చిరుమువ్వల సవ్వడులు…
తప్పటడుగుల చిట్టి పాదాలు…
బుడిబుడి నడకలతో
బడి బాట పట్టాయి…
దిద్దుకుంటున్నాయి అ ఆ లు…
ఏ చెడు చూపు సోకెనో..!
లేక.. విధియే చిన్న చూపు చూసెనో !
ఆరేళ్ల ఆపసిది ఆహుతై పోయె…
ఇరవై ఏళ్ల కామాంధుడి కన్నుబడి…!!
కన్నపేగు కన్నీటికి అంతమన్నది లేకపోయే..!
పదహారేళ్ల పడతి…
చదువుతోంది పదో తరగతి..
ఆల్చిప్పల్లాంటి కళ్ళు…
అమాయకపు చూపులు…
విచ్చుకుంటున్న లేలేత అందాలు…
ఆకతాయిలకేమో చెలగాటాలు..!
తల్లీ, చెల్లి గుర్తుకురారు వాళ్లకు…
పరాయిపిల్లంటే అలుసు అల్లరిమూకకు !
వెంటాడి వేధించారు..
బ్రతుకు మీది ఆశల్ని చిదిమేశారు…
వేదనతో మూగయై…
ఉరితాడే శరణ్యమై…
నూరేళ్ల జీవితం
చితిమంటల పాలాయె…!!
పురిటికందులో… పసిపాపలో…
ముదివగ్గులో..అమ్మ వయసు ఆడదానిలో…
ఆడతనం తప్ప అమ్మతనం
చూడలేని కామాంధులు…!
కన్ను మిన్ను గానని…
వావి వరుసలు పట్టని…
బ్రష్టు పట్టిన నేటి
దుష్ట సమాజ నిజ స్వరూపమిది !!
మానవులు మృగాలై…
సంచరిస్తూ చేస్తున్న దారుణాలు..!
మృగాలకే తెస్తున్నాయి తలవంపులు…!
ఏ దినపత్రిక చూసినా
ఏమున్నది విషయం ఇంతకన్నా !
మానభంగాలు..హత్యాచారాలు …
దినం దినం…ప్రతీ దినం…
అడుగడుగునా అతివకు ఆగని గండం !
వద్దు..వద్దమ్మా..ఈ పుడమిపై పుట్టకమ్మా…
అడవిలో మానై పుట్టినా… అంతకంటే నయమమ్మా…
కాదూ…కూడదూ…పుడతానంటావా…
అప్పుడు..ఆడపిల్ల కాదు…
నీలో కనిపించాలి ఆదిశక్తి స్వరూపం..
నీ కళ్ళలో కన్నీటి ధారలు కాదు…
కురియాలి నిప్పుల వర్షం….
నీ గొంతులో ఆక్రోశం కాదు…
పెల్లుబికి ప్రవహించాలి..ఆగ్రహం !!
నీ శక్తియుక్తులే కావాలి నీకు
సర్వదా పెట్టనిగోడలు…
నీ నీడ సోకినా చాలు…
మసిగా మారాలి అపర కీచకులు…!
ఎవరి కోసమో ఎదురు చూస్తూ
చెయ్యొద్దు ఆర్తనాదాలు…
నీకు నీవే రక్షణగా
సాగాలి ముందుకు నీ అడుగులు…
అబలను కాదు…సబలను…
అనుకుంటేనే ఆడపిల్లవై జన్మించు…
నేటి భారతంలో తలెత్తుకుని జీవించు…
నీ జన్మ నీ చేతిలో లేదని చింతించకు…
జన్మించాక…నీ జన్మ రాత
నీ చేతిలోనే ఉంటుందని మరువకు….
-యం. ధరిత్రీ దేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~