వేదనామయ జగత్తుకు అమృతపానం – స్వేఛ్ఛాగానం (సాహిత్య వ్యాసం )- డాక్టర్ ఏ. ఈశ్వరమ్మ

 

 

 

ISSN – 2278 – 478 

దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు 1897 సంవత్సరం నవంబరు 1వ తేదీన జన్మించారు. వీరి పూర్వీకులు పిఠాపుయామ్ సంస్థానమున ప్రసిద్ధ పండితులు. ఈయన రఘుపతి వెంకటరత్నంనాయుడుగారి శిష్యులు. కొంతకాలం పిఠాపురం మహారాజా కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో కొంతకాలం ఉద్యోగం చేశారు. వీరి సాహితీకృషిని గుర్తించి ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించింది. కేంద్రప్రభుత్వం ‘పద్మవిభూషణ్’ బిరుదు ప్రదానం చేసింది.

భావకవిత్వానికి ఆద్యులు రాయప్రోలువారైనా, అందు కృష్ణశాస్త్రిగారు ప్రసిద్ధులయ్యారు. వీరు భావగీతాలు, గేయాలు, ఖండికలు, నాటికలు మొదలైన అనేక ప్రక్రియలలో ప్రావీణ్యత గలవారు. చలనచిత్రరంగం లోనూ వీరి కీర్తి వ్యాపించింది. అనేక సినిమాలకు పాటలు రాశారు. ఆ పాటలు మృదుమధుర భాషాబంధురములై విరాజిల్లుచున్నవి. వీరు సినిమా పాటలకు సాహితీగౌరవాన్ని సముపార్జించి పెట్టిన ఘనతను దక్కించుకున్నారు. గొంతులోని స్వరపేటికకు జరిగిన శస్త్రచికిత్స వల్ల, వీరి వాణి మూగవోయింది. అయిననూ కలముతో నవ్యకవితా విధానమున బహుగతులు చిత్రించారు. ఈయన వేషభాషలందు సంపూర్ణ స్వేఛ్ఛాప్రియులు.

ఆత్మాశ్రయత్వం, ప్రకృతిలో తాదాత్మ్యం, ప్రణయం, ఆకాంక్ష, విరహం, దుఃఖం, సౌందర్య పిపాస, దేశప్రేమ, విశ్య్వసౌందర్యప్రేమలో గాఢత, ఆర్ద్రతల్ని ఈయన కవిత్వంలో దర్శించవచ్చు.

ఆంధ్ర సాహితీజగత్తులో కృష్ణశాస్త్రి కృష్ణపక్షం, శ్రీశ్రీ మహాప్రస్థానం చదవనివారు సాధారణంగా ఉండరు. మహాప్రస్థానానికి ముందుమాట రాస్తూ చలం “కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ – ప్రపంచం బాధన్తా శ్రీశ్రీ బాధ” అంటాడు. నిజానికి సాహితీలోతులకెళ్లి అన్వేషిస్తే ‘బాధానివారణార్థమే’. కృష్ణశాస్త్రి భావకవితామృతాన్ని అందించారని అంగీకరించాలి. ఆయన ‘స్వేఛ్ఛాగానం’ చదివితే ‘ఇలాంటి లోకమొకటి ఉంటే రెక్కలు కట్టుకొని ఎగిరిపోదును కదా!’ అనుకొనివారు ఎవరుంటారు. సాహిత్యానికి సామాజిక ప్రయోజనం ఉండాలని ఉద్దండులకు తెలియదా? వర్గాప్రయోజనం రీత్యా అనేకానేక శాఖలు ఉద్భవించినప్పటికీ – ‘విశ్వస్రేయః కావ్యం’ అనేది అంగీకరించవలసిన సత్యం. సర్వజనామోదం.

సామాజిక పరిణామక్రమంలో – వన్యప్రాణిగా జీవించిన మానవుడు తన అనుభవాలతో గుణపాఠాల్ని నేర్చుకుంటూ అనేకానేక వ్యవస్థల్ని రూపొందించుకున్నాడు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరడానికి అనేక అవస్థలు పడ్డాడు. పడిలేస్తున్నాడు. చరిత్ర సరళరేఖ కాదు. అనేక ఒడుదుడుకులను ఎదుర్కొంటూ ముందుకే పోతుంది. ప్రయత్నమనేది ఉంటే మరింత వేగంగా ముందుకుపోతుంది. అలాంటి ప్రయత్నాలు చేసిన దార్శనికులు అనేక రంగాలలో అనేకులున్నారు. భాషాసాహిత్యాల పరంగా చూస్తే, ఎన్నో అద్భుతాలు జరిగాయి. దినదిన ప్రవర్థమానం చెందుతూ నవనాగరికరూపాన్ని సంతరించుకున్నాయి. ‘ఏది నాగరికత?’ అనేదానికి సంబంధించి ఖచ్చితమైన నిర్వచనాలు చెప్పడం సాధ్యం కాకపోయినప్పటికీ, ఏ వ్యవస్థలో అధికసంఖ్యాకప్రజానీకం సుఖశాంతులతో మనగలుగుతుందో – దానిని ప్రజోపయోగకర నాగరికత అనవచ్చును. నాగరికతలో మానసికవికాసం ఆరోగ్యకరమైన కోణం. ఈకోణాన్ని విస్మరిస్తే రసమయజగతికి నిండుదనం రాదు. సంతృప్తి కలగదు. వాసనాభరిత కుసుమాలకు ఆదరణ మెండు.

ఎన్ని హద్దులు విధించుకున్నా సాంస్కృతిక సమ్మేళనం అనివార్యం. పాశ్చాత్య సంస్కృతీనాగరికతల ప్రభావంతో – మన సంస్కృతీనాగరికతల్లో ఎన్నో గుణాత్మక మార్పులు సంభవించాయి. ఆ మార్పుల్లో కొన్ని సమాజాన్ని ఉర్రూతలూగించాయి. అందమైన అసత్యం మనసును రంజింపచేస్తుంది. మనోరంజకత్వం భావకవిత్వానికున్న గొప్ప సుగుణం. బాహ్యస్పృహ లేకుండా చేసి ఎక్కడెక్కడో విశ్వపు అంచులకు తీసుకుపోతుంది. వేదనాభరిత సమాజం నుండి సాంత్వన చేకూరుస్తుంది. నిజానికి ఇది ఒక ఆరోగ్యకరమైన మత్తు. అంతకుమించి తీరనిదాహం. అలాంటి దాహార్తిని కలిగించే కళల్లో అగ్రస్థానం కవిత్వానిదే. కవిత్వాల్లో రాజముద్ర భావకవిత్వానిదే.

ఈ నాగరిక అరణ్యవాసంలో అంతులేని క్లిష్టతల పద్మవ్యూహం నుండి ఒకింత పట్టింపులేని మూకల బారినుండి తాత్కాలికంగానైనా బయటపడేసి కొండంత ఉత్సాహాన్ని అనిర్వచనీయమైన ఆనందాన్ని ప్రసాదించేది ఊహాజగత్తే. నియమాలు, హద్దులు, కొలబద్దలు బాహ్యజగత్తుకే. అంతర్జగత్తుకు ఆ నియమం లేదు. కృష్ణశాస్త్రి జగత్తు సామాన్యుల ఊహకందని ఊహాజగత్తు. హృదయాన్ని ఆనందభంగమాలికలలో తేలుస్తాడు.

“చీకటి యను తీగ నక్షత్రములను పువ్వులను దాల్చ, కఠినశిలలు శిల్పకళతో వెలుంగ, మ్రోడులు చిగురింప, స్వేఛ్ఛాగానమను సెలయేళ్లు లోకమంతయు వ్యాపింపజేయుదును; మహాకఠినములగు దాస్యములనెడు సంకెళ్ళు విడిపోవ, ఆకాశపథమంతయు మారుమ్రోగునట్లు, కంఠమెత్తి గానమాలపింతును; మనసునందు సంతోషప్రకాశమంతట వెలుంగ, హృదయమున ఆనందమనెడు తరంగపంక్తులు తేలిపోగ, కనులలో హర్షజలములు రాగా స్వేఛ్ఛాగానమొనర్తును; ప్రతి యుగమునందును స్వేచ్ఛకై ప్రాణసుమములర్పించు వీరవరుల దివ్యజీవితములు సఫలమగునట్లు స్వేచ్ఛగా పాటపాడుదును; భయంకరములగు కష్టములనెడు తాపములు మరచి, మిక్కిలి వ్యాపించు చీకట్లను విస్మరించి, లోకమే వశముదప్పి నావెంట రాగా స్వతంత్రగానమునాలపింతును”.

“మనోహరములగు పక్షుల రెక్కలపై తేలి, నక్షత్రరాశిలో ఒక నక్షత్రమునై నా మధురగానమున లీనమయ్యెదను; మబ్బులనెడు పడవలలో ప్రయాణింతును; ఆకాశమంతయు విహరించి, మెరుపువలె మెరయుదును; పాట పాడుచూ పాడుచూ చిన్న చినుకునై భూమిపై పడిపోదును; తెల్లమబ్బుల తెరచాటున నుండు చందమామతో గూడి దోబూచులాడెదను”.

“నీటి తుంపరలు, చిన్న చేపలు, క్రొత్త ముత్తెములు – వాటితో నటనమొనర్చి సముద్రగర్భమున మునిగిపోదును; గాలితో పరుగులిడుదును; తరుశాఖలలో దూరెదను. అట ప్రేమరహస్యములు పలుకుదును; ఒక పూపడతి చక్కిలిగింతలు పెట్టి, మరియొక విరిపొలతితో సరసములాడి, ఇంకొక పూనెలతతో రహస్యములు సలిపి, వేరొక సుమకాంత సిగ్గు పోగొట్టి, మధుపమునై మధురమకరందము గ్రోలుటకై పువ్వుపువ్వున కెగురుదును”.

“ఉత్సాహంతో స్వతంత్రగానమాలపిస్తూ పక్షినయ్యెదను, చిన్న చుక్కనయ్యెదను, తేనెటీగనయ్యెదను, చందమామనయ్యెదను, మేఘమునై వింతగొలుపు మెరుపుగా మారుదును; పువ్వునయ్యెద, చిగురాకునయ్యెద, తుదకు పాటనే యగుదును; సెలయేరునగుదును, గాలినయ్యెద, సముద్రపుటలలనయ్యెద; ఎప్పుడో యొకప్పుడు – యెందులలో గాని మాయమయ్యెదను; ఇట్టి నా ఊహాగగనవిహారమును పరులపహసించినను, నా స్వతంత్రము ననుసరించి నే వర్తింతును; నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు, నా ఇఛ్ఛయే గాక నాకేటి వెరపు” అని ప్రకటించాడు.

‘సమస్తవిశ్వం మనదే’ అన్నట్లు ప్రకృతితో మమేకమైన తీరు ఊహాతీతం. ఆనందంతో సంబరంగా అంబరాన్ని తాకిన తీరు, ఉరకలేసే ఉత్సాహంతో సాగర గర్భాలలోకి చొచ్చుకుపోయిన తీరు, సమస్త ప్రకృతితో తాదాత్మ్యం చెందిన తీరు పరిశీలిస్తే ‘బాహ్యజగతిని సంపూర్ణంగా త్యజిస్తేనే అది సాధ్యం’ అనేది అవగతమవుతుంది.

కఠినసత్యం మనస్సును క్షోభింపజేస్తుంది. గ్రీష్మం రగిలిస్తుంది – పండువెన్నెల వికసిస్తుంది. రెండూ వాస్తవాలే అయినా వెన్నెలనే ప్రేమిస్తాం. కలల సాకారం కోసం కన్నీళ్లను అధిగమించడం కోసం – కలలనే ఆశ్రయించడం సృష్టివైచిత్రి గాక మరేమిటి! కవి మనసుకు పాఠకుల మనసు తోడైతేనే ఆ లోతులు తెలిసేది. భావుకత ఉంటే తవ్వే కొద్దీ దొరుకుతూనే ఉంటాయి. మహాప్రస్థానం, స్వేఛ్ఛాగానం రెండూ సుదీర్ఘపయనాలే. దోపిడీ పీడన, వంచన లేని ఆనందమయ ప్రపంచానికి గమ్యం తెలియాల్సింది బాటసారికి.

భావకవితా జగత్తులో కృష్ణశాస్త్రి కృష్ణపక్షం సొగసు ముందు శుక్లపక్ష శోభ చిన్నబోయింది. ప్రతి పదం లోనూ అంతర్లీనంగా ఉన్న భావనను గమనించగలిగితే – భావకవిత ప్రధానలక్షణాలుగా ప్రకృతిప్రియత్వం, స్వేఛ్ఛాప్రియత్వం, సౌందర్య తృష్ణ, భావంలో భాషలో నవ్యత గోచరమవుతాయి. మధురాతిమధురమైన గీతాలలో అంతర్లీనంగా విషాదం పొడసూపుతుంది. వ్యక్తి స్వేచ్ఛకోసం చేసిన సాహసంలో సామాజిక అస్వతంత్రతను, నియమాలను, సాహిత్యలాక్షణిక శృంఖలాలను బలంగా ఛేదించిన సాహసి కృష్ణశాస్త్రి. ‘దిగిరాను దిగిరాను దివినుంచి భువికి’ అనడంలో అతిశయించిన అంతరిక్షయాన ప్రియత్వం గోచరిస్తుంది. ‘మాయమయ్యెదనా మధుర గానమున’ అని గంధర్వుడు కాకుంటే అనగలడా?

‘మరచి విశ్వము మరచి నేనే – మరచి సర్వము నన్ను నేనే’ అన్నా,

‘వింతగా తోచు నా జీవితము నాకె – అమల మోహన సంగీతమందు’ అన్నా

లోతైన ప్రకృతి సౌందర్యారాధన, లోకపరిధి నుండి అలౌకిక స్థితికి చేసే ప్రయాణంలో అంతర్ముఖుడై చేసే అన్వేషణ గోచరమవుతుంది.

“సౌరభములేల చిమ్ము పుష్పవ్రజము

చంద్రికలనేల వెదజల్లు చందమామ

ఏల సలీలమ్ము పారు, గాడ్పేల విసరు

ఏల నాహృదయమ్ము ప్రేమించు నిన్ను” అంటూ తనను తాను సమాధానపరచుకున్న తీరు అద్భుతం.

వియోగంలో మాధుర్యాన్ని, విషాదంలో సౌందర్యాన్ని అన్వేషించి, దర్శించిన ఈ భావుకుని స్పర్శలో అగాధమైన అంతర్ముఖత్వం, అనుభూతి గాఢత, ఉదాత్తభావ సౌకుమార్యం దర్శించవచ్చు. ప్రకృతి యొక్క విరాట్ స్వరూపం దర్శింపజేస్తాడు. వ్యక్తి నుంచి సృష్టికి – సృష్టి నుంచి పరమేష్టికి ఎగబాకే తత్త్వం ఈయన కవిత్వం. పదాలకు నగిషీలద్ది, అమృతంలో ముంచి అందించిన సౌందర్యపిపాసి – బతుకంతా ప్రతి నిముషం పాటలాగ సాగాలని కాంక్షించిన ఈ గంధర్వుడు.

“నన్నుగని యేరు జాలినొందగ వలదు

ఎవ్వరని యెంతురొ నన్ను

ఏననంత శోకభీకర తిమిర లోకైక పతిని

నాకు నిశ్వాస తాళవృంతాలు కలవు

నాకు కన్నీటి సరుల దొంతరలు కలవు

నాకమూల్య మపూర్వ మానందమొసగు

నిరుపమ నితాంత దుఃఖపు నిధులు కలవు” అంటూ విషాదమాధుర్యాన్ని అందించాడు.

ఉపయుక్త గ్రంథం :

· కృష్ణపక్షం (దేవులపల్లి కృష్ణశాస్త్రి)

– డాక్టర్ ఏ. ఈశ్వరమ్మ

అసోసియేట్ ప్రొఫెసర్

తెలుగు విభాగం

ఆంధ్ర విశ్వకళా పరిషత్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​, , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో