అభివృద్ధా..!?
నడక నుంచి నానో కారు దాకా
అభివృద్ధి పయనం
సాంప్రదాయాలు, పెళ్ళి నుంచీ
సహజీవనం విడాకులు
దాకా జారుడుమెట్ల ప్రహసనం
ఎదుగుదల సూచనలో మహిళలు
వంటింటికి గుడ్ బై చెప్పి
పైలెట్లు,క్రికెటర్ లు,అంతరిక్ష
విహంగులుగా నేడు
అన్యాయాలకు అత్యాచారాలకు
యాసిడ్ దాడులకు
కిడ్నాప్ లకు బలి పశువులూ వారే
ఆప్యాయత అనురాగాల నిలయం
ఈ భూమి ఆనాడు
వృద్ధాశ్రమాలకు తరలి వెళ్తున్న
ముదుసలలు ఈనాడు
బాల్యానికి ప్రతిరూపాలుగా
పిల్లలు పరవశిస్తూ అప్పట్లో
బ్రతుకు భారాన్ని పుస్తకాల రూపంలో
మోస్తూ యంత్రాలులా ఇప్పట్లో
కబుర్లతో ఉల్లాసంగా
ఇంటి పనుల్లో పడతి అప్పుడు
క్షణం ఊపిరి తీసుకోలేని పనులతో
సతమతమవుతూ ఇప్పుడు
బంధుప్రీతికి పెద్దపీట
భారతావనిలో ఒకప్పుడు
కుటుంబానికి పరిమితమై స్వార్ధం
గడపలో మనుషులు ఇప్పుడు
స్నేహం కోసం ప్రాణం ఫణం ఆ రోజుల్లో
ఆ ముసుగులో ఊపిరి తీయటం ఈ రోజుల్లో
మగవాని ఆజ్ఞ అనే దండం కింద
బానిసలా ‘ఆమె’ ఎప్పుడూ!
-యలమర్తి అనూరాధ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~