‘నా విజయానికి
అన్నివైపులా నువ్వే’
నేను ఎంత ఎదిగినా
శ్రీగంధానికి తోడున్న కందిచెట్టులా
నా వెనుక నువ్వున్నావు
నా రెక్కలకు ఊతమిచ్చావు
నీ ప్రతిరూపాలను
కానుకగా ఇచ్చావు
నా మనసులోని బాధ మేల్కొనగానే
నీ నేత్రాలు విప్పార్చుకున్నాయి
‘నన్ను దీపంలా వెలిగించి
నువ్వు శలభంలా కాలిపోయావు
మా అమ్మ జన్మనిచ్చింది
నువు గొప్ప జీవితాన్ని ప్రసాదించావు’
సాగుకు జలంలా
పంటకు ఊతంలా
స్థిరమైన రేపటికోసం
సమానత్వం సాధించడానికి
నిన్ను నిన్నుగా ఎదగనివ్వాలి
అంతర్జాల ఆకాశంలో
‘విహంగ’మై విహరించావు
నీ ‘ఫెమినిజ’ భావాలకు
ఊదారంగు పూయాలి
అంతర్జాతీయమైన నీకు
అనునిత్యం ధనుర్ధాసులా నీకు గొడుగు పట్టాలి
ఏమిచ్చి నీకు సరిపుచ్చగలను
నీ మట్టిపాదాలకు
ప్రణమిల్లడం తప్ప.
-వెంకటేశ్వరరావు కట్టూరి
(అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా )
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~