జ్ఞాపకం- 82 – అంగులూరి అంజనీదేవి

 

 

 

 

 

“నా దగ్గర ఎలా వస్తుందన్నయ్యా డబ్బు?” దీనంగా చూసింది సంలేఖ.
“జయంత్ ఇవ్వడా?”
“ఇవ్వడు”
“ఎందుకివ్వడు?”
“ఎందుకంటే నాకేం అవసరాలుంటాయి అన్నయ్యా డబ్బుతో? ఒకవేళ వున్నా అత్తయ్యగారి దగ్గర అడిగి తీసుకోమని చెబుతాడు”
“మరి అడుగు. నాకిప్పుడు డబ్బులు కావాలి”
“నీకోసం అడిగితే ఏం బావుంటుంది?”
“ఎందుకు బావుండదు?”

“ఆవిడ ఇప్పటికే నన్ను లోకువగా చూస్తున్నారు. ఇంకా చీప్ గా చూస్తుంది. నేను అడగను”

“నీ పెళ్లి ఘనంగా చేశాం! అలా చెయ్యమని ఆవిడే అడిగింది. ఇప్పుడు నాకు తినటానికి తిండిలేదు”

“నీ తిండికి నా పెళ్లికి సంబంధమేమిటి? నువ్వు సంపాయించుకొని పొదుపుగా, పద్దతిగా బ్రతుకుతుంటే ఎవరొద్దన్నారు? జయంత్, దిలీప్ నీతో చదివినవాళ్లేగా! వాళ్లిద్దరికి తిండిలేదా? ఇలాంటి మాటలు నీ నోటి వెంట వినాలంటేనే బాధగా వుంది. సిగ్గుగా వుంది” అంది.

“నీకెలా వుంటే నాకెందుకు. నాకు మాత్రం డబ్బు కావాలి. నువ్వు అడుగుతావా? నన్నే వెళ్ళి అడగమంటావా?” అన్నాడు.

సంలేఖ భయపడింది. తోడబుట్టినదాని ఇంటికొచ్చి ఒక అన్నయ్య వుండాల్సిన పద్ధతి ఇదేనా? పూటకి గతిలేని అన్నయ్య అయినా చెల్లెలు దగ్గరికి వెళ్లేటప్పుడు పూలో, పండ్లో పట్టుకొని వెళ్తాడు. అలాంటిదేం లేకుండా వట్టి చేతులతో వచ్చిందే కాక ఇలా తాగి వస్తాడా?

సంలేఖ మౌనం తిలక్ లోని ఆవేశాన్ని మరింత పెంచింది.

“ఆవిడ పైనేగా వుండేది? నేనే వెళ్లి అడుగుతాను. ఆవిడ ఇవ్వకపోతే ఎవరిస్తారు?” అంటూ పైకెళ్లబోయాడు..

ఊపిరి ఆగిపోయేలా చూసింది సంలేఖ. తిలక్ తాగి వుండటం వల్లనో ఏమో అతన్ని చూస్తుంటే భయంగా, యావగింపుగా వుంది.
కంగారుపడింది.

“వద్దు అన్నయ్యా వెళ్ళకు” అంటూ తిలక్ ని ఆపింది సంలేఖ.

“నీకేవై నా పిచ్చా! నన్ను ఆపుతావ్? నిన్ను చూస్తుంటే అమ్మ పెట్టదు. అడుక్కోనివ్వదన్నట్లుంది. నీవరకు నువ్వు మహారాణిలా వుంటే సరిపోతుందా?” అన్నాడు.

అతని మాటలు మామూలుగా లేవు. ఒకటే కేకలు, అరుపులు.
తిలక్ గొంతు విని అత్తగారు వస్తారేమోనని పైకి చూస్తూ నిలబడింది సంలేఖ.

“నువ్వలా పైకి చూసి లాభం లేదు. నన్ను అప్పులవాళ్లు చంపేలా వున్నారు. డబ్బు కావాలి” అన్నాడు.

“నిన్ను ఇలా చూశారంటే వీళ్లు నన్ను చంపేస్తారు. చెల్లెలు ఇంటికి వచ్చేటప్పుడు తాగి వస్తాడా ఏ అన్నయ్య అయినా? ఈ అరుపులేంటి? ఈ కేకలేంటి? ఇంట్లో నాన్నని ఇలాగే బాధపెట్టేవాడివి. ఇప్పుడు నన్ను బాధపెట్టాలని వచ్చావు. ఇప్పటికే మా అత్తగారు కోపం వచ్చినప్పుడల్లా నీకో మట్టితట్టలు మోసే అన్నయ్య వున్నాడుగా అని ఎగతాళి చేస్తుంటుంది. జయంత్ కూడా అంతే! ఎవరొచ్చినా రాజారాం అన్నయ్య గురించి చెబుతాడు కానీ నీగురించి చెప్పడు. నువ్విక మారవా?” అంది.

“నిలబడి నీ క్లాసులు వింటే నాకు డబ్బులొస్తాయా? వస్తే చెప్పు వింటాను. అయినా నాకు నీ డబ్బులేం వద్దు. నీ పెళ్లిలో ఖర్చు పెట్టిన మా పొలం డబ్బులు ఇవ్వు. చాలు” అన్నాడు.
తలకొట్టుకుంది సంలేఖ.

“వీళ్ళేమో సామాన్ల డబ్బులంటారు. నువ్వేమో పొలం డబ్బులంటావు. నేను ఎక్కడ నుండి తేవాలి? మీరంతా కలిసి నన్ను చంపేలా వున్నారు” అంది.
తిలక్ బిగ్గరగా నవ్వాడు.

“నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు లేఖా! ఎప్పుడైనా మీలాంటి ధనవంతులు డబ్బులు పోతే మళ్ళీ రావని ఒక్క రూపాయిని కూడా బయటికి పోనివ్వరట. మరి ఈ అన్నయ్య పోతే తిరిగి వస్తాడా?” అన్నాడు. నవ్వుతూనే వున్నాడు.

ఆ నవ్వు విని శ్రీలతమ్మ కిందకి దిగింది. తిలక్ ని చూడగానే ఆమె ముఖంలో రంగులు మారాయి.

“ఏమయ్యా తిలక్! ఎందుకొచ్చావ్!” అంది. తిలక్ వైపు చూడాలనిపించక ముఖాన్ని పక్కకు తిప్పుకుందామె.

“డబ్బు…” అంటూ మాటలు మింగేశాడు. ఆమె కట్టూ, బొట్టూ, మాట్లాడే విధానం చూస్తుంటే అతని మాటలు తడబడ్డాయి.

శ్రీలతమ్మ కళ్లు వెలిగాయి “ఓ.. మీ నాన్న నిన్ను నాకు డబ్బులు ఇమ్మని పంపాడా? ఏదీ ఇలా ఇవ్వు” అంటూ చేయి చాపిందామె.

“మా నాన్న డబ్బులు పంపలేదు” అన్నాడు.

“ఎప్పుడు పంపుతాడు? ఎప్పుడు అడిగినా ‘నాక్కొద్దిగా టైమివ్వమ్మా!’ అంటాడు. ఎంత టైం కావాలి? ఇంకా ఎన్నిరోజులు?” అంది.

“మా నాన్న మీకేం బాకి? మీరేమైనా ఆయనకి డబ్బులిచ్చారా? ఇంకా ఎన్నిరోజులు ఆగాలి అంటున్నారు?” అన్నాడు తిలక్. చిర్రెత్తుకొచ్చింది శ్రీలతమ్మకు.

“నువ్వేమనుకుంటున్నావురా నన్ను? నేనెలా కన్పిస్తున్నాను నీకు? పెళ్లిలో పెడతానన్న సామాన్లేవి? నువ్వేమో మట్టితట్టలు మోసుకుంటూ ఎక్కడో వుంటావ్? మీ అన్నయ్యకేమో మొన్నటి వరకు కాల్లే లేవు. తండ్రేమో మాట మీద నిలబడడు. అసలేంటి మీ ఉద్దేశ్యం?” అంది.

ఆ మాటలకు విరగబడి నవ్వాడు తిలక్. నవ్వీ, నవ్వీ తాగిన మైకం దిగేలా నవ్వాడు. సంలేఖ కళ్లలో నీళ్లు తిరిగాయి.

నవ్వటం ఆపి సంలేఖ వైపు చూసాడు.

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో