నాలుగైదు రోజులకుగానీ బయటకు వెళ్లలేకపోయాము. ఇప్పుడు వెళ్ళేది మొదటి పర్యటన, ఇంత తీవ్రమైన ఎండల్లో నీటివనరుల పరిస్థితి ఎలా ఉందో చూడాలనుకొని తాడ్వాయి అడవికి వెళ్ళాము.అటవీశాఖ వన్యప్రాణులకు కనీస నీటిసదుపాయంకల్పించే నిమిత్తం చిన్నచిన్న నీటికుంటలు ఏర్పాటుచేసి, దానికి అనుసంధానంగా సూర్యచ్చక్తితో నడిచే మోటర్లను ఏర్పాటు చేసింది.ఇది ముందే నిర్ణయించిన కాలానికి తగిన విధంగా సూర్యరశ్మి ఉన్నంతవరకు నీటిని కుంటలోకి తోడిపోస్తూ ఉంటుంది. తాడ్వాయి వెళ్లాలంటే ఏటూరునాగారంనుంచి ములుగువైపుగా వెనక్కురావాలి. అటవీశాఖ పర్యావరణ పర్యాటకం ప్రోత్సహించే విధానంలో భాగంగా నాలుగైదు గదుల విడిదినీ, పర్యావరణ విద్యామందిరాన్ని తాడ్వాయిలోనే ఏర్పాటు చేసింది. విడిదికేంద్రం రూపకల్పన 1980లోనే ఏర్పాటు అయినప్పటికీ ఇతర సదుపాయాలు చాలాకాలానికి అందుబాటులోకి తెచ్చారు. 1980ల నాటికి తాడ్వాయి దట్టమైన అడవి. తదుపరి దశాబ్దకాలానికిపైగా నక్సలైటు ఉద్యమ సంఘర్షణనెదుర్కొంది. అప్పటి అటవీశాఖ కార్యాలయం ఈ ఉద్యమ నేపథ్యంలోనే పేల్చివేయబడింది. తదుపరి చాలాకాలం అక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేయబడలేదు. మరలా కొంతకాలానికి పరిస్థితులు మారాక మళ్ళీ కొత్తగా కార్యాలయం నిర్మించారు. ఇప్పుడిది ములుడు జిల్లా పరిధిలోకి వచ్చింది కానీ ఇంతకుముందు వరంగల్ ఉత్తర మండలంలో ఒక అటవీక్షేత్రం (రేంజ్ ).
ఎండాకాలం కనుక ఉదయం ఏడు గంటలవరకే వెళ్లిపోయాము. వాతావరణం ఇంకా వేడెక్కలేదు. జల్లులుగా ఎండుపొడ కొమ్మల సందులలోంచి వస్తుండగానే బీటు దారికి దగ్గరలో ఉన్న నీటి కుంట దగ్గర ఆగాము. ఎండ పూర్తిగా రాలేదు కనుక ఇంకా బోరు పని మొదలు కాలేదు. కుంటలో నీరు ఎక్కవా లేదు, తక్కువా లేదు. పూర్తి నీటిమట్టానికి లోపలికే ఉన్నా జంతువులకు తగు నీటి అవసరానికి సరిపోతుంది.కుంట అంచుల వెంబడి గడ్డి మొలిచి ఇంత ఎండలోనూ పచ్చగడ్డి నవ నవలాడుతూ ఉంది. గడ్డితో చిత్తడిగా ఉన్న చోటు చీమలు,చెదలు ఇంకా చిన్న చిన్న జీవులు, పాములకు మంచి ఆవాసం. GEC వేక్ ఫీల్డ్ అనే అతను 1912 లో నర్సంపేట(ప్రస్తుత వరంగల్ గ్రామీణ జిల్లా) లో బంగారు పాముని(Banded krait: Bungarus fasciatus ) మొదటిసారి గుర్తించాడట. ఉస్మానియా విశ్వవిద్యాలయనికి చెందిన పరిశోధకులు దీనికి చెందిన ఒక్క ఆధారమైనా పట్టుకోవాలని 1996 నుంచి ప్రయత్నంచేస్తే 2006లో రొహీర్ వద్ద కనిపించిందట.అంటే వందేళ్లకు ! రొహీర్ బీటు, దేవాదులవైపు ఉంటుంది. తాడ్వాయి నుంచి చాలా దూరమే ఉంటుంది. వేరు వేరు సమయాల్లో దొరికిన మూడు బంగారుపాముల్లో ఒకదాన్ని స్థానికులు చంపివేయగా మిగిలిన రెండు రోడ్డుప్రమాదంలో చనిపోయాయట. చివరగా చనిపోయిన పాము తలని విశ్వవిధ్యాలయపు న్యాచురల్ హిస్టరీ మ్యూసియంలో ఉంచారట(Rediscovery of the Banded krait Bungarus fadsciatus (Schneider1801 ) Serpentes : Elapidae from Warangal District, Andhra Pradesh:26 June 2009:Citation by Srinivasulu.C, D.V enkateshwarlu& M.Seetharamaraju).ఈ పత్రసమర్పణ చేసిన పరిశోధకులు, రాష్ట్ర అటవీశాఖను ఉద్దేశిస్తూ ఈ పాములు సున్నితమైనవని, సులభంగా రోడ్డు ప్రమాదాలకు గురికాగలవు కనుక పాములమీదుగా వాహనాలను నడపకుండా డ్రైవర్లకు సూచిస్తూ సైన్ బోర్డ్స్ను దారులమీద ఏర్పాటు చేయాలని, స్థానికులకు ఈ పాముల ఆవరణవ్యవస్థ మీద అవగాహన కల్పించి కాపాడాలని ఒక స్పష్టమైన అంశాన్ని వారి పరిశోధకపత్రంలోనే సూచించారు. అయితే ఈ పరిశోధనావివరాలు నాకు మన రికార్డుల్లో దొరికినవి కావు.అభిరుచి కొద్దీ తెలుసుకున్నవి.బాధ్యతాయుతమైన అంశాలు వ్యక్తిగత అభిరుచులకు పరిమితంకాకుండా పరిశోధనలకు, స్వయంగా పనిచేసేవారికి అనుసంధానం చేయకపోతే విలువైన వనరుల్ని కోల్పోతాము. అది జరగకుండా ఉండాలంటే ఒకే రేఖ మీద పనిచేసే సంస్థలన్నింటిని, వారి కృషిని తప్పక సమన్వయం చేయాలి.
బంగారుపామంటే మనకు కట్లపామే, కాకపోతే శరీరంమీద నలుపు, బంగారు పసుపు పట్టీలతో ఉంటుంది. రహదారులకు ఇరువైపులా పసుపు నలుపు పట్టెలు వేస్తారుకదా అచ్చం అలాగే ఉంటుంది.అది అత్యంత విషపూరతమైన పామట. స్థానికులకు తెలిసి ఉండవచ్చు. కానీ అడిగే పరిస్థితి లేదు. ఈ ప్రయాణంలో ఎక్కడైనా, ఎప్పుడైనా కనిపించక పోతుందా అని అనిపించింది.కానీ ఇంత పెద్దఅడవిలో బంగారుపాము యే కలుగులో ఉందో ఎలా తెలుస్తుంది. కనిపిస్తే కనిపించింది అనుకోవడమే.సహజ ఆవాసంలో దేన్నైనా చూడడం గొప్ప అవకాశం అంతే. అన్నీ సార్లు అందరికీ అది దొరకదు.
ఈ అడవిలో ఇప్పపూవు(Madhuka indica ) బాగానే దొరుకుతుంది. ఈ కాలంలోనే ఇప్పచెట్టుకు పూతవచ్చి రాలుతుంది. గిరిజనులు పూవులు ఏరుకోవడానికి వీలుగా చెట్టుకింద గడ్డి కాల్చివేస్తారు. ఇది దురుద్దేశ్యం కాకపోయినా ఒక్కోసారి అడవిలో మంటలు చెలరేగడానికి కారణం అవుతుంది, కనుక స్థానికులను అలా చేయవద్దని వారించడం తప్పనిసరి.గిరిజన మహిళలు చిన్నచిన్న వెదురు బుట్టల్లోకో, చీరకొంగుల్లోకో ఇప్పపూవు యేరుతూ కనిపిస్తుంటారు. ఇప్పపూవు, యాలక్కాయకన్నా కొంచం పెద్దగా చిక్కని తేనెవంటిరసంతో నిండిన పూవురెక్కలు దగ్గరగా ముడుచుకొని పూమొగ్గలాగే కనిపిస్తుంది.తింటే రుచికి వగరుగాఉన్న తేనె అనే అనిపిస్తుంది. మధు అనేది తేనెకు ఉన్న మరోపేరు. భారతదేశంలో మొక్కల పేర్లు వాటి లక్షణాల ఆధారంగా పెట్టినవే. సంస్కృతంలో ఈ చెట్టు పేరు మధూక. భారత దేశమే దీని పుట్టిల్లు కనుక శాస్త్రీయ నామం మధూక ఇండికా అని పెట్టారు. ఏరిన ఇప్పపూవులనుంచి నూనెతీయడం , సారాకాయడం చేస్తుంటారు. ఇప్పసారా తయారుచేయడం,నూనె తీయడం ప్రత్యక్షంగా చూడాలని చాలా కోరికగా ఉండేది. కానీ ఇప్పటివరకు అవకాశం రాలేదు.ఈ సారైనా చూడాలని ఆశపడుతున్నాను.ఒకసారి వీడియో మాత్రం దొరికింది.ఇప్పసారా తయారీని అనుమతించాలా, వద్దా అన్న విషయంలో నాకైతే యే సందేహమూ లేదు. ఎందుకంటే అది ఒక పురాతన కుటుంబ అలవాటుగా అక్కడి గిరిజనుల జీవనంలో మమేకమై ఉంది. పురాతన స్థానిక శాస్త్రీయ విజ్ఞానమూ ఉంది. అందునా అది ఏడాది పొడుగునా జరిపే వ్యవహారం కాదు. అది కొనసాగాలా వద్దా అనేది వారు మాత్రమే తీసుకోగల నిర్ణయం. దానితో ఎవరికీ ప్రమేయం లేదు. అయితే ఇప్ప చెట్టు ఎలా పుట్టింది అన్న దానికి మాత్రం ఒక సరదా జానపద కథ ఇలా ఉంటుంది. దారిద్య్రం భరించలేని ఒక బ్రాహ్మణుడు పులికి ఆహారం కావాలనుకుంటే అదేమో అతనితో స్నేహం చేస్తుందట.వీరితో గాడిద కూడా చేరిన కొన్నాళ్ళకు పులి మరణిస్తే అదే చితిలో పడి బ్రాహ్మణుడు, గాడిద చనిపోయాయట. ఈ బూడిద నుంచే ఇప్ప చెట్టు మొలిచిందట. తాగక ముందు బ్రాహ్మణుడిలా సాధువుగా, తాగేటప్పుడు పులిలా, తాగాక గాడిదలా ప్రవర్తిస్తాడనే ప్రతీకాత్మకమైన ఈ కథ డా. రావి ప్రేమలతగారు రాసిన తెలుగు జాన పద సాహిత్యం – పురాగాథలులో జానపద కథల పుట్టుక సిద్ధాంతాలను వివరిస్తూ సృష్టి సంభంది గాథల్లో భాగంగా వృక్షాల పుట్టుక గురించిన జానపద కథ.
యాజ్ఞవల్క్య మహర్షి ఇచ్చిన బృహదారణ్యక ఉపనిషత్లో మధుఖండ అనే బ్రాహ్మణం ఉంటుంది.అది మధుసిద్ధాంతం గురించిచెప్తుంది. ఈ సిద్ధాంతం, తేనెటీగలన్నీ కలిసి తీయని తేనెపట్టును తయారుచేసినట్టు ఈ భూమి మీద ఉండే సకల జీవ,నిర్జీవులుకలిసి భూమిని మధుఖండం చేశాయని అంటుంది. జీవులకు ఈ మధువే ఆశ్రయమూ, ఆహారమూ. దీనిలో భాగం పంచుకునే ప్రతీది దివ్యమైందే.మధు సిద్దాంతం ప్రకారం, నీరు ఒక మధువు, గాలి ఒక మధువు, సూర్యుడు ఒక మధువు, సకలదిక్కులు ఒక మధువు, చంద్రుడు, విద్యుత్తు, మేఘం, ఆకాశం, ధర్మం, సత్యం, పంచ భూతాలు, ఆత్మ ఇవన్నీ మధువులే.అంటే మధువుగా చెప్పబడే ఇవన్నీ జీవ, నిర్జీవులకు ఆశ్రయన్ని ఇస్తాయి, ఆహారాన్నీ ఇస్తాయి. మధువిద్య అన్నది ఇదే. ఈ మధువిద్య పరవిద్య, కానీ ఇక్కడ ఈ అరణ్యంలో మాత్రం, తీయని తేనె పూలనిచ్చిన ఇప్పచెట్టే మధుభాండం.అది తనలోని మధువుని పూలముద్దలుగాకట్టి ఎగరలేనివాటి నోటికోసం నేలకు జారవిడుస్తుంది.తనలోని తీపిని పంచుతుంది.
అడవి దారుల్లో ప్రయాణం చేస్తున్నప్పటికంటే అడవిలోకి నడిచేటప్పుడు కలిగే భావన వేరు. కొత్తగా వెళ్ళినవారు అక్కడి గంబీరతకు ఖచ్చితంగా భయపడతారు.ఎటునుంచివచ్చి ఏది మీదపడుతుందో అనిపిస్తుంది.కొంచం అలవాటుగా అడవిలో తిరిగితేనే స్థిరంగా ఉండగలరు.లోపలకి నడిచేటప్పుడు దండకారణ్యంగా పిలిచే అడవి, తాడ్వాయి నుంచే మొదలవుతుందని అనుకోవచ్చునేమో అనిపించింది. పసరాలోకూడా చిక్కటి అడవే ఉన్నప్పటికీ వెదురుపొదలు,మానవసంచారం ఎక్కువ. పసరా,తాడ్వాయి పక్కపక్కనే ఉన్నా అడవి చిక్కదనం, చెట్ల జాతులలో తేడా ప్రస్పుటంగా తెలుస్తుంది. దండకారణ్యం ఛత్తీస్గర్, ఒడిషారాష్ట్రాల దక్షిణభాగం, తెలంగాణ,ఆంద్రప్రదేశ్లలోని ఉత్తరభాగం కలుపుతూ దాదాపు నాలుగువందల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన దట్టమైన అడవి. ద్వీపకల్పానికి ఇటు తూర్పుకనుమలు,అటు సహ్యాద్రిపర్వతాలు, పైన వింధ్య పర్వతాలకిందుగా ఉన్న అటవీప్రాంతం. సహజవనరులదృష్ట్యా అత్యంత విలువైనది.రామాయణ కాలంనుంచీ ఉనికిలోఉంది.పురాణాలు దీన్నిరాక్షసులకు, పిశాచాలకు ఆలవాలంగా దండకుడనే రాక్షసుడు పాలించే ప్రాంతంగా గుర్తించాయి. అయితే సాధకులకు కూడా ఈ ప్రాంతం పేరున్నదే.
పురాణాలసంగతి ఎలా ఉన్నా 1958లో అప్పటి భారతప్రభుత్వం దండకారణ్యప్రాజెక్టు అని ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారతదేశ స్వాతంత్ర్యం ద్విజాతి సిద్ధాంతం ప్రాతిపదికగా ఇవ్వబడింది. అంటే హిందూముస్లింలను వేరుగా గుర్తిస్తూ నాటి దేశ భూభాగం పాకిస్థానుగానూ, భారత్ గానూ విడపోయాక తూర్పుపాకిస్థాన్ లేదా ఇప్పటి బంగ్లాదేశ్ నుంచి ఎన్నో హిందూ కుటుంబాలు భారతదేశానికి వలస వచ్చేశాయి.ఉత్తరభారతదేశంలో నాడు నెలకొన్న హింసాత్మక పరిస్థితులే అందుకు కారణం.బెంగాల్ హిందువులు ముఖ్యంగా అట్టడుగువర్గాలవారు నామశూద్రఉద్యమం ద్వారా సామాజిక చైతన్యాన్ని పొంది రాజకీయంగానూ చురుకుగా ఉన్నారు. వీరి ఉద్యమంలో బ్రిటిష్ వారి వల్లనే సామాజికన్యాయం జరుగుతుందని భావించారు. పూనాఒడంబడిక ద్వారా చట్టసభల్లో రిజర్వేషన్ వంటి అంశాలతో మంచి భవిష్యత్తుని ఊహించారు. ప్రారంభంలో తమను గుర్తించాలని కోరుకున్నారు కానీ దేశవిభజనతర్వాత వీరు ఉన్న ప్రాంతాలు ఇప్పుడున్న తూర్పుబంగ్లాదేశ్ పరిధిలోకి వెళ్లిపోయాయి.ఆ సమయంలో ప్రస్తుత తూర్పుబంగ్లాదేశ్ మొత్తం మతమార్పిడికోసం హిందువులమీద దాడితో అట్టుడికిపోయింది.
1950తర్వాత ఎదుర్కొన్న మతవిద్వేషాల కారణంగానే చాలా హిందూకుటుంబాలు బెంగాల్లోనూ, ఛత్తీస్గార్, ఒరిస్సాలోకివలసరాగా, వచ్చినవారిని ఆదుకొని ఒక స్థిరఆవాసం ఏర్పాటు చేయడం కోసం ఈప్రాజెక్టును ఏర్పాటుచేశారు.ఇందుకు ప్రధానకారణం వలస వచ్చిన కుంటుంబాలు గిరిజనులవి, పేదలవి కావడమే. వీరు ప్రధానంగా చేపలు పట్టేవారు, పడవలు నడిపేవారు. భద్రజీవులంతా కాస్త మంచిఆవాసాలను బెంగాల్ పరిసరప్రాంతాల్లోనే సంపాదించుకోగలిగినా గిరిజనులకు మాత్రం ఎక్కడా అవకాశం దొరకలేదు. అందుచేత వలసలను అదుపు చేస్తూనే, వచ్చినవారికి ఆదరవు కల్పించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టు కొనసాగింది.ఇది అప్పటి ఆంధ్ర ప్రదేశ్. ఒడిష, ఛత్తీస్ఘర్లోని బస్తర్కు, ఒడిషాలోని కోరాపుట్ కి పరిమితమైనది. ఇలా వలస వచ్చినవారికి ఉపాధి కల్పించడంకోసం మొదలుపెట్టిన పనుల్లో మన అరకు రైల్వేస్టేషన్ కూడా ఒకటి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ఎకనామిక్ రిసెర్చ్,న్యూఢిల్లీ వాళ్ళు 1963లో ఈ వివరాలన్నీటితో పుస్తకంవేశారు.అయితే ఈ ప్రాజెక్టు మీద విమర్శలు రావడంతో 1964లో ఆగిపోయింది. అదే సమయంలో పశ్చిమబెంగాల్లో నక్సల్బరీ ఉద్యమం,అది క్రమంగా ఒరిస్సా,బస్తర్,ఆంధ్ర,తెలంగాణలకు వ్యాప్తిచెందడం నిన్నమొన్నటి విషయల్లాగానే ఉంటాయి. నక్సలైట్ ఉద్యమం, బస్తర్ ప్రాంతంలో సల్వాజుడుమ్, తదనంతర పరిస్థితులు పరిశీలిస్తే ఉద్యమం 1980-2000వరకు ఒకవిధంగానూ, 2000-2015వరకు ఒకవిధంగానూ ప్రయాణించిందని తెలుస్తుంది.ఈ నేపథ్యంలో దండకారణ్యం నిజంగానే అనేక రక్తసిక్త చరిత్రల్నితనలో దాచుకుంది. అయితే ములుగుప్రాంతం దట్టమైన అటవీప్రాంతంగా ఉన్నప్పటికీ దండకారణ్యప్రాజెక్టు పరిధిలో లేదు.వలసలు రాకుండా ఉండడానికి బహుశా నాటి విస్తృత గోదావరితీరం కారణమై ఉండవచ్చు లేదా వలస వచ్చినవారికి ఉపాధి కల్పించే పరిస్థితులు లేనంతగా చిక్కని అడవి ఉండడమూ కావచ్చు.అయితే ఆదిలాబాదులో మాత్రం ముఖ్యంగా సిర్పూర్ కాగజనగర్లో ఇలా బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చిన వారికోసం పదహారు క్యాంపులు ఏర్పాటు చేశారు.కాగజ్నగర్ ఇప్పుడు పట్టణంగా ఉంది కానీ 1950లలో అది కూడా దట్టమైన అడవే.ఇప్పటికీ అక్కడే అలా వలస వచ్చిన వారి జీవనం కొనసాగుతున్నది. ఇలా దండకారణ్యం రామాయణ, మహా భారత కాలం నుంచీ ఈనాటి వరకు అనేక విధాలుగా తన విదారక చరిత్రను నిలుపుకుంటూనే ఉంది.
మేము వెళ్ళిన నీటికుంట పరిసరాలుచూసేలోపే, ఒక చనిపోయిన అడవిదున్న కళేబరం పాక్షికంగా కుళ్లిన స్థితిలో కనిపించింది.పరిమాణం చూస్తే ఏడాది వయసు ఉండి ఉండవచ్చునని అనిపించింది. తలభాగం, కాళ్ళు ఎముకలు తేలినా పొట్ట, వెనుకభాగం మాత్రం చర్మంతో ఉన్నాయి.కుళ్ళిపోతే మొత్తం కుళ్లిపోవాలి.కానీ అలాలేదు. వెనుకభాగం కొంచం ఏదో తిన్నట్టు ఉంది. సాధారణంగా కళేబరం నాలుగైదురోజుల్లో దాదాపు కుళ్లిపోతుంది. ఆ వైపు వెళ్లేందుకు కూడా వీలులేనంతగా వాసన వస్తుంది. ఇక్కడ అంత వాసన రాలేదు.కళేబరం చుట్టూ పురుగులూ లేవు. చర్మం మాత్రం ఉంది.అడవిదున్నలు చిన్నవయసులో ఉన్నప్పుడు తల్లితోనే ఉంటాయి. మగదున్నలు యెదకువచ్చిన సమయంలో గుంపుతో ఉంటాయిగానీ ఏనుగుల్లాగా ఎప్పుడూ కుటుంబాన్ని అంటిపెట్టుకొని ఉండవు. ఇది చనిపోయి రోజులు గడిచాయి గనక తల్లి ఇటువైపు వచ్చే అవకాశమైతే లేదనే అనుకున్నాం.ఇలా చనిపోవడానికి ఏది కారణం కావచ్చు అని ఆలోచిస్తే , ఏదైనా తినడానికి దాడి చేసి ఉంటే కళేబరం యథాతథంగా ఉండేది కాదు, అంటే ఇంకా ఏదైనా కారణం ఉండవచ్చు అనుకునేలోపే ఇప్పపూవు తిని చచ్చిపోతాయి మేడమ్ అన్నాడు బేస్ క్యాంప్ వాచర్. బేస్ క్యాంప్ వాచర్లు స్థానికులు,చిన్నప్పటినుంచి అడవితో అనుభంధం కలిగినవారు కనుక ఇటువంటి వాటిమీద వారికి చాలా అవగాహన ఉంటుంది. అలాగే అనిపించింది కూడా. ఎందుకంటే కాళ్ళు,తల కుళ్లిపోయినా పొట్టచర్మం అలాగే ఉంది కనుక . ఇప్పపూవులో ఉన్న తేనెవంటి చక్కెరపదార్థం కిణ్వనం చెంది ఆల్కహాల్గా మారి ఉంటే కొంతవరకు కుళ్లడం ఆపగలదు.బహుశా ఇక్కడ అలాగే జరగవచ్చు. అడవిలోపలికి వెళ్లాలని అనుకున్నప్పటికీ అనుకోని ఈ సంఘటనవల్ల ఒక పూటఅంతా గడిచిపోయింది. కోవిడ్ పరిస్థితులవల్ల దీనిని ముందుగా గుర్తించే అవకాశంలేకుండా పోయింది. ఇది తప్ప అడవంతా ప్రశాంతంగా ఉంది. శవపరీక్షకోసం పశు సంవర్ధక శాఖను సంప్రదిస్తే వారూ అదే విషయం వ్యక్తం చేశారు. కొన్ని కళేబర భాగాలను నమూనాలకు ఇచ్చి ఏటూరునాగారం తిరిగి వచ్చేసాము.
సాయంత్రానికి గానీ అలసట పోలేదు. మరలా విధుల్లోకి వెళ్ళేటప్పటికి సమయం తెలియలేదు. ఎవరికీ ఏమీ పాలు పోని స్థితి.ఏం జరుగనున్నదో అన్న బెంగ. ఎక్కడి వారు అక్కడే.మా కార్యాలయాన్ని ఆనుకొని టింబర్ డెపో ఉంటుంది. ప్రతీ నెల వివిధ అటవీనేరాల్లో పట్టుకున్న కలపను ఇక్కడ వేలం వేస్తారు. ఇక్కడ కూడా కలప దుంగలను ఆశ్రయించి పెరిగే వివిధ శిలీంద్రాల మీద విశ్వ విధ్యాలయాలు పరిశోధనలు చేశారు. వాటి వివరాలుఉన్న పరిశోధకపత్రాలలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఏటూరునాగారంలోనివే ఎక్కువ. ఎన్ని ఎక్కువ జాతులు మనగలిగితే అంత స్వచ్చమైన ఆవరణ వ్యవస్థ. ఇక్కడ కోతులు కార్యాలయం చుట్టూతా తిరుగుతూ ఉంటాయి. నీటి తొట్ల వద్దకు మంచినీళ్లకోసమే వస్తాయి. నడుస్తూ ఎవరైనా కనిపిస్తే అవే బెదిరించి అవే పారిపోతాయి.వాటికి అట్లా అలవాటై ఉంటుంది. ఆఫీసు బిల్డింగ్స్ పైన ఉండే నీళ్ళ టాంక్ ల నుంచి పొర్లిపోయిన నీళ్ళు పడి చెలిమల్లాగా అయ్యాయి. కోతులు అక్కడకి పిల్లలతో వచ్చి నీళ్ళు తాగిపోవడం గమనించాను. చెలిమలాగా ఉన్న చోట రెండు సిమెంటు రింగులు వేస్తే బాగుంటుదేమో అనిపించింది. వీటిని గమనిస్తూ ఉండేటప్పటికీ పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ గేటు ముందు నుంచి ఎవరో వెళ్లిపోయారు. మామూలు వాళ్ళు అరిచినట్టు లేదు. ఆరా తీస్తే పిచ్చివాడు అని చెప్పారు. కొన్ని రోజులు ఇక్కడే ఉంటాడనీ, కొన్ని రోజులు ఎక్కడికో వెళ్లిపోతాడనీ, ఊరూ,పేరూ తెలియదనీ, ఆఫీస్ రోడ్డుకి అవతల ఉన్న మన షెడ్డులోనే ఉంటాడనీ చెప్పారు. ఏదైనా తినడానికి ఇస్తే తీసుకుంటాడనీ, అప్పుడప్పుడు పెద్దగా అరుస్తాడు గానీ ఎవరినీ ఏమీ అనడనీ అందువల్ల వదిలేశామనీ చెప్పారు. అతను ఎక్కడివాడో కూడా తెలియదని చెప్పారు. కార్యాలయాన్ని ఆనుకొని చెక్పోస్ట్ ఉంటుంది. అక్కడినుంచి నిరంతరం నిఘా ఉంటుంది కనుక అతని వల్ల యే ఇబ్బంది లేదని వదిలేసి ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చాడో పాపం! విస్తట్లో అన్నం, కూర, ఒక చద్దరు, మంచి నీళ్ళు పంపించాను. తీసుకున్నాడని చెప్పారు.
ఇరవై ఏళ్ల క్రితం వరంగల్లో డిగ్రీ చదువుకునే రోజుల్లో మా హాస్టల్ మూడో అంతస్తు నుంచి చూస్తే పక్కనే ఒక పిచ్చివాడు తన వద్ద ఉన్న గిన్నెతో మురికి కాలువనుంచి నీళ్ళు తీసుకొని తాగుతుండడం చూశాము.అయ్యో పాపం అనుకున్నాం కానీ పిచ్చివాళ్ళు ఇలా చేస్తేనే కదా పిచ్చివాళ్ళు అంటారని అనుకున్నాం. పిచ్చివాడి నీళ్ళదృశ్యం చాలా రోజులు ఆలోచనలోనుంచి పోలేదు. పిచ్చివాడి శరీరంలో అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి, ఆకలిదప్పుల అవసరాలు తెలుస్తున్నాయి, అతను శరీరానికి కావలసిన వనరుల్ని కనీసంగానైనా సరే అందిస్తున్నాడు. కానీ ఏదో అతనిలో లోపించింది. అందుకే అతను మురికి నీళ్లను కూడా నీళ్లుగానే చూస్తున్నాడు కానీ మురికి ఉందని గుర్తించలేకపోతున్నాడు. అది మురికిది , ఇది మంచిది అని గుర్తించేది ఏదో అతనిలో ఇప్పుడు లేదు. అతని బాహ్య జీవితానికి, శరీరానికి లంకె వేసి నియంత్రించేది ఏదో అతని నుంచి వేరుగా ఉంది లేకపోతే అసలు లేదు.అయితే ఆ ఏదో మెదడు నియంత్రణలో ఉంటుందా, ఉంటే అది మెదడు పనిచేస్తుంది కనుక ఆ ఏదో కూడా పనిచేయాలి, మెదడు పనిచేయకపోతే అది కూడా పనిచేయకూడదు. కానీ పిచ్చివాడిలోకూడా మెదడుతోనేకదా శరీరం పనిచేస్తుంది. అంటే ఆ ఏదో మెదడు నియంత్రణకు వెలుపల ఉన్నది. ఏమిటి ఆ ఏదో ? అది ఏది, ఎక్కడ ఉంది , దాని ఉపాధి లేదా పదార్థం ఏమిటి? అది ఎవరి నియంత్రణకు లోబడి ఉపాధిని అంటే శరీరాన్ని ఆశ్రయిస్తుంది, ఎందుకు కలిసో, విడిపోయో ఉంటుంది? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినా అర్థం కాని గహణమైన విషయాలివి.
నా చిన్నతనంలో మాతాత చనిపోయినప్పుడు తత్వాలుపాడే ఒకపెద్దాయన్ని పిలిచారు. చనిపోవడంఅంటే ఏమిటో తెలియని వయసది.అప్పటికి ఇంట్లో ఎవరైనా పోయినప్పుడు తత్వాలు వినిపించడం తెలంగాణలో సంప్రదాయంగా ఉంది. ఆ పెద్దాయన మాతాత పెద్దకర్మవరకు రోజూ సాయంత్రం వచ్చి ఏవో చెప్పేవాడు. తంబూర వాయిస్తూ పాటలు పాడేవాడు. ఒక రోజున “ గుమ్ములు గాదెలు సున్నంపు గోడలూ సూసుకా మురవకే సిలకా..” అంటూ పాడాడు. అందరూ పాటలో మునిగి తేలి నిట్టూర్చారు.పాటంతా అయ్యాక, తాతా సిలక అంటే ఎవరు అని అడిగాను.నవ్వేసి, జీవుడు అన్నాడు. తర్వాతి కాలంలో దువ్వూరి రామిరెడ్డి పానశాల పాత కాపీ ఒకటి తిరగేస్తే అందులో రాక పోకలయందు స్వేచ్చయున్న ఇలకు రాకపోదును అన్నవాక్యం బాగా పట్టుకుంది.దానర్దం జన్మించడం,మరణించడం అన్నది, శరీరం చేతిలోలేదు అనే. మరి ఈ జీవుడు అన్నది ఎవరి అదుపులో ఉన్నది. జీవుడి ద్వారా శరీరాన్ని అదుపుచేస్తూ సుఖదుఃఖాల్ని అనుభవించేలా చేసేది ఎవరు? అనుభవించేది ఎవరు ? అనే సందేహం వచ్చింది. మొక్కలైనా జంతువులైనా జీవుడు ఉన్నాడు కాబట్టే జీవులు అన్నారు. పుట్టి, మరణించే ప్రతీది జీవులనే వర్గానికే చెందుతుంది. మరైతే పిచ్చివాడిలో జీవుడు ఉన్నట్టా లేనట్టా అన్న సందేహం కలిగింది.
తర్వాతి రోజుల్లో ముండకఉపనిషత్ లోని మూడవ ముండకంలోని రెండు పక్షుల వ్యాఖ్యానం వల్ల ఇంకొంచం అర్థం చేసుకోగలిగాను.
ద్వా సుపర్ణా సాయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే |
తయోరణ్యః పిప్పలమ్ స్వాద్వత్త్యనాస్నాన్నన్యో అభిచాకశితి || 1 ||(3.1.1 )
ఈ వ్యాఖ్యానం ప్రకారం రెండు పక్షులు ఒక చెట్టు మీద ఉంటాయి. ఒక పక్షి కర్మచేయడం, అనుభవించడం చేస్తుంది. రెండవపక్షి మొదటిపక్షిని గమనిస్తూ ఉంటుంది లేదా సాక్షిగా ఉంటుంది. కర్మ చేసే, అనుభవించే పక్షి జీవుడు, సాక్షిగా ఉండే పక్షి, ఆత్మ. చెట్టు అనేది శరీరం లేదా పదార్థం లేదా ఉపాధి. అంటే ప్రతి ఉపాధిలోనూ పరమాత్ముడు ఆత్మగా, సాక్షిగా ఉంటాడు, జీవుడు అనుభవిస్తూ ఉంటాడు. భగవద్గీత రెండవ అధ్యాయం 2.19 నుంచి 2.30 శ్లోకాలలోని వివరణలోకూడా ఆత్మకు చావులేదని, ఆత్మను సృష్టించడంకానీ ,నశింపజేయడంకానీ ఉండదని అన్నారు భగవాన్. అంటే సుఖ దుఖాలు పొందేది, అనుభవించేది జీవుడే. ఆత్మ కాదు.
ఇలా వివిధరకాలుగా జీవులు,వృక్షాలుగాగానీ , జంతువులుగా గానీ వివిధరకాల శరీరాలని కలిగిఉండి మధుఖండంలో చెప్పినట్లుగా భూమిని అంతా తేనెపట్టుగా మార్చితే వీటన్నింటినీ నియంత్రించేది ఇంకాఏదో ఒకటి ఉండిఉండాలి. ఉదాహరణకు ఒక పులి ఒక జింకను తింటుంది అనుకుంటే పులి శరీర సౌఖ్యాన్ని, జింక శారీరక దుఖాన్ని అనుభవిస్తున్నది. రెండింటిలోనూ జీవుడు ఉన్నాడు,ఆత్మ ఉంది. పులిలోని శరీరం ఉద్దరించబడి , జీవుడు సుఖాన్ని అనుభవిస్తుండగా,జింకలో శరీరం మరణిస్తుండగా , జీవుడు దుఖాన్ని అనుభవిస్తున్నాడు. రెండింటిలో ఆత్మ సాక్షిగా ఉంది. ఇలా అయితే జీవుడు యే శరీరాన్ని ఎంచుకోవాలో ఏది అనుభవించాలో ఇంకా ఏదో నిర్ణయిస్తున్నది. పులిలోని జీవుడికి సుఖాన్ని, జింకలోని జీవుడికి దుఖాన్ని ఇచ్చేది ఇంకా ఏదో ఉండిఉండాలి. అదే పరమాత్మ అయి ఉండాలి. దానినే బ్రహ్మం అంటారని చదివాను.అదే పరమాత్మ. అదే పరబ్రహ్మం.ఏదో ఒకనాటికి జీవుడు తన ప్రయాణాన్ని ముగించి తిరిగి ఈ నియంత్రించే దానిని చేరుకోవాలి. జీవుడు తన ప్రయాణాన్ని పరిపూర్ణంగా ముగించిన రోజున ఆత్మ జీవుడిని వదిలి తనకు మూలమైన దాన్ని చేరుకుంటుంది. జీవుడు ఆయా ఉపాధిని లేదా శరీరాన్ని వెతుక్కోవడం, వదిలివేయడం ఆత్మ ఆ తత్సంభంధ ఉపాధిని లేదా శరీరాన్ని విడచిపెట్టడం ముక్తి, ఆత్మ తన ప్రయాణాన్ని పూర్తిగా ముగించి పరబ్రహ్మం చేరుకోవడమే మోక్షం.ఇదే నాకు అర్థం అయింది.
ఇంతకు పిచ్చివాడిలో ఎవరు ఉన్నట్టు, ఎవరు లేనట్టు? శరీరం ఉంది, భగవద్ గీత రెండవ అధ్యాయం ప్రకారం, ముండక ఉపనిషద్ ప్రకారం ఆత్మకు కర్మలేదు, పుట్టుకలేదు,చావులేదు అది పరమాత్మ స్వరూపంగా సాక్షి మాత్రమే కనుక పిచ్చివాడిలో కూడా ఆత్మ ఉంటుంది, ఇక లేనిది జీవుడే. అంటే యే కారణం చేతనో పిచ్చివాడి శరీరంనుంచి జీవుడు దూరంగా ఉన్నాడు లేదా అలా ఉండేందుకు తగిన కర్మచేసి ఉన్నాడు. పిచ్చివాడిలో జీవుడులేడు, కనుకనే శరీరందేనితో సంస్కరించవలెనో తెలుసుకోలేకపోయాడు, మురుగుకాలువ నీటికి, మంచినీటికి భేదాన్ని గుర్తించలేకపోయాడు.అంతగా గాయపడి జీవుడు దూరమయ్యే స్థితి ఎందుకు వస్తుంది? దీనిని కూడా ముండక ఉపనిషద్లోని 3.1.9 శ్లోకం వివరణ సరిపోతుందేమో .
ఈషో’ణురాత్మా చేతసా వేదితవ్యో యస్మిన్ప్రాణః పంచధా సంవివేశ |
ప్రాణైశ్చిత్తం సర్వమోతమ్ ప్రజానాం యస్మిన్విశుద్ధే విభవత్యేష ఆత్మా || 9 ||
ఈ శ్లోకం, శరీరాన్ని ఆశ్రయించిఉన్న జీవుడుకి,శరీరంలోని ఆత్మకిమధ్య తెరలాగా మనసు ఉంటుంది అని చెప్తుంది. మనసును ఆశ్రయించి శరీరానికి చెందిన ఇంద్రియాలు ఉంటాయి. ఇంద్రియాలకులోబడిన మనసు జీవుడ్ని ఆత్మవైపు చూడనివ్వదు. మనసు భావోద్వేగాల లోలకం. దాన్ని అదుపులో ఉంచి జీవుడ్ని ఆత్మ వైపు చూడవలసి ఉంటుంది. అదే సాధన. అందుకే Know Thy self అంటారేమో, అంటే నిన్ను నేవు తెలుసుకో అని అర్థం. తనలో ఉన్న దివ్యత్వాన్ని తాను చూడలేని వాడు ఇతర జీవుల్లోని ఆత్మను ఎలా గుర్తించగలడు? కనుక మనసు తీవ్రమైన భావోద్వేగాలకు గురైతే, అది అదుపు తప్పితే జీవుడు, శరీరం నుంచి స్పృహను పోగొట్టుకుంటాడేమో. అదే పిచ్చివాడిస్థితి అయిఉండవచ్చు. పిచ్చివాడితత్వం ఏదైతే ఏం మా ముందు ఉన్న పిచ్చివాడు కూడా ఎందుచేతనో తనలోని జీవుడ్ని దూరం చేసుకున్నాడు. పాపమని అనిపించింది.
పిచ్చివాడుగా చెప్పబడుతున్న వ్యక్తి వల్ల కొంత తత్వం బోధ పడింది. అయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ రాసిన భారతీయ తత్వశాస్త్రంలో శంకరాద్వైతవేదాంతం గురించిచేసిన వ్యాఖ్యానంలో మూర్చఅవస్థను వ్యాఖ్యానిస్తూ మూర్ఛ అనేది ఆత్మయొక్క యే దశకూ చెందదని అది కేవలం మరణఅవస్థకు చెందుతుందని, కర్మ ఏదైనా మిగిలి ఉంటే మనసు, జీవుడు తిరిగి వస్తాడని, లేకపోతే ప్రాణమనే ఉష్ణం అతనినుంచి వెళ్ళిపోతాయని రాశారు.బహుశా ఇది పిచ్చివాడుగా చెప్పబడుతున్న వారికీ వర్తించవచ్చునేమో. అలాగైతే ఈరోజు ఇక్కడ కనిపించిన పిచ్చివాడని చెప్పబడుతున్న అతను ఏనాటికైనా తిరిగి మామలు మనిషి అయితే బాగుండును అనిపించింది.
మనుషులేకాదు జంతువులుకూడా పిచ్చివిగా మారతాయి.కుక్కలు మనకు దగ్గరగా ఉండే జంతువులు కనుక పిచ్చికుక్క అనేపదం వినే ఉన్నాము. అంటే పిచ్చివాడిలాగానే పిచ్చికుక్కలో కూడా జీవుడు లేడు. వృక్షాలలో పిచ్చివాడిలాగా శరీరం నుంచి జీవుడు వేరుగా ఉండే అవకాశం ఉంటుందా అన్న సందేహం వచ్చింది. ఒకవేళ చెట్టు కూడా జీవుడునుంచి వేరుగా ఉంటే అది కూడా పిచ్చిదే అవ్వాల్సి ఉంటుంది. ఎన్ని దెబ్బలు తిన్నా , ఎంత గాయపడినా చెట్టు చిగురించడం మానలేదు, చెట్టు ఎన్నడూ తన వ్యక్తమయిన స్వభావాన్ని విడచి పెట్టినట్టు గమనించలేము. బహుశా అందుకేనేమో ఎవరూ చెట్టు పిచ్చిది అయింది అన్నది ఎక్కడా చూపెట్టలేదు.కనుక శరీరం నుంచి జీవుడు బయటకు వెళ్ళే స్థితి జంతువులోనే ఉందని భావించాలి.
ఇక్కడ నాకు ఇంకో విషయం అర్థమైంది, కొత్త కర్మలు చేసి కొత్త ఉపాధి పొందే స్థితి జంతువులకే ఎక్కువ, వృక్షాలకు ఆ అవకాశం లేదు, ఎందుకంటే అవి స్థాణువులు కనుక, స్వయం పోషకులు అంటే తన ఆహారం తాను తయారు చేసుకోగలవు కనుక, దేనికీ ఎవరితోనూ సంభంధం కలిగి ఉన్నా లేకపోయినా తనలోని జీవుడు, ఆత్మకు వ్యతిరేకంగా కర్మలు చేసే అవకాశం లేదు కనుక, ఒకవేళ ఉన్న అది తక్కువ కనుక. ఎందుకంటే వృక్షాలలో జీవుడి కర్మలను, ఆత్మఉన్నతిని విడదీసే మనో చాంచల్యం, దానివల్ల కలిగే పరిణామాలు ప్రభావం ఉండే అవకాశం లేదు. జంతువుల్లో జీవుడు తనతో పాటు ఉన్న ఆత్మను చూడలేక పోవడానికి మనసు చేత ప్రభావితమైన భావోద్వేగాలను కలిగి ఉంటాడు. భావోద్వేగాలు ఇంద్రియాలకులోబడి ఉంటాయి. ఎంత ప్రభావితం అయితే అన్ని కొత్త కర్మలు , అవి మంచివో, చెడ్డవో. ఎటువంటివి అయితే అటువంటి జన్మ. ఈ భావోద్వేగాల అదుపులేని పరిస్థితి వృక్షాలకు లేదు. కనుక చెడ్డ కొత్తకర్మలు ఉండే అవకాశంలేదు. ఉన్నదంతా పరోపకారమే.కనుక కర్మను త్వరగా పూర్తి చేయాలనుకునే జీవుడు వృక్షంవంటి ఉపాధిని ఎన్నుకోవడంవల్ల జన్మల పరంపర సులభంగా దాటవచ్చునేమో అనిపించింది. అయితే అలా వృక్ష ఉపాధిని ఎంచుకోవడం మనకు ఎలా తెలుస్తుంది ?
ఒక సంధర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో రాష్ట్ర జీవ వైవిధ్యశాఖ వారు ఫారెస్ట్అకాడెమీలో రాష్ట్రం నలుమూలలనుంచి సంప్రదాయ మూలికావైద్యులను ఆహ్వానించి, వారు ఉపయోగించే మూలికల వివరాలను నమోదు చేసే మంచికార్యక్రమం ఏర్పాటుచేశారు. అందులో పాల్గొనడంవల్ల ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి. కార్యక్రమం తరువాత కొంతమందితో ప్రత్యేకంగా మాట్లాడాను. వారు ఎంతో గొప్ప నిష్ట గలవారు. గోప్యత ప్రథమ సూత్రం. ఎవరికి పడితే వారికి చెప్తే దుర్వినియోగం అవుతుందని అలా కట్టుబడి ఉంటారు.వారు చెట్లలో ఒక్కొక్కరు ఒక్కో దివ్యత్వాన్ని చూశారు. అందులో ఒకరు “ ఔషద మొక్కలు ఎవరో తెలుసా అమ్మా, వారు వృక్షజన్మ తీసుకున్న మోక్ష సిద్ది పొందినవారు. సాధన ద్వారా జీవుడి కర్మలను వదిలించుకొని పరమాత్మను చేరేటప్పుడు మా యొక్క ఇంత తపస్సు మాకు మోక్షాన్ని ఇస్తుంది కానీ ఈ జగత్తుకి ఏమి ఇస్తుంది కనుక మా సాధనా శక్తిని జీవుల దుఃఖానికి విరుగుడుగా ఔషదవృక్షాలుగా ధారపోస్తాము అనుకున్నారట. అట్లా మనం వాడే ఔషదులన్నీ మోక్షం పొందిన ఆత్మరూపాలే” అన్నారు. ఈ మాట చాలా గొప్పగా అనిపించింది. అన్నమయ్య “ కట్టెదుట కానాచైనా కొండ” సంకీర్తనలో రెండవ చరణంలో “ ఉర్వి తపసులే తరువులై నిలచిన కొండ” అని రాశారు. ఉర్వి అంటే భూమి, భూమి మీద ఉన్న తపస్వులు, తరువులుగా అంటే చెట్లుగా మారి ఈ కొండ మీద ఉన్నాయి అని అర్థం. ఆ సంప్రదాయ వైద్యుడు చెప్పిన మాట అన్నమయ్య మాటకు సరిపోలింది. సంప్రదాయ వైద్యాన్ని మన ప్రాంతంలో నాటువైధ్యమనే పేరుతో పిలవడం అలవాటుగా చేశారుగానీ వారివద్ధ ఎంతో విలువైన తత్వపరిశీలన,ఆచరణ, విజ్ఞానమూ ఉన్నాయి.ఆ విజ్ఞానాన్ని జాగ్రత్త చేసి ముందు తరాలకు అందించవలసిన బాధ్యత అందరిదీ. నేనీ యాత్రలో అటువంటిది నాకేమైనా దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాను.
ఆఫీసు పరిసరాలలో ఉన్న చెట్ల కదలికలతో వాతావరణం చల్లబడింది.కనబడే ప్రతీ కొమ్మ విధిగా తన వైపుగా వచ్చిన గాలిని ముందుకు తోస్తున్నది. చెట్టుకు కర్మే పరమావధి. చెట్లఆత్మలు జంతువులకన్నా ఉన్నతమై ఉండి చంచల దశలేవీలేకుండా నిరంతరం కర్మోన్ముఖులై ఉంటాయని అనిపించింది. పరోపకారం తప్ప మరొకటి తెలియని కర్మ వాటిది. ఇవే ఉపనిషద్లో చెప్పిన మధుఖండానికి నిజమైన మధువుగా ఉండదగినవి.
-దేవనపల్లి వీణావాణి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~