సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఎప్పుడూ లేనంత ఆతృతగా పేపర్ కోసం ఎదురుచూస్తోంది సంలేఖ. ఇవాళ పేపర్లో రాత్రి జరిగిన తన అవార్డు ఫంక్షన్ వివరాలు వుంటాయి. తను షీల్డ్, చెక్కు తీసుకుంటున్న ఫోటో వుంటుంది. దాన్ని పేపర్లో చూసుకోవాలన్న కుతూహలం తో గేటువైపు చూస్తోంది.
శ్రీలతమ్మ కళ్లకి హాల్లో సెల్ఫ్ లో వున్న సంలేఖ మెమొంటో తప్ప ఇంకేం కన్పించటం లేదు. అది ఆమె మూతిని, ముక్కును వంకర్లు తిరిగేలా చేస్తోంది. ఆమెలోంచి వెరైటీ మూలుగులు వచ్చేలా చేస్తోంది. అసూయతో తన్నుకు చచ్చేలా చేస్తోంది. అంతేకాదు జలుబు చేసినా దానిలా ముక్కుల్ని ఎగపీలుస్తూ తెగ ఇబ్బంది పడుతోంది. ఆ బాధంతా ఆమెకు ఆ మెమొంటోను చూసినందువల్లనే!
రాత్రి సంలేఖ రవీంద్రభారతి నుండి ఇంటికి వచ్చినప్పటి నుండి ఆమె అలాగే వుంది. ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు. జయంతేమో రాత్రి గొడవ పెట్టుకొని పడుకొని ఇంకా నిద్ర లేవనేలేదు. మామగారు ఎందుకో ఏమో కోపంతో ముఖమంతా నలిపినట్లు పెట్టుకొని తిరుగుతున్నాడు.
అసలు వీళ్లంతా ఎందుకిలా వుంటారు? ఏదో ఒక పనిని కల్పించుకొని, ఆ పనిలో నిమగ్నం కాకుండా తననే టార్గెట్ పెట్టుకున్నట్లు ఎప్పుడు చూసినా తన గురించే ఎందుకాలోచిస్తారు? మన చుట్టూ వుండేవాళ్ల స్థాయిని బట్టి మన గౌరవం కూడా పెరుగుతుందని ఎందుకనుకోరు? కనీసం తాము హాయిగా వుండడం కోసమైనా ఇతరులు బాగుండాలని అనుకోవచ్చుకదా!
అప్పటికీ తను ఒకసారి “అత్తయ్యా! ఎప్పుడూ మీలో మీరే ఆలోచించుకుంటూ కూర్చోకుండా, పుస్తకాలను చదవండి. ఈ వయసులో నేను పుస్తకాలు చదవడం ఏంటి అని అనుకోకండి! ఏ వయసులలోనైనా పుస్తకాలు చదవొచ్చు. మన అభివృద్ధి మొత్తం పుస్తకాల్లోనే వుంది. ఒక్కో పుస్తకం ఒక్కో అనుభవం. అనుభవాల్లోంచే పుస్తకాలు పుడతాయి. అవి చదివితే మానసిక ప్రశాంతత వస్తుంది. నేను బయటకెళ్లినప్పుడు మీకు మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు తెచ్చిస్తాను. లౌకికజ్ఞాన దానం, ప్రాణదానం, అన్నదానం కన్నా ఆధ్యాత్మిక దానం గొప్పదని ఆధ్యాత్మికవేత్తలు ఇప్పుడు మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు రాస్తున్నారు” అంటూ కొన్ని పుస్తకాలు తెచ్చి ఇచ్చింది.
ఒక్కటి కూడా చదవలేదు. వాటి దారి వాటిదే, ఆమె దారి ఆమెదే! ఎవరితోనూ ఆమె స్నేహభావంతో వుండదు. అలాంటప్పుడు ఆధ్యాత్మికం, సేవాగుణం, ప్రేమ, అనుభూతులు ఆమెకెలా తెలుస్తాయి? ఎప్పుడు చూసినా వ్యంగ్యంగా మాట్లాడడం, అవసరాన్ని మించి వాదించడం. అంతేకాని ఒక్కరోజన్నా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమెను ఇష్టపడాలని చూడదు. అరవడం, దండించడం ఆ తర్వాత బి.పి. తగ్గిందనో, షుగర్ పెరిగిందనో గంటలు, గంటలు హాస్పిటల్లో గడిపి రావడం.
అంతలో పేపరబ్బాయి గట్టిగా ‘’పేపర్’’ అని కేకేశాడు.
సంలేఖ పరిగెత్తుకుంటూ గేటువైపు వెళ్లే లోపలే దారంతో కట్టివున్న ఆ పేపర్ సర్రున గాల్లో తేలివచ్చి శ్రీలతమ్మ ముఖం మీద పడింది.
ఆమె ఉలిక్కిపడి పేపరందుకొని “వీడి ముఖం మండ నా ముఖానికేసి కొట్టాడేంటి!” అని గొణుక్కుంటూ ఆ పేపరని తీసికెళ్ళి భర్తకి ఇచ్చింది.
ఆయన ఆ పేపర్ తిరగేస్తూ సంలేఖ పేరు చూడగానే దాన్ని తిప్పేసి వేరే మేటర్ చదువుతున్నాడు. అదిచూసి సంలేఖ మనసు ఉసూరుమంది.
ఈలోపల జయంత్ స్నానం చేసి గదిలోంచి బయటకొచ్చాడు. పేపరందుకొని చదువుతూ అక్కడే కూర్చున్నాడు. అతను సంలేఖ న్యూస్ ను దాటెయ్యకుండా చదివాడు. అతని కళ్లు మెరిశాయి. ఆ మెరుపు చూసి తండ్రి విసుగ్గా లేచి పైనున్న తన గదిలోకి వెళ్లాడు. సడన్ గా లేచి వెళ్తున్న తండ్రివైపుచూడకుండా “లేఖా!” అంటూ పిలిచాడు జయంత్.
ఆనందం ఎక్కువై ఒక్కగెంతులో వెళ్లి భర్తముందు నిలబడింది సంలేఖ. ఆతృతగా పేపర్లోకి తొంగిచూస్తూ ”మేటర్ బాగానే ఇచ్చారు కదండీ! ఫోటోకూడా కలర్లో వచ్చింది” అంది సంబరంగా.
“అవును. అంతా బాగానే వుంది. వీళ్లు నీకిచ్చిన లక్షరూపాయల చెక్కుని క్యాష్ చేసి అర్జంటుగా తెచ్చి నాకు ఇవ్వు” అన్నాడు.
అతని కళ్లు మెరిసింది తనకి అవార్డుతో పాటు లక్షరూపాయలు చెక్కు ఇచ్చినందుకా? సంలేఖకు నోట మాట రాలేదు. పేరుకన్నా వీళ్లకి డబ్బే ముఖ్యమా? అయినా ఆ డబ్బుతో
ఇతనికేం పని? అలాగే చూస్తోందామె.
శ్రీలతమ్మకు వాళ్లేం మాట్లాడుకుంటున్నారో అర్థంకాక భర్త దగ్గరికి వెళ్లింది.
“అలా చూస్తున్నావేం? నేను అడిగేది అర్థమైంది కదా?” సంలేఖనే చూస్తూ అడిగాడు జయంత్.
“అయింది. కానీ నేనా డబ్బును మా నాన్నగారికి ఇవ్వాలనుకున్నాను”
”మీ నాన్నగారికి ఇవ్వాలనుకున్నావా? నేను వింటున్నది నిజమేనా?” కళ్లు పెద్దవిచేసి చూస్తూ అడిగాడు.
“నిజమే!” అంది సంలేఖ ఏమాత్రం తడబాటు లేకుండా.
“నేనెలా ఒప్పుకుంటాననుకున్నావ్? అవి నా డబ్బులు” అన్నాడు తీవ్రంగా చూస్తూ,
“మీ డబ్బులా?” షాకింగ్గా చూసింది.
“అవును! నా డబ్బులే!” అన్నాడు జయంత్.
సంలేఖ ఒక్కక్షణం మౌనంగా చూసి “సరే! మీ అనుమతితోనే వాటిని మా నాన్నగారికి ఇస్తాను. తర్వాత తిరిగి తీసుకుందాం! ఇప్పుడైతే వాటిని ఆయనకి ఇవ్వాలి”
“నువ్వేం మాట్లాడుతున్నావో నీకసలు అర్థమవుతుందా? ఆయన మనకి ఇస్తానన్న సామాన్ల నే ఇంతవరకు కొనివ్వలేదు. ఈ డబ్బులు తీసికెళ్లి ఇస్తే జీవితంలో వీటిని మళ్లీ మనం చూస్తామా? ప్రాక్టికల్ గా ఆలోచించు” అన్నాడు.
“అది కాదండీ! పెళ్లిలో ఇస్తానన్న సామాన్లు ఇవ్వలేదని అత్తగారు బాగా బాధపడుతున్నారు. అందుకే ఈ చెక్కుమార్చి డబ్బులు ఇస్తే మా నాన్నగారు సామాన్లు కొని మనకు ఇస్తారు. మంచికైనా, చెడుకైనా రెండు కుటుంబాల మధ్యన రాకపోకలు వుండాలిగా!” అంది.
“ఏంటీ! మా డబ్బులతోనే మాకు సామాన్లు కొనిస్తారా?” గట్టిగా అరిచాడు జయంత్.
– అంగులూరి అంజనీదేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~