మార్పు కోసం శ్రమించి
ఆకాశాన్ని చేరిన
అరుణ తారలన్నీ
ఎర్రని కరపత్రాలై
ప్రపంచమంతా విస్తరిస్తున్నాయి
దోపిడి సమాజాన్ని
కూకటి వేళ్ళతో
పెకళించేందుకు
కొడవళ్ళను సిద్దం చేస్తున్నాయి
శ్రమకు తగ్గ ఫలితాన్ని
ప్రశ్నించమంటూ
అసమానతలను
ఎన్నాళ్ళు భరిస్తావంటూ
మెదడును అదేపనిగా
తొలుస్తున్నాయి
అందాలను ఆరబోసే
అంగడి బొమ్మను చేసి
మాడ్యూల్ కిచెన్ గా
తయారు చేసి
నీ విలువలను వేలం వేస్తున్నారు
ఎదురు తిరగకుంటే
నీ బతుకు మారదనే
అక్షర సత్యాన్ని బోధిస్తున్నాయి
మన ప్రయాణం కోసమే
ఓ ప్రణాళిక సిద్ధం చేశాయి
పెట్టుబడిదారి సమాజాన్ని
అంతం చేస్తే
సోషలిజమనే అందమైన ప్రపంచం
మనకోసం వేచివుందంటూ
దాన్ని నిర్మించుకునే
ధైర్యాన్ని మనలో నింపాయి
మన అసలైన
గమ్యాన్ని చేరేందుకు
బాటలు వేశాయి
ఎరుపెక్కిన అక్షరాలతో నిండిన
ఎర్రని పుస్తకాన్ని చేతబట్టి
ముళ్ళను దాటుకుంటూ
అడుగులు వేస్తే
పూలు స్వాగతం పలుకుతాయని
రుజువు చేశాయి
– సలీమ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~