“నాకు అప్పులున్నాయి. వాటిని తీర్చుకోవాలి. ‘అప్పులెక్కువా? తండ్రి సమాధి ఎక్కువా?’ అని అడక్కు ఆమాటకొస్తే అప్పులే ఎక్కువ. అవి తీర్చలేకపోతే వాళ్లు నన్ను తరిమి తరిమి కొడతారు. నాన్న నన్ను కొట్టడు. అసలాయన ఎక్కడున్నాడు నన్ను కొట్టటానికి? సమాధి కట్టించినా ఆయనొచ్చి చూస్తాడా? చస్తాడా?” అన్నాడు.
సంలేఖ కి పట్టరాని కోపం వచ్చింది. తిలక్ వైపు కళ్లెర్రజేసి చూసింది.
“నాన్నగారికి నువ్విచ్చే గౌరవం ఇదేనా? అసలు నువ్వంటేనే నీకు గౌరవం లేదు. వుంటే ఇలా వుండేవాడివే కాదు” అని బ్యాగ్ పట్టుకొని లేచి నిలబడింది.
“అవ్వా! నేను వెళుతున్నా” అంటూ అక్కడున్న ముసలమ్మలతో చెప్పి, రోడ్డు మీదకెళ్లి ఆటో ఎక్కింది. వాళ్లు చూస్తుండగానే ఆమె ఎక్కిన ఆటో కదిలింది. ఆటో దిగి బస్సెక్కి ఆదిపురికి చేరుకుంది. అప్పుడు మధ్యాహ్నం మూడు గంటలు.
సంలేఖను చూడగానే సంతోషపడింది సులోచనమ్మ.
“ఎండనపడి వచ్చావు లేఖా! మీ అత్తగారు, మామగారు, జయంత్ బావున్నారా!” అంటూ పెరుగన్నం కలిపి నోట్లో పెట్టింది. తల్లి చేతి తిండి తిని చాలాకాలమైనట్లు తృప్తిగా తిన్నది సంలేఖ.
“కొద్దిసేపు పడుకుంటానమ్మా! నన్ను అన్నయ్య వచ్చేంత వరకు లేపకు” అంది.
“సరే! పడుకో లేఖా!” అంటూ ఉతికిన బెడ్ షీట్ తెచ్చి బెడ్ మీద వేసి, దిండు సర్ది వెళ్లింది సులోచనమ్మ.
వినీల ఒకసారి వచ్చి సంలేఖను చూసింది కానీ పలకరించలేదు.
సంలేఖ పలకరిస్తే “ఊ… ఆ…” అంటూ వెరైటీగా మూలిగింది. అంతే! రాజారాం స్కూల్ నుండి వచ్చేసరికి సాయంత్రం ఆరు దాటింది. రాగానే సంలేఖను పలకరించి కుశల ప్రశ్నలు వేశాడు. ఆమెకు రాజారాంని చూస్తుంటే చాలా సంతోషమనిపించింది. అతను ఎప్పటిలాగే నడుస్తున్నాడు. అన్ని పనులు చేసుకుంటున్నాడు. అందరి పనులు చేస్తున్నాడు. చాలా హుషారుగా వున్నాడు..
రాత్రి భోజనాలయ్యాక సులోచనమ్మ ఆరుబయట మంచం వెయ్యడంతో రాజారాం, సంలేఖ వెళ్లి కూర్చున్నారు. వీధిలైటు వెలుగుపడి అక్కడ పట్టపగలున్నట్లుంది.
వాళ్లిద్దరు మాట్లాడుకుంటుంటే ఒకరి హావభావాలు ఒకరికి స్పష్టంగా కన్పిస్తున్నాయి. కొద్దిసేపు ఆమె రాసిన నవలల గురించి మాట్లాడుకున్నారు.
“నీ నవలల్లో ఓ ప్రత్యేకత వుంది లేఖా! అవి ఏ వయసు పాఠకుడితోనైనా వదలకుండా చదివిస్తాయి. కొంతమంది రాసినవి శైలి బాగుండక చదవాలనిపించదు. అలాంటి పుస్తకాలను చదివేవాళ్లు లేక లైబ్రరీల్లో బూజుపట్టి పోతుంటాయి. అవి రాసిన రచయితలు కూడా ఆ పుస్తకాల్లాగే కొంతకాలానికి మరుగునపడి పోతుంటారు. నువ్వలా కావు. ఇంకో వంద సంవత్సరాలు దాటాక అయినా నీ పుస్తకాలు దొరికితే ఇప్పట్లాగే కొని చదువుతారు” అన్నాడు రాజారాం.
రాజారాం అలా అంటుంటే సంతోషంగా వుంది సంలేఖకి.
“దిలీప్ కూడా మంచి రంగాన్నే ఎన్నుకున్నాడు లేఖా! ధైర్యంగా, సూటిగా దూసుకెళ్తున్నాడు. ఈమధ్యన కలిశాడు” అంటూ దిలీప్ ని గుర్తుచేసుకున్నాడు రాజారాం.
“నిజమే అన్నయ్యా! తిలక్ అన్నయ్యతో పోల్చుకుంటే దిలీప్ చాలా గ్రేట్! నిత్యం గాంబ్లింగ్ ఆడే తండ్రి కడుపున పుట్టి కూడా ఉన్నతమైన భావాలతో బ్రతుకుతున్నాడు. దిలీప్ నాన్నగారు ఇప్పటికి కూడా హస్విత దగ్గర డబ్బులు అడుక్కుని గాంబ్లింగ్ లో పోగొట్టుకుంటూనే వుంటాడట. వాళ్ల అమ్మగారయితే మొన్న ఏడ్చి నాతో ఏమన్నదో తెలుసా?” అంది.
“ఏమన్నది?” ఆసక్తిగా అడిగాడు రాజారాం.
– అంగులూరి అంజనీదేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~