మేకోపాఖ్యానం- 24  -మొద్దుబారిన మెదళ్లు – వి. శాంతిప్రబోధ

శాంతి

దూరంగా మైక్ లోంచి వినిపిస్తున్న మాటలకేసి చెవి రిక్కించి వింటున్నవి చెట్టు కింది మేకల జంట.

నెమలి బ్రహ్మచర్యానికి సంకేతం. మగనెమలి ఆడ నెమలి కలవకుండానే పిల్లల్ని కంటాయి. మగనెమలి నాట్యానికి ఆడ నెమలి పరవశించిపోయి దగ్గరకి వస్తుంది.  మగనెమలి కళ్ళనుండి ఒక ద్రవం స్రవిస్తూ ఉంటుంది. దాన్ని ఆడ నెమలి ఆఘ్రాణిస్తుంది. అలా గర్భం దాలుస్తుంది. అస్కలిత బ్రహ్మచర్యం అంటే అదే. శ్రీకృష్ణుడు జీవితమంతా పాటించింది అదే. కాబట్టే 16వేల సంసారాలు చేశాడు…. అంటూ ఓ ప్రవచనకారుడి ప్రవచనం కొనసాగుతున్నది.

అంతలో “చెప్పేవాళ్లకు బుద్ధిలేకపోతే వినేవాళ్ళకన్నా ఉండొద్దూ.. ఛి ..ఛీ .. ఏం మనుషులు.. చిరాగ్గా ఉంది ” అన్నది అప్పుడే వచ్చి చెట్టు మీద వాలిన కాకి

“నువ్వేమంటున్నావో నా కర్ధం కాలేదబ్బా..  ఏమైంది మనుషులకి ” అమాయకంగా మొహంపెట్టి అడిగింది ఉడుత

” వాళ్ళు చాలా తెలివిగలవాళ్ళు. పెద్ద బుర్ర ఉన్నవాళ్లు అనుకున్నా .. కానీ దాన్నిండా పనికిరాని బురద ఉందని ఇప్పుడర్ధమవుతున్నది.” అన్నది కాకి

“ఏంటోయ్ .. ఏనాడూ లేనిది మనుషులగురించి ఇంత బాధ పడిపోతున్నావ్ ” ఆరా తీసింది అప్పుడే అక్కడకు చేరిన  గాడిద

‘ఒకరు కాదు ఇద్దరు కాదు వేలు, లక్షల మెదళ్ళు మొద్దుబారి పోతుంటే బాధగా ఉండదూ …
ఎవడో ఏదో కూసాడని అదే గుడ్డిగా నమ్మితే ఎట్లా .. ఇసుమంతైనా ఆలోచన ఉండొద్దూ ..” అన్నది కాకి.

“ఏంటబ్బా.. అద్భుతమైన  ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించక,  ఉత్సాహాన్నిచ్చే కబుర్లు చెప్పక  అలా చిటపటలాడిపోవడం ఏమీ బాగోలేదు” మొహం చిట్లించుకుంటూ  అన్నది చిలుక.

“అటు చూడు, మొత్తానికి మగనెమలి నాట్యానికి ఫలితం లభించింది. పరవశించిన ఆడ నెమలి మగ నెమలికి దగ్గరైంది. చూడండి ఆ నెమళ్ళ జంటను,  ఎంత పరవశంతో జతకూడాయో.. ”  తానే అన్నది చిలుక.

“కదా .. మనలాగే అవి జత కడతాయని, ఆడనెమలి గుడ్లు పెడుతుందని  మనకు తెలుసు కానీ ఆ మైక్ లో కూస్తున్నాడే అతనికి తెలియదు.

మీరు విన్నారో లేదో .. జనాన్ని వెర్రి నాగన్నలు చేసి నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. ఆ మాటలు వింటుంటే చిర్రెత్తి పోతున్నది.

ఆ జనానికి ఎట్లా బుద్ది లేదో   పిల్ల పాప నుంచి పండు ముసలి వరకు, పండితుడి నుంచి పామరుడి వరకు , ధనిక -పేద అందరూ అదే నిజమని నమ్మేస్తుంటే .. పిచ్చి లేస్తున్నది

భౌతికంగా కలవకుండా అదెలా సాధ్యమని ఒక్కడంటే ఒక్కడు ప్రశ్నించడే .. వీళ్ళ చదువు చట్టుబండలైందేమో !” అన్నది కాకి

“ప్రవచన కారుడు చెప్పేడు అంటే అది నిజమే అయుంటుంది. ఉత్తుత్తి మాటలు చెప్పరు పండితులు”  అన్నది గాడిద .

“ధర్మాల మర్మాలను విప్పే వాళ్ళు చెప్పేది నిజం కాకపోతే టీవీల్లో , రేడియోల్లో, యు ట్యూబ్ లలో , సోషల్ మీడియా లో  ఎక్కడ చూసిన వాళ్ళ ప్రవచనాలు ఎందుకు ఉంటాయి ?” ప్రశ్నించింది ఉడుత

ఆడ మగ  జత కూడకుండా కళ్ళలో ఉండే ద్రవం నుండి గర్భం దాల్చడం ఈ సృష్టిలో ఎక్కడైనా ఉందా ఆలోచనలో పడింది ఆడమేక

“భూమిలోంచి సీతమ్మవారు పుట్టిందంటే నమ్మలేదా ..
భూతల్లే సీతమ్మవారిని తన ఇంటికి తీసుకుపోయిందంటే నమ్మలేదా .. ఇదీ అంతే” అన్నది మగమేక
“అవునవును సూర్యున్ని చూడగానే కుంతికి కొడుకు పుట్టాడంటే నమ్మలేదా.. ఇంద్రుడు,యముడు,వాయు దేవుడు లాంటి వారితో కాంటాక్ట్ లేకుండానే బిడ్డలు పుట్టారంటే నమ్మలేదా.. ” నవ్వింది చిలుక
“ఆహ్హ్హాహ్హా .. చూస్తుంటే, నెమలి కన్నీటితో నెమలినే కాదు మనిషిని కూడా కంటుందని చెబుతారేమో!” అన్న ఆడమేక మాటలకు గాడిద పకపకా నవ్వింది. ఆ నవ్వుతో జత కలిపాయి ఉడుత, చిలుక

కాకికి మండిపోతున్నది.  దేవాలయ ఆవరణలో ప్రవచనాల ప్రసంగం స్వయంగా విని అక్కడ ఉన్న మహిళలు, పురుషులు హావభావాలు చూసి ఉండడంవల్ల ఆ బాధ, కోపం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

“హూ .. రేపు ఆ మాట ఆ నోట వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎంత అజ్ఞానమైనా వండి వారుస్తారు.  ఎన్ని మూఢవిశ్వాసాలైనా వడ్డిస్తారు. నమ్మే జనం ఉన్నారుగా..ఎంతటి చాదస్తమైనా వాళ్ళ మెదళ్లలో నింపే వాక్చాతుర్యం ఉన్నదన్న ధీమాతో  .. ” వెటకారంగా అన్నది కాకి

“అబ్బో … మహామాయగాడు.. మాటల మత్తులో ముంచేస్తాడు. ఆడవాళ్ళని చూడాలి ఎంత భక్తిశ్రద్దలతో వింటారో .. ఆవెకిలి వాగుడుకి పరవశిస్తారో .. ” కొబ్బరి చిప్పతో వచ్చిన కోతి అన్నది

“ఇంటిచాకిరీ అలసిపోయిన ఆడవాళ్ళని సేదదీర్చే మాటలు చెబుతుంటే మీకేంటి దుగ్ద ? ఆడిపోసుకుంటున్నారు” కసిరింది గాడిద

“నీ మొహం, ఆ మాటలు విన్నావా.. ఎన్నడైనా..

ఆడవాళ్ళ చుట్టూ మాతృత్వపు వల బిగించేసి, మగవాళ్ల నీడగా బతకమని, తలెత్తి లోకాన్ని చూడొద్దని  చెబుతున్నాడు . మన పశు జాతి ఏనాడైనా అట్లా మాట్లాడుతుందా ..?” నిలదీసింది మగమేక

“నిజమే నేస్తం, మాటల చాతుర్యంతో ఆ బుర్రలను  ఆక్రమించేసి ఏం చేస్తున్నారో తెలియనివ్వకుండా ఆలోచించనివ్వకుండా తెలియని మత్తులోకి తీసుకుపోతున్నారు.

ఆఖరుకి వాళ్ళు తినే  తిండి మీద, కట్టే బట్టమీద, వాళ్ళ ఆలోచనల మీద వీళ్లద పెత్తనం.  ఈయనొక్కడే కాదు ఇట్లా బతకనేర్చిన జాతి పెరిగిపోతున్నది ” అన్నది కోతి

”  అయ్యో ఇలాంటి వాళ్లు సమాజానికి ప్రమాదకరం. ” అన్నది ఆడమేక

“అబ్బ .. ఛా.. మీరు మరీనూ ..” అన్నది గాడిద

“మతానికి, సనాతన ధర్మానికి తమ జ్ఞానాన్ని , ఆలోచనని తాకట్టు పెట్టేసినట్టున్నారు  ” ఆలోచనగా అన్నది చిలుక
“అది వాళ్ళ ఉద్యోగం, వ్యాపారం .  జనాలకి మూఢత్వం, ముర్కత్వం, మూఢనమ్మకం  వెదజల్లుతూ కుండ కదలకుండా  కోట్లు సంపాదించుకుంటున్నట్టున్నారు .”  అన్నది మగమేక.

 “వీళ్ళ  చదువు చట్టుబండలు కాను ..  ఆ మధ్య ఎప్పుడో రాజస్థాన్ హై కోర్ట్ జడ్జి కూడా ఇట్లాగే మాట్లాడాడు ” ఎప్పుడో విన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ అన్నది కాకి

“వామ్మో.. ” గుడ్లు వెళ్లబెట్టింది ఉడుత

“ఇంకేం విన్నారు మీరు .. వాళ్ళ పైత్యం అంతా ఇంతా కాదు.

ఆడవాళ్లు మగవాళ్ళని ఆకర్షించడానికే తయారవుతారట .  ఆడవాళ్లు టీ షర్ట్ వేసుకుంటే మగవాడు ఏమైనా చేసే హక్కుంటుందట … ఈ అరవై ఏళ్ల వయసులో నేనే టెంప్ట్ అవుతాను . ఇక యువకుల కారా ..
అత్యాచారాలు జరుగుతున్నాయంటే జరుగుతాయి . జరగవా . అంటాడొక రోజు .
ఆడవాళ్లు జుట్టు గాజులు మెట్టెలు , మంగళ సూత్రం లేకపోతే మగాడు ఆమె వైపు చూస్తాడు అంటాడు
నోరు తెరిస్తే అబద్దాలు , ద్వంద వైఖరి , మూఢనమ్మకాల్ని సైన్స్ అని బొంకడం .. అన్ని తమకే తెలుసని దబాయింపులు, వెటకారాలు , వెకిలి నవ్వులు …  ” వీళ్ళ కారుకూతలు వినలేక చస్తున్నా వాపోయింది కాకి

“వందలు వేలల్లో భజనపరులు ..  బుర్రవాడరు .. ఎంత డ్యామేజ్ చేస్తున్నారో .. ” కోతి కొబ్బరి నములుతూ

“జనాన్ని ముందుకు పోనివ్వడంలేదు .. వందల వేల  వెనక్కి తీసుకుపోతున్నారు  ” మగమేక

“పబ్లిక్ గా స్త్రీలను క్రించపరుస్తూ ఉంటే చూస్తూ ఉరుకుంటారేంటో ..  తీసుకుపోయి బొక్కలో  వెయ్యక” ఆవేశపడింది ఆడమేక

  “మతాలు దేవుళ్ళు మూఢాచారాలు  కాకుండా

సైన్స్ భాష సాంకేతికత, సమానత్వం, స్వేచ్చ, వాస్తవిక దృష్టి అలవరచుకునే  ప్రవచనాలు స్వతంత్రంగా తార్కికంగా ఆలోచించే విధంగా ప్రవచనాలు చెప్పేరోజు వస్తుందా… “అన్నది తీవ్రంగా ఆలోచించిన కాకి

“హ్హహ్హా.. ఆ దిశగా వెళ్లనీకుండా, ఆలోచనలు వికసించనీయకుండా చేస్తున్న ప్రయత్నమే ఆ మెదళ్లలో చెత్తాచెదారంతో నింపడం.” అన్నది ఆడమేక.

“ఆలోచన పెరిగితే  కొత్త ప్రశ్నలు వస్తాయి. ఆధిపత్యాన్ని,

అబద్ధాలను నిలదీస్తాయిగా..

అందుకే ఎక్కడైనా ప్రశ్న తలెత్తి చూస్తే దాని పీక నులిమే ప్రయత్నం చేయడం” అన్నది మగమేక.  నిజమేనన్నట్లు తలూపింది కాకి.

“ఊరు కాలుతుంటే పేలాలు ఏరుకు తినే మొఖాలు.. థూ..”  అంటూ ఉమ్మింది ఆడమేక

-వి. శాంతిప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో