసుకొని వచ్చింది కళ్యాణి. నాలుగు రోజులు ఉండి, తమ ఊళ్ళో అయితే బాబుతో టైం ఉండడం లేదని, మా ఊళ్ళో చాలా షాపింగ్ చేసింది. వంటింటి సామాను ఎంతో కొన్నది. మధ్యలో శని, ఆది వారాలు రావడంతో రోజంతా, షాపింగ్ చేసి, బయట తినేవాళ్ళం. మిగతా రెండు రోజులు కూడా, సాయంత్రాలు అదే విధంగా షాపింగ్, సరదాగా ఊరు తిరగడం.
మా వారు వర్క్ కి వెళ్ళినప్పుడు, చిన్నప్పటి సంగతులు, చుట్టాల కబుర్లు చెప్పుకునే వాళ్ళం. కళ్యాణి బాబు చాలా మంచివాడు. పెద్దగా గొడవ చేసేవాడు కాదు. మాటల్లో ఓ రోజు, తను విన్న దానికి విరుద్ధంగా, మా వారు, మనిషి బాగున్నారనీ, అంతేకాక మంచి వాడిలా కూడా ఉన్నారనీ అన్నది. అది మెచ్చుకోవడమే అని భావించాను.
తన భర్తకి మాత్రం, పెళ్ళికి మునుపు ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉండేదని తనకి అనుమానమట. ఇలా ఎన్నో మాటలు, కోతలు, వింతలు, విశేషాలు చెప్పుకున్నాము. నేనే ఎక్కువగా మాట్లాడానేమో. హాయిగా సంతోషంగా గడిపాము ఆ నాలుగు రోజులు. మళ్ళీ వస్తాననీ, ఆ లోగా వీలుంటే మేము ఫ్లోరిడా రావాలని మరీ మరీ చెప్పి తిరిగి వెళ్ళింది కళ్యాణి. దేశం కాని దేశాన ఓ ఫ్రెండ్/కజిన్ దొరకడం ఆనందంగా అనిపించింది. అందునా నా చిన్ననాటి ప్రియ నేస్తం.
*** *** *** ***
ఇక్కడి నుంచి ఫ్లోరిడా తిరిగి వెళ్ళిన తరువాత, మూడు రోజులకే, తాను బాబుతో ఇండియా వెళ్ళుతున్నానని ఫోన్ చేసింది కళ్యాణి. బాబుతో ప్రయాణం కదా, హైదరాబాద్లో దిగి రాజమండ్రి వెళ్ళేంత మటుకు, అమ్మా వాళ్ళ దగ్గర ఉండేలా ఏర్పాటు చేసాను. అమ్మా వాళ్ళని కలిసి ఒకటిన్నర రోజులు వాళ్ళ దగ్గరే ఉందట. నా కొత్త కాపురం ఎలా ఉందంటూ మా ఇంటిల్లిపాది కళ్యాణి చుట్టూ చేరారట.
నేను అమెరికాలో అస్సలు బాగోలేనని, నా పరిస్థితి చాలా అన్యాయంగా ఉందనీ, ఇంటికి వచ్చిన తనకి కూడా సరైన ఆతిధ్యం ఇవ్వలేకపోయానని, ఇంట్లో కనీసపు సామాను కాని వస్తువులు కాని లేవని, దౌర్బగ్యపు స్థితిలోనే ఉన్నానని చెప్పిందట, కళ్యాణి మా అమ్మా వాళ్ళతో. మా వాళ్ళు బెంబేలెత్తిపోయి, చాల బాధ పడిపోయారు. నేను నిజంగానే సంతోషంగా ఉన్నాను, బాగున్నాను అని, అతి కష్టం మీద వాళ్లకి సర్ది చెప్ప గలిగాను. మరి కళ్యాణి అలా ఎందుకు చెప్పిందో ఏమీ అర్ధం కాలేదు. అయినా అంతటితో ఆ సంగతి వదిలేసాను.
*** *** *** ***
ఏడాదయ్యాక మూడు నెలల మా బాబుని తీసుకొని నేను హైదరాబాద్ వెళ్లాను. ఓ రోజు పొద్దునే నేను బాబుకి పాలు కలుపుతుంటే, వంట మనిషి మణమ్మ సానుభూతిగా, “ఏమ్మా, ఉమమ్మా మరి బాబుని తీసుకొని వచ్చేశావు కదా!, ఇక్కడే ఉండిపో తల్లీ, పాపం ఆ దేశం కాని దేశంలో డబ్బు లేక బాధపడుతున్నావట, ఇంట్లో గిన్నెలు సామాను కూడా లేదట కదా, ఎంత అన్యాయం, ఇక్కడ మహారాణిలా పెరిగిన నువ్వు, నిన్ను తలుచుకోని రోజు లేదనుకో తల్లీ,” అంటూ కంట తడి పెట్టుకుంది.
నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. ఆమెకి చెప్పినా అనుమాన పడుతూనే ఉంటుంది. లాభం లేదనిపించింది. అస్సలు కళ్యాణికి ఏమి పని ఇలా మాట్లాడ్డం. నేనేం చేసాను దాన్ని అని కాసేపు తిట్టుకొని, ఆ తరువాత పూర్తిగా ఆమె విషయం మర్చిపోయాను.
*** *** *** ***
కళ్యాణితో నా గతాన్ని నెమరువేసుకుంటే ఒకింత ఆశక్తిగానే ఉంది. ఇన్నాళ్ళ తరువాత, ఈ ఫోన్ చేయడం ఎందుకో అర్ధం అవ్వక కొంచెం ఆదుర్దాగానే ఉంది నాకు. ఇంతలో మ్యూజిక్ నేర్చుకునే పిల్లల రాకతో, నా ఆలోచనకి బ్రేక్ పడింది. అప్పుడే సాయంత్రం అయిందన్నమాట.
క్లాస్ ముగించుకొని లోనికి వస్తుండగా మా వారు కూడా ఆఫీస్ నుండి అప్పుడే వచ్చారు. భోజనం పెడుతూ, వింతైన విశేషం అంటూ, కళ్యాణి ఫోన్ గురించి, సంభాషణా సారాంశం చెప్పాను. ఆయన ఎప్పటిలా, తస్మాత్ జాగ్రత్త! అనే ధోరణిలో, “మనుషుల మనస్తత్వాలు అర్ధం అయ్యాకైనా కాస్త జాగ్రత్తగా మసులుకోవలసిన అవసరం ఉంది, లేదంటే మళ్లీ బాధపడాల్సి వస్తుంది,” అంటూ హెచ్చరించారు.
*** *** *** ***
అన్నమయ్య ఉత్సవాలు దగ్గర పడుతుండడంతో నా మ్యూజిక్ క్లాసులతో, తీరిక లేకుండా అయిపోయాను. ఐదు నెలల తరువాత కళ్యాణి మళ్ళీ ఫోన్ చేసేంత వరకు, ఆమె విషయం గుర్తే లేదు. వాళ్ళబ్బాయిని తీసొకొని ఓ వారం ఉండేలా వస్తున్నానంటూ, ఫ్లైట్ సమాచారమంతా ఇచ్చింది. కళ్యాణి ఇంకా అదే పద్ధతి, మాకు ఆ వారం వీలేనా అని కూడా అడగలేదు. ఏమయినా, తను రావాలని ఉత్సాహంగా ఉందని అర్ధమయి, స్నేహభావమే ఉంచుకున్నాను నా మనసులో.
అన్నమయ్య ఉత్సవాలు చక్కగా జరిగాయి. ఆ మరునాడే, వచ్చారు కల్యాణి, కొడుకు శ్రీకాంత్. 30 యేళ్ళ కొడుకు, అంగ వైకల్యం తో ఏర్పడిన, కొంత లెర్నింగ్ డిసెబిలటి (బౌతిక మానసిక వైకల్యం) వల్ల, ఎప్పుడూ తన వెన్నంటే ఉంటాడని చెప్పింది. ముప్పై ఏళ్ళ ఆ యువకుని మానసిక ఎదుగుదల పన్నెండేళ్ళ అబ్బాయిలా ఉంటుందట. శారీరకంగా బాగానే ఆరోగ్యంగా ఉన్నాడు. శ్రీకాంత్ ని చూశాక, నా మనసులో చాలా బాధ పడ్డాను. కళ్యాణి మీద ఎంతో జాలి కలిగింది. ఆ తల్లి మనసు కొడుకు విషయంలో ఎంత కుమిలి పోతుందో? కదా అని. అందుకే, ఎటువంటి కోపతాపాలు, అలకలు పెట్టుకోకుండా, ఆ వారం రోజులు కళ్యాణి వాళ్ళతో, కలసి పోయి బాగానే గడిపాము, నేను, మా వారు కూడా.
కళ్యాణి వెళ్ళిపోయాక, గతంలో మా మధ్య జరిగినది, కళ్యాణి నా గురించి అప్పట్లో మా అమ్మ వాళ్ళతో అన్న మాటలు, ఎప్పటికీ మరచిపోవాలని నిశ్చయించుకొన్నాను. ఫ్రెండ్లీగా ఆప్యాయంగానే ఉండాలని కూడా అనుకొన్నాను. అదే ఆలోచనలో, నేను కూడా కొన్నాళ్ళకి న్యూయార్క్ వెళ్ళాను.
కళ్యాణి ఇల్లు, వాకిలి, ఎంతో పొందిగ్గా, వీలుగా ఉన్నాయి. వాళ్ళబ్బాయిని చూసుకోడానికి రోజంతా ఓ మనిషి ఉండేలా, అన్నీ చక్కగా అమర్చుకుంది. రెండు రోజులకోసారి ఫోన్ చేసేది. ఎక్కువగా బాధపడుతుండేది, భయపడుతుండేది. వాళ్ళాయనతో 20 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నప్పటి నుండి, పిల్లవాడి భాద్యత కూడా తీసుకొని ఒంటరిగా బ్రతుకు పోరాటం సాగించానని ఎంతో మదన పడేది. విడాకుల విషయంలో కూడా, పోలిస్ కలగజేసుకోవలసిరావడం, కోర్ట్ చుట్టూ తెగ తిరగవలసి రావడమే కాక, తానే ఇల్లు, డబ్బు ఇవ్వ వలసి వచ్చిందని చెప్పి వాపోయేది. నేనూ సానుభూతితో వినేదాన్ని.
*** *** *** ***
అలా మరో ఆరు నెలలు గడిచింది. తన ఒంటరితనం పోవాలంటే, ఉద్యోగం చూసుకొని, మా ఊరికి, నాకు దగ్గరగా ఉండేలా వస్తానంది. జాలేసింది. ఆమెని ప్రోత్సహించాను. కళ్యాణి కోసం నా వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసాను. మా వారు కూడా వైద్య వృత్తిలో ఉండడంతో, కళ్యాణి ఉద్యోగ అవకాశాల గురించి వాకబు చేసి ఇన్ఫర్మేషన్ సేకరించి కళ్యాణికి అందించాము. అయితే, ఓ ప్రక్క రోజుకు పది సార్లు ఫోన్లో మాట్లాడుతున్నా, ఎంత ఉత్సాహ పరచినా కళ్యాణిలో వేగంగా, అసహనత పెరిగిపోవడం గమనించాను.
నేనసలు ఇక్కడ ఉండలేను అని గబుక్కున ఒకరోజు ఉద్యోగానికి రాజీనామా కూడా చేసింది. నాకు దగ్గరిగా తనకి ఓ మంచి ఏరియాలో అద్దెకి ఇల్లు చూడమంది. అన్ని వసతులు ఉన్న ఇంటికి అడ్వాన్స్ నేనే కట్టేసి, అగ్రీమెంట్ పంపాను. మా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి మంచి మెడికల్ గ్రూప్ నుండి ఇంటర్వ్యూకి పిలుపు, వెనువెంటనే హాస్పిటల్ ఇంటర్నిస్ట్ గా ఉద్యోగం కూడా వచ్చింది.
పరిపాటిగా అర్దరాత్రి ఫోన్ చేసేది కళ్యాణి. తన ఇక్కట్లు, తన కష్టాలు, చెబుతూ కుర్చోబెట్టడంతో, మా వారు తన పడక, నివాసం మేడమీదకి మార్చేసారు. ఆయన ఇబ్బంది నాకు బాధగానే ఉంది. నాతో మాట్లాడందే అడుగు తీసి అడుగు వేయను అన్నట్టుగా అయిపోయింది కల్యాణి. ఒక్కోసారి ఆశ్చర్య మేసేది. నాకో వ్యసనంగా మారింది ‘ఆపరేషన్ కళ్యాణి’ అంటూ నవ్వుతూనే చిరాకు పడేవారు మా వారు.
ఉద్యోగం ఖాయం అవడంతో, సొంత ఇల్లు కావాలంది కళ్యాణి. మళ్లీ ఇంటి వేట మొదలు పెట్టాను. ఓ నెల రోజులకి, వర్క్ కి దగ్గరగా ఉన్న హోం మాడల్స్ లిస్టు పంపగా, అందుండి ఓ విస్తారమైన, ఆధునిక చక్కని ఖరీదైన లోగిలినే కొనుగోలు చేసింది కళ్యాణి. తానింకా చక్కబెట్టవలసిన పనులతో, న్యూయార్క్ లో ఉన్నందున, నన్నే డిసైడ్ చేసేసి అడ్వాన్సు ఇవ్వమంది కల్యాణి. వేరే దారి లేక అలాగే చేసాను. లోన్ తీసుకోదలచుకోలేదు, ఇంటికి క్యాష్ పేమెంట్ చేస్తానంది. తన పాత వజ్రాల, బంగారు నగలు అమ్మి పెట్టమంటే, అలాగే చేసాను. ఒక్కటే రోజు ఊరు నుండి వచ్చి, ఇంటి రిజిస్త్రేషన్ ముగించుకొని తిరిగి వెళ్ళిపోయింది.
అంతలా నా జీవితం లోకి, నా మనస్సు లోకి చొచ్చుకుపోయింది కళ్యాణి. నా ఆలోచన, సాలోచన లెప్పుడూ కల్యాణి బాగు కోసం, కళ్యాణి మనుగడ కోసమే సాగాయి కొద్దికాలం. ఆమెకి అన్నీ సమకూరాలన్న తపనతో, నేనే, తన ఇంటికి అలారం సిస్టం, గార్డెన్, ఫోన్ కనెక్షన్స్, టివి కేబిల్, గట్టర్స్ లాంటివి కళ్యాణి రాకముందే రెడీ చేశాను. నా ద్వారా ఇల్లు కొనుగోలు చేయడం వల్ల, రిఫరెన్స్ ఫీజు 2000 డాలర్లు నా వాటాగా అందించారు రియాలిటీ వారు. ఆ డబ్బు కూడా కల్యాణికే ఇచ్చేసాను.
*** *** *** ***
మొత్తానికి మహా బేషుగ్గా కల్యాణి సెటిల్ అయ్యింది. ఎంతో గర్వంగా ఉంది. బేలగా, నిస్సహాయంగా, ఒంటరితనంతో బాధ పడుతున్న తోటి స్త్రీకి సహాయ పడగలిగినందుకు, తృప్తిగా ఉంది. ఉద్యోగం కూడా చాలా నచ్చింది కల్యాణికి. గృహప్రవేశం చెయ్యాలని ఆలోచించాము. మొదట్లో శ్రీకాంత్ నా దగ్గరే ఉండేవాడు. ఆ తరువాత, కొద్ది రోజులు వాడికి నచ్చేలా వంటకాలు చేసి కల్యాణికి వీలుగా ఉండేలా వాళ్ళ ఫ్రిడ్జ్ లో పెట్టేదాన్ని.
*** *** *** ***
పని వొత్తిడి వల్ల ఫోన్ చేసే తీరిక లేకుండా పోయిందని బాధ పడుతూ, ఇ-మెయిల్ పంపింది ఓ సారి, కల్యాణి. పర్వాలేదన్నాను. రెండేళ్లగా కల్యాణి విషయం ఓ యజ్ఞం లా చేసిన నాకూ కాస్త రిలీఫ్, విశ్రాంతి దొరికినట్టయింది. మా అబ్బాయి వాషింగ్టన్ లా స్కూల్లో చదువుతున్నాడు. అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటాడు. కొద్ది రోజులు వాడి దగ్గరికీ, ఇండియాకి కూడా వెళ్లాలని అనుకుంటున్నాను.
***
కళ్యాణి ఇంట, నేనమర్చిన సామాను, ముందస్తుగా ఇంటి విషయంలో నేను డిపాజిట్ పెట్టిన మొత్తం కలిపి, ఐదు వేల డాలర్ల కి పై చిలుకే ఉంది. ఉద్యోగంలో సెటిల్ అవ్వనీలే, అని వెంటనే తిరిగి ఇవ్వమని అడగలేదు.
*** *** *** ***
ఓ సాయంత్రం నా ఫ్రెండ్ ఇందిర ఫోన్ చేసింది. కల్యాణి ఇంట జరిగిన గృహప్రవేశంకి మేమెందుకు రాలేదని అడిగింది. ఇందిర భర్త కార్డియాలజిస్ట్, కళ్యాణి పని చేసే హాస్పిటల్లోనే పని చేస్తారు. కల్యాణి ఆహ్వానం పై వెళ్ళారట. గృహప్రవేశం కి ఇరవై ఇండియన్ ఫామిలీస్ వచ్చారట. బాగా జరిగిందని చెప్పింది.
***
ఆ తరువాతి వారం, ఓ రోజు పొద్దున్న పది గంటలప్పుడు ఫోన్ చేసింది, కల్యాణి. ఎలా ఉన్నావని అడుగుతూ, “నాకు మాట్లాడ బుద్ధికావడం లేదు,” అంది. నా కాళ్ళ కింద భూమి జారినట్టయింది. “వొంట్లో బాగోలేదా,” అడిగాను. “ ఫోన్ ఎత్తి మాట్లాడాలని కూడా అనిపించడం లేదు,” అంది. బుద్ధి తెలియని పసిపిల్లలా ఆ మాటలు ఆమె నోట… విస్మయం చెందాను. ఏమనగలను? “అంత అలసటగా, విసుగ్గా ఉంటే, అలాగే, ఏముంది? మాట్లాడకు,” అన్నాను. “అయితే నీ అడ్రెస్ ఇస్తే, నీకు పంపవలసిన చెక్ పోస్ట్ లో వేస్తాను,” అంది.
*** *** *** ***
కాల చక్రం ఆగదుగా! మరో మూడు నెలలు గడిచాయి. మ్యూజిక్ క్లాసు ముగించుకుని లోనికి వచ్చి లంచ్ పెట్టుకొని కూర్చున్నాను. అప్పటికే భోంచేసి, పేపర్ చదువుతున్న మా వారు ఉన్నట్టుండి, సోఫా నుండి బయటకి పడినంత పని చేసారు. ఆ తరువాత అయన చెప్పిన విషయం విని కుర్చీ నుండి, కింద పడటం నా వంతయింది. షాకింగ్ న్యూస్, అని చదివారు మా వారు, “న్యూయార్క్ పోలిస్, F.B.I శాఖ కలిసి పన్నెండు మంది భారతీయ వైద్యులని, మెడికేర్ ఫ్రాడ్ గావించిన వారిగా గుర్తించి, మోసపూరితంగా ప్రభుత్వాన్ని కొన్ని మిలియన్స్ కి నష్ట పరచినందుకు, దగా చేసినందుకు, త్వరలో అరెస్ట్ చేసి కట్టడి లోకి తీసుకుంటారు” అని హెడ్ లైన్స్ న్యూస్. ఆ పన్నెండు మంది వైద్యుల్లో మూడవ పేరు, డాక్టర్. కల్యాణి కులశేఖర.”
*** *** *** ***
అవాక్కయ్యాను. ఆ న్యూస్ లోని ఒక డాక్టర్, మా కల్యాణియే.
ఊహంచని సంఘటనలతో నిండినదే జీవితమా? అంటే ఔననే అంటాను. ఓ సగటు మనిషి నిత్య జీవన శ్రవంతిలో, అనుకోని వ్యక్తుల ఆగమానాలు, ఉహించని కొందరి నిష్క్రమణలు, నేర్చుకొనే గుణపాఠాలు, ఎదుర్కునే అనుభవాలు, నిరాశలు, ఇవన్నీ ప్రతినిత్యం చోటు చేసుకొనేవే. అయినా ఈ సంఘటనలు, వాటి పర్యవసానాలు, జీవితాన్ని తప్పక ప్రభావితం చేస్తాయి. ఒక్కోసారి మాయని చెరగని ముద్ర వేస్తాయి కూడా.
పరిచయాలు, స్నేహాలు, చుట్టిరికాలు కూడా, సప్త సముద్రాల్ని దాటి దూర తీరాల చేరగానే, స్వరూపాన్ని మార్చి కొంగ్రొత్త రూపాన్ని ఆపాదించుకుంటాయి. పురోగతి, ప్రగతి మనలోని ఆంతరంగిక సహజ నైజం, గుణగణాల్ని అనుసరిస్తాయే గాని, అధిగమించవు.
‘ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్, ఇజ్ ఎ ఫ్రెండ్ ఇండీడ్’ అనే నానుడి నాకిష్టం, ఫాలో అవ్వాలని ప్రయత్నిస్తాను. ఆ విధానం లో కొన్ని పాఠాలు నేర్చుకోవడం, మరికొన్ని అనుభవాలు పొందడం తప్పదుగా.
కళ్యాణి తో ఈ రెండేళ్ళ స్నేహం, అనుభవం, మరోజన్మకి క్కూడా సరిపడా పాఠo నేర్పింది, నాకు.*
– కోసూరి ఉమాభారతి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
6 Responses to ‘ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్…’