స్త్రీ యాత్రికులు

ఇదంతా నోగా చేసిన కుట్ర ఫలితంగానే జరిగిందని తెలుసుకొని ఎంతో బాధపడుతుంది. నాలుగు నెలలు నరకయాతన అనుభవిస్తూ చేసిన ప్రయాణం అంతా వృధా అయ్యేసరికి అన్నీ మొదటిసారిగా దుఃఖ్ఖిస్తుంది.

‘ఈ వైపుగా మీరు ఎక్కడికి వెళుతున్నారు?’ అనే ప్రశ్నకి సమాధా నంగా ‘డార్జిలింగ్‌’ అని మాత్రమే చెప్పగలుగుతుంది. ఆ పోలీసులు ఎంతో మర్యాదగా ‘మీరు వచ్చిన దారినే వెనక్కి తిరిగి వెళ్ళక తప్పదు’ అని చెబుతారు.

‘నన్ను లాసా వరకూ తీసుకెళ్ళి మరలా ఇక్కడికి తెచ్చి వదిలిపెడితే, అలాగే వెనక్కి వెళతాను. ఇంతవరకూ వచ్చింది సరదాకోసం కాదు’ అని మొండిగా మాట్లాడేసరికి వారు పై అధికార్లను తీసుకొస్తారు. ఇదంతా రెండువారాలపాటు జరుగుతుంది. ఈలోగా పరిసరాల్లో తిరగటం తప్ప మరేమీ చేయలేకపోతుంది. అన్నీ ఆ పోలీసుల్ని ఎంత అభ్యర్ధించినా ఒక్క అడుగు కూడా ముందుకి పోనివ్వరు. తన కల ఫలించనందుకు ఎంతగానో బాధపడి, ఏమిచేయలేక తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి తిరుగుతుంది. లాసా నగరానికి దగ్గిరవరకూ రాగలిగి వెనక్కి వెళ్ళటం అన్నీకి ఎంతో బాధ అనిపిస్తుంది.

తిరుగు ప్రయాణంలో అన్నీకి, పోంట్‌సోకి మంచిగుర్రాలు ఇస్తారు. వారికి తోడుగా ఉండేందుకై పోలీసుల్ని కూడా సరఫరా చేస్తారు. వారు అన్నీకి పదకొండు రోజుల వరకు రక్షణగా ఉండి, దొంగలు తిరిగే మెకాంగ్‌ నదీ, తాషిగోంఫా దాటించి, కేగు దారిలోకి జాగ్రత్తగా పంపిస్తారు. అక్కడ నుండి చైనా సరిహద్దులు దాటి వెళ్ళటం సులభం. వారి తిరుగు ప్రయాణంలో ఏప్రిల్‌ పదమూడు నాటికి టాషినేలు అనే పట్టణం చేరుకొం టారు. అది సింకియాంగ్‌కి దగ్గరగా ఉంటుంది. అక్కడ నుండి కియాటింగ్‌ మీదుగా తీరాన్ని చేరుకొంటారు.

ఈ తిరుగు ప్రయాణం మొత్తం మూడున్నర నెలలు పడుతుంది. ఒక స్త్రీ ఇలాంటి భయంకరమైన యాత్ర చేసి బ్రతికి రావటం చాలాకష్టం. పైగా గమ్యం చేరలేకపోయామన్న బాధ ఎక్కువై అది తిరుగు ప్రయాణాన్ని మరింత కష్టంగా మార్చింది. ఆత్మ స్థైర్యం ఎక్కువగా ఉన్న స్త్రీ కావటం వల్లనే ఈ యాత్ర చేయగలిగింది అన్నీ.

ఈ యాత్రలో ఆమె చేసిన ఒక గొప్ప పనేమిటంటే నిత్యం డైరీ రాయటం. ఆ డైరీ మూలంగానే అన్నీ టేలర్‌ ‘టిబెట్‌ యాత్ర’ వెలుగులోకి వచ్చింది. ఆ మంచుగాలిలో కొంగర్లు తిరిగిపోతున్న వేళ్ళతోనే నిత్యం తన అనుభవం అంతా రాస్తూ ఉండేది.

ఇంత భక్తి, పట్టుదల, సాహసంతో చేసిన యాత్రలు చరిత్రలో చాలా అరుదుగా కనిపిస్తాయి.

ఈ యాత్రలో అన్నీ 2000 కి.మీ. ప్రయాణించింది. మొత్తం ఏడు నెలల శ్రమ. అన్నింటి కన్నా ఆమె ప్రాణాలతో తిరిగి రావటమే విచిత్రం.

1893 వ సం|| వేసవి కల్లా ఇంగ్లండులోని తన ఇంటికి చేరుకొం టుంది అన్నీ. తోడుగా పోంట్‌సో ఎప్పుడూ ఉంటాడు. లాసాకి వెళ్ళటంలో ఆమె సఫలం కాకపోయినా,  ఆమె చూపిన సాహసానికి గుర్తుగా ఇంగ్లండులో ఎన్నో పురస్కారాలు పొందగలిగింది. సాహసవనితగా కీర్తి తెచ్చుకొంది. చాలా పత్రికలు ఆమె రాసిన వ్యాసాల్ని ముద్రించాయి.

ఇంగ్లండులో పూర్తిగా ఒక సంవత్సరం గడపక ముందే మరలా టిబెట్‌కి వెళ్ళాలనే కోర్కె పుడుతుంది. అయితే ఈసారి తాను స్వయంగా తయారుచేసుకున్న ‘టిబెటన్‌ పయనీర్‌ మిషన్‌’తో పాటుగా ప్రయాణాలు చేద్దామని నిశ్చయించుకుంది. ఈ సంస్థలో సభ్యులు తొమ్మిది మంది. ‘చచ్చినా బ్రతికినా టిబెట్‌ చేరుకుని అక్కడ మతప్రచారం చేస్తాం’ అని శపథం చేసి అందరూ 1894 ఫిబ్రవరి పదహారున బయలుదేరి ఇండియాకి వస్తారు. ఇక్కడ నుండి చైనాకి వెళ్ళాలి, ఆ తరవాత టిబెట్‌ వెళ్ళటానికి మార్గాలు చూడాలి. కానీ వారు ఇండియా చేరిన మూడు నెలలకే వారిలో వారికి విభేదాలు వచ్చి, విడిపోయి అందరూ మళ్ళీ పాత ‘చైనా ఇన్‌లాండ్‌ మిషన్‌’లోకే చేరిపోతారు.

టిబెట్‌ వెళదామని ఎంతో ఆశతో వచ్చిన అన్నీకి మరలా నిరాశే ఎదురైంది. పోంట్‌సో తోడుగా ఉంటేచాలు, ఎప్పటికైనా టిబెట్‌ చేరి మత ప్రచారం చేయగలను అనే ధైర్యంతో ఉండిపోతుంది. అందువలన ఇంతకు ముందులాగా చైనాకి వెళ్ళకుండా సిక్కింకి ప్రయాణం అవుతుంది. అంతకుముందు తనకి పరిచయం ఉన్న గాంగ్‌టాక్‌ చేరి, అక్కడ ఉన్న ‘ఇండియా టీరోడ్‌’ అనే ప్రాంతంలో నివాసం ఏర్పరచు కొంటారు. డార్జిలింగ్‌లో ఉంటున్న తన అక్కయ్య వద్దకి ఒకసారి కూడా వెళ్ళదు. ఈ ‘ఇండియా టీరోడ్‌’ ఎప్పుడు చూసినా సంతలాగే ఉంటుంది. ఇండియాలోకి వచ్చే ప్రతి టిబెట్‌ వ్యాపారీ ఇదే దారిలో రావాలి. ఆ దగ్గరలో ఉన్న కాలింగ్‌ పాంగ్‌ సంతలకు వెళ్ళేవారు కూడా ఇక్కడ నుంచే బయలుదేరాలి. వారందరి విడిది కేంద్రం ఈ ‘టీరోడ్‌ జంక్షన్‌’.

అన్నీ తన మత ప్రచారానికి ఈ ప్రదేశాన్ని కేంద్రంగా ఎంచుకొం టుంది. వారితో కలిసిపోయి, వారి భాషలు మాట్లాడుతూ సువార్త చెప్పు కొంటూ ఆనందించక తప్పటంలేదు. వీళ్ళందరితో మంచిగా ఉంటే ఎవ్వరైనా, ఎప్పటికైనా తన కలల రాజ్యమైన లాసా నగరానికి, తీసుకెళతా రేమోనని ఆశ. సువార్త ముద్రించబడిన మూడువేల కార్డుల్ని ఇక్కడ పంచగలుగుతుంది. చైనాలోని కుంబుం మోనాస్టరీలో గడిపినంత ఆనందంగా ఇక్కడా ఉండగలుగుతుంది. తన దేశపు ప్రజలు అందరూ ఇండియాలోనే ఉన్నారాయె.  అందువలన అన్నీ హాయిగా ఉండటం నేర్చుకుంది. టిబెట్‌ భాషని మాతృభాషలాగా మాట్లాడటం వలన ఆ మార్గాల్లో ప్రయాణించే చాలామంది పెద్ద వ్యాపారస్థుల్ని కలిసి తనను టిబెట్‌ తీసుకువెళ్ళమని అడిగి ఉంటుంది. వారు తప్పనిసరిగా భయపడే ఉంటారు. ఎందుకంటే 1880 వ సం|| నాటికే నైన్‌సింగ్‌ రావత్‌, శరత్‌ చంద్రదాస్‌ రహస్యంగా లాసా వెళ్ళి వచ్చారని తెలిసిన టిబెట్‌ ప్రభుత్వం కొత్తవారి కదలికలపై డేగకన్నువేసి ఉంచింది.

గాంగ్‌టాక్‌లో ఎక్కువ రోజులు ఉండటం వలన ప్రయోజనం లేదని తెలుసుకున్న అన్నీ ఉత్తరంగా ఉన్న జెలెప్‌ కనుమ దాటి యాటుంగ్‌ చేరుకుంటుంది. ఇది సిక్కిం-టిబెట్‌ సరిహద్దు ప్రాంతం. సముద్రమట్టానికి పదిహేనువేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో వ్యాపార కేంద్రాలు పెట్టుకోవచ్చని టిబెట్టువారు బ్రిటీషు వారికి అనుమతి ఇస్తారు. అందువలన అన్నీ అక్కడకి వెళ్ళగానే తాను ఉండేందుకు అనుమతి ఇస్తారు, కానీ ఒక షరతు మీద. ఆమె అక్కడ ఊరికే ఉండకుండా ఆ వ్యాపార కేంద్రంలో ఉద్యోగం చెయ్యాలి. కష్టపడటానికి అన్నీ ఎప్పుడూ సిద్ధమే. పై ప్రదేశాల నుండి టిబెట్‌ వారూ, కింద ఉన్న ప్రాంతాలనుండి సిక్కిం వారూ యాటుంగ్‌లోకి వచ్చి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అందువలన అన్నీ వారితో హాయిగా కలిసిపోవచ్చు. ఇది పోంట్‌సోకి కూడా నచ్చింది. ఎందు కంటే తన దేశాన్నుంచి వచ్చే పోయే ప్రజలతో ఎన్నో కబుర్లు చెప్పుకోవచ్చు కాబట్టి.

తనకు, పోంట్‌సోకి నివాసంతో పాటుగా నెలకి ఇంత అని జీతం కూడా ఇస్తున్నారు. ఆ దగ్గరలో చర్చి ఉంది. బ్రిటీషువారు తనకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు చాలా బాగున్నాయి కాబట్టి అన్నీ మనసు కాస్త కుదుట పడుతుంది.

ఇక్కడ పోంట్‌సో జీవితంలో కొన్ని మార్పులు జరిగాయి. నిత్యం స్థానికులతో కలిసి మెలిసి ఉండటం వలన తన మనసులో ప్రేమ చిగురించింది. ఇదే అదనుగా భావించిన అన్నీ ఒక మంచి టిబెట్‌ అమ్మాయిని చూచి పోంట్‌సోకి పెళ్ళి చేస్తుంది. దీంతో పోంట్‌సోకి స్వేచ్ఛ నిచ్చినట్లైంది. వారిద్దరూ అన్నీకి తన పనిలో సహాయపడుతూ ఉండటంతో ఆనందం వేసింది.

ఇలాంటి ఆహ్లదకరమైన ప్రదేశంలో అన్నీ ఎంతో సంతోషపడుతూ మత ప్రచారం కూడా చేస్తూ ఉండేది. పరిసరాల్లోని వారందరూ ఎంతో గౌరవిస్తూ ఉంటారు. అయినాసరే తనకు మాత్రం లాసా వెళ్ళాలనే కోరికపై  ఇంకా మోజు తీరలేదు. లాసా వెళ్ళే అవకాశాలు ఎప్పుడు వస్తాయా అని ఆశపడుతూనే ఉంది.

చూస్తుండగానే యాటుంగ్‌లో ఐదు సంవత్సరాలు దొర్లిపోతాయి. 1898 వ సం||లో ఆమెను చూడటానికి ఇంగ్లండు నుండి ప్రపంచ ప్రఖ్యాత జర్నలిస్టు విలియం కారే వస్తాడు. 1893 వ సం|| వేసవి తరువాత అన్నీ రాసిన వ్యాసాలు లండన్‌లో చూసి, తన దేశపు గొప్ప సాహస వనితను గురించి పుస్తకం రాయాలనే ఆలోచనతో వచ్చానని అన్నీకి తెలియజేస్తాడు. తీరా ఆమె రాసిన డైరీలు అన్నీ చూశాక కారే చాలా నిరాశపడతాడు. ఎందుకంటే ఆ చిన్న పేజీల్లోని పదాలు సరిగ్గా అర్ధం కావు. నాగ్‌ఛుకా వద్ద ఆమెని ఆపివేయటం నుండి మళ్ళీ కేగు మార్గంలో ఆమెని వదిలివేయటం వరకూ రాసిన వాక్యాల్లో ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు. ఆ మంచు ప్రాంతాల్లో రాసినదంతా ఏవో పిచ్చిగీతల మాదిరిగా ఉంటాయి. తాను రాసింది తానే అర్ధం చేసుకోలేకపోయింది. 162 పేజీలు ఉన్న ఆ డైరీని కాలే భూతద్దాలతో పరిశీలించి, ఒక సంవత్సర ప్రయత్నం చేసిన తరవాత ఆ వాక్యాలకి ప్రాణం పోయగలుగుతాడు.

1901 వ సం||లో విలియం కారే అన్నీ డైరీని పరిష్కారం చేసి, తప్పులుదిద్ది ముద్రించగలిగాడు. ఆనాటి ఇంగ్లండులో అది పెద్ద సంచలనం సృష్టించింది. ఆ పుస్తకంపేరు  “Diary Of Miss Talor’s Journey Through Tibet”. ఇది వెంటనే రీప్రింట్‌కి కూడా రావటంతో అన్నీకి పేరు ప్రఖ్యా తులతో పాటు డబ్బుకూడా వస్తుంది. పోంట్‌సో కూడా ప్రపంచానికి తెలిసి పోవటంతో అతనికి కూడా సంతోషం వేసింది.

ఈ కొత్త ఆనందంలో తన కలని తాత్కాలికంగా పక్కన పెట్టింది అన్నీ. కానీ 1904 వ సం||లో జరిగిన ఒక సంఘటనతో ఆ పాతకోర్కెకి మరొక్కసారి ప్రాణంవచ్చి, పచార్లు చేయటం మొదలుపెడుతుంది. ఆ సంవత్సరంలో యంగ్‌ హజ్బెండ్‌ లాసా మీదకి జైత్రయాత్రకి బయలు దేరుతాడు. అందువలన యాటుంగ్‌ పక్క ఉన్న చుంబీలోయలో మజిలీ వేస్తార్ష్ము తమ సైన్యాలతోపాటుగా. అందుకోసం వాళ్ళు ప్రత్యేకంగా ఒక ఫీల్డ్‌ ఆసుపత్రిని తెరుస్తారు. అది బ్రిటీషు వారిదే కాబట్టి వారి ఆసుపత్రిలో నర్స్‌గా చేరిపోతుంది అన్నీ. రోగులకి, గాయపడ్డవారికి సేవ చేయటానికి, తన సేవలకి వారు మెచ్చుకుని తన చిరకాల కోరిక నెరవేర్చుకొనేందుకు సహాయం చేస్తారేమో అనుకొంటుంది, ఆశచావని అన్నీ మనసు.

ఆ దండయాత్రలో గాయపడ్డవారికి ఎందరికో సేవలు చేస్తుంది అన్నీ. యంగ్‌ హజ్బెండ్‌ తన జైత్రయాత్రని విజయవంతంగా ముగించుకొని వచ్చాక తెలిసిందేమిటంటే, టిబెట్‌ ప్రయాణానికి ఇంతకుముందు కంటే మరింత కఠినమైన ఆంక్షలు విధించబడ్డాయని. టిబెట్‌ ప్రయాణం చాలా కష్టమని తెలుసుకొన్న అన్నీ గుండె నీరైపోతుంది.

ఇన్నాళ్ళూ తన కలల బలంతో బతుకుతున్న అన్నీ టేలర్‌ చివరి ప్రయత్నం కూడా చిగురులోనే చితిగా మారేసరికి మానసికంగా దెబ్బ తింటుంది. ఏనాడో కుదుటపడిన తన ఆరోగ్యం ఈ దెబ్బతో చెదిరిపోయి, తనని వెక్కిరిస్తున్నట్లుగా పైకి పొంగుతుంది. ఈ పరిస్థితిలో తన ఉద్యోగాన్ని పోంట్‌సోకి బదిలీచేసి, తాను కొంతకాలం విశ్రాంతి తీసుకొంటుంది. పోంట్‌సో, అతని భార్య సిగ్‌జు అన్నీటేలర్‌ ఆరోగ్యం బాగుపడటానికి ఎంతో కష్టపడతారు.

1907 వ సంవత్సరం వరకూ అన్నీ యాటుంగ్‌లోనే ఉంటుంది. కానీ  క్షయవ్యాధి ముదిరిపోవటంతో తన అక్కయ్య, ఇతర మిత్రులు వచ్చి అన్నీని ఇంగ్లండుకి తీసుకుపోతారు. తాను పుట్టిన ప్రదేశంలోనే అన్నీ టేలర్‌ చివరి ప్రార్థనలు చేసుకొంటుంది. మరో జన్మంటూ ఉంటే తనని లాసాలోనే పుట్టించమని తప్పనిసరిగా కోరుకొని ఉంటుంది.

సుదూర ప్రాంతాల్లో నివసించేవారికి కూడా సువార్త వినిపించాలి అనే తపనతో అన్నీ టేలర్‌ చేసిన ప్రయాణాలు ఆమెకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెట్టాయి. టిబెట్‌లోకి ప్రవేశించిన మొదటి యురోపియన్‌ స్త్రీగా అన్నీ టేలర్‌ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. ఆత్మస్థైర్యంతో మనిషి ఎంతగొప్ప పనులు చేయగలడో నిరూపించి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన అన్నీ టేలర్‌ ఒక అసమాన్య స్త్రీమూర్తి.

                                                                                              – ప్రొ.ఆదినారాయణ

(ఇంకావుంది)

యాత్రా సాహిత్యం, , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో