హృదయం ద్రవించి వెచ్చని రక్తం
ఉండి ఉండి ఉద్వేగ భరితమవుతోంది.
మారని మనస్తత్వాలు
మళ్లీ మళ్లీ తెగబడుతున్నాయి !
చేరువయ్యేది స్నేహంగా
సొంతం చేసుకోవటమే ధ్యేయంగా
మృగసంచారం !
కులం మతం సమస్థాయిలు
ప్రేమకు అడ్డు కాదన్నా
పెళ్లికి అడ్డంకులైనప్పుడు
అడ్డంగా దొరికేది నువ్వే సుమా !
రాసక్రీడలు విన్నాం షరతుల్లేని ప్రేమలో
“నో ” అంటే నరికి చంపుతా అనే
రాక్షసక్రీడలు చూస్తున్నాం ఆంక్షల బరిలో!
ఒకరి జీవితానికి చరమగీతం
పాడాలనే ఆలోచన ఎవరిదైతే
అది వారికీ వర్తింప చేస్తుందనేది
నివురు గప్పిన నిజం !
జీవితమంటే ఆట కాదు వేట కాదు
అయినా బ్రతకాలంటే అచ్చం
ఆటలానే ఆగని పరుగులు
వేటలానే చేజిక్కని ఉరుకులు
నిత్యం అలవాటవ్వాలా ?
ఉన్మాదం ఉరికొయ్యల నుండి
ఊపిరి కాపాడుకోవాలంటే
ఈ ఉరుకులు పరుగులు
ఇంకెన్నాళ్లు ?
ప్రేమించడమంటే ప్రేమగా వాళ్లని
పూర్తి స్వేచ్ఛలో ఉండనివ్వటమని
ఇంకెప్పుడు తెలుసుకుంటారు ??
– కావూరి శారద
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~