చిన్నప్పటి నుండీ నాదో కోరిక
నా ఉనికి ప్రశ్నార్ధకం కాని చోటుకి చేరుకోవాలని…
ఇంత వరకు నేను చెరనేలేదు
ఎన్నో చోట్ల వెతికాను….
మీరెవరన్నా చూశారా?
ఒక్కోసారి నా ప్రశ్నలకి, నాకూ
ఉన్న బంధాన్ని ఎవ్వరూ
ఎప్పుడూ విడదీయలేరేమో అనిపిస్తుంది.
నేను బయటకి రాగానే చెప్పుల రూపంలో ప్రశ్న
ఉదయిస్తుంది. దాటుకుంటూ ముందుకి…
అరే… చెప్పులలో నుండి వీరి ముఖాల పైకి
ఎలా పాకింది!? చిత్రంగా ఉందే…
నా కదలికలను అనుసరిస్తుంది
సరే సరే ముందుకు…
ఇప్పుడా కాళిదాసులాంటి
కవులు లేరు కనుక సరిపోయింది
అదే ఉంటేనా ఉత్తి పుణ్యానికే
ఆమెని ఎవరినో ‘దీపాశిఖ’ అన్నారట
ఇప్పుడు వీరి ముఖాలను చూస్తే…
ఖచ్చితంగా నన్ను ‘ప్రశ్నశిఖ’ అనేవారే!
హమ్మయ్య! మా కాలాలు వేరై గండం తప్పింది
ముందుకు… అరే నేను ‘ఎక్కాల్సిన
గుమ్మంగా’ ఎదురొచ్చింది….ఉష్ ఉష్
మెల్లాగా దాటేద్దాము… హమ్మయ్య
‘బడి’లోకి వచ్చేశా… ఇంకా నువ్వు నన్ను చేరుకోలేవు
నీకు ఆ గుమ్మమే హద్దు! నీకీ బడిలో
స్థానం ఎవ్వరు ఇవ్వరుగా
అనే ధైర్యంతో తిరిగి చూద్దును కదా
లింగ భేదం లేకుండా పిల్లలందరి
ముఖాలలో పదింతలై కనిపించింది
ఉష్… నీతో నేను వేగలేను బాబో
అయినా నాకెందుకు నా పని
నాది అంటూ నా చూట్టూ
పుస్తకాల గోడ కట్టుకున్నా
బాగా… చదివితే అన్నీ ప్రశ్నలకి
టక టక బదులు చెప్పవచ్చునటగా
అందుకే అక్కడ పట్టిన పుస్తకాన్నీ
‘చదువుల్లో సారమెల్ల చదివితిని
తండ్రి’ అనే వరకు వదలలేదు
అదేంటో అందరి ప్రశ్నలకీ బదులిచ్చే
పుస్తకాలు నా ప్రశ్నలకి “మౌన వ్రతం” పట్టాయి
నా ప్రశ్నలు “నావే” అయ్యాయి!
భారంగానైనా ముందుకే…
సరే ఇలా లాభం లేదు
నేనే వీరిని అడిగేస్తా అనుకుంటూ
ఒక పెద్దాయనని అడిగా
నన్ను చుట్టు ముడుతున్న
ప్రశ్నలకి సమాధానం ఏమిటని
మొదట ఆయన తెల్లబోయాడు
తరువాత దబాయించాడు
అవి ప్రశ్నలే కావనీ
సరే ముందుకే….
ఏ ప్రశ్నల బరువు లేని వారితో
పరుగు పందెంలో పాల్గొన్నప్పుడు
నాకు కనబడింది వెనుకబడిన
కుందేలు మనస్సులో
వేధిస్తున్న ప్రశ్నల జాడ!
ఇప్పుడా ప్రశ్నల పరంపర
నా మీదకే మళ్లింది
అయినా నాకు అర్ధం కాదు
ప్రతీ చోట, ప్రతీ ఒక్కళ్ళు వాళ్ళే సమస్యలు
సృష్టించుకోని నా నుండి వాళ్ళకి నచ్చిన
సమాధానాలు ఆశిస్తారేమిటి
వాళ్లకి లాగా ‘రెడిమేడ్ పాలసీ’
ఇక్కడ వర్క్ అవుట్ అవ్వదు
నా ప్రశ్నలు ఇంత వరకు
ఎవరు అన్వేషించని సమాధానాలు
నేను మాత్రమే కనుగొనాల్సినవి
ప్రతీ నిమీషం నా ‘సమర్ధత’ పై
వారికి సందేహమే
అయినా సరే ముందుకే…
నా ఈ ప్రయాణం ‘పుట్టప్ప’ లాగా
ఒక ఇల్లు ఆ ఇంటి పక్కన పారే సెలయేరు
దాని పక్కనే చిలకల గుంపు కోసం కాదు
నాలో భావుకతకి చోటు లేదు
నా ఉనికి ప్రశ్నార్ధం కానీ ప్రదేశం కోసం
నన్ను తమలో ఒకరిగా
ఆదరించగల ‘బంధు గణం’ కోసం…
-అరుణ బొర్రా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~