సుకన్య

(9వ భాగం)

                                                                                      – డా.కనుపర్తి విజయ బక్ష్

కోపంతో రెచ్చిపోయాడు వెంకయ్య ”మీరనుకునేలాటి సంబంధం… అంటే శారీరక సంబంధం లేదు. కాని మానసికంగా అతనితో ఎన్నో సార్లు నేను ఎంతో అనుభూతిని పొందాను… సిగ్గువిడిచి చెబుతున్నాను. అతనితో నేను భార్యగా ఎన్నో ఊహించుకున్నాను. అది అట్లా జరిగిన తర్వాత కూడ నేను వేరే వాళ్ళతో పెండ్లికి ఏ విధంగా సిద్ధమవుతాను”  ”శారీరక సంబంధంలేదంటావు, మానసిక సంబంధం అంటావు ఇదేమైనా నలుగురికి తెలిసేదా?  చచ్చేదా?”

”అదే తప్పు ఇంచు మించు ఇది మానసిక వ్యభిచారం లాంటిది కాదా! ఆత్మసాక్షి ఎపుడు వెన్నంటి ఉండదా? మనల్ని నిరంతరం హెచ్చరిస్తుండదా? దాన్నించి ఎట్లా తప్పించుకొగలం?

”ఏమో! నాకవన్ని అనవసరం అసలు నీతో ఇంతసేపు ఈ విషయాన్ని మాట్లాడటమే నేను చేసిన తప్పు. నీవు నేను చెప్పినట్లు వినలేదనుకో! మీనాన్న నిన్ను వదిలేస్తాడని అనుకోకు. నీవు చేసిన ఈ అప్రతిష్ట పని భరించలేక నేను మీ అమ్మ ఆత్మహత్య చేసికొని చచ్చిపోతాము… వెంకయ్య గట్టిగా మాట్లాడాడు.

”నాన్న! కాలం మారింది. మీరు ఈ పల్లెటూరులో ఉండి మీ చుట్టూ మీరు చూచే నలుగురి గురించి, మీకు తెలిసిన ఏ కొద్దిమంది గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. బయట సువిశాల ప్రపంచాన్ని చూడండి ఎంతమందికి వర్ణాంతర, మతాంతర వివాహలే కాదు. దేశం కాని దేశం వాళ్ళు ఒకరినొకరు పెండ్లాడి ఎంత హాయిగా సుఖంగా ఉంటున్నారో చూడండి… నా వల్ల మీకు అపకీర్తి ఏమీరాదు. చందుతో కూడా నా పరిధి దాటి నేను ఎపుడు వ్యవహరించలేదు. మీ అనుమతితో వివాహం చేసుకోవాలని మాత్రమే నిర్ణయించుకొన్నాం. అయినా నాన్నా! మీరు చందుతో ఒకసారి మాట్లాడండి. అతనంటే ఏమిటో మీకర్ధం అవుతుంది. ఎంత సంస్కారవంతుడో, ఎంత నిజాయితీపరుడో, ఎంత మంచివాడో…

”ఆపు” సుకన్య మాటలను మధ్యలోనే అడ్డుకున్నాడు వెంకయ్య… ”ఆ తక్కువ కులం వాడి సంగతి ఎత్తొద్దన్నానా?” అంటుండగానే సీతమ్మ వచ్చింది పైకి.

”ఏమిటి తండ్రి కూతుళ్ళు గంటలు గంటలు మాట్లాడుకొంటున్నారు? దేన్ని గురించి” అని అడిగింది.

”ఏముంది! నీ కూతుర్ని చదువుకోమని పట్నం పంపితే ఇది చేసిన నిర్వాకం చూడు… ఆ కుండలు చేసుకొనే కనకయ్య కొడుకు చంద్రధర్‌ని ప్రేమించిందట. అతన్ని తప్ప వేరు ఎవరిని పెండ్లాడనని మొరాయిస్తున్నది…” వెంకయ్య కూతురి గురించి వ్యంగంగా చెప్పాడు భార్యతో.

”అవ్వ ” అంటు బుగ్గలు నొక్కుకొంది సీతమ్మ. ఇలాటి పనులు ఏదో ఒకటి చేస్తారనే ఆడపిల్లలకు పెద్దచదువులు ఎందుకంటుంటే విన్నారు కాదు! చదువుకొన్నందు వల్ల ఇంటి గౌరవాన్ని నిలబెట్టే పనులు చేయాలి కాని, ఇట్లా ఇంటి పరువు ప్రతిష్ట పోయే పనులు చేయవచ్చా? అయినా ఆ వనజ బుద్ధిగా వాళ్ళ నాన్న చెప్పినట్లు విని పెండ్లికి ఒప్పకోలేదు.” సీతమ్మ కూతురిని ఏ విధంగాను సమర్ధించటానికి సిద్ధంగా లేదు. ఒకరికి ఇద్దరిని ఎదుర్కోవాల్సి వచ్చింది సుకన్య. అందునా వారెవరో పరాయి వాళ్ళు కాదు. కన్న తల్లిదండ్రులు.  జన్మనిచ్చివారు. ఏమని ఎదిరించాలి ఎట్లా మాట్లాడాలి… వారిని నొప్పించ కుండానే ఇప్పటి వరకు వ్యవహరించిన సుకన్య ఇకపైన అవసరమయితే గట్టిగా వాదించి అయినా తన మాట నెగ్గించుకోవాలనుకొంది. ”మీకు నేను అప్రతిష్ట తెచ్చేలాగ ప్రవర్తించలేదు. ఇకపై ప్రవర్తించను కూడ. మీరు ఒప్పకోకపొతే నేను, అతను చాలా దూరం వెళ్ళి పెండ్లి చేసుకొంటాం మీరనుమతిస్తేనే వస్తాం.”  ”చాలు గొప్ప ఘనకార్యం చేసావు. దీనికంటే అంతో ఇంతో విషం తాగి చావటం మేలు. రేపు బంధువులందరికి నా ముఖం ఏమని చూపించను అందరు కాకుల్లా పొడవరు. మీ అమ్మాయి ఇట్లా చేసిందా అని అడగరు” సీతమ్మ రయ్యిమని లేచింది.

”దీనికి ఇట్లా చెబితే వినదు. నీవు నన్ను ఏమిటో తక్కువగా అంచనా వేసావేమో! ఇదేమి సినిమా కాదు. నిజ జీవితం నేను ఈ కక్ష మనసులో బెట్టుకొని కనకయ్యను చంపించటం లేదా ఆ పిల్లాడ్ని చంపించటం లాంటివి ఏం జరగవు. అవమానం భరించలేని వాళ్ళం మేము. కాబట్టి నీ మీద ఒట్టు వేసి చెబుతున్నాం. నీవు నీ అభిప్రాయం మార్చుకోకపోతే ఈ రాత్రికే పురుగుల మందు తాగి ముగ్గురం చచ్చిపోదాం. బాగా ఆలోచించుకో” విసుగుగా అక్కడి నుండి లేచి వెళ్ళాడు వెంకయ్య. సీతమ్మ కూతురిని పట్టుకొని బుజాలు ఊపుతూ, ”నీకిదేం పోయేకాలమే! అసలు ఇట్లాంటి పని ఎందుకు చేసావ్‌? మీ నాన్న అన్నంత పని చేస్తాడు… నేను చెబుతున్నాను విను. నీకు మా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా చెప్పినట్లు అందరం కలసి చచ్చిపోదాం.

”అమ్మా? ఎందుకంతమాట అంటావు… ఒకవేళ చందుతో నాపెండ్లి జరగని పక్షంలో నేనసలు జీవితాంతం పెండ్లే చేసుకోను… కనీసంనన్నీ ఈ విషయంలో నయినా బలవంత పెట్టకండి” సుకన్య వచ్చే ఏడుపు ఆపుకుంటూ అన్నది. ”ఆ అట్లా అన్నావు బాగుంది. నీవు ఆదరిద్రపు పెళ్ళి చేసుకొనే దాని కన్నా అసలు పెండ్లి మానేయడం మంచిది” సీతమ్మ వెళ్ళింది విసురుగా కిందికి.

సుకన్య ఒంటరిగా ఉండిపోయింది. అసలు ఇటువంటి పరిస్థితి వస్తుందని తాను అనుకోలేదు. తండ్రిని ఎట్లాగో చెప్పి ఒప్పించగలననుకొంది. ఇప్పడు తనవల్ల కాదని తేలిపోయింది. నిజానికి తాను చేసింది తప్పేనా? ఆడపిల్లలు ఎవరినీ ఎప్పుడు తనంతట తానుగా యిష్టపడకూడదా? తల్లిదండ్రులు ఎవరిని యిష్టపడమని చూపితే వారినే ఇష్టపడాలా? ఈ సంకట పరిస్ధితుల్లో చచ్చిపోవాలని పిస్తుంది. కాని తాను చందుకిచ్చిన వాగ్దానం… తనని ఎటు కాకుండా బంధించి  వేస్తున్నాయి ఈ పరిస్ధితులు. తననొక్కర్తినే తల్లిదండ్రులట్లా ఒంటరిగా వదలి వెళ్ళిపోయారు…. ఆ అనంత దుఃఖ సాగరంలో మునిగిపోతున్న తరుణంలో తనకు ఆసరాగా ఎవరు లేరా! చందు… చందు… చందు… అనుకొన్నది తనలోతాను. చందు తన వాడు కానపుడు తనకసలు పెండ్లేవద్దు. తనిక జీవితంలో పెండ్లనే మాటే తల పెట్టదు. చందు తన గురించి ఏమనుకుంటాడో! తాను మోసం చేసిందనుకుంటాడేమో! అసలు అతన్ని ఎక్కడ కలవాలి? ఎట్లా మాట్లాడాలి? ఢిల్లీ నుండి ఎప్పుడు వస్తాడో!

తానెందుకు ఇంత నిరుత్సాహపడిపోతున్నది! మళ్ళి మరొక్కమారు తల్లిదండ్రులకు చెప్పి చూస్తే! తనమాట వారు విరటారేమో! ఇట్లాగే ఆలోచిస్తూ ఓ గంటసేపు కూర్చుండి పోయింది సుకన్య.

”ఏమే అట్లాగే కూర్చున్నావేమిటి రా! కిందకిరావా” తల్లి పైకి వచ్చి నిష్టురంగా అడిగింది. సమాధానం కోసం ఎదురు చూడలేదు.

”రేపు నిన్ను చూసుకుంటానికని రఘువాళ్ళు వస్తున్నారట. రమ్మని చెప్తే ఇక ముహూర్తాలు పెట్టుకోవటానికే. నీవు వద్దని అంటే యీ అర్ధరాత్రే అంతా పురుగులు మందు తీసుకొందాం ఏ సంగతి చెప్పు.”

తండ్రి కఠినంగా మాట్లాడినా తల్లి ప్రేమగా మాట్లాడుతుందంటారు కాని తన తల్లి ఏమిటి ఇంత చిత్రంగా మాట్లాడుతుంది.  సమాధానం ఏమి చెప్పలేదు సుకన్య.

గబగబా పైనుంచి వచ్చి తండ్రి దగ్గరకు వెళ్ళింది. ఆయన పడుకుందామని పందిరి మంచం ఎక్కాడు. సుకన్య అతని సమీపంలో నిలబడింది.

”నాన్నా! మీరు చెప్పినట్లు నాకు చచ్చిపోవాలని ఉన్నా చచ్చిపోలేను. నాకారణంగా మీరు బలవన్మరణం ఎందుకు కొని తెచ్చుకోవటం! అయితే నాకోరిక ఒకటి మన్నించండి… ఇక జీవితంలో ఎపుడు నా పెండ్లి మాట తల పెట్టకండి. ఈ ఒక్క కోర్కె తీర్చండి చాలు…” ఎట్లా వచ్చిందో అట్లా వెళ్ళిపోయింది. సుకన్య వెళ్ళాక వెంకయ్య తనలో తాను తర్కించుకోవటం ప్రారంభించాడు. అమ్మాయి చెప్పింది బాగానే ఉంది కానీ బంధువర్గమంతా పెండ్లి చేయలేదని తప్పుపడతారు. నలుగురు నవ్వుతారు. అయినా ఆచంద్రధర్‌తో పెండ్లికి అంగీకరిస్తే? ఊహు, అదెంత మాత్రం కుదరదు. అతనేమైన తమ కులమా? స్థలమా! అసలు వాడు ఎందులో తమతో సరితూగ గలడు! అమ్మాయి చెప్పినట్లు కొన్నాళ్ళపాటు పెండ్లి గొడవ ఎత్తకుండా ఉంటే అదే కొన్ని రోజుల తర్వాత సుముఖత చూపిస్తుంది. అపుడు చేయవచ్చు. ఇట్లా ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత అతని మనసు కుదుట పడ్డది.

సుకన్య కూడా ఆ రాత్రంతా నిద్రకు దూరమై, రాత్రికే కాపలా కాస్తూ మంచం మీద పడుకుంది. వద్దంటున్నా తనను చందు ఆ రోజు సడన్‌గా గుండెలకు హత్తుకోవటం, గాఢంగా తన పెదవులను ముద్దు పెట్టుకోవటం గుర్తు వస్తుంది. ఇక తనకు జీవితంలో మిగిలింది ఆ అనుభూతే. దాన్నే నెమరు వేసుకుంటూ తనజీవితం గడిపేయాలి. ఎందుకో తనను తాను ఎంత కంట్రోలు చేసుకుంటున్నా చందు స్పర్శ, చందు కౌగిలి, చందు చుంబనం కావాలని మనసు, శరీరం పదే పదే కోరుకొంటున్నాయి. ఇంతగా అతనికి అర్పణ అయిన తాను మరొకరి భార్యగా తనను తాను వంచించుకుంటూ, ఇంకోక వ్యక్తిని వంచిస్తూ ఎట్లా పెండ్లికి సిద్ధ పడగలదు! అట్లా జరగటానికి వీలు లేదు… ఆ నిర్ణయానికి వచ్చాక నిద్రపడుతున్నట్లనిపించింది. ఇంతలోనే పెద్ద పెద్ద అరుపులు… తల్లి ఏడుపు ఏమిటి కలా! కాదు నిజమే ఉలిక్కిపడి లేచింది సుకన్య .. తల్లి ఏడుస్తుంది.  చిన్నాన్నా, చిన్నమ్మ అంతా ఓదారుస్తున్నారు. డాక్టరుగారు వచ్చారు. ”ఏమిటి ఏమయింది…” సుకన్య తల్లినడిగింది. ఆమె ఏమి చెప్పలేదు. కాని ఏడుస్తున్నది. ”మీ నాన్నకు మైల్ట్‌ హోక్ట్‌ స్ట్రోక్‌ వచ్చింది. డాక్టరుగారు వచ్చారు భయం లేదులే…” చిన్నమ్మ చెప్పింది.

తండ్రి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. డాక్టర్‌ ఇంజక్షన్‌ ఇచ్చాడు. ”వెంటనే హాస్పిటల్‌లో జాయిన్‌ చెయ్యండి మిగతా అంతా నేను చూచుకుంటాను. అవసరమయితే పట్నంతీసుకెల్దాం” డాక్టరు గారు చెబుతున్నారు.

సీతమ్మను పట్టుకోవటం ఎవరి వల్లా కావటం లేదు. సుకన్య తల్లిని ఓదాదుర్దామని దగ్గరకు వెళ్ళింది ‘అమ్మా’ అంటు కౌగలించుకోబోయింది ‘సీతమ్మ’ సుకన్యను చూచి ముఖం తిప్పుకోంది.

”అక్కయ్య! అలా ఏడిస్తే ఎట్లా! ఏం కాలేదు బావగారికి. నీవు ధైర్యంగా ఉండాలి. లేకుంటే సుకన్య భయపడదూ? వనజ తల్లి ధైర్యం చెప్పే ధోరణిలో మాట్టాడింది.

”దానికా! ధైర్యం ఎందుకు లేదు, దీని మూలంగానే ఆయనకు గుండె నొప్పి వచ్చింది.

పిడిరాయిలాగ ఉండే మనిషి రాత్రంతా ఏమి ఆలోచించారో ఏమో! అందుకే వచ్చింది ఈ జబ్బు. చూడు అది ఎట్లా గుడ్లు మిటకరించుకుని చూస్తున్నదో. అమ్మా! తల్లి చాలు గొప్ప పని చేసావ్‌…” సీతమ్మ కూతురిని తిడుతూ మధ్య మధ్యలో ఏడుస్తున్నది.

”అమ్మా! ఎందుకమ్మా అట్లా మాట్లాడుతావ్‌! నాన్నకు ఏం కాదు నీవు ధైర్యంగా ఉండాలి మరి” సుకన్య తల్లిని ఓదారుస్తుంది. మిగతా వాళ్ళంతా వెంకయ్యను హాస్పిటల్‌లో చేర్చే ఆదుర్దాలో ఉన్నారు.

ఒక్కసారిగా సీతమ్మ రెండు చేతులు ఎత్తి కూతురికి దణ్ణం పెట్టింది. ”నీకో నమస్కారం తల్లి! నీమూలాన నాభర్త నాకు కాకుండా పోతున్నాడు. నా పసుపు కుంకుమలు నిలుపు తల్లీ” అంటూ ఏడ్చింది.

సుకన్య ఈ హఠాత్సంఘటనకు నివ్వెరపడిపోయింది. మరునిముషమే తల్లి దణ్ణం పెడుతున్న చేతులను విడదీసి వారిస్తూ అన్నది. ‘అమ్మా! నన్ను నీవు అపార్ధం చేసుకొన్నావ్‌! నానుంచే నాన్నకు ఇట్టా జరిగితే నా వల్లే ఆయనకు బాగవాలి. అందుకు నేను ఏమైనా చేస్తాను” అంది.

సీతమ్మ కూతుర్ని ప్రేమగా చూస్తూ ”నాకు కాదు ఆవిషయమేదో నాన్నతో చెప్పు తెలివి రాగానే… ఎంతో ఆందోళనపడ్డారో ఏమో!”

వెంకయ్యను పట్నంలో హాస్పిటలో జాయిన్‌ చేయనవసరం లేకుండానే నిమ్మళించింది. బాగానే ఉన్నాడు. కళ్ళు తెరిచి అందరితో మాట్టాడుతున్నాడు. మూడ్రోజులు హాస్పిటల్‌లోనే ఉంచారు. సుకన్య రాత్రింబవళ్ళు తండ్రి వద్దనే ఉండి పోయింది. ఒకరోజు ఆయన వద్ద ఎవరు లేకుండా చూచి ”నాన్నా! మిమ్మల్ని తెలిసి తెలియక కష్టపెట్టాను. నన్ను క్షమించండి మీయిష్టానికి వ్యతిరేకంగా ఏమిచేయను” అన్నది. ”ఆ సంతోషమమ్మా! చాలా సంతోషం..” కూతురు వైపు ప్రేమగా చూస్తు అన్నాడు వెంకయ్య. సుకన్య ఏం మాట్లాడలేదు.

”అమ్మా! నాకెందుకో బాబాగారిని ఒక్కసారి దర్శించుకోవాలనుంది.” ”ఇపుడెలా సాధ్యపడుతుంది నాన్న! నీకు కొంచెం తగ్గిన తర్వాత వెళ్దాం సరేనా” చిన్న పిల్లాడ్ని బుజ్జగించినట్లు అంది సుకన్య ”పోనీ నాకిట్లా జరిగిందని బాబాగారితో చెప్పి ఆయన దీవెనలు కావాలని చెప్పాలమ్మా! మీ బాబాయికి ఆయనంటే పడదు నీవే వెళ్ళిరావాలి”

వెళ్తాను వెంటనే. ఇప్పడే వెళ్తాను నాన్న మీరు నిశ్చితంగా ఉండండి” అంటూనే సుకన్య లేచింది.

తండ్రి ముఖంలో ఎంతో ప్రశాంతత తనవల్ల ఇంతమంది సంతోషిస్తారని అనుకున్న వెంటనే సుకన్యకు ఎక్కడలేని సంతృప్తి కలిగింది. తల్లి కారులోంచి  దిగింది. నుదుటి మీద పెద్దబొట్టు ముఖమంతా వెలిగిపోయేలా నవ్వు.

”ఏమ్మా! మీనాన్న మాట్లాడారా! బాగున్నారు కదా! ”ఆమె ఆయన్ని వదిలి ఇంటికి వెళ్ళి వచ్చిన రెండుగంటల్లో ఎంత ఆత్రం… ఎంత భయం… ఆ ప్రశ్నించే తీరులో ఆమె ఆదుర్దా వెల్లడయింది.

(ఇంకావుంది)

 

సుకన్య, , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో