ఊహతెలిసినప్పటి నుండి
తనని ‘అది’ ‘దాన్ని’ అంటూ
వస్తువాచకంగా తప్ప
మనిషిగా చూడరెందుకు అంటూ ఒక ప్రశ్న !
అభిప్రాయం చెబుతుంటే
ఆరిందానిలా మాట్లాడకు అంటుంటే
అవమానంలోనుంచి మరో ప్రశ్న !
బడికి వెళ్ళేటప్పుడు బజారులో జనాలు
‘నేనేమైనా గాజులు తొడుక్కునానా?’ అనుకుంటుంటే
తన గాజుల శబ్ధం వేసే ఇంకొక ప్రశ్న!
చదువు విషయంలో ఆంక్షలు
మనువు విషయంలోనూ నిట్టూర్చిన ఆకాంక్షలు
వంటగదే తనకు ప్రపంచం
ఒంటరైనా సాగాలి ఓపికలేకున్నా ఏకొంచం !
తనకి తెలుసు..
తనలోవుంది అశక్తి కాదు
ఆదిపరాశక్తి
అయినా
ఎందుకీ తారతమ్యత
ఎక్కడికీ అభావగమ్యత
ప్రతీసారి నిట్టూర్పులే మిగిలేవి
సమాధానపరచడానికి !
ఈసారి సమాధానాలు దొరికాయి
ప్రశ్నించడానికి..!
– కళాథర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~