దేహక్రీడలో తెగిన సగం

Vanaja Vanamali

Vanaja Vanamali

ఆడి  పాడే అమాయకపు బాల్య  దేహం పై..

మొగ్గలా  పొడుచుకు వస్తున్నప్పుడు..

బలవంతంగా   జొప్పించిన ఆడపిల్లననే జ్ఞానం

పదమూడేళ్ళ ప్రాయంలో..యవ్వనపు దేహం పై..

వసంతం విరిసినప్పుడు…. వీడని అమాయకత్వం 

 

నువ్వు ఆడదానివే సుమా అన్నట్లు 

నఖశిఖ పర్యంత చూపులతో..

గుచ్చి గుచ్చి తడిమినప్పుడు.. 

లోలోపల భయం, గగుర్పాటు తో 

అప్పటిదాకా లేని సిగ్గు తెర పైట అయి 

తనువంతా  చుట్టుకునే ముగ్ధత్వం 

కాంక్షల కౌగిలిలో నలిగిపోతున్నా

మోహపు పరవశంతో ఉప్పొంగినా    ..

నలిగిన  మేనుకు   అవే  తరగని

అలంకారమని  సగభాగం   నిర్ధారించాక

అనంత సృష్టి  రహస్యపుఅంచులు తాకే

కేళీ విలాసంలో ముఖ్య భూమిక గా

కామ్య వస్తువుగా..భోగ వస్తువుగా

మారిన  కుచ ద్వయాలకి

అన్నీ గరళమైన  అనుభావాలే  !

 

చిన్ని  చేతులతో ..తడిమి  తడిమి ..

ఆకలికి  తడుముకుంటూ న్నప్పుడు   ..

ఆ  పాలగుండెలు  బిడ్డ  ఆకలిని  తీర్చే

అమృత భాండా లని   …

ఆ గుండెలు పరిపూర్ణ  స్త్రీత్వపు  చిహ్నాలని

తన్మయత్వం తో..తెలుసుకున్న క్షణాలు

మాత్రం స్వీయానుభావాలు.

 

అసహజపు అందాలను ఆబగా చూసే వారికి.. 

సహజం అసహజమైనా,అసహజం సహజమైనా.. 

ఆ దేహం పై క్రీడలాడునది..ఈ నరజాతి వారసుడు  

చనుబాలు కుడిచిన నాటిని మరచిన బిడ్డడే కదా..

 

అసహజంగా పెరిగిన కణ సముదాయాలని

కుతికలోకి.. కోసి.. ఓ..సగ భాగాన్ని

పనలని పక్కన పడేసినట్లు పడేసాక..

అయ్యో అనే  జాలిచూపులు భరించడం,.

నువ్విక పనికరావనే..వెలివేతలు..సహించడం కన్నా

ప్రాణం పోతే బాగుండునన్న భావనే అధికం.  .

 

అమ్మ – అమృత భాండం.. 

స్త్రీ-సౌందర్యం..ఉద్దీపనం  సారూప్యమైనవే !

 

దేహం నదిలో 

ఎత్తు పల్లాలు,ఒంపు సొంపులు ,సొగసులును 

ఆబగా కొలుచుకునే కామచిత్తులకి  

ప్రవాహించినంత మేరా…  పచ్చదన్నాని నింపే 

ఆ నది అంతరంగం అర్ధమయ్యేది ఎన్నడు?  

పరచిన నగ్న దేహం పై మిగిలిన సగం పై 

విశృంఖలం చేసిన గాయం స్రవిస్తూనే ఉంది.     

అంతః చక్షువుతో .సౌందర్యపు ఝడిని కనలేని 

వికృతమైన ఆలోచనల కురుపు  

రాచ పుండు కన్నా భయంకర మైనది.

    –  వనజ వనమాలి

(టాటా మెడికల్  ఇనిస్ట్యూట్ ఆఫ్ కేన్సర్ (ముంబాయి) లో బ్రెస్ట్ కేన్సర్ విభాగంలో కొంతమంది అనుభవాలు విని విచలితమై వ్రాసుకున్న కవిత ఇది.)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , , , Permalink

29 Responses to దేహక్రీడలో తెగిన సగం