నువ్వడిగిన నా (నీ) నవల

               ఆమె ముఖచిత్రం పుస్తకంపై రెపరెపలాడుతోంది. నా మనసు కూడా అలాగే రెపరెపలాడుతోంది. డైలమా! వెళ్ళనా? వద్దా? చూడాలని మనసు పీకుతోంది. ఆమెను చూసి చాలా కాలం అయింది. ఒక సంవత్సరం…పూర్తిగా ఒక సంవత్సరం. చిరుగాలి లాంటి ఆమె నవ్వు, సూటిగా గుచ్చుకునే ఆమె చూపు. వంకీల ఆ జుట్టు, ఆమె కేరీ చేసే ఆ పాయిస్….ఓహ్! పూర్తిగా ఆమె మాయలో  పడి మూడేళ్ళు!
కవిత్వమంటే ఆమె…..ఆమెలో ప్రవహించే రక్తమే కవిత్వపు రసజ్ఞత సంతరించుకుందేమో!

మనసు,శరీరం అంటూ మొదలై మనిషి జీవితపు ఉత్తుంగ స్థితికి పాఠకులను తీసుకువెళ్ళే ఆమె కవిత్వపు స్థాయిని అంచనా వేయడం కష్టమయ్యేది నాకు మొదట్లో. ఆమె నవ్వేసి ఊరుకునేది నా ప్రశ్నలు విని. మరీ ఫూలిష్ గా అడుగుతున్నానా అనుకునే వాడిని. కొన్నాళ్ళకు,,,కాస్త చనువు పెరిగాక, చెప్పొచ్చుగా…నాకు ఇంకా క్లారిటీ కావాలి అని అడిగేవాడిని.
“రాయడం వరకే నా పని. నువ్వెలా అర్థం చేసుకుంటావో…అది నీ ఇష్టం. నేను వివరణ మాత్రం ఇవ్వను.” అనేది. నాకు తిక్క

రేగినా, ఒక్కోసారి డిక్షనరీని ముందేసుకుని, ఒక్కోసారి ఆమె రాసిన వాక్యాల్ని ముడిపై ముడేసుకుని మనసులో పీక్కునేవాడ్ని. చాలా రీసెర్చ్ తర్వాత చాలా ఉత్సాహంగా ఆమె దగ్గరకు వెళ్ళి నా రీసెర్చ్ ఫలితాన్ని ఏకరువు పెట్టేవాడిని. సూదంటు ఆ చూపులు నా మనసులో పాతేసి, నా మాటలు పూర్తిగాకముందే నేను చెప్పాలనుకున్నది చదివేసి, ఒక నవ్వు విసిరి, “హ్మ్….మంచి ఎనాలిసిస్…..ఇంకోలా కూడా ఏమైనా ఆలోచించగలవా?” అనేది. మళ్ళీ నా పరిశోధన మొదలని వేరే చెప్పాలా?
ఒక్కోసారి ఆమెను చూస్తే జలపాతం గుర్తొచ్చేది. ఒక్కోసారి చాలా నెమ్మదిగా పారే నది తానయ్యేది. రెక్కలు కట్టుకుని ఎగిరిపోయే ఆమె ఆలోచనలను అందుకోవడానికి నేను ఆమె వెంట పరుగులు పెట్టేవాడిని. ఒక్కోసారి నా చిన్ని మెదడులోనే ఒదిగిపోయి ఎక్కడికీ వెళ్ళనని మారాం చేసే చిన్నపిల్లయ్యేదామె! మొత్తానికి ఆమె ఒక పాదరసపు పదార్థం……మొత్తానికామె వైచిత్రికి మారుపేరు!
ఇప్పుడు ఆమె పుస్తకావిష్కరణ నేను ఉంటున్న ఈ నగరంలో! ఇన్నాళ్ళకి ఆమె కవిత్వం కాకుండా నవల రాసింది. నేను ఎన్నాళ్ళు పోరినా…హే! నా వల్ల కాని పనులు చెయ్యమనకు అని కసిరిన ఆమేనా ఈమె? ఇష్టం లేని పనులు ఆమెతో చెయ్యించడం అంటే అసాధ్యమే! ఇప్పుడా కష్టసాధ్యమైన పని సాధించిందెవరబ్బా??? వెళ్ళనా? వద్దా? ఇంత ఆలోచన అవసరమా?
“నీకసలు కలాపోసన లేదు…..ఏం చదువుతున్నావసలు? నీ వయసేంటి? నువ్వు చదివేదేమిటి? కవిత్వమేంటిరా బాబూ….” సినిమా పత్రికలు….వేరే రకమైన పత్రికలు ముందేసుకుని నన్నేడిపించేవారు ఫ్రెండ్స్. అందులో ఉన్న మత్తు నాకు మాత్రమే తెలుసు. వారితో వాదించేవాడిని కాదు. ఆమె నేర్పిన నవ్వే వారికి నేనిచ్చే సమాధానం.

“నువ్వు కూడా రాయొచ్చుగా! ఇంత బాగా నా కవితల్ని అనలైజ్ చేస్తుంటావ్?” అనేదామె. “రాస్తాను. ఎప్పటికైనా…ఒక్కటైనా….” ఇది నా సమాధానం. ఈ డైలాగ్ రోజుకోసారైనా మా మధ్య నడిచేది. మా నవ్వుల మధ్య అది రోజూ నలిగేది! “కవిత్వం తప్ప ఇంకేమీ రాయలేవా? కథెందుకు రాయవు? ఒక నవలెందుకు రాయవు?” నా ప్రశ్న, వారానికొకరోజైనా….”రాయను…ఎప్పటికీ రాయను…ఒక్కటి కూడా రాయను….” ఆమె సమాధానం, నా జవాబును పేరడీ చేస్తూ….

ప్రపంచానికవతల ఉన్నట్లుంటావ్! కలల ప్రపంచమా? కల్లోల ప్రపంచమా? ఆమెను ఎన్నోసార్లు అడగాలనుకున్నాను. అడగలేకపోయాను. సముద్రాన్ని కూడా ఆలోచనలో పడేసే లోతు ఆమె హృదయానిది. ఎందరి మధ్యలో నిల్చున్నా….ఏదో ప్రత్యేకత…..ఆమె వ్యక్తిత్వంలో! అందుకేనేమో…ఆమెతో ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఎందుకు పడ్డానో…కారణాలు వెతుకుతున్నానా? పడ్డంలో అలా ఇలా కాదు! అబ్సెస్సివ్ అయ్యాను. తప్పక్కడే జరిగింది. సంవత్సరంగా ఆమెను చూసే భాగ్యమే లేకుండా చేసుకున్నాను.
ఇప్పుడు వెళ్ళనా? వద్దా? ఈ ఆలోచన మెదడును తొలిచేస్తోంది. ఆమెను చూసొచ్చేస్తే చాలు కదా! ఒక్కసారి. ఇన్నాళ్ళ అజ్ఞాతవాసం తర్వాత నాకామాత్రం హక్కు లేదా? ఆమె నన్ను చూడదుగా! చాటుగా…ఒక్కసారి. ఆడియన్స్ లో కూర్చుంటే చూస్తుందా ఏమైనానా? కానీ నేనొచ్చినట్లు తెలిస్తే మాత్రం నాకు ఇష్టం లేదు. చిన్న చిన్న విషయాల్ని భలే కాంప్లికేట్ చేసుకుంటాం కదా మన మానవులం?! ఆర్ యా పార్ అనుకోవడానికి బానే ఉంటుంది….ఈ బాధ అనుభవించినవాడికే అర్థమౌతుంది.
నేను నీతో ప్రేమలో పడ్డాను అని చెప్పాల్సిన అవసరం మాత్రం రాలేదు నాకు. ఆమెకూ అర్థమయ్యింది….నాకెప్పుడో ఆ నిషా తలకెక్కింది. అది పూలజల్లైతే బానే ఉండేది. ఇద్దరం మౌనంగానే ఉండిపోయాం. కారణం లేదు. రోజులు గడుస్తున్నాయి….. నెలలు గడిచిపోయాయి. రోజూ కలుస్తున్నా….మాటలు కరువవ్వడం మొదలైంది. చిన్న చిన్న విషయాలకే చిరాకు మొదలైంది. ప్రేమంటే తేనెలా తియ్యదనాన్ని రుచి చూపాలి కదా! ఇదేమిటి ఇలా? ప్రాప్తం…అంతే! రోజంతా ఆమె ఆలోచనల్లో నిండుగా తడిసే నేను, రాత్రయేసరికి అగ్నిపర్వతాన్ని నాలో నిర్మించేవాడిని. బయటపడని ఆ అగ్నిపర్వతం లోలో లావాని పొంగులెత్తిస్తూనే ఉంది. నేను మౌనినైపోయాను….ఆమె శిలైపోయింది…..
నాకు నేను విధించుకున్న ఎడబాటిది. ఆమె ప్రమేయం లేదు. ఫూలిష్ గానే ప్రవర్తించానో, నిజంగానే మేధావినయ్యానో! నాకైతే తెలీదు. కానీ చేసిన వెధవ పని మాత్రం ఇదే! ఇప్పుడు తగుదునమ్మా అని ఆమె ముందుకు వెళ్ళడం అవసరమా? అంతరాత్మ నిర్భీతిగా నవ్వుతోంది. నిజమే! నాతో నేనే అబద్ధం ఆడుతున్నాను. చచ్చిపోతున్నాను ఆ ముఖచిత్రం ఆ మేగజైన్ మీద చూసినప్పటినుండి. ఇన్నాళ్ళూ ఎలా బ్రతికానో మరి!
ఎవరెవరో పొగుడుతున్నారు ఆమె కవిత్వాన్ని. నేను చెప్పినట్లు ఎవరైనా చెప్పగలరా ఏమిటి? వీళ్ళు ఒకసారి చదివుంటారు. నాకు ఆమె చేతిలోంచి ఊడిపడ్డ ప్రతి కవితా కరతలామలకం. ఆమె ప్రస్థానాన్ని వివరిస్తున్నారు ఇంకెవరో! మొదటి కవిత పేరు చెప్పారు. మొదట అచ్చయిన కవిత….. ఆమె అనుభూతి….ఆ కవిత రాయడానికి ప్రేరేపించిన అనుభవం….ఆమె ప్రచురించిన సంకలనాలు….చివరిగా నేను ఎదురుచూస్తున్న నవల గురించి మాట్లాడుతున్నారు….హమ్మయ్య! నవల పేరు ” అగ్నిపర్వతాభిలాష” బానే ఉంది.
కథ ఏమిటో! నేనున్నానా? అందులో?
“హే! నువ్వెప్పటికైనా ఒక నవల రాస్తే, అందులో నా గురించి ఒక పేజీ అయినా రాస్తావు కదా!”
“నవలంటూ రాయనపుడు ఇక నీ గురించి రాసేదేమిటి?” కవ్విస్తూ నవ్వేది
” పోనీ ఆటోబయాగ్రఫీ అయినా రాస్తావుగా”
” ఊ….అప్పుడైతే రాస్తానేమో! అయినా నా ఆటోబయాగ్రఫీ ఎవరు చదువుతారు?”
” నీ పుస్తకంలో నా గురించి ఒక్క వాక్యమైనా రాస్తావులే!” నా ధీమా
“నీకంత సీన్ లేదు.” వెక్కిరింత
“నిన్నూ…….” ఒక్క క్షణంలో ఆమెను చేరిన నేను కాఫీ కప్పును ఆమె చేతిలో నుండి లాక్కుని ప్రక్కన పెట్టాను.
“నా గురించి రాయకపోతే ఎవరి గురించి రాస్తావ్? ఇంకోళ్ళ గురించి రాయనిస్తానా?” అంటూ ఆమెను ఒడిసి పట్టుకున్నాను.
ఆమె పెనుగులాడుతుంది….నాకు చక్కిలిగింతలు పెడుతుంది….ఎలానో వదిలించుకుంటుంది.
నాకు తెలిసింది ఇదే!
ఎప్పుడూ జరిగేది ఇదే!
చాలా స్ట్రాంగ్ ఆమె! మానసికంగా…శారీరకంగా…
నా అగ్నిపర్వతం నాలోనే దాగిపోవడానికి కారణం అదే!
అలా జరిగిన రోజు నేను నిద్రపోనన్నది నిజం.
ఒక అడుగు ముందుకు వెయ్యాలని ఎంత ఆత్రపడినా…..కొయ్యలేని వజ్రం ఆమె! కరిగించ వీలు లేని ఇనుము ఆమె!
ముందుగా నా మనసు గ్రహించింది….తర్వాత నా శరీరం….
ఆమె నన్ను హత్తుకుంది….గాఢంగా…..ఇక విడవలేనట్లుగా….
రాత్రుళ్ళు నాలో విజృంభించే అగ్నిపర్వతం ఆ క్షణం కట్టలు తెంచుకుంది. నా ప్రేమొక లావా విస్ఫోటనమే అయింది. ఆమె నాదనే నమ్మకానికామె ఆ రోజు రాజముద్ర వేసింది.
“ప్రేమొక రోగం…..వదలని, కుదరని రోగం….
నాకంటూ నన్ను మిగుల్చుకోకుండా ఇంకొకరిలో విలీనమై తర్వాత తీరిగ్గా చేసిన వెధవ పనికి విచారించే సామంతరాజులా ఐపోతుంది మన పరిస్థితి.” అని నేనంటుంటే భలే నవ్వేది ఆమె.
ప్రేమలో వందసార్లయినా పడగలనన్న నేను పది సార్లకే విసుగు చెందాను. ప్రేమంటే వట్టి భ్రమ. అది నాకొద్దు…అనేవాడిని. కానీ ఆమె కావాలి. ఆమె నాదే కావాలి.
రెండు వైరుధ్యాల మధ్య నేను నలిగిపోవడం ఆమె చూస్తూనే ఉంది.
ఆ రోజు తర్వాత అన్నీ మారిపోయాయి. పది సార్లు సామంతరాజునైన నేను….పదకొండోసారి కాలేకపోయాను. ఆమెకు లొంగిపోతానేమోనన్న భయంతో చిత్రంగా ప్రవర్తించాను. ఒక్కోసారి బాధించాను. ఆమె దూరం కావద్దు….అలా అని దగ్గర కావద్దు….ఎటు పోతున్నానో తెలియని సుడిలో కొట్టుకుపోయాను. అందరిలానే ఆమె కూడా దూరమైతే అన్న ఆలోచన వచ్చిన ప్రతిసారీ గడ్డ కట్టుకుపోయాను. స్నేహంలో ఉన్న మాధుర్యాన్నంతా ఒక్క రాత్రితో విషంగా నేనే మార్చేసాను.
స్త్రీలెంత పిచ్చివాళ్ళో! ఎంత మేధావులైనా….ప్రేమ విషయంలో!
ఆమె ఆరాధన ఇంకా భయపెట్టేది నన్ను….
ఆ రోజు నా జీవితంలో మొట్టమొదటి, చిట్టచివరి కవిత రాసాను…..
ఆమె డైరీలో పెట్టి వెనుతిరిగి చూడకుండా….ఆమెకు కనబడకుండా ఈ నగరానికొచ్చేసాను.
“నేను నవల రాయలేదు. ఒకరు రాయించారు. రాసాను. అంతే! కథ, కథనం అంతా ఆ వ్యక్తిదే! నేను నిమిత్తమాత్రురాలిని. మీకు నచ్చితే ఆనందిస్తాను. నచ్చకపోతే క్షంతవ్యురాలిని. ఒక కవితకు స్పందన ఈ నవల.” ఆమె స్పీచ్ కోసం వళ్ళంతా చెవులు చేసుకున ఉన్న నేను ఇలా ఆలోచనల్లో పడిపోయానేమిటో!
ఒక్క వాక్యంలో ముగించిందేమిటి?
” ఆమె ఈ పుస్తకాన్ని తన సహచరుడికి అంకితమిచ్చారు. అదృష్టవంతుడాయన. ఆయన కోసమే ఈ నవల రాసినట్లు నిన్న ఫోన్లో చెప్పింది రేమల. ఆమె మొదటి నవల కాబట్టి నేను నవలను ఆసాంతం చదివే వచ్చాను ఇక్కడ మాట్లాడ్డానికి…….” అంటున్న చీఫ్ స్పీకర్ను మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.
“చెప్పయ్యా…చెప్పు…ఎవరి గురించి రాసిందో! ఏం రాసిందో! ఎప్పటి నుండి ఎదురుచూస్తున్నాను!” నా ఆవేశరాముడు లోపల్నుండి కేకలు వేసాడు.
స్త్రీ అయిన ఆమె పురుషుడి దృష్టికోణంలో రాయడం ఒక ప్రయత్నమైతే…..ఆ దృష్టికోణాన్ని…..అతడి ఆలోచనల్ని….జీవనాన్ని….ప్రేమ….కలయికల గూర్చి అంతే ఖచ్చితంగా రాయగల్గడమే నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక స్త్రీ పురుష భావాల్ని ఇంత బాగా ఆవిష్కరించడం నేను ఇదే మొదటిసారి చదవడం. మగాళ్ళందరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకమిది.” ఆయన స్పీచ్ తాత్పర్యం అర్థమయ్యేసరికే నా అంతరాత్మ నన్ను సెమినార్ హాలు దాటించి, పుస్తక విక్రయ స్థానం వద్ద నిలబెట్టింది.
కొన్న పుస్తకాన్ని గుండెలకు హత్తుకోవాలని గాఢంగా అనిపించింది. జనాలు జడుసుకుంటారని, మనసును ఓదార్చి, మొదటి పేజీ తిరగేసాను.
అవును. నా పేరే!” నీకోసం నీ ఇడియట్ రాసిన పుస్తకం….పుస్తకంలో ఒక వాక్యమే రాసానో…పుస్తకమే నువ్వై నింపానో….నువ్వే చెప్పాలి విన్సెంట్”
ఇప్పుడు ఎవరు ఆపుతారు నన్ను ఆ నిధిని నా హృదయానికి హత్తుకోకుండా?
ఆమెనెప్పుడూ పేరు పెట్టి పిలిచేవాడిని కాదు నేను. ఇడియట్ అనే వాడిని.
“నేను అర్థం చేసుకోగలను. పాపం నిన్ను నువ్వు అలా పిలుచుకోలేక నన్ను పిలిచి తృప్తి పడుతూ ఉంటావ్. పర్లేదులే” కన్ను గీటుతూ నవ్వేదామె!
ఇంటికి వచ్చేసాను అర్జెంటుగా బైక్ స్టార్ట్ చేసి. సెమినార్ హాల్లో ఇంకా పుస్తక పరిచయం జరుగుతూనే ఉంది.
మంచంపై వాలిపోయింది శరీరం. ఎన్ని సార్లు హృదయానికి హత్తుకున్నా…తనివి తీరడంలేదు.
చదవాలి. ఇక చదవాలి. నా గురించే రాసిందా? ఏం రాసుంటుంది? మా ఇద్దరి కథా? మా ప్రేమా?
రొమాన్సా?
నా పేరుని ఇంకోసారి చూసుకుని, చదవడం మొదలుపెట్టాను.
రాత్రి రెండింటి వరకూ పొడి కర్చీఫ్ లు ఒక పది తడిగా మారాయి. కథలో రేమల ఎక్కడా లేదు….నేనే….
నా చిన్నతనం, నా అనుభవాలు, నా ఆలోచనలు…..
పదిహేడేళ్ళ వయసులో ప్రేమలో పడి తల్లిదండ్రులతో నేను పెట్టుకున్న గొడవ
చదువుపై నేను చూపిన అశ్రద్ధ
ప్రేమించిన అమ్మాయిని నా సొంత కారణాలతో వదిలేసుకోవడం
నా దృక్పధాలు…అవి క్రమంగా మారుతూ….నా ప్రస్థానం…
ఆమె కవితలకు నేను చేసిన రీసెర్చ్ ను భలే ఉపయోగించుకుంది….దుర్మార్గురాలు!
నా భావాలు….ఆవేశం…
నా జీవితపు ఖాతాలో నేను జమ చేసుకున్న పది ప్రేమకథలు….
వాటితో విసుగు చెంది, ప్రేమంటే జస్ట్ అవసరం అని ఫిక్స్ ఐపోయిన నా బలహీనత…
“ప్రతి ఏడు సెకండ్లకు ఒకసారి మగాడి మనసు దేనిపై కేంద్రీకృతమౌతుందో తెలుసా?”
“నేనింతే! ఇలాగే ఉంటాను. ఇలాగే మాట్లాడుతాను.భరించు.”
“నీ దగ్గర నాకస్సలు సిగ్గు లేదు. నువ్వే నేను….నేనే నువ్వు….కాదా?”
ఆమె దగ్గర నేనెలా ఉన్నానో….
నా ప్రవర్తన….
ఆమె దగ్గర నేను పొందాలని ఆశ పడ్డ దగ్గరితనం….
పోకిరీ నుండి పాష్ గా నేను మారిన నేపధ్యం….
నా వంటరితనం…
ఒక్కో పరిస్థితిలో నా స్పందన
నా అంతరాల్లోని అచ్చమైన నన్ను వెలికితీసిన రేమలను చితక్కొట్టాలనిపిస్తోంది. నిజం! ఎదురుగా ఉంటే అదే పని చేసేవాడిని. అద్దం నా ప్రతిబింబాన్ని ఎలా ఉన్నది అలా చూపిస్తోంది. కాదనలేను కానీ చెప్పలేని ఇబ్బంది.
చివరిపేజీ చదివి నేను ఆమె ఉన్న హోటల్ కి పరుగుతీసాను.
“ఇది చదివి, నువ్వెక్కడున్నా…..”మగాళ్ళు ఇంత బలహీనులా? ఇలా రాస్తావా? నీకెంత ధైర్యం” అంటూ నన్ను చితక్కొట్టడానికి బెత్తం పట్టుకుని వస్తావని తెలుసు విన్సెంట్. నిన్ను రప్పించడానికే ఈ నవల. నువ్వడిగిన నా (నీ) నవల.” *

– విజయభాను కోటే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

5 Responses to నువ్వడిగిన నా (నీ) నవల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో