సుకన్య

                ఆ స్థంభానికున్న గంటలు సుప్రభాతానికి గణగణమంటూ వాయిద్య సహకారాన్ని అందిస్తున్నాయి. పొదుగు నిండా ఉన్న పాలను ‘అంబా’ అని అరుస్తున్న లేగదూడల కివ్వాలన్న తాపత్రయంతో ఆవులు దూడల వైపు ఆరాటంగా చూస్తున్నాయి. రైతు కుటుంబాల వనితలు లోగిళ్ళలో మజ్జిగ చిలుకుతున్నారు. క్రమం తప్పకుండా కవ్వం పైకి లేస్తూ కిందికి దిగుతూ అదొకరకమైన లయతప్పని గీతంలాగా చెవులకు ఇంపు కల్గిస్తున్నది. వాకిలిముందు చీపురుతో బరబరా ఊడుస్తూ కొందరు… పేడ కళ్ళాపి చల్లుతూ మరి కొందరు చెఱువు నుంచి నీరు తెచ్చుకొనే హడావుడిలో ఇంకొందరు, పాలు పితకటానికి చెంబులు చేత తీసుకొని వెళ్ళేవారు, కావడితో చెఱువులో నీళ్ళు మోసుకొచ్చేవారు… అంతా హడావుడి… కోలాహలం… ఆనందం… చైతన్యం…

సుకన్య అప్పటికే స్నానం చేసి ధ్యానం చేసుకొంటూ కూర్చున్నది. ఆ రోజు చందు గ్రామానికి వస్తానని చెప్పిన రోజు. వస్తూనే తనను కలుసుకొనే ప్రయత్నం చేస్తాడు. ఆశ్రమానికి వస్తాడా? తనను కలవనిస్తారా? ఇట్లాటి ఆలోచనలు మసురుకొంటున్నాయి. ధ్యానం చేయటానికి మనస్సు ఏకాగ్రత స్థాయి నందుకోలేదు. అలాటపుడు ఎందుకని అక్కడి నుండి లేచింది.

”ఏమ్మా! తయారయినావా? వెంకయ్య కూతురిని అడిగాడు.

”ఆ!” అంది సుకన్య.

సీతమ్మ కెందుకో కడుపులో దేవినట్లయింది. తన కూతురు తనకు శాశ్వతంగా దూరం అవుతున్నది. అదీ ఏదో జీవితంలో సుఖపడటానికో, కొత్త అనుభవాలు చవి చూడటానికో వెళ్ళటంలేదు. ఇకపై జీవితమంతా నిస్తేజంగా, నిరాశగా, నిష్కామంగా గడపటానికి వెళ్తున్నది.

ఒక్క ఉదుటున వచ్చి కూతురిని కావలించుకొని బావురుమన్నది సీతమ్మ.

”ఎందుకమ్మా! ఏడుస్తావు! ఇప్పుడేమయింది. ఎక్కడో ఒక చోట నేను క్షేమంగా ఉంటాను కదా! నీవు నాన్న ఆరోగ్యం విషయంలో జాగ్రత్తతో ఉండండి.” అంటూ తల్లి దగ్గర సెలవు తీసుకొన్నది.

వెళ్తున్న కూతురికేసి అయోమయంగా చూచింది సీతమ్మ.

బాబాగారికి ఇపుడు ఎంతో సంతోషంగా ఉంది. చక్కగా చదువుకున్న, నీతి, నిజాయితీ, నిబద్దత గల అంత మంచి అమ్మాయి తన అశ్రమంలో ఉండటం తనకెంతో అవసరం. ఇక ఇక్కడ కార్యకలాపలన్నింటిని క్రమబద్ధంగా ఆ అమ్మాయి నడిపించగలదు. ముందుగా పాఠశాల నిర్వహణ బాధ్యతను అప్పచెప్పాలి. ఆ తరువాత తక్కిన పనులను బదలాయించాలి.

కారులో నుండి దిగుతున్న సుకన్యను చూచి రామేశం కళ్ళు మిలమిల లాడాయి. మరో మంచి అమ్మాయి రాబోతుంది.  అంత క్రితం రోజే ఆ అమ్మాయికని కేటాయించిన రూమ్‌కి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళాడు. వెంకయ్య కూతురు కోసమని కేటాయించిన ఆ గదంతా పరిశీలించి చూచాడు. ఒక్కే గది చాల విశాలంగా ఉంది. కూర్చోటానికి కింద పురుపులు పరిచి ఉన్నాయి. ఒక మూలగా చదువుకొనటానికి, వ్రాసుకోటానికి వ్యాసపీఠం, మరొక వైపు చిన్నచాప, ఒక అల్మరా, ఆ గదికి కొంచెం ప్రక్కగా టాయిలెట్స్‌.

అంత పెద్దయింట్లో అన్ని సౌకర్యాల మధ్య ఉండే కూతుర్ని ఇట్లా ఇక్కడ వదిలి వేయవలసి వచ్చినందుకు వెంకయ్యకు మనస్సు చివుక్కుమంది. కాని అదంతా తన కూతురు చేసుకున్న ప్రారబ్దం అని సర్ది చెప్పుకొన్నాడు.

ఆ తర్వాత బాబా దగ్గరకు కూతురుతో సహా వెళ్ళాడు. ”మా అమ్మాయిని మీకు అప్పచెబుతున్నాను. ఇక మంచికయిన చెడ్డకయిన మీరే” అంటుంటే కండ్ల నీళ్ళు వచ్చాయి.

”వెంకయ్య! నీవేమి ఆందోళన చెందకు. అమ్మాయి ఇక్కడ చాలా సంతోషంగా ఉంటుంది. మీరేమి ఆందోళన పడవద్దు” అని హామి ఇచ్చాడు బాబా.

సుకన్య కూడా బాబా తన పట్ల చూపుతున్న ఆదరణకు ఎంతో సంతోషించింది. తానెక్కడెక్కడికో వెళ్ళి ఉద్యోగం చేసే కంటే ఇక్కడ తన సేవలను అందజేస్తుంది. తన అవసరం ఎంతో ఉంది ఇక్కడ అని బాబా అన్న తర్వాత తాను ఇక్కడే ఉండి పోవాలని ఎందుకు నిర్ణయించుకోకూడదు! అందుకే తండ్రి తనను వదిలి భారమైన మనస్సుతో వెళ్తుంటే గేట్‌ వరకు తండ్రితో పాటు నడచింది. ఆయనకు ఎన్నో ధైర్య వచనాలు చెప్పింది. ”నాన్నా! మీరేమి నా గురించి ఆందోళన పడకండి. మీరు ఎపుడంటే అపుడు రావచ్చు దూరమా? భారమా? అమ్మను కూడా తీసుకురండి. నేను సంతోషంగానే ఉన్నాను.”

వెంకయ్య మనస్సు కొంత తేలిక అయింది. కనిపించినంత సేపు కారులో నుండి కూతురివైపు చూస్తూ చేయి ఊపాడు.

సాయంకాలం ఏడుగంటలెపుడవుతుందా అని కనకయ్య అతని భార్య సాయమ్మ పదే పదే గడియారం వైపు చూస్తున్నారు. ఏడు గంటల కల్లా కొడుకు చంద్రధర్‌ వస్తాడని ఫోను చేసాడు. కనకయ్య కుల వృత్తయిన కుండలు చేయటం ఎపుడో మానేసాడు. ఉన్న పొలం సాగు చేసుకుంటూ, రెండు గేదెలను కొని పాడి మీద బాగానే సంపాదిస్తున్నాడు. ఒకే ఒక్కడు చంద్రధర్‌, అతని మీదనే పంచ ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారు ఆ దంపతులు. చంద్రధర్‌ చదువు నిమిత్తం ఇప్పటి వరకు బయట ఊళ్ళలోనే గడుపుతున్నాడు. వీలయినంత తొందరగా తనకు ఉద్యోగం వస్తే వాళ్ళని తనతో తీసుకువెళ్ళాలని అతని ఆలోచన. కాని వాళ్ళు ఆ పల్లెటూరు వదిలి రామని అంటారు.

ఏడు గంటలవుతుండగా చంద్రధర్‌ కారులోంచి దిగాడు. అతని ఫ్రెండు తన కారులో డ్రాప్‌ చేసి వెళ్ళాడు. కొడుకుని చూడగానే కనకయ్య సాయమ్మలకు ప్రాణాలు లేచివచ్చాయి. పేదవాడికి పెన్నిధి దొరికినంతగా మురిసిపోయాడు.

సాయమ్మ కొడుకును తనివి తీరా చూచుకుంది. ఎంత దిష్టి తగిలిందో! తల్లి దిష్టి మంచిది కాదని వెంటనే చూపుమరల్చుకుంది.

కనకయ్య కూడా ఎంతగానో మురిసిపోతున్నాడు. అందగాడు, గుణవంతుడు తెలివైన తన బిడ్డతో సరి వచ్చేవాళ్ళు ఎవరు లేరని ఒకింత గర్వపడ్డాడు. కనకయ్య తమ పూరింటిని పెంకుటింటిగా మార్చాడు. కొడుకు వచ్చినపుడు హాయిగా సౌకర్యంగా ఉండాలని ఒక పడక గది, కుర్చీలు నాలుగు, ఒక టేబుల్‌ కొడుకు చదువుకుంటానికి వీలుగా టేబుల్‌ కుర్చీ ఒకవైపు అమర్చాడు.  ఉన్నంతలో కొడుక్కి ఏ లోటు చేయలేదు. తామిద్దరిలో ఎవరు కాఫీలు టీలు తాగకున్నా కొడుకు కోసమని, అతని కోసం స్నేహితులు వస్తారని కాఫీపొడి, టీపొడి, బోర్న్‌విటా ఇట్లా అన్ని సిద్ధం చేసాడు. తల్లి ప్రేమంతా కలిపి తయారుచేసిన పాలకోవా తెచ్చి అప్యాయంగా కొడుకు చేత తినిపించింది సాయమ్మ!

”బాబు! ఇన్నాళ్ళు ఎంతో దూరంగా ఉన్నావ్‌! చదువు పేరుతో ఏనాడు ఇంటి పట్టున ఉండలేదు. కొన్నాళ్ళు హాయిగా మాతోనే ఉండు మరి” మమ్మల్ని విడిచి వెళ్ళవద్దని తల్లి అభ్యర్ధన.

తల్లిదండ్రులు తనివితీరా కన్నబిడ్డని చూసుకొని పొంగిపోతున్నారు. చంద్రధర్‌కి వారి నిష్కల్మషమైన ఆ అనురాగం ఆప్యాయతలు కళ్ళనీళ్ళు తెప్పించాయి. తనని ఒక అపురూపమైన వ్యక్తిలాగ వాళ్ళు చూడటం చిత్రంగా అనిపించింది. తాను వారు తనకందించినంత ప్రేమానురాగాలను వారికి తిరిగి ఇవ్వగలడా? తన మనసంతా తానై కూర్చున్న సుకన్య తనని తాను కాకుండా చేసింది. సుకన్య ఆలోచనలురాగానే మనసు మాట విననంటూ పరుగులెత్త సాగింది. గబగబా స్నానాదికాలు ముగించుకొని సుకన్య కిష్టమైన పాంటు షర్ట్‌ వేసుకొని బయలుదేరాడు. తల్లితో ”అమ్మా! ఒక్క గంటలో వస్తాను. నాకిష్టమైన బెండకాయ వేపుడు చెయ్యి సరేనా అన్నాడు.” వెళ్తున్నా కొడుకుని చూసుకుంటూ సాయమ్మ గర్వంగా నవ్వుకుంది. తన కడుపున పుట్టిన బిడ్డ చెయ్యెత్తు ఎదిగాడు. అట్లా చూస్తునే ‘అయ్యో ఆలస్యం అయిపోతుందేమో! వాడికిష్టమైనవన్ని వండాలి’ అనుకుంటూ సాయమ్మ వంటగదికేసి వెళ్ళింది.

చందు గబగబా అడుగులు వేసుకుంటూ వెంకయ్య ఇంటివైపు వెళ్ళాడు. అతను అంత క్రితం ఎపుడు ఆ యింటి లోపలకు వెళ్ళలేదు. గుమ్మం వద్దకు వస్తుండగానే వేగం తగ్గింది. బయట అరుగు మీదనే కూర్చుని ఉన్నాడు వెంకయ్య. ”ఎవరు?” అన్నాడు చందూని చూచి. ఏ ఆఫీసరో అనుకున్నాడు.

”నేను సుకన్యతో చదువుకొన్నానండి. నా పేరు చంద్రధర్‌ ఆ అమ్మాయితో ఒక్కసారి మాట్లాడిపోదామని.”

”ఈ ఊరేనా మీది” వెంకయ్య ప్రశ్నించాడు. అతన్ని పరిశీలిస్తూ.

”ఆ కనకయ్య కొడుకుని.”అప్పుడే తిన్నావా?

”ఆ ఆ కుమ్మరి కనకయ్య కొడుకువా?” కుమ్మరి అనే పదాన్ని నొక్కిపడుతూ మరీ అడిగాడు వెంకయ్య.

 ”ఔను కుమ్మరి కనకయ్య కొడుకునే! ఇంతకీ తమరు ఎవరో తెలుసు కోవచ్చా?” వ్యంగ్యంగా అడిగాడు చందు.
అప్పటికే వెంకయ్యకు కోపం ముంచుకువచ్చింది. కాని ఆ వచ్చిన కుర్రాడు ఎంతో మర్యాదగా, సంస్కారం ఉట్టిపడేలా ఉన్నాడు. మాటలు ఉచ్ఛారణ చక్కగ, స్పష్టంగా ఉంది. పిల్లాడ్ని చూస్తుంటే ఏ గొప్పింటివాడో అనిపిస్తున్నాడు. ఏ విధంగా వాడిని తప్పుబట్టాలో తెలీలేదు. వెంకయ్య సమాధానం చెప్పేలోగానే పక్కింటి పోలయ్య ”సుకన్య, ఆశ్రమానికి వెళ్ళింది బాబు. ఇంటి కాడ లేదు.” అన్నాడు.
”వస్తానండి మరి” అంటు చందూ అక్కడి నుండి ముందుకు కదిలాడు. సుకన్య ఆశ్రమానికి వెళ్ళటం ఏమిటి? ఎందుకు? అనే ప్రశ్నలు వేధించటం మొదలయింది. శుక్లపక్షపు థమినాటి చంద్రుడు ఆకాశంలో మబ్బుల మాటున దోబూచులాడుతున్నాడు. తాను ఆశ్రమానికి అంతదూరం వెళ్ళటం బాగుంటుందా? అసలు తాను తప్పు చేసాడు. ఆశ్రమానికి వెళ్ళిందనగానే ఎందుకు వెళ్ళింది? ఎపుడు వస్తుంది? అని అడగవలసింది. పోనీ ఇపుడు వెనక్కు వెళ్ళి వాళ్ళని అడిగితే బాగుటుందా? ఊహుఁ ఇవాళంతా తనని చూడకుండా, మాట్లాడకుండా గడపాలా? అట్లా ఆలోచిస్తునే వెన్నెల చూపేదారి వెంట నడక సాగించాడు చందు. వెనకనుండి స్కూటర్‌ ఒకటి వస్తున్నది. చందు స్కూటర్‌ని అపాడు. ”ఆశ్రమం దాకా వెళ్తున్నారా? నన్నక్కడ దింపుతారా? ”ఆ రండి కూర్చోండి. నేను అక్కడికే వెళ్తున్నాను.” అంటూ స్కూటర్‌ ఆపాడు అతను.
”ఇంతకీ మీరెవరో తెలుసుకోవచ్చా”
”నేను కుమ్మరి కన్నయ్య కొడుకుని. నా పేరు చంద్రధర్‌. ఆశ్రమంలో నాతో పాటు యూనివర్సిటీలో చదువుకొన్న సుకన్య ఉందంటే చూద్దామని బయలుదేరాను.”
”ఔను రాత్రివేళ బయలుదేరారేమిటి? రేపు ఉదయం కలవవచ్చు కదా! ఆ నా గురించి మీకు చెప్పలేదు కదా! నా పేరు దయాకర్‌ నేను ఆశ్రమంలో హాస్టల్లో పనిచేస్తున్నాను. సుకన్య మొన్న మొన్ననే ఆశ్రమంలో చేరారు.”
”ఆశ్రమంలో చేరటం ఏమిటి?” ఆశ్చర్యంగా అడిగాడు చందు.

దయాకర్‌ చెప్పాలా, వద్దా అని సంశయిస్తునే చెప్పాడు.” ఆ అమ్మాయి చదువుకుంటూ ఏదో ప్రేమ వ్యవహారం నడిపిందట. అతను కులం తక్కువవాడట. అందుకనే తండ్రి కోపించి ఆ అమ్మాయిని ఆశ్రమంలో చేర్పించాడు.”
”అంటే ఇక ఎప్పటికి తను ఆశ్రమంలోనే ఉండిపోతుందా?” చందూ ఎంతో ఆరాటంగా అడిగిన ఆ ప్రశ్నకి దయాకర్‌ విస్తుపోయాడు.
”ఉండవచ్చు. బాబా గారికి కూడా నమ్మకస్తులయిన వారు కావాలి కదా! ఈ పిల్ల చదువుకున్నది, తెలివైంది, మంచిది. ఇక ఆ అమ్మాయి జీవితమంతా ఆశ్రమ సేవకు వినియోగించిన ఆశ్చర్యపడనక్కర్లేదు.”
చందు నెత్తిన పిడుగుపడ్డట్లయింది. ఇదేమిటి! సుకన్య ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది. అసలు తాను వింటున్నదంతా నిజమేనా? ఆశ్రమం ఎంతో దూరం లేదు. దూరం నుంచే లైట్లు కనబడుతున్నాయి. కాని తాను సుకన్యకు ఎంతో దూరంలో ఉన్నట్లు చందు భావించుకొన్నాడు. మరో రెండు నిముషాల్లో ఆశ్రమం గేట్‌లో ఉన్న గుర్ఖా దయాకర్‌ని చూచి గేటు తెరిచాడు. దయాకర్‌తో రావటం వల్ల చందుకి లోపలకు వెళ్ళటానికి ఎటువంటి ఆటంకం కలగలేదు. దయాకర్‌ సరాసరి సుకన్య ఉంటున్న గదిముందు స్కూటర్‌ ఆపాడు. ”సుకన్యగారు! మీ కోసం ఎవరో వచ్చారు.” అన్నాడు. మరు నిమిషంలో సుకన్య బయటకు వచ్చింది. చందుని చూచి మనసు పరవళ్ళు తొక్కింది. గుండె దడదడ కొట్టుకొంది. మనసు శరీరం మైమరచి పోయేంతటి ఆనందం… ఆశ్రమంలో ఉన్నా మనసు అదుపు తప్పుతుంది. నవ్వుకుంది. ”చందు! నీవా?” అన్నది. ”రా! లోపలకి? దగ్గరగా వచ్చి పిలిచింది. ‘దయాకర్‌ గారు! రండి.’
”లేదమ్మా నాకు పని ఉంది వస్తాను. మరి ఈయన ఆశ్రమంలోనే ఉంటారా? తిరిగి వెళ్తారా? ఉంటే హాస్టలుకి వచ్చి భోజనం చేయవచ్చు. అక్కడే విశ్రమించవచ్చు” అంటూ వెళ్ళిపోయాడు దయాకర్‌.
క్రింద పరుపు చూపిస్తూ ”కూర్చో చందు” అన్నది సుకన్య.
మంత్రించినట్లు మారు మాట్లాడకుండా కూర్చున్నాడు చందు.
అతనికి కొంచెం దూరంలో కూర్చుంది సుకన్య.

 – విజయ బక్ష్

(ఇంకా వుంది)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

సుకన్య, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో