వరిమడిలో నాట్లు వేసేవేళ…
పంటను కోత కోసే వేళ…
ఒక చేతితో ముంగురులను వెనక్కి తోస్తూ…
స్వేదపు చినుకులలో తడుస్తూ…
శ్రద్ధతో పని చేసే శ్రామిక స్త్రీ సౌందర్యం…
శ్రమలో భాగస్వామ్యం…
కనులవిందు!
అన్నదాతల ఆరుగాలం శ్రమ
అందరి భుక్తికి ఆధారం…
మానవ చైతన్య శక్తికి మూలాధారం!
కుమ్మరి కరములో అందంగా,
అలవోకగా రూపుదిద్దుకునే కళారూపం…
మేదరి చేతిలో అద్భుతంగా
మార్పుచెందే వెదురుగడ…
వడ్రంగి చేతిలో మంత్రదండంగా
మారే కఱ్ఱముక్కలు…
కమ్మరి సుత్తితో మెత్తబడి
రూపం మార్చుకునే లోహాలు…
కులవృత్తులన్నీ శ్రామిక సౌందర్య చిహ్నాలే!
వనిలో, గనిలో, కార్ఖానాలో
ఒడలొంచి నిరంతరం పరిశ్రమించే శ్రమజీవులు…
కొండలు పగులగొట్టే కండరశక్తి…
యంత్రాలతో పాటు అరిగే దేహావయవాలు…
పరుల కొరకు ధారబోయు
పరోపకారులు శ్రమజీవులు!
దేశ ప్రగతికి ఆధారం
శ్రమైక జీవన సౌందర్యం!!!
-చంద్రకళ.దీకొండ,
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~