ఓ పాట
శ్రుతిలయలతో హాయి గొలుపుతుంది
శ్రుతి తప్పిన హృది వీణను సవరిస్తుంది!
మరో పాట
ఉద్యమానికి ఊపిరి పోస్తుంది
ఉర్రూతలూగించి ఉత్సాహాన్ని ఉద్భవింపజేస్తుంది!
ఇంకో పాట
వేదన పొందిన మదికి సాంత్వన
లేపనం పూస్తుంది
వేకువ పొద్దులా నూతనోత్తేజాన్ని నింపుతుంది!
పనిలో పాట
పనిపాటుల్లో శ్రమను మరిపిస్తుంది
తల్లి పాడే పాట
పసిపాపను మురిపించి నిదురపుచ్చుతుంది!
అగ్గిని రగిలించే పాటొకటి
అనుబంధాలను వివరించే పాటొకటి
ప్రకృతి అందాలను వర్ణించే పాటొకటి
ప్రకృతి ప్రతిరూప విలువను తెలిపే పాటొకటి!
జీవితానికి దిశానిర్దేశం చేస్తుందొక పాట
మంచిచెడులను తెలియజేస్తుందొక పాట!
జీవితపాఠాలను బోధిస్తుందొక పాట
బాధలను దూరం చేస్తుందొక పాట!
ప్రణయ విహారం చేయిస్తుందొక పాట
మానసిక వికాసం కలిగిస్తుందొక పాట!
ఆత్మహత్యలు ఆపగలదు పాట
ఆనందవరాన్ని అందించగలదు పాట!
ఎన్నెన్నో పాటలు!
పాటేదైనా…
శిశువులను
పశువులను
పాములను
సైతం పరవశింపజేస్తుంది!
-చంద్రకళ.దీకొండ,
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~