అరణ్యం 2 –వాన గాయం – దేవనపల్లి వీణావాణి

సరిగ్గా ఇప్పటికి రెండువారాలనుంచి వానలు కురుస్తూనే ఉన్నాయి. ఏటూరునాగారం చుట్టుముట్టు నీళ్ళుచేరిదాదాపు మూడురోజులు గడుస్తున్నది.ములుగుకువెళ్ళే రోడ్డు కొట్టుకుపోయింది. రామప్పచెరువునుంచి మొదలుకొని ములుగురోడ్డు తెంచుకుని నీళ్ళు సముద్రాన్ని తలపించేలా నిలిచిపోయాయి.గ్రామాలకు గ్రామాలు తరలించే పరిస్థితి ఏర్పడింది.ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు కూడా. ఇటువైపు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. నీళ్ళలో నానిపోయిన మట్టిగోడలు కూలిన సంఘటనలు ఎన్నో.అంతా భీభత్సంగా తయారైంది. ములుగువరకు వెళ్ళి పరిస్థితి చూసివచ్చాను. అటవీశాఖ పనులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి.ఎప్పుడో చానాళ్ళక్రితం ఇటువంటి పరిస్థితి వచ్చిందనీ, రామప్పచెరువు ఇంత నిండి పొంగిపొర్లడం గతంలో ఎప్పుడూ లేదనీ బయట అందరూ అనుకున్నమాట. ఏటూరునాగారంనుంచి తాడ్వాయివరకు ఉన్న సింగల్ రోడ్డు,రెండు వైపులా ఏపుగా ఉన్న చెట్లు,కురుస్తున్న మంచుముత్యాల వాన ఉల్లాసంగా అనిపించినా మిగలినదేదీ ఉల్లాసంగా లేదు. వరదల్లో ఎన్నో జీవులూ కొట్టుకుపోయి ఉంటాయి. జీవుల స్థావర మార్పకు వరదలు సహజకారకం. పాములు,ఇతర సరీసృపాలు, చిన్నచిన్న జంతువులు ఇలా కొట్టుకుపోతుంటాయి. మనుషులు కొట్టుకుపోవడం జరిగినప్పుడు జంతువులమాట ఎత్తే పరిస్థితి ఉండదు.

ఎప్పుడువానో,ఎప్పుడుఎండో తెలియని పరిస్థితి వచ్చింది. మేమున్న కార్యాలయపు గోడలు, విడది గోడలు నీటితో నానిపోయాయి.పాకురుపట్టడం కనిపిస్తోంది. ఫలానా స్థలం మునిగిందనీ, ఫలానా స్థలం కొట్టుకుపోయిందనీ టీవీనో,సెల్ఫోనొ,సహాయకులో ఏదో సమాచారం చేరవేస్తున్నారు. ఋతుజనిత సమస్యలు ఋతువుకాలం ముగిసేలోపున కనుమరుగౌతాయనే నమ్మకం ఇంతకుముందు ఉండేది. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం లేదు. కొంతకాలం క్రితం సర్వాయి, చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆక్కడి ప్రజలు తాము ముప్పై నలభై ఏళ్ళకిందట గోదావరి వరదలప్పుడు ఆయా ప్రాంతాలకు వచ్చి స్థిరపడ్డామని చెప్పారు.చాలా పెద్ద వరదలనీ అప్పటికి వేరే చోట ఉండేవాళ్ళమనీ , వరదల్లో తమకున్నవన్నీ కొట్టుకుపోగా గవర్నమెంటు ఇక్కడ ఉండాలని సూచించిందనీ చెప్పారు.తమను ఇక్కడ ఉండమన్నట్టు గవర్నమెంటు ఇచ్చిన కాగితాలు తమవద్ద ఉన్నాయనీ చెప్పారు.ఇలా వినడం తప్ప కైఫియత్తులలాగా ఇక్కడి చరిత్రలు నమోదు చేయబడిన వివరాలు లేవు. గ్రామపెద్దలు ఎవరైనా చెప్పినది ఇప్పటికైనా రికార్డు చేయాలేమో అనుకున్న సందర్భాల్లో అదొకటి. ఇప్పుడు వస్తున్న వరదలలోకూడా కొన్నిగ్రామాలు చెదిరిపోయాయి. గిరిజనగూడాల్లో అన్నీ వెదురుతోనో,పొరకతోనో అల్లిన తడికల గోడలు, కింద మట్టి, బురదతో బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. గిరిజన గ్రామాలలో పక్కా ఇండ్లు తక్కువ, కాబట్టి నీళ్ళ ఉధృతిని బట్టి ఆవాసాలు కోల్పోయే అవకాశమే ఎక్కువ ఉంది.అధికారులు, ప్రజాప్రతినిధులు చేయవల్సింది చేస్తూనే ఉన్నారు. చేసే చేతులు తక్కువ ఉన్నప్పుడు సమయస్పూర్తీ,ప్రణాళికతో పనిచేయడం సత్వర ఉపశమనం కలిగిస్తాయి. గతంలొ పాటించిన పద్దతులు అందుబాటులో ఉంటే ఇంకా మంచిది, లేకపోతే అదే పని మరలా అదే బిందువునుంచి మొదలు పెట్టడం కాలహరణం మాత్రమే కాక అనుభవైక నైపుణ్యం అందిపుచ్చుకోలేనివారమవుతాం.

ముప్పై నలభై ఏళ్ల క్రిందట వచ్చిన పెద్ద వరదలు అంటే 1986 గోదావరి వరదలే. నాటి గోదావరివరదల భీభత్సం గురించిన బాధాకరమైన జ్ఞాపకాలు, పరీవాహక ప్రాంతాల్లో మిగిల్చిన విషాదం ఎవరూ మర్చిపోలేరు. మరలా రెండు మూడు సార్లు వరదలు వచ్చినప్పటికీ అవేవీ 1986నాటి వరదలలాంటివి కాదు. అయినప్పటికీ వరదలు సృష్టించే సమస్యలు తక్కువైనా , ఎక్కువైనా వైయుక్తిక జీవనంమీద అంతే ప్రభావం చూపగలవి. 1986లో నాటి ఖమ్మం జిల్లా కలెక్టర్గా పనిచేసిన IYR కృష్ణారావుగారు వరదలను ఎదుర్కొన్న పరిస్థితులని క్రోడీకరించి ఒక పుస్తకం వేశారని చదివాను. ఆ పుస్తకం ప్రస్థావన తెస్తూ భద్రాచలం ITDA ప్రొజెక్టు అధికారిగా పనిచేసిన విద్యాసాగర్ గారు తన భద్రాచలం మన్నెంకతలు పుస్తకంలో కృష్ణారావుగారు “మార్గదర్శిని”వంటి పుస్తకం రాశారనీ దాని ఆధారంగానే తాను పనిచేసిన 1988లో మరలా వరదలు వచ్చినప్పుడు అధికారులకు సూచనలిచ్చారనీ రాశారు. పుస్తకంపేరు మార్గదర్శినినా లేక వారు సూచించిన విధి విధానాన్ని అలా చెప్పారో తెలియలేదు, కానీ ఇప్పటికీ ఎక్కడ వరదలు వచ్చినా ప్రభుత్వాలు సలహాలు తీసుకొనే అత్యున్నత అధికారుల్లో కృష్ణారావుగారు ఒకరు. నాకా మార్గదర్శిని వివరాలు దొరకలేదు.మా కార్యాలయంలో వరదలనిర్వహణమీద ఎటువంటి సమాచారం ఉండే అవకాశం లేదు. క్లిష్ట పరిస్తుతుల్లో అందరూ కలిసి పనిచేయాల్సి రావడం ప్రభుత్వవిధి నిర్వహణలో భాగం కనుక గిరిజనులు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లోనూ, వన్యప్రాణులు అధికంగా ఉండే ప్రాంతాల్లోనూ కనీసఅవగాహన కోసం ఉంటే బాగుంటుందని అనిపించింది. అలాగే నీటి తీరువానిర్వహణలోనూ వరద ప్రాంతాల విషయ అవగాహన పనికి వస్తుంది.

ఏటూరునాగారానికి సంబంధించినంతవరకు ఇట్లా వరద స్థితిగతులని ఇక్కడ స్పెషల్ డిప్యూటీ కలేక్టర్గా పనిచేసిన ఫణికుమార్ గారు తన గోదావరి గాథల్లో రాశారు. ఆ గాథలూ 1986నాటి వరదలవే.ఈ పుస్తకంలో రాసిన వివరాలను బట్టి 1986 నాటికి ITDA కార్యాలయం నిర్మాణంలో ఉంది. నాడు అక్కడ చావలి వెంకట శివరామ కృష్ణ శర్మ గారు ప్రొజెక్టు ఆఫీసర్ గా ఉన్నారట. ITDAకార్యాలయం మా కార్యాలయానికి కొన్ని అడుగులదూరంలోనే ఉంటుంది.అప్పటికి ఇది రేంజ్ కార్యాలయమే. అప్పుడు వరంగల్ ఉత్తర డివిజన్లోని ఒక రేంజ్ కార్యాలయం. అప్పుడు కార్యాలయ స్థితిగతుల ఆనవాళ్ళు ఏవీ మిగిలిలేవు, ఒక్క చెక్పోస్టు, కలపడిపో తప్ప.శివరామకృష్ణ శర్మగారివల్లనే ఫణికుమార్ గారు ఏటూరునగరం వచ్చారట. రావడం రావడం వరదల్లో చిక్కుకుంటే ఉన్న ఫలంగా సహాయక చర్యలలో పాల్గొన్నారట. అది ఆగస్టు పధ్నాలుగో తారీఖు అంటూ చెప్పుకుపోయారు. ఏటూరునాగారం చేరుకోవడానికి పస్రా దగ్గర దయ్యంవాగు పెట్టిన తిప్పలు, గోదావరి ఉదృతికి కొట్టుకుపోయిన రామన్నగూడెం,లక్ష్మీపురం వూళ్ళ దయనీయ స్థితికి గిరిజనుల కన్నీళ్ళు కలగలిపి చెప్పిన ఈ గాథలొకటే సామాన్యులకు దొరికే కైఫీయత్తు. గిరిజనప్రాంతాల్లో ముఖ్యఅధికారిగా ఉంటూ వాస్తవ చరిత్రలను నిక్షిప్తం చేసిన తీరు ఎంతగానో ఆదర్శనీయం. లక్ష్మీపురం వరదల్లో కొట్టుకుపోయినప్పుడు తన భర్త, ఇంక తనను తన ఆరునెలలపాపను పట్టుకొని ఈదుతూ కాపాడడం సాధ్యంకాదని నువ్ మంచిగుండు మామ అనిచెప్పి విడిపించుకుందట ఓ ఇల్లాలు, పునరావాస శిబిరంలో చేరిన ఆ భర్త కిష్టయ్యను చూసి చలించిపోతారు ఫణికుమార్. ఆ మాటకొస్తే లక్ష్మీపురం ఇప్పటికీ ఉంది కన్నాయి గూడెం మండలంలో, కానీ తమ కిష్టయ్య ఏమయ్యాడో వాళ్లకు తెలుసో లేదో, తెలిస్తే ఏమైనా చెప్పగలరో నాకూ తెలుసుకోవాలనిపించింది. కానీ తెలియలేదు. వలసదారుల చేతిలో భూమిని పోగొట్టుకున్న చింతా సాలక్కలూ, ఎలుగుబంటి దాడిలోముఖం చెదిరిపోయిన రాకీ తల్లులు,తండ్రులుమాత్రం ఇంకా కనిపిస్తారు. ఇలాటి గాథలే భద్రాచలం ITDA ప్రొజెక్టు అధికారిగా పనిచేసిన విద్యాసాగర్ గారు భద్రాచలం మన్నెం కతలుగా రాశారు. విధ్యాసాగర్ గారు రాసింది రెండేళ్ల తర్వాత కాలానికిచెందిన అదే గోదావరినది కొనసాగింపుగా పొందిన స్వీయఅనుభవాలు. తదుపరి ఏటూరునాగారంలోనూ, ఉట్నూరులోనూ ITDA ప్రొజెక్టు అధికారిగా పనిచేసి కొన్ని కలలు కొన్ని మొలకువలు రాసిన వాడ్రేవు చినవీరభద్రుడుగారు.వీరంతా తమ విధులకు వెలుపల అంతకన్నా ఎక్కువ బాధ్యతగా ఆయా ప్రాంతాల, ప్రజలజీవన చరిత్రలను,అనుభూతులను, లక్ష్యాలను రాసి పెట్టారు. ఆయా ప్రాంతాలకు అధికారులుగా వచ్చేవారికి ఇవి మహత్తర దృష్టి కోణాన్ని పరిచయం చేస్తాయి.

ఏటూరునాగారం అటవీశాఖకుచెందిన మరో ముఖ్యమయిన విషయం గోదావరి గాథలలో దొరికింది. అదేమిటంటే గిరిజనులమీద అధ్యయనం కోసం యాభై ఏళ్లు మన దేశంలో ఉండి విలువైన వివరాలతో పుస్తకాలు రాసి ఇక్కడే జీవితాన్ని ముగించిన ప్రఖ్యాత మానవ శాస్త్రవేత్త హేమండార్ఫ్,తన భార్య ఎలిజబెత్ తో పాటు తాడ్వాయిలో అటవీశాఖ వారు నిర్మించిన కుటీరాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకున్నామని రాశారు ఫణికుమార్ గారు. అది 1986 శీతాకాలం అని రాశారు. అంటే అప్పటికే అక్కడ మనవాళ్ళు నిర్మించిన కుటీరాలు ఉన్నాయన్నమాట. అది నిజమే, అక్కడ 1980 నాటికే ఆ కుటీరాలు నిర్మించడానికి వేసిన శిలాఫలకం ఉంది. కానీ ఎక్కడ కూడా ఈ విషయానికి చెందిన ఫోటోలో పత్రికా ప్రచురణలో ఎక్కడా లేవు.ఒక్క ఫోటో అయినా దొరికితే ఇప్పుడున్న తాడ్వాయి పర్యావరణ విద్యామందిరంలో ఉంచేవాళ్ళం.అలా చేయడంవల్ల మా విద్యామందిరానికి ఒక నిండుదనం వచ్చేదేమో అనిపించింది. హేమండార్ఫ్, ఆయన సతీమణి ఆదిలాబాదులో ఎక్కువ పనిచేశారు. Tribes of India: Struggle for survival, The Gonds of Andhrapradesh, The Rajgonds of Adilabad వంటి విలువైన పుస్తకాలు రాశారు.వారిగురించి రాయడం ఒకపుస్తకమే అవుతుంది.అయితే ఆయన ఆదిలాబాదులోనే కాకుండా అప్పటికి యాభై ఏళ్ల క్రితం ఖమ్మంకూడా వచ్చారట.తాను ఇంతకుముందు చూసిన ప్రదేశాలు, ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి వచ్చేవారట.అయితే 1986లో ఏటూరునాగారంవచ్చి తాడ్వాయిలో సేదదీరి హైదరాబాదు వెళ్ళాక ఆయన భార్య చనిపోయారు.ఆమె కోరిక ప్రకారం, వారు ఎక్కువకాలం నివసించిన ఆదిలాబాదులోనే అంత్యక్రియలు నిర్వహించారు.ఆయన ఒంటరివాడయ్యాకకూడా గిరిజనులమధ్యే గడిపారు. 1989లో ఒక్కరే భద్రాచలం వచ్చినట్టు విధ్యాసాగర్ గారు రాశారు.ఇలాంటి వివరాలు, ప్రముఖుల సందర్శనలు, అభిప్రాయాలు,సలహాలు రికార్డు చేసుకోవడం మునుముందు చేయబోయే ప్రణాళికలకు ఎంతగానో ఉపయోగపడతాయి.ప్రాంతీయ అభివృద్ది కార్యక్రమాలకు శాఖాబేధం అంతగా వర్తించదని నా అభిప్రాయం. ఉమ్మడి ప్రణాళికలే ఎక్కువ ప్రయోజనాలు నెరవేర్చగలవు. ఏటూరునాగారం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే లేదు, ముప్పై యేళ్లలో మార్పులు వచ్చాయి.రవాణా మార్గాలు పెరిగాయి,పాఠశాలలు వెలిశాయి, ప్రజల్లో చైతన్యమూ వచ్చింది. కాకపోతే అతివాద పరిస్థితులల్లో కాస్త ఆలస్యంగా ప్రపంచంతో అనుసంధానం అయ్యాయి.దీనివెనక ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా భయంతోనో బాధ్యతతోనో పనిచేసిన ఉద్యోగబృందం ఉందన్న విషయంమాత్రం మర్చిపోకూడని విషయం. ఫణికుమార్ గారు గోదావరిగాథల్లోనూ విద్యాసాగర్ గారు తన మన్యం కతల్లోనూఇంకా రాయబడని,చెప్పబడని కతలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఇంకా చేయాల్సిన పనులు, చెప్పుకొని తీరవలసిన కథలు మనల్ని చూడమని వినమనీ చెప్పకనే చెప్పారు.

ఏటూరునాగారంలో జంపన్నవాగు, దయ్యంవాగువంటి పెద్దవాగులతోపాటు రెండువందలకు పైగా పెద్దచిన్న నీటి తావులున్నాయి. అన్నీ నిండుకుండల్లా పొంగిపొర్లుతున్నాయి.గత ఐదారేళ్లుగా బొగత జలపాతం,లక్నవరం చెరువు, తాడ్వాయి విడదివంటివి పర్యాటక ప్రాంతాలుగా బాగా ప్రాచుర్యం పొందాయి. తగిన సౌకర్యాలు పెంచడంతో గ్రామాలలో అనుబంధ రంగాలలో అభివృద్ధి కనిపిస్తున్నది. అయితే ఇప్పటి వరదలు సృష్టించిన చిందరవందర పరిస్థితుల్లో అంతా అస్తవ్యస్తంగా తయారయింది.ఎటూ తోచని విపత్తుల కాలంలో నా సహాయకురాలే వూళ్ళో విషయాలు చెప్తుండేది. మొన్నటి ఎండాకాలంలో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంటి పనులకు సహాయకురాలు ఒకామె వస్తుందని చెప్పారు.ఆమె, విడదిలో చేరిన మూడో రోజున వచ్చింది.నాగారంనుంచి వచ్చేది. నేనొక్కదాన్నే కనుక నాకుపెద్దగా చేయాల్సిన పనేమీలేదు. ఆమె ఎన్నో కబుర్లు తీసుకువచ్చేది. కొంచం నా గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కూడా ఉంది. ఆమె అమాయకంగా అడిగిన ఎన్నో విషయాలు చెప్పాను. గోదావరి వరదల గురించి, కిష్టయ్య గురించి, కొన్ని నాగురించీ, నా రెండు కవిత్వాల పుస్తకాల గురించి. తానూ నిన్నా మొన్నటివానలకు తమ ఇల్లు ఒ పక్క కూలిపోయిందనీ తన పక్కా ఇంటి నిర్మాణం సమయానికి డబ్బు అందక సగంలోనే ఆగిపోయిందనీ చెప్పుకొచ్చింది.

నాగారం చుట్టుపక్కల ఇలా పాక్షికంగానో,పూర్తిగానో ఆవాసాలు దెబ్బతిన్నవాళ్ళు చాలామందే ఉండవచ్చు. మొన్నటి మే నెలలో ఇరవై ఏళ్ల తర్వాత మొదటిసారి ఇక్కడ పులి ఆనవాళ్ళు గుర్తించాము. పులి వచ్చి వెళ్లిందో, ఇక్కడ స్థిరంగా ఉండాలని అనుకుంటే ఈ వరదల్లో ఎటుపోయిందో. జంతువులకు మనకన్నా విపత్తుల విషయాలు ముందే తెలుస్తాయంటారు. అవి తమను తాము రక్షించుకుంటాయనీ ఎన్నో ఉదాహరణలు చూపిస్తారు, కానీ కిలోమీటర్ల కొద్దీ వరద ముంచెత్తితే అవి మాత్రం ఏం చేయగలవు? మళ్ళా వరదపరిస్థితులు కుదుటపడ్డాక ఏదో ఒకఆధారం దొరికితే గానీ పులి ఆవాసం నిర్దారించలేం. పులులు మంచి ఈతగాళ్లు,సులువుగానే తప్పించుకోగలవని భావించుకోవాలి. సుందర్బన్ మడ అడవుళ్ళో నిత్యం ఇలాటి వరద పరిస్థితులే ఉంటాయి. అయితే అక్కడ పులులు ఆ వాతావరణానికి అలవాటు పడిపోయాయి. పులులు మనుషుల్ని తినడం అక్కడ సాధారణం. ఆ పులులకు మ్యాన్ ఈటర్స్ అనిపేరు. ఒక పరిశోధన ప్రకారం నిత్యం ఉప్పునీళ్లలో ఉండడం వల్ల మనిషి మాంసం మృదువుగా ఉండి సూక్ష్మ పోషకాలను అందిస్తుందనీ అందువల్ల మనుషుల్ని తినడానికి అలవాటు పడ్డాయని తేల్చారు.
మనదగ్గర ఒకప్పుడు నల్ల చిరుతలు, చిరుతలు, పులులు ఇలాగ మనుషుల్ని చంపుకుతినేవి ఉండేవి. వాటిని ప్రత్యేకంగా వేటాడి చంపేవాళ్ళు.ప్రఖ్యాత వేటగాళ్ళు(Ethical hunters అందాం) జిమ్ కార్బెట్ , కెన్నెత్ అండర్ సన్ వంటి వారు పులులని వేటడంలో తమ అనుభవాలను పుస్తకాలు వేశారు. ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన పుస్తకాలవి.ప్రస్తుతం మనవద్ద పులులదాడులు చాలా అరుదనే చెప్పాలి. సుందర్ బన్లో అయితే పులుల వల్ల ఎన్నో కుటుంబాలు విచ్చిన్నం అయ్యాయి. పులుల దాడులలో తమ భర్తలను కోల్పోయిన స్త్రీలు తగిన పరిహారం కోసం ఉద్యమించే పరిస్థితులున్నాయి. అలాగా భర్తలనుకోల్పోయిన స్త్రీలను స్వామి ఖేజోస్ అంటారు వాళ్ళు.పర్యావరణ రక్షణ , ప్రజల రక్షణ రెండిటికీ సమన్వయం కుదర్చడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారిందక్కడ. మనవద్ద ఎక్కువగా ఎలుగుబంటి దాడులు,పోతే పశువులమీద దాడి చేసే చిరుతల సంఘటనలు ఎక్కువ. ప్రభుత్వం నష్టపోయిన వారికి నష్ట పరిహారం అందిస్తున్నది. ఏటూరునాగారంలో బీడీ ఆకో ,మోదుగ ఆకో లేక ఇతర సంధర్భాలలోనో ఎలుగుబంటు దాడిచేసిన సంఘటనలున్నాయి. ఫణికుమార్ గారు రాసిన రాకీ తల్లి కథ ఎలుగుబంటు దాడిలో మొఖం పోగొట్టుకున్న రాకీ అన్న గిరిజన స్త్రీ కథ. విద్యాసాగర్ గారి నా మొకం మల్లొచ్చింది సారూ కథలోనూ ఒ వృద్ధుడు మొఖం పోగొట్టుకుంటాడు. ఈరెండూ ఎనభైయ్యవ దశాబ్దపు గిరిజనులస్థితిని చూపిస్తాయి.

వన్యప్రాణుల దాడిలో గాయపడిన, ప్రాణాలు కోల్పోయిన అటవీఅధికారులూ ఉన్నారు. వన్యప్రాణీచట్టం వచ్చాక వన్య ప్రాణుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడినవారికి పరిహారం ఇవ్వడం జరుగుతున్నది.చట్టాల మీద అవగాహన , మారిన సామాజిక పరిస్థితుల్లో అడవికి వెళ్ళేవాళ్ళ సంఖ్య తగ్గడంవంటివి ప్రజలపై వన్యప్రాణుల దాడుల సంఖ్యను తగ్గించాయి. కరువు, వరదలు, ఆవాసాలధ్వంసం,ఆక్రమణవంటివి స్వయంగా వన్యప్రాణులసంఖ్యనూ తగ్గించేయడమూ దాడులసంఖ్యను తగ్గించింది.

వరదలఉధృతి మరో నాలుగురోజులకుగానీ తగ్గలేదు. నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయాక అందరూ మళ్ళా తమపనుల్లో పడిపోయారు. వారం పదిరోజులుగా కనిపించని కోతులు మళ్ళాకనిపిస్తున్నాయి.కలపదుంగలు నీటిలో నానిపోయి బెరడు సందులలోంచి పుట్టగొడుగులు వస్తున్నాయి. అక్కడక్కడా ఆరుద్రపురుగులు అస్సామీ పడుచులు పెట్టుకునే ఎరుపు నారింజరంగు బొట్టు బిళ్ళల్లాగా దర్శనమిస్తున్నాయి.పాత క్వార్టర్స్ లో భద్రపరిచిన కాగితాలకట్టల పరిస్థితి చూసాము. చెమ్మ పట్టాయి. కొన్నిరోజులు గాలితగిలేచూడాలని చెప్పాను. అవి అటవీశాఖను పురవ్యవస్థీకరణ చేసినప్పుడు ఒక్క ఏటూరునాగారంను కొన్ని రేంజులుగా విడగొట్టినప్పుడు మూటగట్టిపెట్టిన ఫైళ్ళు. కాగితం పాడైతే సమాచారంపోతుంది. బయట ఇసుకమేటవేసిన పొలాలు,ఉన్న కాలిబాటకూడా దెబ్బతిన్న పల్లెలు, చుట్టూఉన్న నీళ్ళలో కరువైన మంచినీళ్ళు, తడిసిన ధాన్యపుముద్దలవంటి సమస్యలనుంచి జనజీవనం సాధరణమౌతున్నవేళ కాగితాలకెక్కని కథలు కొన్నిమాటలుగా చెవినపడ్డాయి.పెద్ద జీవితకథలో చిన్న ఉపద్రవాలు, మెల్లిగా సర్దుకుంటున్నాయి. సర్దుకున్న సంఘటనలు ఒకనాటికి ఎవరి జీవితాల్లో వారే ఏరుకునే గాథలుగా మిగిలిపోతాయి.మనసుపెట్టి మనబోటివాళ్లకు అందిస్తే కదిలించే వానగాయాలు నిన్నటికి సాక్ష్యాలు, దేవ్ ధన్ లాగా గోండు పెద్ద అత్రం భీమ్ రావు చెప్పినవో, పెద్ద అధికారి కృష్ణారావు రాసి పెట్టినవో రేపటికి మార్గదర్శనులు.

-దేవనపల్లి వీణావాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో