సుర కత్తుల సూరీడు – శివసాగర్
సందర్భం ఏదైనా సరే శివ సాగర్ కి మరణాన్ని ఆపాదించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు . ఎందుకంటే లోక రీతి లో మరణమంటే శాశ్వత నిష్క్రమణం. కాలాన్ని జయించ గలిగిన కవి శివ సాగర్ .ఇప్పుడతను నింగికేగిన ఉద్యమం నెలబాలుడు .అంతే.
శివ సాగర్ గురించి కనీసం నాలుగు మాటలైనా రాయాలి అనుకున్నప్పుడు ,కలం కదిలించలేని అశక్తత ఒకటి నన్ను ఆవరించింది . 1999 లో యం ఏ చదువుతున్నప్ప్పుడు ఒకానొక సాహితీ సభలో ఆ నల్లనల్లటి సూరీడుని చూసాను . నా ముందే కూర్చొని వున్నారు . ఎవరెవరో వచ్చి పలకరిస్తున్నారు . అలా పలకరించేటప్పుడు ఆయన చిరునవ్వుల ముఖాన్ని నేను చూడగలిగాను. కానీ ,జయించలేని మొహమాటం వలన పలకరించ ప్రయత్నించలేదు . ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అప్పటికే ఆయన నిండు డెబ్బయ్యేళ్ళ మనిషి . వయసు రీత్యా ఆయనకు నాకు ఎంత అంతరముందో వారు నడిచివచ్చిన ఉద్యమాల గురించి అంతే అజ్ఞానముంది. శివ సాగర్ తో నా పరిచయం అవధులు లేని కవిత్వ స్నేహమే .
నేను మొట్టమొదటి సారి చదివిన శివ సాగర్ కవిత “ఉరిపాట” …….ఉరికంభం / మీద నిలిచి / ఊహాగానం / చేసెద / నా ఊహల / ఉయ్యాలలోనా / మరో జగతి / ఊసులాడు …చదువుతున్న ఆ వాక్యాలు నా మెదడును చేరి విస్ఫోటించగానే, నా శరీరం అవ్యక్తమైన ఆనందానికి ,గుగుర్పాటికి గురికావడం, అసంకల్పితంగా నా కళ్ళు చెమర్చడం ఇవాలంతటి తాజా జ్ఞాపకం. అలాటి భావనే ”కడలి జనం / అలలు దళం/ అలలు కడలి /ప్రాణపదం” అని చదివినప్పుడు , ”నా చెల్లీ చెంద్రమ్మ ” లో ”ఊరికి పులి కానీ గొడ్డలి కి పులి కాదు/ దోపిడీకి దొర కానీ కత్తికి దొర కాదు ”అనే పంక్తులు చదివినప్పుడు కలిగింది .
సెంట్రల్ యూనివెర్సిటీ లైబ్రరీ లో నా అలవాటు కుర్చీలో తన కవిత్వపు పుస్తకం పట్టుకుని కూర్చొన్న నా ముందు శివ సాగర్ అడవిని ,వీచే తూర్పు పవనాలనీ ఆవిష్కరించే వాడు . కల్లాకపటము లేని తోట రాముడిని ఎదుట నిలబెట్టి ”అతనీ వల్ల నేరామేమి రా! ఓ !చెలికాడా! /అతనీ వల్ల నేరామేమి రా? అని ప్రశ్నించే వాడు . మరోచోట ” మానవాళి భవిష్యత్తు కు సంబంధించిన తపన విప్లవం ,మానవాళి భవిష్యత్తుని పట్టించుకోవడం విప్లవం. అందువల్ల పేదవాళ్ళం పెట్టుబడి లేకుండా రెండు పనులు చెయ్యగలం ‘కలం పట్టి కవితలల్లగలం ప్రాణాలిచ్చి పోరాటం చెయ్యగలం’ ” అని తానేం చేస్తున్నాడో చెప్పేవాడు . ఆ పోరాటం లో వీరులయ్యే అమరుల గురించి ” సూర్యాస్తమయం చేతిలో చెయ్యి వేసి / సూర్యోదయాన్ని వాగ్దానం చేసింది / అమరత్వం రమణీయ మైంది ./ అది కాలాన్ని కౌగలించుకొని / మరో ప్రపంచాన్ని వాగ్దానం చేసింది అంటూ ,అమరత్వంలో ని రమ ణీయతని వెలిగించే వాడు .
శివ సాగర్ చేసిన విప్లవోద్యమ ప్రయాణంలో ఒక యు టర్న్ , ఉదయించిన కొత్త జ్ఞానం ‘దళిత సూర్యుడు’. దళిత స్పృహ తో ఆయన ”కొమ్ముకండె సూరీడు / కల్లు గీత సూరీడు / మాతంగి సూరీడు / గోసంగి సూరీడు / ఆలి చిప్ప అద్దంలో నవ్వుకునే సూరీడు / నత్తగుల్ల గజ్జె కట్టి నాట్యమాడే సూరీడు” అంటూ రాసిన “నల్లాటి సూరీడు ” అందంగా వున్నా, బ్రంహాండంగా వున్నా, దళిత సౌందర్యపు వెలుగులని విరజిమ్మినా శివ సాగర్ అనబడే సత్య మూర్తి అది రాయాల్సి వచ్చిన సందర్భం దుఃఖం కలిగించినట్టు జ్ఞాపకం .
శివ సాగర్ కవిత్వం గురించే చెప్పాలంటే పై పైన ఇట్లా చాలానే చెప్పొచ్చు . శిల్పం సౌందర్యం పద చిత్రం ప్రతీక వంటి కవిత్వ నిర్మాణ సంగతులలో శివ సాగర్ శ్రీశ్రీ తో సరి సమానుడు . అయితే శ్రీశ్రీ కవిత్వానికి శివ సాగర్ కవిత్వానికి మధ్యనున్న ప్రధాన తేడా శివ సాగర్ కవిత్వం లో గర్జించే వసంత మేఘాలు వుండటం . శివ సాగర్ కవిత్వం నిండుగా విప్లవ రాజకీయం వుంటుంది …మినహా మరేమీ ఉండదు . ఈ రాజకీయము, ఆ కవిత్వము సియామీస్ కవలలు . ఎవర్నో ఒకరినే ముద్దాడాలి అంటే కుదరదు. రెండింటినీ ఒడిలోకి తీసుకోవాల్సిందే .
వరవర రావు ఒక చోట ” ఈనాటి కవికి విప్లవం గురించి రాసేప్పుడు అనుభవం లోపిస్తున్నది. బూర్జువా సమాజం లోనే పుట్టి ఆ పరిసరాల్లోనే పెరిగి ఆ చదువులు చదువుకొని ,ఈ సమాజం లోని ఘర్షణల వల్ల కళ్ళు తెరిచినప్పుడు ,చరిత్ర గతి తర్కం మాత్రమే అతన్ని పీడిత వర్గం వైపుకి నెట్టుతున్నాయి .చదువుకున్న శాస్త్రాన్ని కవితగా మలచలేము ,మలచినా అది మూసలో పోసినట్టుంటుంది ” అంటాడు . శివ సాగర్ గురించి రాయాలనుకున్నపుడు నాకు ,వర వర రావు ఈ మాటలే జ్ఞాపకానికి వచ్చాయి . ఆ మాటలు నాకు అతికినట్లు సరిపోతాయి.అందుకే నా వరకు నాకు శివ సాగర్ నేను రాయలేని కవిత్వం .శివసాగర్ మూసకందని కవిత్వం . అందుకని నేను ఏమి రాయలేకపోతున్నాను . అయితే ఈ దుఃఖ సందర్భంలో శివ సాగర్ కవిత్వపు వ్యక్తిత్వం తెలిసిన మనిషిగా వారి గురించి ఒక మాట చెప్పగలను ” అప్పుడే అతను వొళ్ళు విరుచుకుని సమాధి నుండి లేచి ఆయుధం చేత బట్టి తిరిగి రణరంగం చేరే ఉంటాడు “
– సామాన్య
6 Responses to మే నెల సంపాదకీయం