నౌపడా ఉప్పు సత్యాగ్రహ నాయకురాలు ,త్యాగి – శ్రీమతి వేదాంతం కమలాదేవి (వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్

కడపజిల్లా నందలూరులో శ్రీమతి వేదాంతం కమలాదేవి 5-5-1897న ప్రతాపగిరి రామ గోపాల కృష్ణయ్య,శ్రీమతి భ్రమరాంబ దంపతులకు జన్మించింది .తండ్రి ప్లీడర్.అయన గారాబు పుత్రిక కనుక రోజూ ఆమెను తనతో కోర్టుకు తీసుకు వెళ్ళేవాడు .అందువల్ల అర్ధం లేని సిగ్గు జంకు ఆమెకు ఉండేవికావు .రాజకీయ ,సాంఘిక పరిజ్ఞానం అలవడింది 12వ ఏటనే .ఆమె వివాహాన్ని బాపట్ల వాసి వేదాంతం వెంకట కృష్ణయ్యయ్య తో  చేశారు .భర్త విద్యావంతుడు, సంస్కారజీవి .బ్రహ్మసమాజ మతానికిఆనాటి అందరు యువకుల్లాగానే ఈయనా ఆకర్షితుడయ్యాడు.పిల్లని అత్తారింటికి కొంతకాలం ప౦ప కుండా ఉంటె , అతడే దారికోస్తాడనుకొన్నారు ఆమె తలిదండ్రులు .కానీ వారి ఆలోచనలకు భిన్నంగా కమలాదేవి 13ఏటనే భర్త భావాలతో ఏకీభవించి కాకినాడకు కాపురానికి వెళ్ళింది .

  ఆమె భర్త అప్పుడు కాకినాడలో హెడ్ మాస్టర్ .పిఠాపురం రాజాగారు స్థాపించిన అనాధ ఆశ్రమ నిర్వాహకుడుగా కూడా ఉండేవాడు .  అందువల్ల కమలాదేవికి జాలి కరుణ ,ప్రేమ ,కార్యనిర్వహణ అభిలాష సేవాభావం అ వయసులోనే కలిగాయి .పని చేసి యేదైనా సాధించగలనన్న ఆత్మ విశ్వాసం ఏర్పడింది .ఆమె నేర్పు ,పట్టుదల అందరికి వి౦తగొలిపేవి .భర్త డాక్టర్ పరీక్ష చదవటానికి కలకత్తా వెడితే, ఈమెకూడా వెంట వెళ్ళింది .అక్కడ మహిళాభ్యుదయానికి ఎంతగానో కృషిచేస్తున్న శ్రీమతి సుప్రభాదేవికి శిష్యురాలై౦ది .బెంగాలీ నేర్చుకొని బెంగాలీతో పాటు ఇంగ్లీష్ పుస్తకాలూ చదివే సామర్ధ్యం సాధించింది .బెంగాలీ పుస్తకాలను కొన్నిటిని తెలుగులోకి అనువాదం చేసింది .

  కలకత్తా చదువు పూర్తిచేసి భర్త వెంకట కృష్ణయ్య కాకినాడ లో 1919లో డాక్టర్ గా స్థిరపడ్డాడు .సంఘానికీ దేశానికి ఎన్నో రకాలుగా సేవ చేయాలన్న విశాలభావాలతో కమలాదేవి కలకత్తా నుంచి కాకినాడ చేరింది .1920లో  గాంధీ పూరించిన స్వాతంత్ర్య శంఖారావం ఈ దంపతుల హృదయాలను ఊపేసింది.జాతీయోద్యమ బీజం మొలకరించి వృక్షంగా పెరిగింది .విదేశీ వస్త్ర బహిష్కారం ,నూలు వడకటం ఖాదీ ధరించటం,ఇంటింటికీ  తిరిగి ఖాదీ వస్త్రాలమ్మటం నిత్య కృత్యమైంది .శాసనోల్లంఘన పై ప్రజాభిప్రాయ సేకరణ కు 1921లో అఖిలభారత శాసనోల్ల౦ఘన సంఘం సామర్లకోటకు వచ్చింది .అప్పటికి కొన్ని రోజులక్రితమే కమలాదేవి బిడ్డస్వరాజ్యం  చనిపోయింది .ఆ బాధను మనసులో దిగమింగుకొని ,విచారణ సంఘాన్ని ఆహ్వానించి వినతిపత్రం సమర్పించింది .ఆనాటికీ నేటికీ ఒక్క సారే కాంగ్రెస్ మహాసభలు ఆంధ్రదేశంలో 1923లో మాత్రమె జరిగాయి .

  కాకినాడలో జరిగిన ఆమహాసభలు రంగరంగ వైభవంగా జరగటానికి కమలాదేవి చేసిన కృషి అనన్య సదృశం .ఘోషా వదిలేసి మహిళలు మహోత్సాహంగా వేలాదిగాపాల్గొని విజయవంతం చేశారు .వారిలో అణువు అణువునా ఉత్సాహం ఉద్రేకం పెల్లుబికింది .కమలాదేవి నాయకత్వంలో అనేక బాలికా ,మహిళా వాల౦టీర్ దళాలు  ఏర్పడి  ఇరవైనాలుగుగంటలు విసుగు విరామం లేకుండా  సేవలందించారు ..స్త్రీల శాంతిదళానికి కమలాదేవి  ఆధిపత్యం వహించింది .భర్త కృష్ణయ్య వైద్య దళానికి నాయకుడు .మహిళాసంఘ కార్య దర్శినిగా కమలాదేవి  ఆంధ్ర దేశమంతా తిరిగి, ఖాదీ ప్రచారం చేసి ,తిలక్ స్వరాజ్యనిధికి భారీగా విరాళాలు సేకరించింది .

   1930లో ఉప్పు సత్యాగ్రహం నాటికి కమలాదేవి ఆరోగ్య౦ ఏమీ బాగాలేదు .ఇంట్లో అంతా పసిపిల్లలు ,ఇల్లు’’ఆనందనిలయం’’ కాంగ్రెస్ ఆస్పత్రి అయింది .అతిధి అభ్యాగతులతో, క్షతగాత్రులతో కిటకిట లాడేది .విశాఖ జిల్లా ఉద్యమం నడపటానికి మహిళా నాయిక కోసం మహర్షి బులుసు సాంబమూర్తి వెతుకుతున్నారు .ఈమె అన్ని ఇబ్బందుల్నీ వదిలేసి ,రంగంలోదూకింది .ఆవేశంగా ఉపన్యాసాలిస్తూ ఉద్బోధిస్తూ చాకచక్యంగా పురుషులతోపాటు చొచ్చుకుపోయింది .ఒక గొప్ప ప్రజానాయికగా ,ఉద్యమకారిణిగా గొప్ప పేరు తెచ్చుకొన్నది .ఏ జిల్లావారు ఆజిల్లో శాసనోల్లంఘన చేయాలని కాంగ్రెస్ నియమాన్ని అనుసరించి కమలాదేవి ‘’నౌపడా ఉప్పు కొఠార్ల మీదికి దండెత్తింది .ఆ ఉద్రేక౦ , సంరంభం ,పట్టుదల అసామాన్యం అనిపించాయి .లాఠీ దెబ్బలకు జంకలేదు ,అరెస్ట్ లకు భయపడలేదు .సాశనోల్లంఘన ఒక పవిత్రయజ్ఞం లా  ప్రజలు  భావించి ముందుకు కదిలారు. అనేకమంది స్త్రీ పురుషులతో కలిసి ఆమె నౌపడా ఉప్పు కొఠార్లవద్ద ఉప్పు సత్యాగ్రహం చేసి 1930మే 20న అరెస్ట్ అయింది .రాయవెల్లూరు జైలులో ఆరు నెలలు బిక్లాస్ ఖిదీగా శిక్ష అనుభవించింది .

   రాయవెల్లూరు జైలులో శ్రీమతి ఉన్నవ లక్ష్మీ బాయమ్మ ,శ్రీమతి ఆచంట రుక్మిణీ లక్ష్మీపతి, దుర్గాబాయమ్మ ,దువ్వూరి సుబ్బమ్మ గార్లవంటి అగ్ర నాయకులతో పరిచయం కలిగింది .కళాత్మక హృదయమున్న ఈమె ఏపనైనా ఉత్తమంగా ,నాణ్యంగా చేసేది .చమ్కీ ,పట్టు ,జరీ ,అల్లికలు పూలతోట పెంపకం ,చక్కగా వంట చేయటం మధురంగా పాడటం వంటివి ఆమెకు కరతలామలకం .ఖైదీగా తనకు వంటపని డ్యూటీ వచ్చినపుడు వంటిల్లు ను ముందు అద్దం లాగా పరిశుభ్రం చేసి ,ఆటర్వాతే కమ్మని వంటచేసేది .1930నవంబర్ 12న  విడుదలై ఇల్లు  చేరింది .అనారోగ్యంగా ఉన్నా ఏపనీ మానలేదు .1931లో ఇచ్చాపురంలో జరిగిన గంజాం జిల్లా మహిలళాసభకు అధ్యక్షతవహించింది .

  1932 రెండవ సారి శాసనోల్లంఘన లో ప్రభుత్వం లాఠీ లను ఉపయోగించి ఉద్యమకారుల్ని భయ భ్రాతుల్ని చేసింది .భారీసభలు జరగకుండా అడ్డగించింది 144 సెక్షన్ విధించింది .సభ జరిపితే రాజద్రోహ నేరం మోపేవారు .ఢిల్లీలో కాంగ్రెస్ సమావేశం జరపరాదాని  ఆంక్షపెట్టింది ప్రభుత్వం. అయినా లెక్క చేయకుండా కొండా వెంకటప్పయ్య ,ఉన్నవా లక్ష్మీ బాయమమ్మగార్లు వెళ్లగా స్టేషన్ లోనే వందలాది మందిని అరెస్ట్ చేశారు .కానీ తెలివిగా ప్రకటించిన చోటకాకుండా గుట్టు చప్పుడు కాకుండా వేరొక చోట సభనిర్వహించారు కమలాదేవి ప్రభ్రుతులు .

  ఈ సందర్భంగా కమలాదేవి తెలివి తేటలు చాతుర్యానికి సంబంధించిన ఒక ఉదంతం తప్పక చెప్పుకోవాలి .గుంటూరు జిల్లాలో శ్రీమతి వేదాంతం కమలాదేవి అధ్యక్షతన 5-6-1932న ఆంధ్రరాష్ట్ర మహా సభ జుగుతుందని అందరూ పాల్గొనాలనీ పత్రికలలో ప్రకటించారు .గోడలమీద కాగితాలు అంటించారు .ఆ సభను ఎలాగైనా జరగనివ్వకుండా చూడాలని నిశ్చయించి పోలీసులు అప్రమత్తులై కమలాదేవి అరెస్ట్ చేయటానికి సర్వ సన్నద్ధంగా ఉన్నారు.నాలుగవ తేదీ అర్ధ రాత్రి గడిచినా ఆమెజాడ కనబడలేదు.అగ్రహారంలో సంపత్కుమారా చార్యులవారి వ్యాయామ శాలలో నాలుగవ తేదీ ఉదయంనుంచి రాములవారి భజన కార్యక్రమాలు రాత్రిదాకాజరిగి రాత్రి పది గంటలకు తీర్ధ ప్రసాదాల సందడి జరిగింది .ఆసమయం లో నలుగురు మనుషులు చేరితే ఆరుగురుపోలీసులు వచ్చేవారు .ఆ రోజు ఆ పోలీసులు కూడా ప్రసాదాలు తీసుకొని ,చుట్టు ప్రక్కలున్న అరుగులపై ఆదమరిచి హాయిగా నిద్రపోయారు .తెల్లవారి కళ్ళు నులుముకొంటూ కలవర పాటుతో పరిగెత్తి లాఠీచార్జి చేస్తున్న పోలీసులతో కలిశారు .తెల్లని ఖాదీ ధరించి జండాలు పట్టుకొని జాతీయగీతాలు పాడుతూ వందే ‘’మాతరం మనదే రాజ్యం ‘’అంటూ దిక్కులు పిక్కటిల్లెట్లు సింహ గర్జన చేస్తున్న కాంగ్రెస్ పెద్దలు ,పౌరులమధ్య విజయోత్సాహం విజయ గర్వం ముఖాన తాండడ విస్తూ ,వేదాంతం కమలాదేవి నిలబడి ఉంది .ఆమె అనుకున్న ప్రకారమే కాకినాడలో బయల్దేరి ,గుంటూరుకు ముందు  స్టేషన్లోనే దిగి ,పల్లెటూరి పెళ్లి ముత్తైదువలాగా తయారై రైల్లోనే గుంటూరుచేరింది .వ్యాయామశాల చుట్టూ ఉన్న చాలా ఇళ్ళల్లో రహస్యంగా వచ్చి దిగిన ప్రతినిధులు ,పొరుగూరి ప్రేక్షకులతోపాటు ఆమె కూడా వచ్చింది .తెల్లవారుజామున కోనేరు గట్టుపై అందరూ చేరి జండా వందన చేశారు .కమలాదేవి అచ్చు వేయించిన తన అధ్యక్షోపన్యాసాన్ని చదివింది .కాంగ్రెస్ మహా సభ ఆమోదించిన శాసన ధిక్కార తీర్మానాలన్నీ చదివి ,ఆమోదించారు .మరికొన్ని ఉపన్యాసాలు ప్రబోధాలు అయ్యేసరికి తెల్లారింది .మహాసభ అద్భుతంగా విజయమైనందుకు అందరూ ఆనందంగా జాతీయగీతాలుపాడుతూ ఊరేగి౦పు గావచ్చారు .తెల్లవారి తెలివిపై తెలివిగా దెబ్బకొట్టి తెల్ల బోయేట్లుచేసిన సాహసి కమలాదేవి .తర్వాత అందరిని  అరెస్ట్ చేశారు .గుంటూరు సబ్ జైలులో పది హేను రోజులుంచి ,ఆరునెలలశిక్షవేసి, రాయవెల్లూరుకు పంపారు .ఈమెతోపాటు అరెస్ట్ అయిన కొండా సత్యవతమ్మగారికి జైలులో టైఫాయిడ్ వచ్చింది .కమలాదేవి ఆమెను కంటికి రెప్పలాగా కాపాడి ఆరోగ్యం కుడుటబడేట్లు చేసింది .

  రెండవ సారి అరెస్ట్ అయి విడుదలయ్యాక 1929,1930,1934లలో అఖిలభారత కాంగ్రెస్ స్థాయీసంఘ సభ్యురాలుగా గౌరవం పొందింది .మూడు సార్లు కాకినాడ మునిసిపల్ కౌన్సిలర్ గా ఉన్నది .ప్రాధమిక విద్యావ్యాప్తి చేసింది .స్త్రీలలో జాతీయభావ స్పూర్తి పెంచింది .తర్వాత వచ్చిన ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున తీవ్రంగా ప్రచారం చేసింది .ప్రత్యర్ధులు కొన్ని చోట్ల ఆమెకు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా చేశారు. అయినా అత్యధికం కాంగ్రెస్ వారు గెలిచారు ఆమె కృషి ఫలించి సంతృప్తి చెందింది .మద్రాస్ కార్పోరేషన్ ఎన్నికలలో ఆచంట రుక్మిణీ లక్ష్మీ పతికి తోడ్పడింది .స్వాతంత్ర్యం రాక మునుపే ఇంతటి దక్షతకల నాయకురాలు,త్యాగమయి  , శ్రీమతి వేదాంతం కమలాదేవి 43వయేటనే14-7-1940న పక్షవాతంతో మరణించింది .

 – గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో