వైద్యో నారాయణో హరిః
అన్నారే గానీ
వైద్యో నారీ అనలేదే!
ఆధిపత్య లోకంలో
ఆమె వయస్సు
ఆమె కి శాపమై వర్ధిల్లుతుంది!
కులం వెతికి మరీ
కొవ్వొత్తుల ర్యాలీ ల జోరు
అందులో సైతం ఆమె వైపు చూపులు
అదే దృష్టి తో అనేకం
సృష్టి లోపం కాదు హ్రస్వ దృష్టి అతను
వైద్య వృత్తి లో ఆమె
ఆమె రక్షణకు మగాళ్లే
అటూ ఇటూ ఆమె ప్రాణ రక్షణలో
పరిగిడుతుంటే
ఎప్పుడు పడ్డాయో ఎక్స్ రే కళ్ళు
ఆ కళ్ళను కెమెరా కళ్ళు పసిగట్టలేవ్
పసి గట్టినా పని చేయనీయని రాజకీయ దర్పం
లంబ కోణంలో
విరచబడ్డ కాళ్ళ వెనుక ఎంతటి పైశాచికం దాగి వుందో!
కళ్ళద్దాలు పగిలి గుచ్చుకుని గాయపడ్డ కళ్ళల్లో
ఎన్ని కలలు మాడి మసై పోయాయో !
పెదాలపై కర్కశంగా గాట్లు
మెడ బొక్క విరిగి అచేతనావస్థ లో ఆమె
ఓ ప్రశ్నను సంఘంపైకి సంధించి నిష్క్రమణ
ఎవరు బాధ్యులో తేలదు
సానుభూతి వెల్లువ లో ఆమె ఓ సరుకై
కొట్టుకుపోతుందంతే!
ద్రవ్య కొలమానంలో మాన ప్రాణాల కో ఖరీదు కట్టి
షరా మామూలే!
రేపేంటి ప్రశ్న సజీవంగా ఉండాలంటే
పిడికిళ్ళు బిగించాలంతే!
– గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~