పరిచయం :
సాహిత్యపు మౌలికరూపం జానపదం, సాహిత్యం లిఖిత రూపం ధరించడానికి పూర్వం అది వాజ్మయ రూపంలో ఉంది. ఈ వాజ్మయ సాహిత్యానికి మౌళిక రూపమే జానపదం. ఏ భాషలోనైనా లిఖితరూప సాహిత్యం ఆవిర్భవించడానికి పూర్వమే జానపద సాహిత్యం పుట్టింది. ఈ మౌఖిక సాహిత్యం లిఖితరూపాన్ని సంతరించే క్రమంలో వివిధ రూపాలలో పరిఢవిల్లింది. నిర్దిష్టరూపం, రూపలక్షణం, రూపపరిణామం మొదలైన అంశాల్ని ప్రాతిపదికగా తీసుకొని మనం నేడు లిఖిత రూపమైన వివిధ ప్రక్రియలుగా విభజిస్తున్నాం. కానీ ఈ ప్రక్రియల ఆవిర్భావానికి పూర్వమే ప్రజాజీవితంలో మమేకమైన జానపద సాహిత్యం ఆవిర్భవించింది. కాలసూచికంగా లిఖిత సాహిత్య ఆవిర్భావానికి వీలుంది. జానపద సాహిత్యం ఆవిర్భావం నిర్ధిష్టంగా చెప్పడం కష్టం.
జానపదం అనే పదము విస్తృతమైన వ్యాప్తి కలిగి ఉంది. నిఘంటువులలో జానపదం అనే పదానికి “జనపదము, దేశము, గ్రామము” పల్లె అనే అర్థాలున్నాయి. జానపదుడు అంటే “జనుడు, మనుష్యుడు, గ్రామవాసి, పల్లెయందుండు వాడు” “మనుష్యుడు” “పల్లెటూరివాడు, జానపదుడు” అని ఇలా నిఘంటువులలో ఇవ్వబడ్డ అర్ధాలను గమనిస్తే దాదాపు అన్నింటిలో జానపదం అంటే ఊరు, గ్రామం, పల్లెటూరు అని అక్కడ నివసించే వారిని జానపదులని పేర్కొనవచ్చు. జనసాహిత్యమే జానపద సాహిత్యమవుతుంది. ఇచట జన అంటే ఊరిలో నివసించే జనాలు అని అర్థం.
ప్రాచీన కాలం వాటి విభిన్న సాంస్కృతిక సమూహాల సంస్కృతీ వికాసాలను గుర్తించడానికి, వారి ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, సంప్రదాయాలు, కళలు, సాహిత్యాది విషయాల్ని గమనించడానికి మనకు ద్వివిధాలైన సామాగ్రి లభిస్తోంది. ఒకటి తరతరాలుగా గ్రంథస్థంకాక కేవలం మౌఖిక సంప్రదాయంలో (Oral tradition) నిలిచిపోయిన విజ్ఞానం,
మొదటిది సాంప్రదాయక విజ్ఞానం. దీన్నే జానపద విజ్ఞానమని (Folk- lore) అంటాం. రెండోది గ్రాంధిక విజ్ఞానం (Booklore).
జానపద సాహిత్యంలో కథ అనునది వచన కథ, గేయకథ వంటి రూపాలలో పరిఢవిల్లుతుంది. వచన కథకి, జానపదంలో మౌఖికంగా సాగే వచన కథకి జనపదుడే మూలం అని చెప్పవచ్చు. గేయ కథలలో కూడా గేయాన్ని కథారూపంలో చెప్పేటువంటి వ్యక్తి కేంద్రంగా కథానిర్మాణం జరుగుతుంది. దీనికి భిన్నంగా శిష్ట సాహిత్యంలో (ఇతిహాసం, కథ, నవల ఇత్యాది ప్రక్రియలలో) కథ నిర్దిష్టమైన నిర్మాణంలో ఉంటుంది. కాబట్టి జానపదంలో ఉన్న గేయాలు, గేయకథలు అందులో ఉన్నటువంటి వస్తువు మొదలైన అంశాలు గూర్చి తెలుసు కోవాల్సిన అవసరం ఉంది.
జానపద కవిత్వంలో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో జానపద గేయాలు, రెండవ భాగంలో జానపద గేయకథలు వస్తాయి. జానపద గేయ కథలను పూర్వ పరిశోధకులు రకరకాల పేర్లతో పిలవడం జరిగింది. వారిలో “కథాగేయము, చారిత్రక గేయాలనీ, వీర గీతాలనీ” “కథాగీతములనీ” “వీరగాథలనీ లేక జానపద గేయకథలు లేక జానపద కథా గేయములనీ” “కథా గేయాలనీ” “వీరకదా వాఙ్మయమని లేదా సాహసిక కథావాఙ్మయము, కరుణ రసాత్మక వాఙ్మయము, అద్భుత రస ప్రధాన కథా వాఙ్మయము, శైవ కథా వాజ్మయములనీ” అని వివిధ పేర్లతో పిలవడం జరిగింది.
జానపద గేయకథల నిర్వచనాలు:
నిరక్షరాస్యులైన జానపదులు అప్రయత్నంగా తమ సహజ భావాలను కవిత్వ రూపంలో వెలువరించినప్పుడు ఆవిర్భవించేది జానపద కవిత్వం. సంతోషం, విషాదం, కరుణ, శృంగారం మొదలైన మానసిక భావాలను వెలిబుచ్చడానికీ, పని చేసుకునేటప్పుడు కలిగే శ్రమను మరిచిపోవడానికీ, తీరిక సమయాల్లో, వేడుకల్లో, సంబురాల్లో పాడుకునే గేయాలు, గేయకథలు వంటివి జానపద కవిత్వ శాఖలోకి వస్తాయి. నైసర్గికమైన భావప్రకటన సహజంగా వెలువడుతుంది కాబట్టి జానపద కవిత్వానికి ఛందోబంధాలూ, అలంకార సంప్రదాయాలు అడ్డురావు.
జానపద సాహిత్యంలో గేయ కథలకు ఒక ప్రముఖస్థానం ఉంది. గేయంలో కథ అంతర్లీనంగా ఉంటుంది. గేయానికి, కథకు అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకే ఆర్వీయస్ సుందరంగారు “ఈశ్వరుడే అర్థనారీశ్వరుడైనట్లుగా గేయమే కథా గేయము అవుతుంది. గేయాలలో భావాంశాలు (Psychemes) ప్రధానమైతే, కథాగేయాలలో కథాంశాలు (Narrative Units) ప్రధానంగా ఉంటాయి.” అని పేర్కొన్నారు. జానపద గేయాలపై ఎక్కువగా పరిశోధనలు జరిగాయి. కానీ జానపద గేయ కథలపై ఎక్కువగా పరిశోధనలు జరగలేదని చెప్పవచ్చు. Ballad అనునది బాహ్యరూపమున lyric ను, ఆంతర స్వరూపమున epic ను పోలియుండునని పాశ్చాత్య విమర్శకులు నిర్ణయించిరి” అని తంగిరాల వెంకట సుబ్బారావు గారు వివరించారు.
“సంచార గాయక భిక్షువుల (Minstrels) చే పాడబడు సరళ కథా గేయమే వీరగాథ” అని వివరించారు ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు.
డా.ఆర్వీయస్ సుందరంగారి ప్రకారం “వాగ్రూపమైన సంప్రదాయం కలిగి, తరతరాలుగా అనేక పాఠాంతరాలతో ప్రచారం పొంది, సామూహిక వికాసం కలిగిన కథాగేయాలే జానపద కథాగేయాలు” అని నిర్వచించారు.
“కథాకథన రూపంలో వుండి మౌఖిక సంప్రదాయంలో తరతరాలుగా అందింపబడుతూ భిన్న పాఠాంతరాలతో కూడిన సరళ కథా గేయమే గేయకథ.” డా.జి.ఎస్.మోహన్ గారు గేయ కథలను ఈ విధంగా నిర్వచించారు.
జానపద గేయ కథల లక్షణాలు:
సాహిత్యం లిఖిత సాహిత్యం, మౌఖిక సాహిత్యం అని రెండు విధాలుగా ఉంటుంది. జానపద సాహిత్యం అక్షర రూపంలో కాకుండ, కేవలం నోటిమాట, గేయ, గేయకథల రూపంలో ఒకరినుండి మరొకరికి, ఒక తరం నుండి మరోక తరానికీ ప్రచారం చెందుతుంది. జానపదులు తమ భావాలనూ, అనుభవాలనూ, ఆచార సంప్రదాయాలనూ, సుఖదుఃఖాలనూ ఇత్యాది అంశాలను వ్యక్తం చేసుకోవడానికి ఆశువుగా గేయాలను పాడుతుంటారు. అందుకే వీరి గేయాల్లో జానపదుల జీవిత విధానాలు, మనస్తత్వాలు ప్రతిబింబిస్తుంటాయి.
ఆచార్య నాయని కృష్ణకుమారిగారు తన పరిశోధన గ్రంథమైన తెలుగు జానపద గేయగాథలు అనే పుస్తకంలో జానపదగేయ కథలకు నాలుగు ముఖ్యమైన లక్షణాలు ఉంటాయని వివరించారు అవి.
1. చలనము (Action)
2. పాత్రలు (Characters)
3. కథ (Theme)
4. సన్నివేశకల్పన (Setting)
ఈ నాల్గింటియందును మిక్కిలి ముఖ్యమైనది కథాగమన వేగము (Speed of Action). సన్నివేశ చిత్రణ ప్రధానమైనది అని వివరించారు.
జానపద గేయ కథా లక్షణాలను గురించి ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారు తన తెలుగు వీర గాథా కవిత్వము మొదటి సంపుటములను పరిశోధన గ్రంథంలో అనేక చర్చలు చేసి బ్లిస్ పెర్రీ అను పాశ్చాత్య విమర్శకుడు వీరగాథల నిస్సందేయ లక్షణములను విడమర్చి ప్రధానంగా పది లక్షణాలు ఉంటాయని వివరించడం జరిగింది అవి.
1. వీరగాథ గేయ స్వరూపమునందును. ఇది ప్రథమ లక్షణము, సరళ చ్ఛందము,పునరావృత్తి, గానయోగ్యత అనునవి ఇందలి ఉప లక్షణములు.
2. వీరగాథా కథాఖ్యానాత్మకముగా నుండును. ఇది ద్వితీయ లక్షణము. నియమిత పరిమాణము, యథార్థ సంఘటనా, జన్యత్వము, దేశీయోతి వృత్తము, సామాన్య నాయకత్వము, వీరరస ప్రాధాన్యము, కథా సారళ్యము, హఠాత్ ప్రారంభత్వము, సంభాషణా సహితత్వము, వచన రాహిత్యము, విషాదాంతత, అభివర్ధిత, పునరుక్తి అనునవి ఇందలి ఉపలక్షణము.
3. గాయక భిక్షువుల ఆశుకవనమున జనించుట వీరగాథ యొక్క మూడవ లక్షణం. కవినామము తెలిసినను వీరగాథ అప్రధాన కర్త్వకముగా నుండును. ఇది మూడవ దానిలోని అవాంతర లక్షణము.
4. మౌఖిక ప్రసరణమున దేశమంతయు వ్యాపించుట, మౌఖిక సంప్రదాయమున తరతరములు జీవించుట వీరగాథల నాల్గవ లక్షణము.
5. బహుజనాదర పాత్ర లేక జనరంజకత్వము లేక జనప్రియత్వము వీరగాథల ఐదవ లక్షణం.
6. వీరగాథా, నాటకము వంటి శుద్ద పరాశ్రయ కవిత్వము.
7. వీరగాథలలోని భాషయేకాక భావములు సరళముగా నుండును.
8. ఎంతటి ప్రతిభావ్యుత్పత్తులున్న కవియైనను సాంప్రదాయక వీరగాథను తనంతతాను సృజింపలేడు. ఇది ప్రజలలో సహజముగా పుట్టును. తరువాత దీనిపై కవి చేయి పడవచ్చును.
9. ప్రపంచమున వివిధ దేశముల వీరగాథలలో నొక ఏకసూత్రము కన్పించును. అందుచే వీరగాథల ప్రస్తావన మానవ సంఘమును వసుధైక కుటుంబమును నిరూపింప సమర్థములని చెప్పవచ్చును.
10. వీరగాథలు నీతిని వాచ్యముగా బోధింపకున్నను, ధ్వనింపజేయును. విధి బలీయము, మానవుడు నిమిత్తమాత్రుడు అనునదియే ఇట్లు ధ్వనితమగు నీతి వీరగాథలు జీవిత విషాదమును ప్రతిధ్వనించును.
వీటితోపాటు డా. ఆర్వీయస్ సుందరంగారు తన ఆంధ్రుల జానపద విజ్ఞానం అను గ్రంథంలో జానపదగేయ కథలకు కొన్ని లక్షణాలను సూచించారు. అవి.
1. కథాగేయాలలో కథ ప్రధానం అయినా వీటికే గేయాల భావ గీతాత్మక (lyric) లక్షణం ఉంటుంది. అయితే అది ప్రధానం కాదు. ఇవి బాహ్య స్వరూపంలో లిరికన్ను, అంతర స్వరూపంలో ఎపిక్ ను పోలుతాయని విమర్శకులు భావించారు. కథాగేయాలలో కథనం కన్నా అనుకరణ సాధ్యమైన సన్నివేశాలు (Imitable_Situ- ations) ఉండడమే ప్రధానమనే వారున్నారు. కథకు కావలసిన సన్నివేశాలుంటే కథనం ఎవరైనా చేయవచ్చు.
2. నిర్దిష్టమైన కవి ఎవరూ లేకపోవడం గేయాలలాగానే కథాగేయాలకు కూడా ఒక లక్షణం. ఈ అజ్ఞాతకర్తృత్వం (Anonymity) వల్ల కథాగేయం అందరి ఆస్తి అవుతుంది. వ్యక్త్యతీతం (Impersonal)గా ఉండటం ఒక ఉప లక్షణంగా చెప్పుకోవచ్చు. ఈ కథా గేయాలలో కొన్ని కవి సమయాల వంటివి కనిపిస్తాయి. కొన్ని పడికట్టు వర్ణనలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. అభివర్ణిత పునరుక్తి (Incremental repetition) ఏదైనా విషయాన్ని మన హృదయానికి హత్తుకునేటట్లు చెప్పడానికి పనికి వస్తుంది.
3. కథా గేయాలలో శిష్టుల కథన విధానం కనిపించదు. ఒక సన్నివేశం నుంచి మరో సన్నివేశానికి వెళ్ళిపోవడం, మధ్యమధ్య ఏదో వెలితిగా ఉండడం సర్వ సామాన్యం. ఈ విధమైన దూకుడు (leaping and linger- ing) వల్ల ఒక్కొక్కసారి కథ కూడా సరిగ్గా అర్ధం కాకపోవచ్చు
4. కథా గేయాలలో పల్లవి కూడా ప్రాధాన్యం వహిస్తుంది. అంతరపల్లవి (Internal refrain) బాహ్యపల్లవి (External refrain) మిశ్రమపల్లవి (Mixed refrain) అని పల్లవి మూడు రకాలు. ఈ పల్లవి కథాగేయాలలో చాలా ప్రాచీన కాలంనుంచి ఉండేవని నిరూపిస్తుందని ‘గమరి’ అభిప్రాయం.
5. గేయకథలలో ఎక్కువగా వీరరస ప్రధానాలు. వీరం తర్వాత కరుణం, అద్భుతం పేర్కొనదగ్గవి. వీరుడు తల్లిదండ్రులకు ఆలస్యంగా పుట్టడం ఆటపాటలలో అతను అమిత శౌర్యాన్ని ప్రదర్శించడం కథాగేయాలలో కనిపిస్తుంటాయి.
6. కథాగేయాలలో అలంకారాలలో సరళమైన ఉపమలు, భాషలో కూడా సారళ్యం గోచరమవుతుంది. జానపదులు వాడేది సరళదేశీయ భాష, సామెతలు, నుడికారాలు సమృద్ధిగా ఉంటాయి. నిఘంటువులకెక్కని దేశ్యపదాలు అసంఖ్యాకంగా కనిపిస్తాయి. వైరి సమాసాలు, అన్యదేశ్యాలు బోలెడన్ని ఉంటాయి.
7. కథాగేయాల ఛందస్సు లక్షణ గ్రంథాలననుసరించేది కాదు. గేయాలను గానం చేసేటప్పుడు రాగాలు సంకీర్ణంగా ఉంటాయి. ఒక పాటను అందరూ ఒకే విధంగా పాడాలని లేదు.
జానపదుల నమ్మకాలు:
జానపదులలో నమ్మకాలు ప్రాచీనకాలం నుండి వస్తున్నాయి. ప్రకృతి వల్ల మానవుని నమ్మకాలు అధికమయ్యాయి. మెరుపు, ఉరుము, వాన, వరద మొదలైన వాటిని ఆశ్చర్యంతో, ఆనందంతో, భయంతో చూసిన మానవుడు ఎన్నో నమ్మకాలను ఏర్పాటు చేసుకున్నాడు. ముఖ్యంగా జానపదులు వారి ఏది చేసినా వారి ప్రయత్నమంతా నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది. జానపద గేయకథలలో అనేక ఊహించలేనటువంటి సంఘటనలు అనేకం జరుగుతుంటాయి. పెద్దమ్మ గేయకథలో ఓ స్త్రీ తనకు సంతానం కలగటం కోసం దేవుని ప్రార్థించడం, దేవుడు ప్రత్యక్షమై తన కోరికను తీర్చుతాడు. ఆ సందర్భాన్ని పరిశీలిస్తే క్రమంగా జానపదుడు ఏ పనిని చేయాలన్న అతని నమ్మకం మీద ఆధారపడి ఉంటుందని భావించవచ్చు.
“ఓ రామ రామయ్య సిరామ రామ వొ రామ / ఓ సాంబసివుడా నీకు దండమో…… వొ రామా ఓ రామ రామయ్య సిరామ రామ వొ రామ / ఎందమ్మ పెద్దమ్మ ఏమి సెతునే……… వొ రామ ఓ రామ
రామయ్య సిరామ రామ వొ రామ / నీయిని బాదకు నువు వచ్చినావా………. ఐ రామా ఓ రామ
రామయ్య సిరామ రామ వొ రామ / బిడ్డ కోసం బొతె పానం బోతదా…… వొ రామా ఓ రామ
రామయ్య సిరామ రామ వొ రామ / పోయిన మంచిదె బిడ్డనియాతె……. వొ రామా ఓ రామ
రామయ్య సిరామ రామ వొ రామా
మొక్కుబడులు:
తెలుగుదేశంలో స్త్రీలు నోములు నోచే ఆచారం, జానపదులు మొక్కుబడులు తీర్చుకునే ఆచారం చాలా కాలంగా ఉంది. వర్ణాశ్రమ ధర్మాలు, కర్మలు, వ్రతాలు, ఆచారాలు, మొక్కుబడులు, నియమనిష్ఠలు మొదలగునవి భారతీయుల ప్రత్యేకతను చాటుతున్నాయి. యజ్ఞ యాగాదులు వ్యయ ప్రయాసలతో కూడి ఉండడం వల్ల, అవి సామాన్య జనానికి అందుబాటులో ఉండవు. అందుకే వారికోసం నోములు, వ్రతాలు, మొక్కు బడులు నిర్దేశింపబడ్డాయి.
మల్లయ్యదేవుని గేయకథలో ఒక సందర్భంలో గౌడకులస్థుల వారి తాడిచెట్లను ఎక్కి, వారికి తెలియకుండ కల్లునుతాగి గొల్లాయన పారిపోయి మల్లన్న దగ్గరికి రావడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న గౌడకులస్థులు గొల్లాయనను పట్టుకొని మెడలో తాటిలొట్లను పెట్టి వాడవాడ తిప్పాలని అనుకుంటారు. అపుడు మల్లయ్య దగ్గర ఈ విషయమును గూర్చి ప్రస్తావించగా, మల్లన్న ఆరెండు కులస్థులలో మధ్య ఉన్న సంబంధాన్ని బలపర్చడం జరుగుతుంది.
“య వంటాను గ్యానమల్లో రామోజ్య రామ రామా / య గొల్లలు బోయినారు రామోజ్య రామ రామా
య వీదులు ఎతికినారు రామోజ్య రామ రామా / య కల్లువయిన వొడత వుంటే రామోజ్య రామ
య రవ రాజు మల్లయను రామోజ్య రామ రామా / య మందకాడ పన్నడెమి రామోజ్య రామ రామా
య లపుడు వాలెమినైనా రామోజ్య రామ రామా / య గౌంలోలు వొచ్చినారు రామోజ్య రామ రామా
య అపుడు వాలునైనా రామోజ్య రామ రామా / య తాల్లాకు మావాలకు రామోజ్య రామ రామా
సాంఘిక ఆచారాలు:
సమాజాన్ని బట్టి సమాజంలో వస్తున్న మార్పుల్ని బట్టి, కాలానుగుణంగా సంస్కృతి సంప్రదాయాలలో, ఆచారాలలో, అలవాట్లలో మొదలగు వాటిలో మార్పులు కనబడుతుంటాయి. ఒక సమాజ, ఒక ప్రాంత లేదా ఒక సమూహ జీవన విధానం జానపద సాహిత్యంలో ప్రస్పుటంగా కనబడుతుంది. అది ఒక తరం నుండి మరో తరానికి, ఒక సమూహం నుండి మరో సమూహానికి, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి అందుతున్న తరగని సంపద. మల్లయ్య దేవుని గేయకథలో మల్లయ్య దేవుడు తుమ్మెద అవతారం ఎత్తి, అగ్నిదేవుడి ముక్కుమీద వాలడంతో, ఆ అగ్ని దేవుడికి తుమ్ము రావడం, ఆ తుమ్ముకి అడవి అంతా కాలడం జరుగుతుంది. అడవిలో ఉన్న జంతువులు, పక్షులు చనిపోవడం చూసి శంకరుడు ఆసోకం ఏవరిదని అంజనం వేయడం గమనించవచ్చు. పూర్వకాలం నుంచే గ్రామాలలో అంజనం వేయడం, చేయి చూడడం వంటి సాంఘిక ఆచారాలుండేవి.
“య సర్వెసుడు మల్లయ్యనె రామ్యో రామరామా / య తుమ్మెద అవతారము రామోజ్య రామరామా
య అవతారం ఎత్తినాడా రామోజ్య రామరామా / య రవరాజు మల్లయనె రామోజ్య రామరామా
య ముక్కుల తుమ్మెద పెట్టి రామోజ్య రామరామా / య వొక తుమ్ము తుమ్మినాడా రామోజు రామరామా య అగ్గి అయిన పుట్టినాది రామోజ్య రామరామా / య అడవంతా కాలబట్టే రామోజ్య రామరామా
య అడవి మీద పచ్చులైనా రామోజ్య రామరామా / య పచ్చులు కాలబట్టే రామోజ్య రామరామా
య సిరికాలు పాయిరాలు రామోజ్య రామరామా / య పచ్చులు కాలుతుంటే రామోజ్య రామరామా
రామాయణ సంబంధ గేయకథ:
పరిశోధనలో భాగంగా క్షేత్ర పర్యటనకు వెళ్ళినపుడు నాకు చరిత్ర సంబంధించిన కొన్ని గేయకథలు లభించాయి. వాటిలో రామాయణ సంబంధ గేయకథ. ఈ గేయకథను ఒక వ్యక్తి ఒక విధంగా, మరోవ్యక్తి మరో విధంగా పాడటం జరిగింది. ప్రపంచ సాహిత్యంలోనే ఆదికావ్యంగా రామాయణం ప్రసిద్ధిచెందినది. వాల్మీకి దీనిని రచించాడు. మనదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా రామాయణ కథలు మనకు కనిపిస్తాయి. ఆదేశ సమాజ పరిస్థితులను బట్టి, ఆకాలంలో ఉన్న కవి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథను మార్పు చేర్పులు చేసి రామాయణమును వ్రాసిన కవులు ఉన్నారు.
“జనుకు జనుకు నింట్లో కోల్/ సా జనుకు నింబ్లే కోల్
బుట్టింది ఆసిత కోల్ / పురుడే కొరింది కోల్
పెరిగింది ఆసిత కోల్/ సిన్న సిన్న బొమ్మరిండ్లు కోల్
కట్టనెరిసింది కోల్ / సిన్నవారి తోటి కోల్
ఆడ నెరిసింది కోల్ / పెదపెద బొమ్మరిండ్లు కోల్
కట్ట నెరిసింది కోల్ / పెద్దవారి తోటి కోల్
ఆడ నెరిసింది కోల్ / లక్క కొలల తొటి కోల్
దంచ నెరిసింది కోల్ / ఎండి మోంటెల తోటి కోల్
సెరుగ నెరిసింది కోల్ / పగిడి జెల్లెల తోటి కోల్
పట్టనెరిసింది కోల్ / తురుపు రాజులు కోల్
ముగింపు :
ఈ విధంగా జానపద గేయకథలు సమాజ ప్రతిబింబలైనా అంశాలెన్నింటినో తనలో ఇముడ్చుకున్నాయి. ఈ గేయకథలలో తల్లికొడుకులు, అన్న చెల్లెలు, భార్యభర్తల సంబంధాలు మొదలుకోని ఏన్నో బంధాలను గూర్చి ఈ గేయకథలు ఉన్నతంగా భావరసస్ఫోరకంగా తెలుపుతున్నాయి. అలాగే ఆర్థిక స్థితిగతులు, అగ్రవర్ణాల ఆధిపత్యం, జూదం, కరువు లాంటి అనేక కోణాలను కూడా ఈ గేయకథలు సృష్టించడం మనకు కన్పిస్తుంది.
-సుధామల్ల స్రవంతి
తెలుగు విభాగం
కాకతీయ విశ్వవిద్యాలయం
ఉపయుక్త గ్రంథ సూచికలు:
1. నల్లగొండ జిల్లా జానపద కథగేయాలు డా|| ఎం. శయ్యఘ రెడ్డి
2. కరీంనగర్ జిల్లా జానపద కథా గేయాలు- డా|| స్వామిరెడ్డి 3. జానపద గేయాలు సాంఘిక చరిత్ర-తెలుగు అకాడమీ
4. తెలంగాణ శ్రామిక గేయాలు-డా || గోపు లింగారెడ్డి
5. తెలుగులో జానపద గేయాగాథలు – నాయని కృష్ణకుమారి
6. జానపద బిక్షుక గాయకులు-డా|| యాదగిరి శర్మ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~