58 – 60 ఏళ్లు దాటిన తరువాత ఉద్యోగస్తులుగా వున్న వాళ్ళకు మొదట వచ్చేది రిటైర్మెంట్!. ఉద్యోగ విరమణ తో కావలసినంత తీరిక అనుకోవడం కన్నా రోజంతా ఏమిచెయ్యాలి అన్నది సమస్య!! దీనితో పాటు ఇంట్లోవాళ్ళతో వచ్చేవి అనేక సమస్యలు. .. ఇప్పుడేమి పని పాటా లేదుగా .ఇదీ చెయ్యండి , అది చెయ్యండి “ అని చెప్పడం మనసుకు ఘాటుగా తగులుతుంది.అదే విషయాన్ని “ కాస్త ఈ పని చేసి పెట్టగలరా “ అని అడిగితే సంతోషం గా చేస్తారు .ఏదైనా చెప్పే విధానం లో వుంటుంది .అరవై ఏళ్ళకి వృధాప్యపు ఛాయలు తక్కువగా వుంటాయి కనుక పనులు చేయడానికి ఓపిక వుంటుంది. చేయగలరు కూడా…
ఇక 65 ఏళ్లు దాటాక మెల్లిగా ఆరోగ్య సమస్యలు తమ తీవ్రతను తెలుపుతాయి BP, SUGAR లాటివి మేమున్నాం అంటూ ముందుకు వస్తాయి రెగ్యులర్గా మాత్రల వాడకం తప్పదు. అవి వేసుకుంటున్నారా లేదా , అసలు మెడిసిన్స్ వున్నాయా లేదా అని చూసుకోవాల్సిన వాళ్ళు ఇంటివాళ్ళే .వాళ్ళు ఏమాత్రం పట్టి౦చుకోలేదు అనిపించితే మానసికంగా depression కు లోనవుతారు .అదివస్తే ఆరోగ్య సమస్యలు ఇంకో కోణం లో మొదలవుతాయి. ఆర్ధికంగా బాగున్నా ప్రేమ ఆప్యాయతలను కావాలనుకుంటారు.
ఇంకా ముసలితనం లో ఎదురయ్యేది వినికిడి సమస్య. ఆర్ధికంగా బాగున్నవారు చెవి మిషను పెట్టుకోవచ్చు ఇంట్లోవాళ్ళకు కూడా అది కొనే పరిస్థితి లేనప్పుడు చెవులు వినపడకపోవడం ఒక వరంగా భావించి ఆద్యాత్మికత కు దగ్గరకావచ్చు.
మరో సమస్య కళ్ళు సరిగ్గా కనపడక పోవటం….అయినవారు మనసున్న వారైతే eye chekup , gycoma రాకుండా eye drops లాటి వాటికి కొరత వుండదు .కళ్ళు కనపడక, చెవులు వినపడక పోయినప్పుడు ముసలి వాళ్లకి విపరీతమైనdepression కి గురి అవుతారు. వీటిని ఎదుర్కునే స్థైర్యం కావాలంటే ఆత్మీయులు సహకరించాలి
కొంతమంది ముసలి వాళ్ళకు నోటి చాపల్యం ఎక్కువగా వుంటుంది. అది వాళ్ళు వేసుకునే మందులవల్ల కూడా కావచ్చును లేదా పూర్వపు అలవాట్ల వల్ల కూడా కావచ్చును . ఏదైనా చిరుతిళ్ళు తినాలనో లేదా టై ము ప్రకారము కాఫి , టీ లు తాగాలనో కోరికలు వుండవచ్చును.
“ఇంత వయసు వచ్చినా తిండి చాపల్యం తగ్గలేదు . చిన్న పిల్లల లాగా అన్నీ కావాలి “ అని విసుక్కోకూడదు . ఈవయసులో వాళ్ళు చిన్న పిల్లలే అని అనుకుంటే ఎంతో బాగుంటుంది .
‘చాదస్తం ‘ అన్న మాట చాలా అంటాము పెద్దలు ఏమీ చెప్పినా . వాళ్ళ జీవిత కాలంలో ఎంతో చేసి వుంటారు ఉదాహరణకి ఇంటికి వచ్చిన వారిని పలకరించి కాఫీలు ఇవ్వటం లేదా అతిధులు వచ్చిన టై ము ను బట్టి పలహారాలో , భోజనం పెట్టడం జరిగేది . అదే అలవాటు తో ఇంటికి ఎవరూ వచ్చినా “ భోం చేస్తారా” అని పెద్దవాళ్ళు అడిగితే చాదస్తం అని విసుక్కోకూడదు. ప్రస్తుత పరిస్తితిలో ఎవరికీ తీరికలు వుండవు అథిదులను ఆహ్వానించి ఆదరించేది తక్కువ ఇక్కడ పెద్దవాళ్ళను విసుక్కుంటే ,తమ మాటకు విలువ లేదనీ ఆందోళన చెందవచ్చు ఆర్థికంగా ఏ రాబడి లేనివాళ్ళు మరింత ఫీలవుతారు .
కొంతమంది కొడుకులదే తమ భాద్యత అనుకుంటారు .కానీ కోడలు కూడా సహకరించాలి కదా . సహకరించేవాళ్ళు వుంటే సరి , సహకరి౦చని పక్షంలో లేదా కన్న కొడుకే తన తల్లి దండ్రులు భారం అనుకునే పక్షం లో ఆ తల్లి దండ్రులకు నరక యాతనే . మరోవిషయం మరవకూడదు ముసలివాళ్ళు కూడా ఎంతో సహకరించాలి మారిన తరాన్ని బట్టి . ఉదాహరణకు “ ఆ మూడు రోజులు కోడలు వంటింట్లోకి రాకూడదు ‘ అనుకుంటే అత్త అన్నీ చేయగలిగే పరిస్థితి వుండాలి లేదా పరవాలేదు అని అడ్జస్టు అవ్వాలి. అప్పుడే అందరు కలిసి జీవి౦చ గలుగుతారు.
ఆర్థికంగా మెరుగ్గా వున్నవారు స్వతంత్రంగా వృదాశ్రామాలలో చేరవచ్చు అక్కడ అన్నీ సౌకర్యాలు వుంటాయి . కానీ కన్న వారికి దూరంగా వుండటానికి ఎంతమంది తల్లి దండ్రులు ముందుకు వస్తారు?
ఇతర దేశాల్లో లాగ ముసలితనం కొసం ప్రిపేరు కావడమనేది మనకు ఇంకా రాలేదు . మన జీవితాలు బాగుండాలంటే ఆర్ధిక స్వాతంత్రం కావాలి . అందుకని డబ్బు దాచుకోవాలి అది జరగని పక్షం లో చాలా విషయాలకు ఇంట్లో వాళ్ళతో సర్దుకు పోవాలి. పిల్లలూ కూడా పెద్దలకు ఒక మర్యాదపూర్వక మైన స్థానం ఇవ్వాలి .
మలి సంధ్యలో ఎవరైనా కోరుకునేది ఆప్యాయత , ఆదరణ ఇవిరెండు పుష్కలంగా దొరికితే వృధ్యాప్యం ఒక సమస్యే కాదు . పెద్దవారు భారం కాదు మన క్షేమం కోరి ఆశీర్వదించే వాళ్ళు అని గుర్తించాలి ఆపైన ఆ దేవుడి పిలుపుకై జీవన్ముక్తికి ప్రార్థన లు తప్పవనుకోండి* .
– లక్ష్మీ రాఘవ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
రచయిత్రి పరిచయం:
చదువు- Msc. Phd.
ఉద్యోగం -జంతుశాస్త్ర విభాగం లో లెక్చరర్ గా 30 ఏళ్ళువనితా మహా విద్యాలయ ‘ హైదరాబాదు లో .
పిల్లలూ ముగ్గురూ అమెరికా వెళ్ళిపోయాక…స్వంత మూలాలను వెతుక్కుంటూ, మావూరు చేరటం ఒక గొప్ప అనుభవం! చల్లటి చక్కటి వాతావరణానికి పేరు పొందిన మదనపల్లెకు దగ్గరిలోని ‘కురబలకోట “లో వందేళ్ళు పైబడ్డ కోటలాటి ఇంటిలో ప్రశాంత పదవీవిరమణ జీవితం ..
కళ ల పైన విపరీతమైన మోజుతో ప్రయత్నించని కళ లేదు..ముఖ్యంగా కళ కేదీ కాదు అనర్హం అని వ్యర్థ వస్తువులతో చేసిన ఎన్నో కళా రూపాల తో నేను పెట్టిన exhibitions చాల తృప్తి నిచ్చాయి.
మరో వ్యాపకం రచనలు . కథలకు ప్రత్యేక గుర్తింపు వచ్చి ప్రచరింపబడుతువుంటే ఎంతో తృప్తి. !!
మనసులో భావాలను స్వేచ్చగా చెప్పుకునేందుకు ఒక బ్లాగు –‘బామ్మగారిమాట’గా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

3 Responses to మలి సంధ్యలో…