అరణ్యం 2 – అభంగలీల 2 – దేవనపల్లి వీణావాణి

కొత్త చిగురుతొడిగే  చైత్రమాసంలో నిట్టనిలువు జపంచేస్తున్న దారువుల మధ్యనుంచి  పాపటి చీలికలాంటి దారి మీద వెళ్తుంటే వేడి గాలి చెవులను విసిరి కొట్టిన క్షణం ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుంది. ఈ ప్రయాణంలో పక్కన ఉన్న ఇతర ప్రాంతాలతో అభయారణ్యపు గంభీరత్వాన్ని సులభంగా పోల్చుకోవచ్చు. గాలి పోకడ ములుగు ప్రాంతం దాటే వరకు ఒకలాగా తాడ్వాయినుంచి ఒకలాగా ఉండడం సులువుగా గమనించవచ్చు. తాడ్వాయి నుంచి పస్రా,ఏటూరు నాగారంలను కలుపుకొని ఏటూరునాగారం అభయారణ్యం విస్తరించి ఉంది. ఇక్కడికి బదిలీ మీద వచ్చాను  కానీ ఈ ప్రాంతం అంతా ఇంతకుముందు పరిచయం ఉన్నదే. పాకాల చెరువుకు ఉత్తరంగా ఉండే విశాలమైన ఈ అభయారణ్యానికి  ఉత్తరంవైపు హద్దుగా గోదావరి నది ప్రవహిస్తూ ఛత్తీస్గర్   రాష్ట్రంనుంచి వేరుచేస్తుంది. ఛత్తీస్గర్  అంటే  ముప్పై ఆరు కోటలు అని అర్థం. అసలు పేరు దక్షిణ కోసల అయితే ఛత్తీస్గర్ అని గోండు రాజులు కట్టిన ముప్పై ఆరు కోటల వల్ల వచ్చిందట. ఏటూరునాగారం అనే పేరు ఏటూరు,ఇంకా నాగారం అనే రెండు ఊర్ల  పేర్లు కలిసి వచ్చింది. నాగారం అనే పేరు మీద రెండు మూడు గ్రామాలు ఉండడం వల్ల ఏటూరు పక్కన ఉన్న నాగారం అలా ఏటూరునాగారం అయింది. తెలంగాణలో పెద్ద అభయారణ్యం ఇదే.  ఇది అడవి దున్నలకు, బెట్టు డుతలకు ప్రసిద్ది. ఇది 1953 లోనే ఆనాటి  హైదరాబాదు అటవీ చట్టం -1355 ఫసలి ద్వారానే అభయారణ్యంగా ఏర్పాటు చేయబడినది. ఇదే పాతది కూడా. ఇక్కడ   బోలెడన్ని వాగులుంటాయి.   జంపన్న వాగు, దయ్యం వాగు, రాళ్లవాగు, జీడి వాగు, వట్టి వాగు, బొడిగట్టు వాగు ఇలాగా. ఇవి అన్నీ గోదావరిలో కలిసి,  గోదావరి  ఖమ్మం చేరే సరికి దాని ఘనపరిమాణం పెంచుతాయి. జంపన్నవాగు పెద్దవాగు. సమ్మక్క, సారక్క గద్దెలకు దగ్గరలో ఉండే దీనికి ఎన్నో మెలికలు.ఈ వాగులు కాక దాదాపు  రెండు వందల దాకా చిన్నా పెద్దా నీటి తావులు ఉన్నాయి. ఇందులో కొన్ని ఎండాకాలం ఎండిపోతే కొన్ని మాత్రం కనీస నీటి నిల్వలతో ఉంటాయి.అడవికి బాగా దూరంగా నీటి తావులు ఉన్న చోట  అటవీ శాఖ, వన్య ప్రాణులకోసం   నీటి కుంటలు ఏర్పాటు చేసింది.

తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే  ఇక్కడి భాష,సంస్కృతి, మానవ వనరులు,పరిస్థితులు అన్నీ భిన్నంగానే కనిపిస్తాయి.ఇక్కడ ఉన్న ప్రధానమైన మానవ వనరులు కోయలవి. కోయలు గోండుల ఒక శాఖ.గోదావరి అవతలి వైపున ఛత్తీస్గర్  అంటే పూర్వపు మధ్యప్రదేశ్ గోండుల ప్రాంతం. గోదావరికి ఇవతల తెలంగాణలో ఇక్కడ ఉన్న ప్రజలు కోయలు, ప్రత్యేకమైన భాషావికాసాన్ని కలిగి ఉంటారు. తెలుగు మాట్లాడగలరు, అర్థం చేసుకోగలరు. లిపి లేదు కనుక విద్య తెలుగులోనే కొనసాగుతున్నది. ఈ మధ్యనే  ఆంద్ర విశ్వ విద్యాలయ ఆచార్యులు శ్రీమతి  ప్రసన్న శ్రీ, కోయ  భాషతో పాటు మరో పద్దెనిమిది  భాషలకు లిపి రూపొందించారు.ఇది  భారతీయ భాషా పరిరక్షణలో చేసిన అత్యంత విలువైన  కృషి.

అభయారణ్యానికి చెందిన చాలా పల్లెలకు “ఆయి” అన్న పదంకలిసి ఉంటుంది. చల్వాయి, సర్వాయి,తాడ్వాయి, కొండాయి, బుట్టాయి  ఇలా అన్నమాట. ఆయి అంటే పల్లె అని అర్థం చేసుకోవచ్చు. కొండ పక్కనే ఉన్న పల్లె కొండాయి. అలాగే కోయ భాషలోని కొన్ని పదాలను ఆయీతో కలిపి చూస్తే ఆయా పల్లెలు ఏర్పడ్డాయని తెలుస్తుంది. తెలంగాణలో చిన్నమ్మ పెద్దమ్మ వంటి పదాలు కాకుండా చిన్నాయి పెద్దాయి అనే పదాలు నిన్న మొన్నటిదాకా వాడుకలో ఉన్నాయి. ఇంకా కొన్ని కుటుంబాల్లో అవే పదాలు కొనసాగుతున్నాయి. మరాఠీలో ఆయి అంటే అమ్మా అని అర్థం కనుక చిన్నమ్మ పెద్దమ్మ పదాలు కాస్త పెద్దాయి చిన్నాయిగా వాడుకలోకి వచ్చేసాయి. అనేక ఇతర మరాఠీ పదాలు కూడా తెలంగాణ తెలుగు భాషలో సొంత పదాలుగా మారిపోయాయి. నేను మొదటిసారి రాసిన కవిత గొంగడి ఒక మరాఠీ పదమని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. గొంగడి, తెలుగు పదమే అని అనిపించేలా వ్యవహారికంలో ఇమిడిపోయింది. తెలంగాణలో ఒకప్పుడు మహారాష్ట్రలోని కొంత భాగం కలిసి ఉండేది. నిజాం ప్రభుత్వకాలంలోనూ మహారాష్ట్రీయులు విరివిగా స్థిరనివాసాలు ఏర్పరచుకున్నారు.అలా  తెలంగాణ తెలుగుభాషలో కొన్ని మహారాష్ట్ర  పదాలు కలగలిసిపోయాయి. అయితే ఏటూరునాగారంలో వినిపించే ఈ ఆయి పదము కోయ భాషకు చెందింది, ఇక్కడ  ఆయి అంటే పల్లె అనే అర్థం చేసుకోవాలి.

వరంగల్నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలోనేఉన్నా ములుగు ప్రాంతం అంతా కూడా చత్తీస్గర్  దండకారణ్యంతో కలిసి ఉండడం చేతనూ, దట్టమైన టేకు వృక్షాలతో, వన్యమృగ సంపదతో అలరారుతూ స్వచ్ఛమైన పల్లెలతో జీవం ఉట్టి పడుతూ ఉంటుంది. ఒకప్పుడు ఈ ప్రాంతానికి తూర్పువైపుగా కాకతీయ సామ్రాజ్యపు బురుజు ఒకటి  హేమాచల నరసింహక్షేత్రం పక్కన ఉన్న గుట్ట మీద ఉండేదని అంటారు.  అయితే చారిత్రకంగా 12వ శతాబ్దం నుంచి కోయల అధీనంలోనే ఈ ప్రాంతమంతా ఉంది. హేమాచలనరసింహ క్షేత్రం దగ్గర ఉన్న వివిధ రకాల ఔషద మొక్కలు  ఉండడం వల్ల   ఔషద మొక్కల  సంరక్షిత  ప్రాంతంగా గుర్తించబడింది. ఇదంతా పదిహేనేళ్లకుముందు చూసాను కనుక కొత్తప్రాంతానికి వచ్చానన్న భావన లేదు. అందునా ప్రపంచం అంతా కోవిడ్ మహమ్మారితో పోరాటం చేస్తున్న కాలంలో దట్టమైన అడవిలోకి వస్తున్నాను. నర్సంపేట, పాకాలనుంచి ఇంకా ముందుకు, ఇంకా చిక్కని అడవిలోకి వస్తున్నాను. అయినా పాకాల నన్ను వదలలేదు. నేనూ పాకాలను వదలలేదు. నేను ఇక్కడికి వచ్చేటప్పటికి మెకంజీ కైఫియాత్లు చదివాను. వాటి తెలుగు అనుసృజన బొల్లోజు బాబా రాసిన పుస్తకం, ఆచార్య ముదిగొండ శివప్రసాద్ రాసిన పాకాల చెరువు   పుస్తకం  అందుబాటులోకి వచ్చాయి. ఇవి పాకాల చెరువుకూ షితాబ్ ఖాన్  అన్న పరిపాలకునికీ ఉన్న  సంబంధం గురించి తెలుసుకోవాలన్న కుతూహలానికి ఇంకొంచం వివరాలు జమచేశాయి. షితాబ్ ఖాన్, ఒక్కరా లేక అదే పేరుతో ఇద్దరు ఉన్నారా అంటే మెకంజీ కైఫియత్ల విశ్లేషణతో ఇద్దరు ఉన్నారని అనుకోవచ్చు. చరిత్రకారులు షితాబ్ ఖాన్ ఒక్కరని  తేల్చినా, ఇద్దరని తేల్చినా అతను హిందువు, అసలు పేరు సీతాపతి,   షితాబ్ ఖాన్ అనేది అతని బిరుదు. ఇద్దరు అనుకుంటే ఇద్దరికీ ఒకే మొదటిపేరు ఉండే అవకాశం ఉన్నదా అన్నది అనుమానం. అయితే ఇతను ముసునూరురెడ్ల తదుపరి  వరంగల్ ప్రాంతాన్ని కొంతకాలం పరిపాలన చేశాడు. ఇంకా వెతికితే చరిగొండ ధర్మన్న రాసిన చిత్రభారతం దొరికింది. దీనిని వావిళ్ల రామస్వామి శాస్త్రులు 1934 లో పరిష్కరించి పుస్తకంగా వేశారు.   తెలంగాణ తొలి ప్రబంధకారుడు, ధర్మపురి వాస్తవ్యుడు  చరిగొండ ధర్మన్న తన చిత్రభారతాన్ని షితాబ్ ఖాన్ వద్ద మంత్రిగా పనిచేసిన యనుములపల్లి  పెద్దనామాత్యునికి(  చిత్రభారతం : పుట 20 ) అంకితమిచ్చాడు..

చిత్రభారతం పీఠిక లోని ఈ రెండు పద్యాలు ఇతను పాకాల చెరువు వంటి చెరువులు దివ్య  ప్రతాపుడై  దిగ్విజయం చేసినవాడుగా చెప్తాడు.

సీ.   అనువత్సరంబు బ్రాహ్మణులకు గోసహ

స్రము లిచ్చు నృగనారేశ్వరుని రీతి

గంధుల కెనగ బాకాల చెర్వాదిగా

జెరువులు  నిలుపు సగరుని కరణి

దీవ్యత్ప్ర తాపుడై దిగ్విజయంబు గా

వించు మాంధాతృభూవిభునిలీల

దేవభూదేవ తార్థి శ్రేణికగ్రహా

రము లిచ్చు భార్గవ రాము పగిది

తే.   మించి చిత్తాంబుఖాన భూమీ మహేంద్ర

సకల సామ్రాజ్య లక్ష్మీ విశారదుండు

భాగ్య సంపన్ను డెన్ములపల్లి   మాద

మంత్రిశేఖరు పెద్దనామాత్యవరుండు

మొదటి పద్యంలోని “దీవ్యత్ప్రతాపుడై” అంటే ప్రతాపరుద్రుని వలె అన్నట్టుగా, ఈ వాక్యం పాకాల చెరువు మరమ్మతులను సూచిస్తుంది. ఇది ఒక చారిత్రక ఆధారం.మెకంజీ కైఫియత్  వివరాలను చరిగొండ ధర్మన్న కాల వివరాలను పోల్చితే ఏదైనా ముగింపు దొరకవచ్చునని అనిపించింది

చిత్రభారతం కృష్ణార్జున యుద్ధం,అందుకు దారి తీసిన పరిస్థితులను గురించి చేసిన కాల్పనిక కృతి.  గయోపాఖ్యానంలాగా ఉన్నా  ఇక్కడ కొన్ని ఘట్టాలు వేరు. దీనిని డా. సంగణభట్ల నరసయ్యగారు సాధికారంగా పరిశోధించి పరిష్కరించారు. చరిగొండ ధర్మన్న కవి, ధర్మపురి (పాత కరీంనగర్ జిల్లా ) వాడు, మొదట వర్ణించినది నైమిశారణ్యాన్ని, అది ప్రస్తుత ఉత్తరప్రదేశ్లో ఉన్నది. ఈ  కవి ప్రస్తుత మహబూబ్నగర్ నుంచి ధర్మపురికి వచ్చి స్థిరపడినవాడు. కవి  వర్ణనలలో పేర్కొన్న వివిధ వృక్ష జంతువుల వివరాలు స్థానికపువే అయి ఉండే అవకాశం  ఉంది. నాకైతే చిత్ర భారతంలోని  ద్వితీయ ఆశ్వాసంలోని వసంతం వర్ణనలు గొప్పగా అనిపించాయి.

తే.  పలుకనేరని కోకిల ప్రకరమునకు

నంచిత స్వరమిచ్చు మహౌషధంబు

కాముక శ్రేణులకు నెల్ల గాలకూట

మనగ మించె వసంతసమాగంబు

పలుకలేని కోకిలకు స్వరమిచ్చే వాడట వసంతుడు. కవి సామ్రాట్ విశ్వనాథ వారు  కోకిలమ్మ పెళ్లి లో

అంతలో పూవుల్లరేడూ

వింత వింతల సోకు లేలిక

చెక్కులా నవ్వూలు చిలుకుతు

చేరవచ్చాడూ

ఏడాది కొకసారి వస్తా

డేడాది కొకసారి తెస్తా

డెన్ని పువ్వులు, అతని వేనూ

వన్నెలూ చిన్నెల్

అని రాశాడు. విశ్వనాథ కోకిల చుట్టూ అందమైన కథ అల్లారు. చిలుకా, కోకిల ఒక తల్లి బిడ్డలు, తండ్రి, ఇతరులు  కోకిలను తనరూపంవల్ల నిర్లక్ష్యం చేస్తారు. తల్లి నిస్సహాయురాలు. కోకిల బాధతో అడవిదారి పడుతుంది. తల్లి,కోకిలను వెదుకుతూ వస్తుంది. ముషిణి చెట్టు కిందకూర్చొన్న తల్లిని చూసి కోకిల, తల్లి తనకోసం బాధ పడుతుందని అర్థం చేసుకుంటుంది. ముషిణి చెట్టు అంటే విష ముష్టి (Strychnos nux-vomica, strychnine tree) చెట్టు. ఈ చెట్టు గింజలు విషపూరితం. ఒకటి రెండు గింజలు తిన్నా చచ్చిపోతారు. బిడ్డ అంటే కోకిల కనబడలేదని తల్లి చనిపోవాలని అనుకుంటుందని కవి భావన. కోకిల, తల్లి ఒళ్ళో వాలిపోతుంది. తల్లీ బిడ్డలు ఒకరి ఒళ్ళో ఒకరు తల ఉంచి అలాగే మరణిస్తారు. తల్లీబిడ్డల మమకారం అలా ఉండాలని అడవిలో సెలయేర్లు, కొమ్మలు, గాలి పిల్లలు వెదురులోకి  రాగాలు తీస్తాయి. అడవి చిన్నబోతుంది.తల్లి అంటే అంత ప్రేమ చూపిన  కోకిల బతికి వస్తుందని అడవి  పాట  పాడుతుంది. అప్పుడు వసంతం వస్తుంది. కోకిలపాట మళ్లీ  అడవిలో వినిపిస్తుంది. వసంతుడికి, కోకిలకు ఒకరికి ఒకరు సరిపోతారని అడవి వారిద్దరికీ పెళ్లి చేస్తుంది. అలా ఏడాదికి ఒకసారి వసంతుడు వస్తాడని, కోకిల పాట  వినిపిస్తుందని చెప్పి కోకిల, తెలుగుపలుకూ కూడబెట్టినదని రాశాడు.  ఇప్పటివరకూ ఎంతో మంది సాహిత్యకారులు వసంతాన్ని ఎన్నో రకాలుగా చూశారు, అలా రాశారు. చరిగొండ ధర్మన్న మాత్రం ఇంకో కొత్త అభివ్యక్తి చూపారు. చిత్రభారతం,ద్వితీయ ఆశ్వాసం లో వసంతంలో  ఆకురాలే చెట్లని చూపిస్తూ మేఘుడు చెట్లకు అప్పులు ఇచ్చాడనీ అవి వసంతునికి ఇవ్వమని అప్పగించాడట. అందుకని చెట్లు ఆకులు ఇచ్చాయట, అందుకని ఆకులు నేల రాలాయట!

అలాగే

తే. అలవసంతుడు  కొమ్మలయందున్  బ్రేమన్

బత్ర భంగము లొనరింప బహుళ భూరు

హముల గనుపట్టు కొమ్మలయందునెల్లన్ 

బత్రభంగబు చేసె నభంగలీల

అని రాశాడు. అంటే వసంతుడు కొమ్మల మీద ప్రేమతో పత్రాలను రాల్చివేస్తూ అనేకమైన  పెద్ద పెద్ద వృక్షాలమీద ఉన్న కొమ్మలన్నిటి పత్రాలను రాల్చి వేశాడట. ఇక్కడ  అభంగలీల అన్న పదం ఎంతో గొప్పగా నిలిచెపదం. అభంగము అంటే భంగము లేనిది, నిరంతరమైనది అని.  లీల అంటే విలాసము లేక పోతే ఎక్స్ప్రెషన్ అనవచ్చునేమో. వసంతుడు నిరంతరం ఇలాటి విన్యాసం చేస్తాడని భావన. అభంగ   అనే పదం పాండురంగవిటలుని  నామసంకీర్తనం చేసే దివ్యకవిత్వానికున్న పేరు. చరిగొండ ధర్మన్న, కొమ్మల మీద కొత్త చివుళ్ళ కోసం వసంతుడు అటువంటి దివ్యకవిత్వాన్ని రాస్తున్నాడని ఏమైనా అనుకున్నాడేమో.

ఈ ఆకురాలు కాలంలోనే ఏటూరునాగరం అడవిలోకి చేరుకున్నాను. ఎటు చూసినా రాలిన ఆకులే.సన్నని కొమ్మలు, రెమ్మలు ఆకులు రాల్చేసి ఆకాశంవంక చూస్తున్నవే.  ఎంత వేడి, భూమి బద్ధలౌతుందా అన్నంత వేడి. ఇంత వేడెక్కిన నేల, వేడెక్కిన గాలి, ఆకులు లేని చెట్లు, తట్టుకోలేనంత వేడి, మిట్టమధ్యాహ్నం కావస్తుండగా కార్యాలయానికి చేరుకున్నాము. కార్యాలయం పక్కనే  సమగ్ర గిరిజన అభివృద్ది కార్యక్రమం వాళ్ళ కార్యాలయం ఉంటుంది.  అవి రెండూ దాటితే పల్లెలు. ఇక్కడికి ఏమి కావాలన్నా నాగారం వెళ్ళవల్సిందే. అంటే గ్రామానికి వెలుపల ప్రారంభంలో మా రెండు కార్యాలయాలు ఉన్నాయన్నమాట.

కార్యాలయంలో యధావిధి పలకరింపులూ, పనుల  తర్వాత సాయం పూట పరిసరాలు గమనిస్తే  మూలమలుపు   మీద ఒక రేల చెట్టు (  Cassia fistula )శాండలియర్లాంటి తన పూలగుత్తుల్ని వేలాడేసి  నిల్చుంది. చిన్న చెట్టేగానీ పూతనే ఘనం. మంచి లేత పసుపు రంగు, ఎక్కడి నుంచి చూసినా  ప్రస్పుటంగా కనిపించే రంగు, బహుపెద్ద గుచ్ఛం, ఎంతసేపు చూసినా తరిగిపోని విన్యాసం. ఒక్కటే చెట్టుంది  కానీ, మూలమలుపంతా తనదే.పూలు కూరల్లో వాడతారు కానీ  నేనెప్పుడూ తినలేదు. ఒకసారి ఒక ఆయుర్వేద వైద్యుడు రేలపూల ఆరోగ్య విలువల గురించి చాలా చెప్పాడు గానీ ఇంత అందమయిన పూలు కోయాలంటే మనసు చంపుకోవాల్సిందే.

గోదావరితీరం చూడాలని ఊరు దాటి వెళ్తే జీవనది, జీవంలేని నదిలా పిల్లకాలువలా పారుతోంది. జనం  అక్కడక్కడా చిన్ననీటి చెలమలు చేసి నీళ్ళు తోడుకొని వెళ్తున్నారు. కాస్త వెసులుబాటు ఉన్న చోటున నీటిలోకి దిగి పశ్చిమానికి తిరిగి ఎర్రగా కిందికి దిగుతున్న సూర్యునికి  నమస్కరించాను.కొంతమంది స్త్రీలతో మాట్లాడాను.వారి అమాయకపు నవ్వులో  ఆకాశమంత  వినయం.

గోదావరినదికి  ఇటు తెలంగాణ, అటువైపున చత్తీస్గర్.  తన పరివాహక ప్రాంతం అంతా కూడా విస్తారమైన టేకు వనాలు నిలదొక్కుకోవడానికి ఆలవాలమై ఉంది. ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి, బాసర క్షేత్రందాటి, బోధన్  దాటి, కాళేశ్వర ముక్తేశ్వరందాటి, ధర్మపురిదాటి ఇక్కడికి ప్రవేశిస్తుంది. గోదావరి ఇటునుంచి ఖమ్మం, అటు తరువాత సముద్రంలో కలుస్తుంది. భారతదేశ చరిత్రలో చెప్పబడే పదహారు మహాజనపదాలలో అస్మిక మహాజనపదం ఒక్కటే  గోదావరి తీరాన వెలసింది. అస్మిక మహాజనపదం  క్రీస్తు పూర్వం మూడో శతాబ్దానికి చెందినట్లయితే గోదావరి ప్రస్థానం కూడా అంతే పురాతనమైనది. గోదావరిని  మనం ఇప్పటికీ చూడగలుగుతున్నాం. సరస్వతీనదిని చూడలేకపోయాం. అస్మిక రాజ్యం అంతరించింది. నది అప్పటి నుంచి   ఇప్పటికీ ప్రవహిస్తూ ఈ ప్రాంతమంతా కూడా ససశ్యామలం చేస్తూనే ఉంది.గోదావరి  నదీ  ప్రస్థానం ఇంకా కొనసాగడానికి అడవి బతికి ఉండడమే కారణమై  ఉండే అవకాశం ఉంది.

గ్రామంలోని సందులలాంటి  దారులగుండా నడిచి వెళ్తే గ్రామంలోని విశేషాలు ఎన్నో కనిపించాయి. గుడిసెలు, బర్రెలు, ఆవులు, మేకలు  వంకరటింకరగా  ఉన్న ఇళ్ల అమరిక. కుదురుకున్న ఊర్లు ఇలాగే ఉంటాయి.గోదావరి ఒడ్డునుంచి ఊర్లోకి వస్తే రెండు తాడి చెట్లకు నిలువెత్తు వెదురుగడలు అమర్చారు. ఒక్కోగడకి అటూఇటూ వచ్చిన కొమ్మలు మెట్లలాగా ఉన్నాయి. కల్లు తీయడానికి ఈ వెదురుగడ ఏర్పాటు బాగుందనిపించింది.  ఏటూరునాగారం అడవిలో టేకు , మద్ది తర్వాత విస్తారంగా ఉండేది, వెదురు పొదలే. వెదురు పొదలు ఉన్నచోట అడవి దున్నలు చక్కగా మనగలుగుతాయి. అడవిదున్న బలిష్టమైన జంతువు. నిగనిగలాడే మేఘంవంటి శరీరం, నున్నని దళసరి చర్మంతో మనం తరచూ  చూసే  బర్రెతో పోలిస్తే పెద్దగా ఉంటుంది. అయితే కాళ్ళు మాత్రం మోకాలుదాకా తెలుపు రంగులో ఉంటాయి.ఈ లక్షణాన్ని వైట్ సాక్స్ అంటారు. పిల్ల దున్నలతో తల్లి తిరుగుతూ కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ అభయారణ్యం వేటవిడిది కేంద్రం. వన్యప్రాణి చట్టం రాకముందు, చివరగా ఫ్రాన్స్ రాయబారికి ఇక్కడ అడవి దున్నను వేటాడే అవకాశం మర్యాదపూర్వకంగా ఇవ్వబడినదని పాత రికార్డులలో చదివాను.  ఇది పులులకు కూడా ప్రసిద్దిచెందిన ప్రాంతం.ఇంకా బెట్టుడుతలది కూడా. ఇక్కడ నివసించే బెట్టుడుతలు( Ratufa  indica) మన దేశానికే (Endamic) ప్రత్యేకమైనవి.వీటిల్లోనే ఇంకా రెండు మూడు జాతులున్నాయి. వీటి శరీరం  లేతకాఫీరంగు నుంచి ముదురు చాకోలేట్ రంగుదాకా వైవిధ్యం ఉంటుంది.

అభయారణ్యాలు, జాతీయవనాలు రెండూ అడవులను కాపాడే చట్టపరమైన ఏర్పాటు. వన్యప్రాణి చట్టం -1972లో  ఇందుకు తగిన విధి విధానాలు ఉంటాయి. అభయారణ్యం ఏదో ఒక జాతికి అది వృక్షమైన , జంతువైనా  కావచ్చు. అదే జాతీయవనం అయితే మొత్తంగా ఆయా ఆవరణ వ్యవసస్థకు కేటాయించినది. ఇక్కడ ఏటూరునాగారం అడవిదున్నలు   బెట్టుడుతలు ఈ   రెండు జాతుల సంరక్షణకు  ఏర్పాటు చేయబడింది. వీటిని   ఫ్లాగ్ షిప్ స్పీసీస్ అంటే ఆ ఆవరణ వ్యవస్థకు  నౌకాధ్వజాలాంటివి అని అర్థం. వన్యప్రాణీ సంరక్షణలో తరుచుగా వినిపించేమాట కీ స్టోన్ స్పీసీస్(Key  stone ) అని, అంటే   యే  వన్యప్రాణి  లేకపోతే  ఆవరణవ్యవస్థ మనుగడ మొత్తంగా  లుప్తం అవుతుందో అదన్నమాట. Key stone అనేది నిజానికి భవననిర్మాణాలలో వాడే పదం. ముఖ్యంగా ఆర్చ్ వంటి నిర్మాణాలు చేపట్టేటప్పుడు మధ్యలో ఒకరాయి ఉంచుతారు. దానికి ఆధారాన్ని అమర్చి ఇరువైపలా ఆర్చ్ నిర్మిస్తారు. ఆర్చ్ నిలిచి ఉండడానికి ఈ కీ స్టోన్ ఎలాగైతే కారణమో అలాగే ఆ ఆవరణ నిలిచి ఉండడానికి కూడా ఆయా జాతులు కారణమని అర్థం. సాధారణంగా ఈ కీ స్టోన్ జాతులు ఆవరణ వ్యవస్థలో పై స్థాయిలో ఉన్న మాంసాహారులు. ఉదాహరణకు ఒక అడవి ఆవరణవ్యవస్థకు పులిగానీ, సింహంగానీ కీ స్టోన్ జాతి అన్నమాట. ఇవి ఉన్నంతకాలం కిందిస్థాయి జీవులైన దుప్పులు, ఇతర శాఖాహార జంతువుల జనాభా,వాటికి ఆధారంగా ఉన్న మొక్కలు,వృక్షాల జనాభా కూడా అదుపులో ఉంటుంది. లేకపోతే శాఖాహార జంతువుల జనాభా అదుపు తప్పి మొత్తం ఆవరణవ్యవస్థ చిన్నాభిన్నామౌతుంది.ఇంకా ప్రత్యేక ఆవరణ వ్యవస్థలలో ఉన్న వృక్షజాతులు కూడా కీ స్టోన్ జాతులుగా ఉంటాయి. ఉదాహరణకు మడ  అడవులు. మడ అడవులలో మడ మొక్కలే కీ  స్టోన్ జాతి.

చీకటి ముసుసరుకునే వేళ చుట్టూ ఉన్న చెట్లవల్ల  మా విడిది మరింత చీకటిగా మరింది. ఆకాశం స్పష్టంగా ఉండి చుక్కలు మిల మిలలాడుతూ ఉన్నాయి. అభయారణ్యంలో రాత్రి ప్రయాణాలు నిషిద్దం, లేదా తప్పనిసరిగా వాహనాల వేగం గంటకు ముప్పై  కిలోమీటర్లు దాటకూడదు. జంతువులు అటూ ఇటూ తిరిగుతూ ఉంటాయని, వాహనాల వేగంవల్ల చీకటిలో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ అని ఈ విధానం చేశారు. ఈ అభయారణ్యం విస్తీర్ణంలో చాలా పెద్దది, ఎనిమిది వందల చదరపు కిలోమీటర్లు. దట్టమైన టేకు వృక్షాలు క్రమేణా దోపిడీ చేయబడి ఇప్పుడు ఎక్కువగా నల్లమద్ది, ఇప్ప, యేరుమద్దిలతో  కూడిన మిశ్రిత అడవిగా ఉంది. ఇలా  మన ప్రజలు క్రమేణా ఒక టేకు ఆవరణ వ్యవస్థని మిశ్రిత అడవిగా మార్చేశారు. టేకు చెట్లు ఎక్కువగా ఉంటే టేకు అడవి,ఒకే పంట. అలా ఉన్నప్పటికంటే మిశ్రిత అడవులలో అనేక జాతులు ఉంటాయి కనుక  వైవిధ్యం ఎక్కువ.కాకపోతే వాణిజ్య విలువ మారుతుంది. సహజంగా జీవజాలం కాలక్రమేణామార్పులకులోనై  ఒక నిర్ధిష్టమైన జీవసమూహం మనుగడలోకి వస్తుంది. జీవుల మధ్య మనుగడకోసం  నిరంతరం సర్దుబాటు ప్రయత్నం జరిగి ఇలా నిర్ధిష్ట జీవసముదాయం మనుగడలోకి రావడాన్ని అనుక్రమం  ( Succession )అని అంటారు. అన్ని ఆవరణ వ్యవస్థలలో ఇది జరుగుతుంది. జీవులు మనుగడకోసం పోరాడుతాయి.సర్దుబాటు చేసుకుంటాయి. మానువులు  మధ్యలో దూరనంత వరకూ ప్రకృతికి జీవులకు జరిగే సంఘర్షణ ఒక రకంగానూ, తదుపరి ఒకరకంగానూ ఉంటుంది. మానవ ప్రభావితమైన చోట ప్రకృతి సహజ ఏర్పాటుకు విఘాతం కలిగి ఆవరణ వ్యవస్థ సహజ స్వభావాన్ని కోల్పోతుంది. ఇలా జరగకూడదనే జాతీయ వనాలను ఏర్పాటు చేసి అన్ని  రకాల బాహ్య ప్రభావాలను నియంత్రిస్తారు. చట్టపరమైన  ఏర్పాటువల్ల చాలావరకు కాపాడగలిగినా  ఇంకా చేయవలసింది ఎంతోఉంది. ఇక్కడైతే కొన్ని ప్రత్యేక  కారణాల వల్ల మానవుల ప్రమేయం జరగింది కానీ కాపాడుకోవడమే  మా నిరంతర లక్ష్యం. ఇందుకు మేమేమి చేయాలో మాకు నిర్దేశించబడిన  నిర్వహణా ప్రణాళిక (Management Plan)లో పొందుపరుస్తారు. మిగిలిన అటవీ ప్రాంతాలకు పది సంవత్సరాలకాలానికి విధివిధానం (Working Plan) ఉన్నట్టుగానే వన్యప్రాణీ  విభాగాలకు  నిర్వహణా ప్రణాళిక ఉంటుంది. ఇదికూడా పదేళ్లకాలానికి సరిపడా చేయవల్సిన పనులను నిర్దేశిస్తుంది. వీటిని ప్రతీ సంవత్సర ప్రణాళికతో జతపరుస్తూ ఆయా ప్రాంతాలను కాపాడవలసి ఉంటుంది. ఇది చూసుకోవడమే మా బాధ్యత.

వనరుల సంరక్షణా విధానం కూడా ఆయా ప్రాంతాలకు తగినట్లుగా  వికేంద్రీకరణ జరగడాన్నే నిర్వహణా ప్రణాళికలు సూచిస్తాయి. ఉదాహరణకు ఇప్ప పూవుతో ఇప్ప సారా ఒక్కటే కాదు, నూనె తీస్తారు, పువ్వులు తింటారు. ఇప్ప పువ్వు నూనె వంటలలో వాడతారు, చర్మానికి వాడతారు.  ఇప్ప చెట్టు అంతటా పెరగదు. అది మనుగడ సాగించిన చోటనే దానిని అభివృద్ది చేస్తే ఆ చెట్టు సంరక్షణనే కాకుండా పెద్ద మొత్తంలో వనరులు సేకరించి వాడుకోవచ్చు. అక్కడ ఉండే జన సమూహానికి తగిన ఆర్థిక అభివృద్ధి  ప్రణాళిక తయారు చేయవచ్చు. అలాగే  కొన్ని రకాల జీవులు ప్రత్యేకమయిన మొక్కలమీదనే ఆధారపడి బతుకుతాయి. ఉదాహరణకు బెట్టుడతనే తీసుకుంటే అది యే చెట్టు మీద ఉంటుంది, యే చెట్ల మీద తన పిల్లలను పెంపు చేస్తుందో తెలుసుకొని వాటినే విరివిగా పెంచితే ఆ చెట్లు ఉన్నంత కాలం బెట్టుడత  మనుగడ సులువుగా కొనసాగుతుంది. ఇవన్నీ నిర్వహణా ప్రణాళికలో ఉంటాయి

ఏటూరునాగారం వచ్చేటప్పటికి నా వ్యక్తిగత ప్రణాళిక ఏమిటంటే ఇక్కడ ఉన్న సంప్రదాయ ఆయుర్వేద విజ్ఞానాన్ని  (Ethno botanical Study)రికార్డు చేసి ఆయా జాతులను పెంపొందించే విధంగా వీలైనన్ని చర్యలు  తీసుకోవడం. ఇప్పటికె వివిద విశ్వ విద్యాలయాలు చాలావరకు సంప్రదాయ ఆయుర్వేద విజ్ఞానాన్నిరికార్డుచేసే పనిచేశాయి.అయితే అవి విశ్వ విద్యయాలనికే పరిమితం అయ్యాయి.వాటిని జతపరుస్తూ ఆయా ఔషదీయ వృక్షవనరులను సంరక్షించే సమన్వయం జరుగలేదు. ఇలా రికార్డు చేయబడే వనరుల విలువ అంతర్జాతీయ న్యాయస్థానంలో మన దేశం పసుపు మీదా, వేప మీదా, బాస్మతి బియ్యంమీదా పోరాడుతున్నప్పుడు అర్థం అయింది.ఇలాగే అనుకొని వీలైనంత సమాచారం సేకరించుకోవాలని సంకల్పం చేశాను.అది నాకు చాలా ఇష్టమైన పని. ఇక్కడ ఉన్న మానవ వనరులను వీలైనంతగా పరిశీలించాలనే కోరికా ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఈ అడవులలో అటవీశాఖకు ప్రజలకు మధ్య మొదలైన ఘర్షణ తీవ్రమైన పరిస్థితులను ఏర్పరచింది. ఇప్పటికీ అది కొనసాగడంతో మా పని మీదా దీని ప్రభావం ఉండబోతుందని అర్థం చేసుకున్నాను. కానీ ఎటూ కోవిడ్ సృష్టించిన మారణహోమం కొనసాగుతున్న వేళ రేపు అనేది అపనమ్మకంగా ఉన్న వేళ  మన గురించి, కుటుంబం గురించిన వ్యాకులత ఇంత చల్లగాలినీ దుఖపెడుతున్నట్లుగా తోచింది. గత రెండు నెలలుగా ఉన్న కోవిడ్  ఉద్ధృతిలో మా సిబ్బందికి ఎటువంటి ఆపద రాలేదని తెలిసి సంతోషించాను. అయితేవచ్చే కాలమంతా బీడీఆకులు ఏరే కాలం.  ఇందుకు మానవవనరుల కదలికలు కొంత ప్రమాదాన్ని కలిగించవచ్చు. మరో వైపు తీవ్రమైన ఎండలు. సమస్యను కాలానికి వదిలివేయడమే మాకు మిగిలింది.

కుప్పపోసిన ఇసుక మీద కూర్చొని, చల్లగాలికి మెల్లగా అటూ ఇటూ ఊగే కొమ్మలను చూస్తూ ఉండిపోయాను. ఇటువంటప్పుడే కథలు కథలుగా సాగే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఊరటనిస్తాయి.ఎక్కడో ఎవరికో ఎప్పుడో జరిగిన సంఘటననో  ఎదుర్కొన్న పరిస్థితో కథలుగా చెప్తే బాగుంటుంది. ఏదో ఒక సలహా చెప్పినట్టు ఉంటుంది.ప్రవాహంలాగా చదువుకుంటూ పోవచ్చు. కానీ వాటిని  మన జీవితంతో సమన్వయం చేసుకోని పాటించడమే కష్టం. పూర్వం ఇలాటివి చిన్న పిల్లలకు కథలుగా చెప్తూ సాపేక్షంగా ఇచ్చిన జ్ఞానంలాగానే ఉంటాయి.విభిన్న వ్యక్తీకరణ అంతే.నావద్ద ఉన్న కొన్ని అలాటి పుస్తకాలు తెచ్చుకున్నాను.వాటిని చూస్తే  ఏమీ తోచని క్షణంలో భుజం మీద చేయి వేసి పిలిచినట్లు  అనిపిస్తుంది. నాకూ ఇప్పుడు అవే సాంత్వన.

ఈ మధ్య బాగా గుర్తుపెట్టుకున్న వాక్యం “ప్రతి సైనికుడి మనసులో అతడు జయించవల్సిన ఒక రాజ్యం ఉంటుంది  నిబద్ధతతో ఉన్న సైనికుడు ఇతరుని కన్నా సృజనాత్మకంగా ఆలోచించి పోరాడతాడు” అని.  ఈ మాట  రాబర్ట్ గ్రీన్ రాసిన శక్తి యొక్క నలభై ఎనిమిది సూత్రాలులోనిది. సైనికుడికి అయితే జయించవల్సిన రాజ్యం ఉంటుంది, మరి సామాన్యమైన  ఉద్యోగికి ఏముంటుంది? కేవలం నిర్ణయంచబడిన  లక్ష్యాలను మొక్కబడిగా సాధించడమేనా, ఆ సాధనలో భాగంగా బాహిరాంతర జీవనంలో వచ్చిన పరిపక్వతనూ, సంతృప్తిని వ్యక్తపరుచుకుంటాడా, అటువంటి అవకాశం ఉందా, విస్తారంగా గడించిన అనుభవాన్ని ముందు వాళ్ళకు వదిలివెళ్తున్నాడా? ఉద్యోగి యొక్క సృజనాత్మక విజయాలను కార్యనిర్వాహకవర్గం నమోదు చేస్తున్నదా? అనేవి  ప్రశ్నలు. ఏదైనా ప్రత్యేక కార్యక్రమం మొదలు పెడితే ప్రాజెక్టు రిపోర్టులో అన్నీ విషయాలు తెలియజేస్తారు. కానీ  ఉద్యోగి అనుభవాలు చాలావరకు వాటి పరిధిలోకి రావు.కానీ అవి చాలా విలువైనవి.మరలా అదే  పనిని చేపట్టడంలో, నిర్వహించడంలో ఆ సమాచారం చాలా వరకు సమయాన్ని, వనరులను ఆదా చేస్తుంది. ఇలా అనుకున్నప్పుడు ఎవరైనా  ఉద్యోగ జీవనం నుంచి  పొందవల్సినది ఏది, దానిని ముగించే రోజుకు ఆర్జించిన  జ్ఞానానుభవాలు ఎలా వదిలి వెళ్లగలరు  అన్న ప్రశ్న ఇలాటివి రాయడానికి ప్రేరణ.ఒక ఉద్యోగి తన సేవలను ముగించినప్పుడు అతని వద్ద నుంచి, అతని గొప్ప విజయాలను, అనుభవాలను పొందుపరిచే విధానం ఉంటే బాగుంటుంది. అలా చేయగలిగితే అవి నిజమైన ఉత్తమమైన సలహాలుగా ఉంటాయి.అటవీశాఖలో ఇటువంటి విషయాల ఉపయోగం ఎంతో ఉపయుక్తం.

రాత్రి మరింత చిక్కబడేలోగా రేపటికి చేయవలసిన పనులను సరిచూసుకొని విడిదికి వెళ్లిపోయాను. ఇక్కడి వాతావరణాన్ని ఒకింత చూపించే అమృత సంతానం, వనవాసి రెండూ గుర్తుకు వచ్చాయి. వనవాసిలో రాసినట్టు డోల్  బాజీ అడవిలో సంచరించే అడవిదున్నల దేవత టాండ్బారోలాంటి విషయాలు ఎప్పుడూ వినలేదు కానీ ఈ అడవి మారేడుమిల్లి  అడవిలాగా మార్మికమైనది కాదు, ఇక్కడి అడవిలో ఒక ప్రసన్నత అయితే ఉంది. ఈ అడవిలో మనగలిగే చెట్టూ, పుట్టా అన్నీ అమృత సంతానమే.వాటి మనుగడ గుట్టు అమృతత్వం వైపు ప్రయాణమే. ఇదంతా ప్రకృతి  అభంగలీలా వినోదమే.

-దేవనపల్లి వీణావాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో