జ్ఞాపకం- 81 – అంగులూరి అంజనీదేవి

వణికింది సంలేఖ. భర్త తను చెప్పింది విని రహస్యంగా దాస్తాడనుకుంది కాని ఇలా అరుస్తాడనుకోలేదు. అందుకే కంగారుపడింది. “ఎందుకండీ అంత గట్టిగా అరుస్తారు? అత్తయ్యగారు విన్నారంటే పెద్ద గొడవే చేస్తారు. నేనా డబ్బులు ఇవ్వను లెండి! ఇక అరవకండి!” అంది.

“సరే! ఇవాళే బ్యాంక్ కు వెళ్లి ఆ చెక్కు మార్చుకొని క్యాష్ తీసుకురా! కారు కొనాలి” అన్నాడు.

ఆశ్చర్యపోయి “కారుందిగా! ఇంకో కారెందుకు? అయినా కారు వున్నా మీరు బైక్ నే ఎక్కువగా వాడతారు. నన్ను ఒక్కసారి కూడా కారులో తీసికెళ్లలేదు” అంది.

“కారున్నవాళ్లంతా కారులో తిరుగుతున్నారా? ఇంటిముందు వుంచుకుంటారు. హోదా కోసం. గౌరవం కోసం. మన కాలనీలో వున్న అందరి కార్లకన్నా మన కారే కాస్ట్ తక్కువ. ఈసారి కొంచెం ఎక్కువ ఖరీదైన కారు కొందామని. కొంత లోన్ కూడా తీసుకుంటున్నాను. వెళ్లు! వెళ్లి త్వరగా రెడీ అయి బ్యాంక్ కెళ్లి డబ్బు తీసుకురా!” అన్నాడు.

ఆలోచనగా చూస్తూ అక్కడే నిలబడింది సంలేఖ.

“నువ్వింకేం ఆలోచించకు. ఇంత బతుకు బతికి అందరి కార్లకన్నా తక్కువ ఖరీదైన కారుని ఇంటి ముందుంచుకోవటం షేమ్ గా వుంది నాకు. నేనొక లక్ష్యంతో బ్రతుకుతున్నవాడిని. నా లక్ష్యం నీకు తెలుసు. అందరికన్నా నేనే ముందుండాలనుకుంటాను. కారు కాని, ఇల్లు కాని, పేరు కాని…” అన్నాడు.

సంలేఖ మనసంతా మొద్దబారినట్లైంది.

అతనామెవైపు చూడకుండా పేపర్ మడిచి పక్కన పెట్టాడు.

“నాకు టిఫిన్ పెట్టు. ఇవాళ ఆఫీసుకి కొంచెం ముందుగా వెళ్లాలి. పనుంది” అన్నాడు.

ఆమె డైనింగ్ టేబుల్ వైపు నడిచింది. ఆమె వెంటే వెళ్లి టేబుల్ ముందు కూర్చున్నాడు జయంత్

టిఫిన్ తింటూ ఒకసారి, డ్రస్సప్పవుతూ ఒకసారి చెక్కును మార్చుకుని రమ్మని గుర్తుచేశాడు.

ఆఫీసుకి వెళుతూ బైక్ ను బయటకు తీసాడు. పక్కనే పార్క్ చేసివున్న తన కారుని వేలితో తాకి “ఈ కారునోసారి తుడువు లేఖా!” అన్నాడు.

ఆమె “సరే!” అంది.

రోడ్డు మీద ఆగివున్న వేరేవాళ్ళ కారును చూసి సడన్ గా సంలేఖ నడుం మీద తట్టాడు.

“అదిగో! అలాంటి కారునే నేను కొంటాననేది. ఇంత వరకు మన కాలనీలోకి ఆ కారు మోడల్ రాలేదు” అన్నాడు.

ఆ కారు వైపు చూసింది సంలేఖ. ఎవరికైనా ఎక్కువగా ఏది ఆనందాన్ని ఇస్తుందో అదే ఆలోచిస్తారు. జయంత్ కూడా అంతే! అందుకే ఆమె మౌనంగా వుంది. అతని మాటను, ఇష్టాలను ఆమె ఎప్పుడైనా గౌరవిస్తుందే కాని వ్యతిరేకించదు. మరి ఇప్పుడు?

ఆమెకు ‘బై’ చెప్పి అతను ఆఫీసుకి వెళ్లాడు.

బ్యాంకుకు వెళ్ళి డబ్బులు తెచ్చింది సంలేఖ. బ్యాంక్ లో రద్దీగా వుండటం వల్ల చాలాసేపు ‘క్యూ’లో నిలబడింది.

పేపర్లో ఆమెను చూడటం వల్లనో ఏమో ఆమెను వెంటనే కొందరు పలకరించారు. కొందరికి పలకరించే ధైర్యం లేక మౌనంగా చూశారు.

ఇప్పుడామె ఒక సెలబ్రిటీ. ఆమెను ప్రభావితం చేసిన ఆమె తండ్రి కాని, భరద్వాజ మాష్టారుకి కాని ఇది తెలియకపోవచ్చు. కానీ తన రచనలు ఇంతగా పాపులర్ కావటానికి సరిపడ ముడిసరుకును ఆమె మనసు ఎలా సేకరించుకుందో కాని దానికి తగిన మానసిక శక్తిని, సంఘర్షణను మాత్రం ఒకప్పుడు వదిన పెట్టిన బాధలు ఇచ్చాయి ప్రస్తుతం అత్తగారు పెడుతున్న ఇబ్బందులు ఇస్తున్నాయి. కొత్తగా ఇప్పుడు జయంత్ కూడా తన మనసుతో యుద్ధం చేస్తున్నాడు. ఒకప్పుడు అదే జయంత్ తన మనసుతో యుద్ధం చేసినందువల్లనే చదువును పక్కనపెట్టి సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచుకుంది. యుద్ధం లేకుండా ఏదీ రాదు. విషయం లేనిదే, సంఘటనలు జరగనిదే, ప్రమాదాలు, విజయాలు, విషాదాలు మింగిలి కానిదే ఎవరూ రచనలు చెయ్యలేరు. నిజం చెప్పాలంటే ఇతరుల మానసిక రుగ్మతలే రైటర్స్ కి ఇన్సిపిరేషన్. వాళ్లు పడే గృహహింస కూడా వాళ్ల కలాన్ని ఉలిని చేసి వాళ్లను వాళ్లు చెక్కుకునేలా చేస్తుంది. ఎప్పటికప్పుడు

అలా చెక్కుకునే ఆ అనుభవం ప్రతి రైటర్ కి వుంటుంది.

అందుకేనేమో ఏ రైటరైనా తమ ఆవేదనను, సంవేదనను, అవసరాలను, తమకు దక్కుతున్న అవకాశాలను, ప్రమాణాలను, ప్రయాణాలను సామాజిక మూలాలను, జ్ఞాపకాలను కలగలుపుకొని ఒక ముద్దగా చేసుకుంటారు. ఆ ముద్దను తమ అక్షరజ్ఞానంతో తడుపుకుంటూ జీవం పోసుకుంటారు. జీవం పోసుకున్నాక ఆ అక్షరాలు నదిపై ఆకుల్లా కదులుతుంటే ఎంత ఆనందమో! ఆ ఆనందం సంలేఖలో పర్వతంలా పెరిగిపోతోంది.

ఆ ఆనందంతోపాటు బాధ్యత కూడా మిళితమై ఆలోచింపజేస్తోంది. ఇంతవరకు తనుచేసిన రచనల్ని ఒక్కసారి పరిశీలణాత్మకంగా విశ్లేషించుకుంది. పాపులారిటీ వేరు ప్రమాణాలు వేరు. విలువలను, నాణ్యతను, ప్రమాణాలను పక్కన పెడితే ఇకముందు తను రాయబోయే నవలలో తీసుకోబోయే వస్తువు ఇంకా ఇంకా విలక్షణమైనదై వుండాలని, అందరి నవలలకన్నా భిన్నమైనదై వుండాలని ఒక గొప్ప ప్రణాళికను సిద్దం చేసుకుంది. అయితే ఆ వస్తువును సమకూర్చుకోటానికి ఎక్కడెక్కడికి వెళ్లాలి. ఎవరెవరిని కలవాలి. వాళ్ల నుండి ఎలాంటి సమాచారాన్ని సేకరించుకోవాలి అన్నది ఆలోచిస్తూ బ్యాంక్ నుండి తెచ్చిన డబ్బుల్ని బీరువాలో పెట్టి వెనుదిరిగి హాల్లోకి వచ్చింది.

అక్కడ తిలక్ నిలబడి వుండటంతో ఆశ్చర్యపోయింది.

“అన్నయ్యా! నువ్వా! ఎప్పుడొచ్చావ్? కూర్చో!” అంది.

అతను కూర్చోలేదు. సంలేఖను చూస్తున్నాడు. అతను నిలబడిన విధానం చాలా నిర్లక్ష్యంగా వుంది. వేసుకున్న డ్రస్, క్రాఫ్ కూడా అలాగే వున్నాయి. మనిషి కొద్దిగా లావయ్యాడు. ఎప్పుడైనా నవ్వినప్పుడు క్లోజ్ అప్ టూత్ పేస్ట్ యాడ్ లా వుండే పలువరసకి ఇప్పుడు సన్నటి గీతల్లాంటి గార పట్టి వయసులో ఇంకో పదేళ్లు పెద్దవాడిలా అన్పిస్తున్నాడు.

పెళ్లి చేసుకోమని తల్లీ, తండ్రి ఎంత చెప్పినా వినలేదు. మట్టిలోడు తీసికెళ్లే లారీ క్లీనర్ చెల్లెలుతో సహజీవనం చేస్తున్నట్లు తర్వాత తెలిసింది. వద్దని ఎంత చెప్పినా వినలేదు. రాఘవరాయుడు చెప్పి, చెప్పి ఇక తన వల్లకాక వదిలేశాడు. పనిలోకి కూడా ఒక్కోసారి తాగే వెళ్తుంటాడట. అదేం అంటే తాగితేనే పని బాగా చెయ్యగలుగుతానంటాడు.

“బాగున్నావా అన్నయ్యా?” అడిగింది సంలేఖ. అన్నయ్య వచ్చాడన్న ఆనందం ఆమె ముఖంలో స్పష్టంగా కన్పించింది.

“కన్పించట్లేదా? నీ పెళ్లి వల్ల వున్న పొలం వూడ్చుకుపోయింది. నువ్వేమో ధనవంతులకి కోడలయ్యావ్! బావగారికి కారుంది. పెద్ద జీతం వస్తుంది. ఎప్పుడు డబ్బులడిగినా ఇవ్వవు. అయినా మా అన్నదమ్ముల నోటికాడిది నాన్న నీకు దోచిపెట్టబట్టేగా నువ్విలావున్నావ్! అయినా నేను అడిగినప్పుడు డబ్బులిస్తే ఏమవుతుందే నీకు? ఒక్కో రాయి తీసినట్లు డబ్బులు కూడా తగ్గుతాయనా? ఎంతయినా ఈ ఇంటికొచ్చాక నువ్వు కూడా డబ్బున్నోళ్లలాగే ఆలోచిస్తున్నావ్!” అంటూ మనిషంతా వూగుతూ చుట్టూ వున్న ఖరీదైన సామాన్లవైపు చూస్తున్నాడు.

తిలక్ చూపులు సంలేఖ చెంప చెళ్లుమనిపించాయి. నోట మాటరాని దానిలా చూసింది. నిజానికి పొలం తన పెళ్లికోసమే అమ్మినా అందులో ఎక్కువశాతం డబ్బులు తిలక్కే తీసుకున్నాడు. అలా తీసుకున్నందువల్లనే ఆరోజు పెళ్లిలో తనకి ఇవ్వాలనుకున్న సామాన్లను కొనివ్వలేకపోయారు. దానివల్ల ఈరోజుకి కూడా అత్తగారు మనశ్శాంతిగా లేదు. తనకి కూడా మనశ్శాంతిని వుంచడం లేదు. ఆ బాధ పడలేకనే కనీసం తనకి వచ్చిన అవార్డు డబ్బుతో అయినా ఆ సామాన్లను కొనివ్వాలనుకుంది. కానీ జయంత్ కారు కొనాలన్నాడు.

“నాకు ఇప్పుడు డబ్బులు కావాలి లేఖా?” సీరియస్ గా చూస్తూ అడిగాడు తిలక్.

“డబ్బా?”

“అవును. డబ్బే! ఎందుకలా ఆశ్చర్యపోతావ్? నేనేమైనా నీ దగ్గర లేనిది. నువ్వు ఇవ్వలేనిది అడుగుతున్నానా?” అన్నాడు. అతను కదిలిస్తే పైనబడే సింహంలా చాలా దూకుడుగా వున్నాడు.

 

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలు, , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో