అబద్దాల అద్దం జారిపోయింది
నిజాల్ని నిర్భయంగా చూసాక..!
ఎన్నెన్ని మాటలో..
తియ్యటి తేనెలో ముంచినట్టు..
అవి చేస్తాం, ఇవి చేస్తామంటూ..
మనుషుల్ని మత్తులో ముంచి
కపట ప్రేమలు చూపించే బడా నాయకులెందరో..!
ఖద్దర్ మాటున చేసే శద్దర్ పనులెన్నో..!
ప్రజల పక్షానే మేమంటూ..
ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించే నేతలే కొందరు.
గద్దె నెక్కిన గర్వంతో గరీబుల్ని
గానుగెద్దుల్ని చేసి ఆడించే మధాన్దులే..!
ఐదేళ్లకోసారి ఆడిన అబద్దాలనే
తిప్పి తిప్పి కుర్చీలాట్లాడే కుతంత్రులే.
కులగజ్జితో కుళ్ళిపోతున్న
కురిడి నేతలే..
బూతుల ప్రసంగాలతో అసెంబ్లీని
అట్టుడికిస్తున్న అంధకారులు.
ప్రజలసొమ్మును పెత్తందారి తనముతో
బహిరంగంగా ఖర్చు చేస్తున్న బరితెగించిన పెద్దలు.
వెయ్యి అబద్దాలాడి తెచ్చుకున్న
కుర్చీ చాటున జరుగుతున్న రాజకీయ దోపిడీ..!
తెలుసుకో మూర్ఖ..
అబద్దానికి ఆయుష్షు తక్కువని..
నిజానిదెప్పుడూ ఒంటరి పోరాటమని..!
-జయసుధ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~