‘శత’ అనగా నూరు. ‘శతకము’ అనగా నూరు లేదా అంతకన్నా ఎక్కువ పద్యాలు కలిగినది అని వ్యవహారంలో ఉన్నది. సాధారణంగా నూట ఎనిమిది పద్యాలు రాయడం ఆనవాయితీగా పాటించబడుతూ ఉంది. శతకానికి మకుట నియమం తప్పనిసరి. సంఖ్యానియమం, మకుటనియమంతో పాటు తెలుగుశతకాల్లో వృత్తనియమం, భాషానియమం, రసనియమం అనే లక్షణాలు కనిపిస్తాయి. శతకాల్లో ఏపద్యానికి ఆపద్యమే స్వయంసంపూర్ణంగా ఉంటుంది.
శ్రీ పాలా వెంకటసుబ్బయ్య గారు పలు ప్రక్రియల్లో అనేక రచనలు చేసినప్పటికీ, అవి ఆముద్రితములుగా ఉండిపోయిన కారణంగా, కవితాలోకంలో మరుగున పడిన మంచికవి, ‘మరోజాషువా’గా ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారిచే పిలువబడిన పాలా వెంకటసుబ్బయ్య గారు. వీరు రచించిన 27 పద్యకావ్యాలు ‘పాలా వెంకట సుబ్బయ్య కవిత్వ సర్వస్వం’ పేరుతో ఈ మధ్యనే ప్రచురింపబడి వెలుగులోకొచ్చాయి. ఆ ఇరవయ్యేడు కావ్యాల్లో ఒకటైన మానవీయ శతకం లోని మానవీయ కోణాలను చర్చించేదే ఈ వ్యాసం.
కవి సంక్షిప్త పరిచయం:
శ్రీ పాలా వెంకటసుబ్బయ్య గారిది (1913 – 1986) కడప జిల్లా లోని కోడూరు. ఈయన కోఆపరేటివ్ ఇనస్పెక్టరు గాను, పత్రికా సంపాదకుడు గాను, శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలిలో సభ్యుడు గాను పని చేశారు. 1951లో కోడూరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. వీరికి మధురకవి, కవిరాజహంస అనే బిరుదులున్నాయి.
మానవీయశతకం లోని అంశాలు:
కవి ఈ శతకాన్ని ఆటవెలది పద్యరీతి లో రాశారు.
శతకమకుటం:
శ్రీ పాలా వెంకటసుబ్బయ్య గారు తన శతకానికి గొప్ప మకుటాన్ని ఎన్నుకున్నారు. ఆ ఎన్నిక మాననీయంగా ఉంది. “మదినెరుంగు దీని మాననీయ” అంటూ తను చెప్తున్న దాన్ని మనసుతో స్వీకరించి మనసులో నిలుపుకొమ్మని చెప్తున్నారు. పైగా అదికూడా అత్యంత గౌరవమర్యాదలు కలబోసి ‘మాననీయ’ అంటూ పాఠకుల పట్ల తనకుగల పూజ్యభావాన్ని వెల్లడించారు.
ఇందులో ముగింపుతో కలుపుకొని మొత్తం 109 పద్యాలున్నాయి. ఈ నూటతొమ్మిది పద్యాలూ విద్య, నడవడి, ఆత్మ విశ్వాసము, అహితులు, పిత్రార్జితము, కృషి, రచయితలు, స్వయంసేవ, లక్ష్యసిద్ధి, ముగింపు అనే శీర్షికలతో వివిధ అంశాలుగా విభజించబడ్డాయి.
శ్రీ పాలా వెంకటసుబ్బయ్య గారు ఈ శతకంలో మనిషిని లేదా సంఘాన్ని అందలి లోపాల్ని ప్రశ్నించారు, విమర్శించారు, కొన్ని సూచనలు చేశారు. వాటిపై కవివరేణ్యుల విభజనా క్రమం లోనే ఆయా అంశాలను ఒక లఘుపరిశీలన చేద్దాము.
విద్య:
“సర్వవేదములను సర్వశాస్త్రములను
చదివిన ఘనుడేని చవటయగును”
ఇందులో అన్ని వేదాలూ శాస్త్రాలూ చదివిన ఘనుడైనప్పటికీ, ‘మానవత్వ తత్త్వ మర్మము నెరుగమి’ చవటైపోతాడు అనితేల్చేశారు. మానవత్వానికే ముఖ్యస్థానమిచ్చారు. నాలుగవ పద్యంలో- ‘మానవత్వ మెరుగు మనుజుడె మనుజుండు – దాని తొలగి మెలగ దానవుండు’ అని నిర్ధారించారు. ఐదవ పద్యంలో మానవత లేనినాడు ‘వివిధ బిరుదులంది విద్యాలయమ్ముల వెలికి వచ్చినంత విజ్ఞుడగునె?’ అని ప్రశ్నించారు. ఆరవ పద్యంలో పాఠాలను బట్టీ పట్టి, పట్టభద్రులైపోయామంటే చాలదంటారు. తొమ్మిదవ పద్యంలో వ్యక్తిత్వం అడుగంటకూడదన్నారు.పరిపూర్ణమానవుడుగా తయారుచేయ్యలేని విద్యవలన లాభమేమి?టంటారు.
నడవడి:
“పరువుగలదు కలదు వ్యక్తిత్వమనుచును
ప్రభువుమాట కేని వంతపాట
పాడకుండువాడె ప్రాజ్ఞుండు పరికింప” అంటూ పదకొండవ పద్యంలో వ్యక్తిపూజ, వంతపాట మాని మన స్వంత పరువు, వ్యక్తిత్వం నిలబెట్టుకోవాలి అన్నారు. అహాన్ని విడవాలి. ఆత్మశుద్ధిని కలిగివుండాలి. ఆవేశాన్ని అణచుకొని ఎప్పుడూ సుమనస్కుడిగా ఉండాలి. పేదరికం ఎంతగా బాధిస్తున్నా బుద్ధి కలిగినవాడు భరించగలడు. మూర్ఖుడు స్థిరచిత్తం, దృఢనిశ్చయం లేక జీవితం మీద పట్టుకోల్పోతాడు. జ్ఞానార్జన బుద్ధిని, శక్తిని, జయాన్ని ఇస్తుంది.
ఆత్మ విశ్వాసం:
“ఆత్మశక్తి గల్గు నతిరథుజూచిన
జనులు తొలగి చోటు సంతరించి
యిత్తురతడు సాగు నెల్లల గమియించి” అని ముఫ్ఫై అయిదవ పద్యంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్న వ్యక్తిని జనులు గౌరవించి దారిస్తారు అన్నారు. కష్టాలను దాటి, గెలిచి వచ్చినవారెందరో ఉన్నారు. నా అభివృద్ధికి పరిస్థితులు అడ్డుపడ్డాయని చెప్పడంలో అర్థం లేదు. శారీరకబలం పైనే ఎక్కువమంది దృష్టిపెడతారు, కానీ ఆత్మశక్తి గొప్పది. తరగని ఆశ, చెరగని చిరునవ్వు, నైపుణ్యం ఉంటే జయము తథ్యం. కష్టాలు స్వశక్తిని పెంపుచేస్తాయి. నైపుణ్యాన్ని పెంచుతాయి. సుఖాలు సోమరిని చేస్తాయి.
అహితులు:
“తొలుత పటువిమర్శ కలిగించు బాధను
తప్పు దిద్దుకొనగ మెప్పుగలుగు
శస్త్రవైద్యమటులె సంధిల్ల జేయదా” అని డెబ్భై రెండవ పద్యంలో విమర్శ బాధ కలిగించినప్పటికీ, తప్పులుంటే దిద్దుకోవడానికి అది ఒక అవకాశం అన్నారు. శత్రువునూ ప్రేమించాలి. గిట్టనివారు మన లోపాల్ని వేలెత్తి చూపి, గేలి చేస్తారు. కానీ వారలా చేయడం వల్ల, అవమానంగా భావించి, మన లోపాలను దిద్దుకుంటాము.
పిత్రార్జితము: “అణగిపోవు సుతుని యార్జనోద్యమ శక్తి
అతని చరిత సున్న, అల్పమగును…..”
జీవితాంతం కష్టపడి సంపాదిస్తే, ఆ ఫలితాన్ని వారసులే అనుభవిస్తారు. కానీ కష్టపడకుండా సుఖాలు అంది రావడం చేత, వారు సోమరులైపోతారు. డెబ్భై అయిదవ పద్యంలో పిల్లలకు ఆస్తులు కూడబెట్టి అందజేయడం వలన వారిలో సంపాదించగల శక్తి తగ్గిపోతుంది. వారు చరిత్రహీనులు అయిపోతారు సుమా అని హెచ్చరించారు. కష్టమంటే తెలియకుండా పెరగడం వల్ల, సమస్య ఎదురైనప్పుడు వారికి ఏంచెయ్యాలో తోచక, దిక్కులు చూస్తారు.
కృషి:
“నిజవిజయము గొనగ ధ్వజము స్థాపింపగ
కృషి ధనంబె గాని యితరమొండు”
విజయానికి, సిద్ధికి తాళం చెవి కృషి మాత్రమే అన్నారు డెబ్భై తొమ్మిదో పద్యంలో. కాబట్టి సాధకులు అనుకున్న తక్షణం దీక్ష వహించాలి. విజయతీరాలకు చేర్చే ద్వారం అందరికీ అందుబాటులో ఎప్పుడూ తెరుచుకొని ఉండదు. అర్హుడైనవాడు తెగించి తలుపు తెరుచుకొని లోనికి ప్రవేశించగానే మరలా దగ్గరగా మూసుకుంటుంది.
రచయితలు:
“ప్రతిభగన్న కవులు ప్రాలుమాలక తమ
స్వీయచరితములను వ్రాయునెడల
యువకచిత్తములకు నుత్తేజకరమగు”
ఎనభై రెండవ పద్యంలో ఉన్నత శిఖరాల నధిరోహించిన ఘనులు తమ స్వీయ చరిత్రలను తప్పకుండా రాశి, భావితరాలకు అందించాలి. అవి యువతకు ఉత్తేజాన్ని,స్పూర్తినీ ఇస్తాయన్నారు. ప్రతిభావంతులుగా పేరుగాంచినవారు, ఆస్థాయికి చేరుకోవడం కోసం తాము ఎదుర్కొన్న కష్టనష్టాలను స్పష్టంగా వివరిస్తే, ఆశావహులకు అవి మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయి. అది పద్యం కావచ్చు, గద్యం కావచ్చు. రాయడానికి కవి పడే కష్టంతో పోలిస్తే చదవడం సులువే. ఒక విలువలున్న రచన వెలువడాలంటే ఎంత శ్రమో? ఎన్ని కాగితాలు ఖర్చవుతాయో? ఎన్నెన్ని సార్లు దిద్దుబాట్లు చేస్తారో? ఇంకెన్ని సార్లు సవరణలు చెయ్యాలో కదా?
స్వయంసేవ:
“ఉత్తమోత్తమమగు నుద్దేశమెదదాల్చ
బోనివానికెపుడు పొలుపు లేదు
తెడ్డులేని పడవ తీరమ్ము చేరునా”
ఉత్తమమైన ఉద్దేశ్యమే లక్ష్యతీరాలకు చేరుస్తుంది. అగమ్యగోచరమైన పనికి ఫలితం దక్కదు. తెడ్డులేని పడవ తీరం చేరలేదు కదా! నీకు నువ్వే సేవచేసుకో. నీ లోపలి శక్తిని నువ్వు తెలుసుకో. ఆత్మతేజంతో మళ్ళీ పుడతావు. ఇంద్రియ చపలత్వానికి లొంగకుండా, శక్తివంచన లేకుండా లక్ష్యం పైనే మనసు నిలిపితే జయం కలుగుతుంది. ఏ పనినైనా స్వతంత్రంగా ఇష్టపూర్తిగాస్వీకరించి ఆత్మశుద్ధితో ప్రయత్నిస్తే తప్పక సాధ్యమవుతుంది.
లక్ష్యసిద్ధి:
“జీవితమ్మునందు జిత్తశుద్ధి గలుగ
లక్ష్యమున్నయెడల లాభమొదవు
తెగిన గాలిపటము తీరేమి లాభమ్ము”
ఒక లక్ష్యమంటూ ఉంటేనే లాభం, కార్యసఫలత. తెగిన గాలిపటానికి తీరముండదు అని పోల్చి చెప్పారు. ముందుకు వెనుకకు ఊగిసలాడితే ఏకాగ్రత చెడుతుంది. లక్ష్యసిద్ధి జరుగదు. అటూ ఇటూ గంతులేసే కోతి ఏం సాధిస్తుంది? లక్ష్యంలో శక్తియుక్తులు కేంద్రీకరిస్తేనే సిద్ధి. లోకంలో చూస్తే ఒకేసారి అనేక కార్యములను తలపోసినవారు దేనిమీదా మనసు లగ్నం చేయలేక, కనీసము ఒక్క కార్యాన్నైనా సాధించలేక చతికిలపడడం గమనించవచ్చు. ప్రబలమైన ప్రయత్నం వలన చిన్ చిన్న లోపాలు కనపడకుండా పోయి తప్పక జయం కలుగుతుంది.
ముగింపు:
“అధిక శ్రద్ధ తోడ నాత్మ సంస్కారమ్ము
నార్జనమ్ము చేసి యాత్మకార్య
ముల బరోపయోగములకు బూన్ప వలయు”
ఎంతో శ్రద్ధతో ఆత్మసంస్కారాన్ని సముపార్జించి, నిస్సహాయులైన వారిని జూచి మనసు కరిగినపుడు పరులకు ఉపకారము చేయమంటున్నారు కవి. వారిది ఎంత పెద్ద మనసో ఎంత గొప్ప మనసో కదా! వస్తువాహనముల కంటే, ఆస్తులుఐశ్వర్యాలకంటే కూడా మానవత్వమే ఎంతో గొప్పదని, కవి ఎలుగెత్తి చాటుతున్నారు.
ఈ శతకంలో అనుసరణీయమైన, ఆచరణీయమైన, మానవ జీవితానికి ఉపయుక్తమైన సూక్తులు కొల్లలుగా జాలువారాయి. ఇంత మంచి శతకం ఇన్నాళ్లూ ఆముద్రితంగా ఉండిపోవడం శోచనీయం. ఇప్పటికైనా ఇది వెలుగులోకి రావడం సాహిత్యాభిలాషులకు ఆనందకరమే.
ఇలా ఒక శతకాన్ని అంశాలవారీగా విభజించి రాయడం పాఠకుల సౌలభ్యం కోసమే. రచయిత గాని, కవిగాని తన కవిత్వాన్ని పాఠకులను దృష్టిలో పెట్టుకొని రాయడం అత్యంత ఆవశ్యకం. ఏ కళకైనా పరమార్థం పాఠకులను రంజింపజేయడమే. అసలు మానవత్వాన్ని తన శతకం యొక్క అంశంగా ఎంచుకోవడం లోనే కవి సహృదయత అర్థమవుతోంది. ఈ పద్యాలన్నీ ఆటవెలది ఉపజాతిలో రాయడం కూడా పాఠకులకు చేరువకావడం కోసమే. కవి తాను చెప్పే మంచి సమాజంలోకి ఎలాగైనా చేరాలని కోరుకుంటాడు. పద్యాలలోని భావావంసులభగ్రాహ్యంగా ఉంది. ఈ శతక కర్తయైన శ్రీ పాలా వెంకటసుబ్బయ్య గారు, వారి సాహిత్యం సాహిత్యాభిలాషులందరికీ, సాహితీ వ్యాసంగంలో కొనసాగదలచుకున్న వారందరికీ మార్గనిర్దేశనం చేస్తాయనడం అతిశయోక్తి కానేరదు.
ఆధార గ్రంథాలు:
· ‘పాలా వెంకటసుబ్బయ్య కవిత్వసర్వస్వం’
· ‘తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు – డా. వెలమల సిమ్మన్న
– మురళీధరరావు ఇళ్ల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~