బహుముఖ సేవాపరాయణి ,సహృదయ సంస్కారిణి ,స్వాతంత్రోద్యమ వీర నారి -ఓరుగంటి మహలక్ష్మమ్మ(వ్యాసం)-గబ్బిట దుర్గా ప్రసాద్

నెల్లూరు జిల్లా కావలిలో 1884లో సంపన్నులైన తూములూరి శివకామయ్య ,రమణమ్మ దంపతులకు మహాలక్ష్మమ్మ జన్మించింది .ఆడపిల్లలకు బడి లేకపోవటంతో ఇంట్లోనే మంచి గ్రంథాలు చదివి గొప్ప పాండిత్యం సాధించింది .పడవకొండవ ఏట 1895లో  కావలిలో నిరతాన్న దాతలైనలైన కుటుంబం లోని ఓరుగంటి వెంకట సుబ్బయ్యతో వివాహం జరిగింది .పెండ్లినాటికి ఆయన హైస్కూల్ విద్యార్దిమాత్రమే అయిన ఆయన తర్వాత పై చదువులు చదివి తాత, తండ్రిలాగా లాయరయ్యాడు .ఆయుర్వేదంపై మహా అభిరుచి ఉండటంతో ఆమందులు తయారు చేసి అమ్ముతూ వైద్యం చేసేవాడు .92ఏళ్ళ వయసులో ‘’ఆయుర్వేద యోగ సింధు ‘’అనే ఉద్గ్రంథం రాసిన మహా వైద్య శిఖామణి వెంకట సుబ్బయ్య .

  వెంకట సుబ్బయ్యకు దేశాభిమానం హెచ్చు .దేశ విషయాలు తెలుసుకొంటూ అందరికీ చెప్పేవాడు .మహాలక్ష్మమ్మ కాపురానికి రావటం తోనే రాజకీయాలతో పాటు భర్త ఆశయాలకు కూడా అలవాటు పడింది .దేశాభిమానం జాలి సేవాభావం ఆమెకు స్వతస్సిద్ధంగా అలవడినాయి . స్వయంగా వంట చేసి ,ఆర్తితోఅన్నదానం చేసేది .కష్టాలు, బాధలలో ఉన్నవారికి చేయూతనిచ్చి సాయం చేసి తృప్తి చెందేది ..1898నుంచే స్వదేశీ చేనేత వస్త్రాలు ధరించటం ప్రారంభించి ,విదేశీ వస్త్రాలను బహిష్కరించింది .అప్పటికి ఖాదీ అంటేవరికీ తెలీదు .గాంధీ ఇంకాదక్షిణాఫ్రికాలోనే ఉండ టం తో  ఆయనకూ ఆభావన లేనేలేదు  .అప్పటికే తిలక్ విదేశీ వస్తు వస్త్ర బహిష్కరణ,స్వదేశీ వస్తు వస్త్ర అభిమానం భారతస్వాతంత్ర్యోద్యమానికి సాధనాలు అని ఎలుగెత్తి చాటాడు .తిలక్ ప్రబోధంతో మహాలక్ష్మమ్మ కావలిలో స్వదేశీ వస్త్ర విక్రయ శాల స్థాపించింది .మంచి రంగులు ,జరీ పనితనంతో ఆ వస్త్రాలు మహిళలను విపరీతంగా ఆకర్షించాయి .చేనేత వారికి చేతినిండా పనిదొరికి, గొప్ప ఉపాధి లభించింది .. ఆమెకు అది గొప్ప పండుగ అయింది .

 1905లో బెంగాల్ విభజన జరిగి ,బ్రిటిష్ ప్రభుత్వం పై ప్రజలకు విముఖత పెరిగింది .బహిరంగ జాతీయోద్యమం చేయాల్సిందే అని మహాలక్ష్మమ్మ దంపతులు భావించారు .సంగీత సమాజం ,భక్త సమాజం స్థాపించి ,నగర సంకీర్తన చేస్తూ ,నాలుగురోడ్ల కూడలి లో ఉపన్యాసాలిస్తూ ,దేశ భక్తీ స్వాతంత్రేచ్ఛ ప్రచారంచేశారు .ఇది తిలక్ గారి గణపతి ఉత్సవాలలాగా ఊప౦దు కొని వినూత్న ప్రయోగంగా ఆంధ్రదేశం లో జాతీయోద్యమానికి తోడ్పడింది ..దేశంలోని స్త్రీలు జాతీయోద్యమం లో చేరి చురుకుకుగా పని చేయాలని భావించి  కావలి లో 1910లో మహిళాసమాజం ఏర్పరచి మహాలక్ష్మమ్మ కార్యదర్శిగా ఉంటూ ,ఆత్మ విశ్వాసం ,మహిళాభ్యుదయం పట్ల అచంచల విశ్వాసం ,దేశభక్తిని రుజువు చేసుకొన్నది .ఆకాలానికి అంతటి సాహసం చేసిన మహిళలేనే లేదు అనిపించుకొన్నది .

  బాలికా విద్యా వ్యాప్తికోసం కావలిలో 1912లో బాలికా పాఠశాలస్థాపించి ,తన ఇంట్లో రాత్రి పాఠశాల కూడా నిర్వహించింది .పదిమందికి ప్రయోజనకరమైన పని చేయాలనీ ,నవసమాజానికి దారితీయాలని ఆమె నిత్యం ఆలోచనలతో ఉండేది 1914-15లో కర్నూలు లో  శ్రీ ముత్తరాజు వెంకట కృష్ణయ్య బాలవితంతువైన తనకుమార్తెకు విధవా పునర్వివాహం చేశాడని తెలుసుకొని చాలా సంతోషించి ఆకుటుంబాన్ని కావలికి ఆహ్వానించి పెద్ద ఎత్తున వనభోజనాలు ఏర్పాటు చేసింది .స్వాములవారు ఆంక్షపత్రాన్ని పంపితే ఆమెపుట్టింటి వారు కూడా వెలివేస్తే ,ఆమె చలించలేదు .కాశీ విద్యా పీఠం లో చరిత్ర, ఆయుర్వేద, వేదాంత, వ్యాకరణ,అలంకార  శాస్త్ర కోవిదుడైన తమ మూడవ కుమారునికి బాలవితంతువుతో మద్రాస్ లో కాశీ నాథుని నాగేశ్వరరావు గారి సమక్షంలో శాస్త్రోక్తంగా వివాహం జరిపించి తాను నమ్మిందీ చెప్పిందీ ఆచరణలో చూపిన ఆదర్శ మహిళ మహాలక్షమ్మ .

  1917కు భర్త వెంకటసుబ్బయ్య కు న్యాయవృత్తి పై విముఖత కలిగి దేశసేవలో తరించాలని నిర్ణయించుకొని ,కుటుంబాన్ని నెల్లూరుకు తరలించాడు .అక్కడ అనీబిసెంట్ ప్రభావంతో హోం రూల్ లీగ్ స్థాపించి భార్యా భర్తలిద్దరూ తీవ్రంగా ప్రచారం చేశారు .పట్టణమంతా హో౦ రూల్ లీగ్ బాడ్జి లతో కళకళ లాడింది .1921లోశ్రీమతి పొణకా కనకమ్మ తో కలిసి  నెల్లూరులోకాంగ్రెస్ సంఘ మహిళా విభాగం ఏర్పరచి తాను అధ్యక్షురాలుగా కనకమ్మ కార్యదర్శిగా సేవలు అందిస్తూ జాతీయవిద్యా విధానం లో విద్య నేర్పటానికి ‘’కస్తూరీ దేవి విద్యాలయం స్థాపించారు .దీనిని మహాత్మా గాంధీ సందర్శించి ‘’నెల్లూరులో  చూడదగిన ముఖ్య ప్రదేశం ‘’కస్తూరీ దేవి విద్యాలయం ‘’అన్నాడు .ఆబాలికా విద్యాలయం ఈరోజు కళాశాలగా అభి వృద్ధి చెందింది .

  1921లో గాంధీ పూరించిన స్వాతంత్ర్య శంఖారావం విని మహాలక్ష్మమ్మ వేలాది జనంతో రణరంగంలో దూకింది .ఆమెకు సహకరించినవారిలో తిక్కవరపు సుదర్శనమ్మ,కందాళై యతిరాజమ్మ మొదలైన వారున్నారు .ఎల్లాయిపాలెం ,బుచ్చిరెడ్డిపాలెం వగైరా గ్రామాలలోసంచారం చేసి ఖాదీ ,మద్యపాన నిషేధం ప్రచారం చేశారు .దీనితో 2లక్షలున్న ఆబ్కారీ ఆదాయం కేవలం 2వందలకు దిగజారిపోయింది. అంతటి ప్రభావం చూపించారు ఈ మహిళా మాణిక్యాలు, వారితోపాటు వెన్నెలకంటి రాఘవయ్య ,వెంకటసుబ్బయ్య ,తిక్కవరపు రామి రెడ్దిగార్లు  .ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి తీవ్రనష్టం, అంతకంటే ఘోర అవమానం కూడా . మహాలక్ష్మమ్మ కుటుంబం వారంతా నూలు వడికేవారు ఖాదీనే ధరించేవారు .వీరి మూడవ  కుమార్తె  మైత్రేయి నూలు వడకటం పోటీలో స్వర్ణ పతకం గెలుచుకొన్నది .కావలిలో చేనేత వస్త్రాలయం స్థానం ఖాదీ విక్రయశాల నెలకొల్పారు .ఎంతోమందికి జీవనోపాధి కలిగించిన దూర దృష్టికల మహిళా మహలక్షమ్మ .ఉత్పత్తి అయిన ఖాదీ బట్టలను బుజాన వేసుకొని ,జాతీయ గీతాలు పాడుకొంటూ ఇల్లిల్లూ తిరిగి అమ్మేవారామె .

  1927లో నెల్లూరు లో  తుఫాను,కావలిలో కలరా  వస్తే , 1928లో కావలిలో పేదల ఇల్లు కాలిపోయి నిరాదారులైనప్పుడు  స్వయంగా పూనుకొని ,ఆహర పదార్ధాలు మందులు వస్త్రాలు సేకరించి ఆదుకొన్న దయాశీలి ఆమె .1930ఉప్పు సత్యాగ్రహం లో భార్తతో, కనకమ్మ మొదలైన వారితో కలిసి మైపాడు ,తుమ్మపెంట ,గోగులపల్లి లలో పెద్ద ఎత్తున సత్యాగ్రహం చేసి అరెస్ట్ అయ్యారు .ఆరునెలలు రాయవెల్లూరు లో జైలు శిక్ష అనుభవించింది. అది జైలు అనిపించలేదు .మహిళలకు విజయ లాస్యంగా ఉండేది .1930డిసెంబర్ 26న విడుదలై ఇంటికి చేరింది .

  రెట్టించిన ఉత్సాహంతో స్వాతంత్ర్య సమరరంగంలోకి దూకి మహాలక్ష్మమ్మ ఖాదీప్రచారం ,మద్యపాన నిషేధం ,విదేశీ వస్తు బహిష్కరణ లతోపాటు అస్పృశ్యతా నివారణ ,ఉద్యమాలలో మహా చురుకుగా పాల్గొన్నది .జాలి, సానుభూతి ,దయ కల ఆమె హరిజన సేవలో ధన్యురాలైనది .1932 శాసనోల్లంఘన లో బహిరంగ ఉపన్యాసాలు చేస్తూ ప్రజలను చైతన్యపరచింది .నెల్లూరు శ్రీరంగనాయకస్వామి తిరుణాల జనసందోహం మధ్య ఆమె ఉపన్యసిస్తుంటే ,అరెస్ట్ చేసి ,దుకాణాలవద్ద పికెటింగ్ చేస్తోందని కేసుబనాయించి ఒక ఏడాది శిక్ష విధించి ,రాయవెల్లూరు జైలుకు పంపారు .అక్కడ ఆమెకు నరాలబలహీనత పెరిగి ,పక్షవాతం వచ్చి ,శిక్షాకాలం పూర్తికాకుండానే 27-8-1932న విడుదల చేశారు .ఈ జబ్బు అయిదుసార్లు వచ్చింది భర్త వైద్యంతో కోలుకొన్నది.

  భర్త వెంట నీడలా ప్రతి సేవా కార్యక్రమంలో పాల్గొన్నది మహాలక్ష్మమ్మ.వీరిద్దరి కుమారులు కూడా జాతీయోద్యమం లో పాల్గొన్నారు. అంటే మొత్తం కుటుంబం అంతా జాతీయోద్యమం లో పాల్గొని ధన్యత చెందింది .1942లో ఆమె అనారోగ్యంగా ఉన్నప్పుడు భర్త మూడవ సారి జైలుకు వెళ్ళాడు .బలహీనంగా ఉన్న ఆమె భరించలేకపోయింది .మతి చలించింది మళ్ళీ మామూలు స్థితికి రాలేకపోయింది .భారత దేశానికి స్వాతంత్ర్యం రాకముందే 1945లో 61ఏట వీరనారి శ్రీమతి ఓరుగంటి మహాలక్ష్మమ్మ పుణ్యలోకాలు చేరింది .ఆమె త్యాగం సేవ సంస్కారం అనితర సాధ్యం .

 -గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో