ఊరి మధ్య పది శాతం
లేనోళ్ళ తీర్పు
ఊరి బయటి వారిలో
చిచ్చు పెట్టింది
ఏలికలకు వైషమ్యాలు రగిల్చే
ఆయుధాన్ని ఇచ్చింది
వెలి పై మాటలేదు
అంటరాని తనం అమానుషం
పుస్తకాల అట్టలపై
అందంగా ముస్తాబు
గొడ్లకన్నా అన్యాయంగా
వెట్టి బతుకుల్లో భుజాలు!
భూముల్లో చిందిస్తున్న
చెమటకి ఖరీదు లేదు!!
ఊరి బయట తరాలుగా
వృత్తుల్లో తేడా
పొరపొచ్చాలు మనసుల్లో
కంచం మంచం
పొత్తు పొసగదు
ఉపకులాల దూరం పెట్టే
నిచ్చెన మెట్లల్లో
భాగస్తులే! ఎవరైనా!
తరాలుగా వారిదే ఆధిపత్యం
ప్రశ్నించిన గొంతులు
కాలక్రమంలో సాష్టాంగ నమస్కారం
లోన భయమా!
పోరులో లొసుగులా?!
రిజర్వేషన్ పొందిన తరం
తర్వాతి తరం త్యజించాలనే
సూక్తి బలంగా!
మూడు తరాలే లబ్ది పొందగా
ఓర్వలేని శీర్షం
క్రీస్తు పూర్వం నుండి నేటిదాకా
పూజారులు గా వారే!
లేదేమో అక్కడ మనస్సాక్షి!!
గెట్లు పెట్టిన జాతులు
గేట్లు బార్లా తీస్తాయా!
చెర బట్టిన జాతులు
మదమెక్కిన వేట కొడవళ్లతో
బలి తీసుకున్న జాతులు
ఎన్ని శిక్షలు పడ్డాయో
కళ్ళ ముందు కదలాడుతూనే!
కొలువుల జాతర లేదు
ప్రభుత్వ రంగం అటకెక్కింది
కాంట్రాక్ట్ పద్ధతిలో
రిక్రూట్మెంట్ జోరు
కులగణన ఊసు లేదు
ప్రాతిపదిక గుడ్డెద్దు చేలో పడ్డట్టు
ఎవరెంతో వారికంత అనే తీర్పు రాదు
ఎవరెవరు ఎంతో తేల్చి
ఎవరి వాటా ఎంతో వనరుల
కాడి నుంచి మొదలెట్టే దాకా
వారి పీఠాలు కదిలే
మహత్తర పోరాటం
రాజ్యాధికారం దిశగా
కదిలేదెన్నడో?!
– గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~