కాళిదాసు కవిత్వం లో స్త్రీ – 2

ISSN 2278 – 4780

కుమార్తె నిశ్చయం సక్రమమైంది కనుక సంతోషంగా అంగీకరించాడు తండ్రి.  కఠోర తపస్సు చేత శివుని మెప్పించి తపోధనంతో ప్రేమదాసుడిగా కొనుక్కొంది. 

”అద్య ప్రభృత్య వనతాంగి తవాస్మిదాస: క్రీతస్త పోభిరితివాదిని చంద్రమేళా” శివుడు చేయి పట్టుకోగానే ఆమె కరిగిపోయిందా ?  మార్గా చలిల వ్యతికరాకులితేవ సింధు:  శైలాధిరాజ తనయా నయయేనస్థే తసే ” కొండ అడ్డం వచ్చిన నది వలె, సంక్షోభించింది, పరవశించింది. తండ్రి గారి అనుమతితో తన్ను చేపట్టమని చెలికత్తెల ద్వారా శివుని కోరింది.  ప్రేమ వివాహాల్లోని కష్ట నిష్టూరాన్ని శాకుంతలంలో మనకు విశదీకరించాడు కాళిదాసు.  తన కోరిక సఫలం అవుతున్నా కన్నె తల్లిదండ్రుల అదుపులోనే వుండటం శోభస్కరం అనే విషయాన్ని చెప్పడానికే ఈ సన్నివేశాన్ని కల్పించాడు.

ఒక యింటివాడనవ్వాలని తలంపు కలిగి, తనకు నచ్చిన పిల్ల తటస్థపడగానే, దానికి తగిన సన్నాహాలు ప్రారంభించాడు శంకరుడు.  పెళ్లి నిర్వహించేవారు పెళ్లి పెద్దలు.  జ్యోతి స్వరూపాలైన సప్త మహర్షులను మనసారా స్మరించాడు.  వారు సారుంధతీకులై సాక్షాత్కరించారు.  పిలువని పేరంటంగా అరుంధతిని ఎందుకని తీసుకు వచ్చారు. వీరు ఆ మాట ఇప్పుడేం చెప్పడు.  ముందు, ముందు మనకే అవగతం అవుతుంది.  సప్త మహర్షుల్ని అరుంధతిని సమానంగా గౌరవించాడు.  హిమవంతుడు ”స్త్రీ పుమానిత్య నాసైషా, వృత్తం హిమ హితం సతాం”.  ఆడవాళ్లూ, మగవాళ్లూ అన్న వివక్ష లేదు. ఎవరు సత్రవర్తన కలవారైతే వారే సత్పురుషులకు గౌరవనీయులట.  తరువాతి పద్యంలో ”ఏవం విధే కార్యే పురంద్రీణాం ప్రగల్భతా” అంటాడు.  ఏ విధమైనది, కష్టసాధ్యమైనందువల్లా శుభకార్యం అవడం వల్లా అన్నది మన ఊహకే వదిలాడు కాళిదాసు.

ఇక పెళ్లి బేరాలు.  శివుని తరపున పిల్లనడగడానికి సప్త ఋషులూ హిమవంతుని యింటికి వెళ్లారు.  హిమవంతుడు ఎంతకాలం నుంచో ఈ శుభముహుర్తం కోసమే ఎదురు చూస్తున్నాడు.  అయినా వెంటనే తల వూపలేదు.  ఏమంటావు అన్నట్లు భార్య ముఖంలోకి చూచాడు.  ఆడపిల్ల విషయంలో భార్య అనే నేత్రంతోనే చూస్తారుట గృహ మేథులు.  ఎంత వాత్సల్యం కల తండ్రి అయిన కుమార్తె హృదయపు లోతుల్ని తెలుసుకోలేకపోవచ్చు.  ఆ చదువు, స్వతంత్రం, ఒక తల్లికే వుంది.  భారతీయ సంప్రదాయంలో మేనాదేవికి భర్త గారికి కీర్తికరమైన ఈ కార్యం అభిమతమే అయ్యింది.  పతివ్రతలు మనసా, వాచా, భర్త యిష్టాన్ని వ్యతిరేకించరు. సరే వచ్చిన సప్తర్షుల్నీ, అరుంధతినీ గౌరవించి కూర్చోపెట్టాడు హిమవంతుడు.

సామాన్యంగా లోకమంతటా కూడ ఆడపిల్ల పెళ్లి అయ్యే వరకూ ఎంతో ఆందోళన పడతారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.  తీరా పెళ్లి నిశ్చయమయ్యేసరికి సంబరం కన్నా ముందర బెంగే వస్తుంది.  యిన్నాళ్ళూ కంటి దీపంలా వున్న అమ్మాయి దూరంగా వెళ్లిపోతుందే అన్నది బెంగ. యింత అపురూపంగా పెంచుకుంటున్నామే, క్రొత్త చోట ఈ పిల్ల ఏ విధంగా నెగ్గుకు వస్తుంది అన్నది ఆందోళన.  తల్లిదండ్రులందరికీ తప్పనిది ఈ పరిస్థితి.  అచలుడు కనుక హిమవంతుడు నిబ్బరంగానే వున్నాడు.  ఎంత వివేకవతీ, గంభీరురాలూ అయినా మేనాదేవి కన్నకడుపు కదా! యింతవరకూ ఎంతో నిబ్బరంగా వున్న ఆమె ఆత్మ వేదన బయటకు వచ్చింది.

” దుహితృ స్నేహలిక్లిబ ” అయిన ఆమెను ” వరస్యానన్య పూర్వత్వాలీ ” ఇటువంటి పెళ్లికొడుకు ముల్లోకాల్లోనూ లేడమ్మా.  అతడి భార్యయైన నీ కూతురు జగన్మాతగా పూజలందుకొంటుంది.  ఏ బెంగ లేకుండా ధైర్యంగా వుండు అని ఓదార్చింది అరుంధతి.  ఇదుగో ఇందుకే ఆమెను కూడా తీసుకొని వచ్చారు సప్త మహర్షులు.  శుభకార్యాల్లో సువాసినులు ముందు వుండాలన్నది భారతీయ సంప్రదాయం.

అమ్మాయి పెళ్లి విషయంలో బాగా ఆలోచించుకొని కుటుంబమంతా ఏకమాట మీద నిలచినపుడే ఆ వివాహం శోభస్కరం అవుతుంది..  అమ్మా, అయ్యా, తలో సంబంధం కోసం పంతాలూ, పట్టింపులూ వహిస్తే, అమ్మాయి వేరొకర్ని వరిస్తే ఆహా!  ఆ కుటుంబ శోభ చెప్పతరమా!

 అంగరంగ వైభవంగా పార్వతి పరిణయం జరిగింది.  పర్వతరాజు యింట అపురూపంగా పెరిగింది పార్వతి.  మహా శ్మశాన వాసియై, పాములూ, పచ్చి తోళ్ళూ ధరించి తిరిగే కాలాగ్ని రుద్రుడు ఆయన మన్నిస్తాడా ?  ఆయన అలవాట్లనీ, అభిరుచుల్ని ఈ సుమకోమలి సహించి అనుసరించగలదా?  కన్న కూతుర్ని అత్తవారింటికి పంపే ప్రతీ తల్లి మనస్సు ఈలాంటి సందేహాల తోనే సంక్షోభిస్తూ వుంటుంది.  పుట్టినింటి వాతావరణాన్ని మెట్టినింటి వాతావరణాన్ని సమన్వయించుకోగల ఓర్పూ నేర్పూ కుమార్తెలో కలగడానికి తల్లి సహకరించాలి.  ” భర్త వల్లభతయాహి మానసీం – మాతురస్యతి శుచం వథూ జిన: ”  భర్తకు యిష్టురాలు కావడం వల్లనే ఆడపిల్ల తల్లియొక్క పోగొట్టుగలదు.

” కావ్యేషు నాటకం రమ్యం – తత్రా పిచ శకుంతలా ” అని భారతీయ సాహితీ

సంప్రదాయంలోనే కాక వివిధ దేశాల సాహితీ ప్రియులందరి మన్ననలనూ పొందిన కావ్యరాజం శాకుంతలం.  శకుంతల కాలం నాటికి కన్యకు వరణ స్వాతంత్య్రమే కాక, వలచినవానిని స్వయంగా వివాహం చేసుకునే హక్కు కూడా సంఘంలో వుంది.   నాడు గాంధర్వ వివాహం శాస్త్ర సమ్మతమైన వివాహాల్లో ఒకటిగా గుర్తింపబడినది.  శకుంతలా దుష్యంతుల ప్రేమ వివాహాన్ని కణ్వుడు ఆమోదించి, ఆశీర్వదించాడు.  అయినా పదిమందిలో అంతర్పత్ని యైన ఆమెని భార్యగా అంగీకరించడానికి వెరచాడు దుష్యంతుడు.  దుష్యంతుని పాత్రకు ఉదాత్తతను చేకూర్చడానికిఅంగుళీయక వృత్తాంతాన్ని కల్పించాడు కాళిదాసు.  మహా భారత గాధలోనూ దుష్యంతుడు శకుంతలను నిరాకరించాడు.  అప్పుడు ఆకాశవాణి సాక్ష్యం చెప్పవలసి వచ్చింది.  అక్కడా యిక్కడా కూడా దుష్యంతుడు కేవలం ధర్మ భీరువు శకుంతలా సౌందర్యం ఒక వంక ఆకర్షిస్తున్నా పరదారను పరిగ్రహించరాదు అన్నదే దుష్యంతుని అభ్యంతరం. శిష్య సమేతమై మున్యాశ్రయం నుంచి వచ్చిన తాపస కన్య.  అందునా కణ్వుని పెంపుడు కుమార్తె యింతటి అబద్ధమాడుతుందా అని ఆయన ఆలోచించలేదు.  అదే లోకం తీరు.  ప్రేమ వేరు.  పెళ్లి వేరు.  ప్రేమించడం వరకూ అందరూ సిద్దమే.  గాంధర్వ వివాహానికి అష్ట విధ వివాహాల్లో ప్రతిపత్తి కల్పించినా, యిక్కడ దంపతులు కలసి కాపురం చేయాలనే నియమం లేదు.  ఎవరి దారి వారిదే కాపురం అంటూ వచ్చేసరికి, కుటుంబం, సంఘం అన్నీ పరిగణనలోనికి తీసుకోవాలి.  సంఘపు తిరస్కృతితో ఆ జంట అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాలి.  ఈ పరిస్థితి నాటికీ, నేటికీ అలాగే వుంది.

కళ్లు తెరవని పసిగుడ్డును తెచ్చి పెంచాడు కణ్వుడు.  ఆమె అత్తవారింటికి వెడుతూ వుంటే ఆయన హృదయం బెంగతో నిండిపోయింది.  కంఠ స్తంభిత భాష్పవృత్తి అయింది. ఆకారం తాపస సహజమైన ప్రశాంతతను వీడి చింతాజడమయిపోయింది.  అయితే ఆయన ప్రేమ కేవలంజీవకారుణ్య జనితం.  తన ఆశ్రమంలోని చెట్లనూ, లతలనూ, లేళ్లనూ పెంచినట్లే శకుంతలనూ పెంచాడు.  ఆమె సాటి మనుష్య బాలిక కనుక ఆమె పట్ల విశేషాదరం వుండటం సహజం. ఆమెను అత్తవారింటికి పంపుతూ ” భాగ్యాయత్త మత: పరం ” అని దైవం మీదనే భారం వేశాడు. ఇతరులు మన వద్ద దాచుకున్న డబ్బులా ఆడపిల్లను అత్తవారింటికి పంపడంలో ఆయన మనస్సు తేలిక పడిందట

”జాతోమమాయం విశద ప్రకామం – పత్వర్పితన్యాస ఇవాన్తరాత్మా”

 ప్రకృతి ధర్మానికి లోబడి బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల విషయం వేరు. జీవితం పొడుగునా వారికి ఆ బిడ్డపట్ల బాధ్యత వుంటుంది.  పుట్టగానే చెట్టుక్రింద కళ్లు తెరని శిశువుని వదలి వెళ్ళినా, గృహిథీ ధర్మం లేని వేశ్య అయినా, మేనక ఈ పాశాన్ని విడిపించుకోలేకపోయింది. అందుకే పుట్టెడు అవమానంతో, దు:ఖంతో వెనుతిరిగిన శకుంతలను కశ్యపాశ్రమానికి చేర్చింది. వంశకర్త కాబోయే భరతునికి జన్మనిచ్చే శకుంతలకు ఆశ్రయమిచ్చి కాపాడటం ప్రజాపతియైన కశ్యపుని ధర్మం.  యదార్థాన్ని గుర్తించిన దుష్యంతుడు పశ్చాతప్తుడై తనంత తానుగా కశ్యపాశ్రమానికి వచ్చి శకుంతలనూ, భరతునీ స్వీకరించాడు.

ఇవన్నీ కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాలు.  పురుషునితో సమానంగా తపస్సు చేసే హక్కు ఆనాడు స్త్రీ కుంది.  కఠోర తపోదీక్షలో వున్న పార్వతిని వయోవృద్ధులైన మునులంతా వచ్చి అభినందించారు. నేటి చదువుల వలె ఆనాడు తపస్సు మానవుల అభ్యున్నతికి సాధనం. మాళవికాగ్ని మిత్రంలో అగ్నిమిత్రుడు పరాక్రమం కలిగినవాడే.  కుమారుడైన వసుమిత్రుడు చేతికెదిగి శత్రువులపై విజయాన్ని సాధించాడు.  అయినా నాటి కాలంలో వున్న బహు భార్యత్వం అగ్నిమిత్రునికీ సంక్రమించింది.  పట్టమహిషిధారిణీ దేవి రాజతంత్రాన్ని అవగాహన చేసుకొని పరిపాలనలో భర్తకు సహకరిస్తున్న సమర్థురాలు.  మాళవ రాజకుమార్తెను తన భర్తకు వివాహం చేసి మాళవ రాజుల సహకారాన్ని సాధించడానికి పట్టపురాణి నిర్ణయించింది.  త్రోవలో దొంగల బారిన పడ్డ రాజకుమార్తెను సేనాధిపతియైన రాణిగారి తమ్ముడు రక్షించి అక్కగారి వద్దకు పంపాడు. నాటకీయంగా జరిగింది.  మాళవికాగ్ని మిత్రుల కలయిక ఆమె దాసీ అన్న భావంతోనే రాణి నిషేదించింది.  ఆమె సాటి రాజకుమార్తె అని నిరూపితం కాగానే స్త్రీ సహజమైన అసూయ లేకుండా ఆమెను తన అంత:పురంలోకి సగౌరవంగా, సాదరంగా ఆహ్వానించింది.  నేడు గరమూ, అసహ్యము అయిన బహు భార్యాత్వం నాడు తప్పనిసరి.

రఘువంశపు కడపటిరాజు, అగ్నిమిత్రుడు వ్యసనలోలుడై నిస్సంతుగా మరణించగా మంత్రులు అంతర్పత్నియైన అతడి రాణిని గద్దెపై కూర్చోబెట్టారు. ఈ విధంగా స్త్రీ సంఘంలో గౌరవప్రదమైన స్థానాన్ని హక్కుల్ని కలిగివుంది కాళిదాసు కాలంలో.

                                                                        ******

                                                                                     – కాశీచయనుల వెంకట మహా లక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , , , , , , , Permalink

One Response to కాళిదాసు కవిత్వం లో స్త్రీ – 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో