మధుర భావాలు వికసించి మానవతా గంధాలు విరజిమ్మే మల్లెమొగ్గలు’’

“మల్లెమొగ్గలు’’ ఆహా ! ఎంత ఆహ్లాదకరంగా ఉందీ శీర్షిక!పుస్తకం చేతిలోనికి తీసుకోగానే మల్లె సుగంధాలేవో మనసును తాకిన అనుభూతి. గోపాలరావు గారి కవితల్లోకి తొంగి చూడగానే ప్రణయ కవిత్వంలో పరిమళించి, మనిషి జీవితంలోని అన్ని దశలూ ఆ కవితల్లో అనుభవించి నట్లైంది. కవితల కూర్పు జీవితంలో ప్రతిదశలో మదిలో పల్లవించే భావాలకు దర్పణం పట్టింది. మనిషి 20 ఏళ్ళ జీవితం నుండీ 60 ఏళ్ళ జీవితానుభవాలు కళ్ళకు కట్టినట్లయింది. ఆయన ప్రేమ కవితల్లో విహరించిన ఏ వ్యక్తికైనా మనసు గతంలోకి పరుగులు తీసి మధుర భావాలు వికసించి ప్రణయ రాగాలు పలికిస్తాయనడంలో సందేహం లేదు. గోపాలరావు గారు ప్రేమైక జీవి. ప్రేమను శ్వాసించే, ప్రేమ పిపాసి.

                 సృష్టిలోని ప్రేమనంతా తనే అనుభవించేయాలనే తపన కనబడుతోంది ఆయన కవితల్లో. అది అత్యాశేమో ! ‘నీడ’ కవిత ప్రేయసీ ప్రియుల మమేకాన్ని  సూచిస్తుంది. మీలో ఉండిపోనీండి కవితలో నెచ్చెలి దూరమై స్వర్గపుటంచులు దాటిన మరుక్షణం మరణిస్తాను తక్షణం ఎంతటి ప్రేమైక భావనది ! పవిత్రమైన ప్రణయంలో కన్పించే సహజ భావనది. ‘‘స్నేహితులుగా ఉండాలా!’’ అనే కవితలో స్వర్గశిఖరాల నధిరోహించుదాం ! జీవన సాఫల్యతకిదే (ప్రేమే) మార్గమని జగతికి చాటుదాం అంటాడు కవి. నిజమే ఒక పరిపూర్ణ జీవితం సాఫల్యం చెందాలంటే వారి నడుమ ఉండాల్సింది ప్రేమబంధమే ! ‘‘కిటికి’’ కవితలో అద్భుత దృశ్యాలకు నెలవు ఆ కిటికీ / నా భావావేశానికి ప్రేరణ ఆ కిటికీ ఏనాటికీ ! నిజమే కదా! చూసే చూపుకి శక్తే ఉంటే అతీతభావాలు, అందమైన దృశ్యాలే గోచరిస్తాయి మనసుకి. ఓచోట కవితలో వెన్నెలా నీవెళ్ళిపోకు నీ విరహాన్ని భరించలేనని వాపోతాడు కవి. ‘కమనీయం కార్తీకం’ కవితలో కార్తీకంలో ఈసునసూయలు పారద్రోలి మన హృదయాలలో శాంతిపూలు పూయించాలని ఆకాంక్షిస్తాడు. ‘‘నిగూఢమైన శక్తిని నిగ్గుతేల్చు’’ కవితలో నిద్రలేని రాత్రులను వృధాపర్చవద్దని సందేశమిస్తూ ఓ పుస్తకం చదవమంటాడు. పొడికళ్ళతో చీకటిని పొడుస్తుంటావు / పీడకలనైనా భరిస్తావు / మదిలో అల్లుకొన్న చీకటికన్న రాత్రి భయంకరం కానిదంటాడు. అమావాస్య నిశిలో నక్షత్రాలు దారి చూపుతాయంటాడు. అవకాశాన్ని అందంగా మార్చుకొనే అంతరంగునికి రాత్రేమిటి? పగలేమిటి ? తెల్లకాగితాన్ని అక్షర దీపాలతో అలంకరించి/నిగ్గుతేల్చు నిగూఢమైయున్న శక్తిని అంటూ సున్నితంగా సూచన చేస్తాడు.

                  ‘‘ఈ జీవితమే ఉండదు’’ అనే కవితలో ఆ మేఘాలు అలాగే ఉంటాయి. ఆకాశం అలానే ఉంటుంది విశ్వాంభర చత్రానికి వజ్రాలద్దినట్లు/తారలుమెరుస్తూ తళుకులీనుతూ వుంటాయి అంటాడు. ఎంత చక్కటి ఊహ ! ఎన్ని జన్మలెత్తినా కళారాధకుని గానే పుట్టాలని ఆకాంక్షిస్తాడు.

            ‘సూర్యదర్శనం’ కవితలో కానుపు కష్టమై రక్తస్రావమైనట్లు ఆకాశం పురుటి నొప్పులు పడుతోందని కష్టమైన కాన్పుకి కాలమనే వైద్యుడు మేఘాల గర్భానికి శస్త్రచికిత్స చేశాడంటాడు. కవిలోని ఊహాశక్తికి, భావపటిమకు అద్దం పడుతోందీ కవిత. ‘‘చెలీ ఒక్కసారి నీ ప్రేమలో’’ కవిత ప్రేయసీ, ప్రియుల నడుమ సున్నిత శృంగార భావాలకు ప్రతీకగా ఉంది. ‘‘మనసున, మనసై’’ అన్న కవితలో కవి అనుకొన్నది జరగదు / అనుకోనిదెందుకు జరుగుతుందని నిలదీస్తాడు. ఇది కవిలోని నిస్పృహ భావాలను సూచిస్తోంది.

                  ఈ కవితలో కవిలో కాస్త అసంతృప్తి భావాలు కన్పిస్తున్నాయి. ‘‘శిల్పమనోహరి’’ కవితలో కవి శిల్ప సౌందర్యానికి ముగ్దుడై ఆ శిల్పం సజీవంగా ఎప్పుడైనా మారితే ఆమెకు ప్రియుడుగా పుడతానంటాడు. ఈ భావన చాలా మధురంగా అన్పించింది. ‘‘నేనో పిచ్చివాణ్ణి’’ కవితలో ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఏమీ చేయలేని నిస్సహాయతతో పిచ్చివాణ్ణి అని వ్రాసుకొన్నాడు కవి. ఈ కవిత ముగింపు కాస్త ఆశాజనకంగా, సందేశాత్మకంగా ఉంటే బావుణ్ణు అన్పిస్తోంది.

కవి ఎపుడూ ఆశావాదిగానే ఉండాలి. ‘‘పక్షులే లేకుంటే!’’ కవితలో వాతావరణ కాలుష్యంతో పక్షుల కిలకిలారావాలు దూరమైతే వాటి అలికిడి వినకుంటే తనలో చైతన్యం మరణిస్తుందనే సున్నిత స్వభావికవి. ‘‘బతికిన మానవత కవిత’’ ఈ పుస్తకానికే మకుటాయమానం (హైలైట్‌). అందులో కాదు నాకు కావాల్సింది వాడి కళ్ళలో కృతజ్ఞత బ్రతకాలి నాలో అంతిమశ్వాసతో ఉన్న మానవత అని మనుషుల్లో అడుగంటుతున్న మానవతను తట్టి లేపాడు.

     ‘‘దేవుడికి దండన’’ కవితలో దేవుడికి మురికివాడల్లో, కన్నాల గుడిసెల్లో, రొచ్చు కంపుల్లో భయంకర రోగాల్లో, ఆకలి అనే శిక్ష వేస్తానంటాడు. అప్పుడైనా పేదవాళ్ళ బ్రతుకు బాగుపడాలని ఆశిస్తాడు. ‘‘మృత్యు దేవతకు విన్నపం’’ కవితలో మృత్యుదేవతా నాకు దగ్గరగా రాకు. ఈ ప్రకృతిలోని అందాలన్నీ ఆస్వాదించనీ, ప్రపంచంలో ప్రేమనంతా పొందగలిగితే, నీ సన్నిధి చేరడానికిపుడే సంసిదుణ్ణి ! అంటాడు.

       ఈ కవిత కవిలో తీరని కళాతృష్ణకు పరాకాష్ట. ‘‘ఆహ్వానంలో ఆహ్లాదం’’ ‘‘కొందరు’’ మనిషిలో దూరమౌతోన్న మానవ సంబంధాలు, లోపించిన ఆత్మీయతలు ఎత్తి చూపుతున్నాయి. ‘‘హార్ట్‌ స్ట్రోక్‌’’, ‘‘ఖైదీ’’ కవితలు బాధ్యతల్లో మనిషి బందీ అంటూ ఈతి బాధలు వివరిస్తాడు. ‘‘నాన్న జ్ఞాపకాలు’’, ‘‘తల్లిదండ్రులూ మీ గమ్యం ఎటు’’, ‘‘కొడుకు’’, ‘‘అమ్మ ఉంటే చాలు’’, ‘‘అవసరం తీరేదాకా’’ కవితల్లో ఒకనాటి బంధాలు, ఈనాటి ప్రేమరాహిత్యాల నడుమ తమబిడ్డల నిరాదరణలో నలిగిపోతున్న తల్లితండ్రుల గురించి చక్కగా వివరించాడు కవి.  

‘‘          అమ్మ’’ … ‘‘అమ్మలోని కమ్మదనం’’ ‘‘అమ్మ జ్ఞాపకాలు’’ కవితల్లో అమ్మ ప్రేమ సాటిలేనిదని వివరించాడు కవి. ‘‘హృదయానికి వందనంలో’’ హృదయం గొప్పతనాన్ని చాటి చెప్పాడు. ‘‘కలం బలం’’ కవితలో కవి, రాయకోయి కవీ ! వృధాగా అర్ధం కాని కవిత్వం అంటూ అర్ధం కాకుండా వ్రాసే కవులకు చురకలు వేసాడు. గోపాలరావు గారి కవితల్లో తాను చెప్పదలచిన విషయాన్ని సూటిగా, సరళమైన భాషలో వ్రాయడం అతని గొప్పదనం నిజానికి ఎదుటివాడికి అర్ధంకాని కవిత్వంలో ప్రయోజనం ఏముంటుంది ?

                    గోపాలరావు గారు ప్రతి చిన్న విషయానికీ స్పందించి అక్షరరూపం ఇవ్వగల సమర్ధుడు. ఆయన స్పృశించని అంశం, సమస్య అంటూ ఏం లేదనే చెప్పాలి. చేనేత కార్మికుల వ్యధలను కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు. ఆత్మహత్యలు వద్దని ప్రబోధించాడు. స్వతహాగా గోపాలరావు బంధాలు, బాధ్యతలు, మానవత్వం, ప్రేమ, స్నేహాలకు పెద్దపీటవేసే ఆదర్శవాది. ‘‘మానవత్వమా నీవెక్కడ !’’ అనే కవితలో ఎక్వేరియంలో చేపల్ని బందీల్ని చేయడం, పక్షుల్ని పంజరాల్లో బంధించడం మానవత్వం కాదంటాడు. ఒక్క చేప చనిపోయినా చివుక్కుమనాలి మనస్సంటాడు కవి. అంతటి సున్నిత స్వభావికవి. ‘శవం’ కవితలో శవాన్ని చూచి భయపడే మనిషికి మృత్యువు తప్పదని హెచ్చరిస్తాడు.
                    

                      ‘కడపటి కోరిక’ గోపాలరావు గారి వ్యక్తిత్వానికి, సమాజంలో తాను ఆశించే సంస్కరణలకు అర్ధం పడ్తోంది. తాను సౌందర్యారాధకుణ్ణని, పరిశుభ్రత, తన స్వభావమని తాను పోతే అందంగా దు:ఖించాలని, క్రొత్త వస్త్రాలతో కొల్చాలని మంచి కర్ణాటక సంగీతాన్ని వినిపించాలని, పుస్తకాలను గ్రంధాలయాలకిమ్మని, స్నేహితులు, కవులకు కబురంపాలని వారందరి మదిలో తాను నిలచిపోవాలని ప్రాధేయపడ్తాడు. మనస్సును ఆర్ద్రం చేసిందీ కవిత. తన ఆత్మీయ మిత్రుని మరణాన్ని గుర్తు చేసుకొంటూ, తాను చేసిన పుణ్యమేదైనా ఉంటే. ఒక్కక్షణమైన కలుస్తాను స్వర్గంలో, నిన్ను మరచిపోవడం అంటే నేను మరణించడమేనంటాడు. ఇది ఆయనలో నిర్మల స్నేహానికి మచ్చుతునక.

          ఒక మల్లి ఎంత మహోన్నతమైనది ! ప్రతి మనిషీ ఓ మల్లెపూవైతే … అని ఆకాంక్షిస్తాడు. దేహం దగ్ధమైనా, మట్టిలో కలిసినా, మానవత నిలచిపోవాలంటాడు.

            ఈ పుస్తకం 80 చక్కని మల్లెలతో అల్లిన పూలమాల. తప్పక అందరూ చదవాల్సిన అందమైన పుస్తకం. ఈ పుస్తకం వెల రూ .100/`

ప్రతులకు : కళాగౌతమి, 7`29`7, టి.నగర్‌, రాజమండ్రి, మల్లెమొగ్గల సీతామాలక్ష్మి, సహాని అపార్ట్‌మెంట్స్‌, ప్లాట్‌ నెం.5, డోర్‌ నెం.27`17`7/4, శ్రీరాంనగర్‌, రాజమండ్రి. రచయిత మల్లెమొగ్గల గోపాలరావు, సెల్‌ : 98857 43834. `

– కె.రాజకుమారి

సెల్‌ : 92466 55040

ది. 8`7`2012న ‘‘మల్లెమొగ్గలు’’ పుస్తకావిష్కరణ సందర్భంగా…

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక సమీక్షలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో