పొలిమేర నుంచి అభివృద్ధి దాకా… (వ్యాసం)- వి. శాంతిపబ్రోధ

శాంతి

నంబూరి పరిపూర్ణ.

పేరు పరిపూర్ణ మాత్రమే కాదు. ఆవిడ జీవితాన్ని పరిపూర్ణంగా మలుచుకున్న సంపూర్ణ వ్యక్తిత్వం.

అయితే ఆమె జీవితంలో ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు లేవా… అంటే ఉన్నాయి. స్త్రీలందరి జీవితాల్లో ఉన్నట్లే ఆమె జీవితంలోను ఎన్నో అగాధాలున్నాయి. అయితే, అగాధాల లోతుల నుంచి పైకి ఎగబాకడం, వ్యక్తిగా నిలదొక్కుకోవడం సామాన్య విషయం ఏమీకాదు. అందుకు దృఢచిత్తం ఉండాలి. వచ్చిన అవకాశాలను అంది పుచ్చుకుని సమాజ స్వభావ, స్వరూపాలను అర్థం చేసుకోగల సత్తువ ఉండాలి. అదే సమయంలో తన స్థితిని, పరిస్థితిని విశ్లేషించుకుంటూ తనను తాను సన్నద్ధం చేసుకోగలిగిన శక్తి ఉండాలి. అవన్నీ పరిపూర్ణగారిలో ఉన్నాయని ఆవిడ రాసిన వెలుగుదారులలో చదివితే అర్థమవుతుంది.

దళిత కుటుంబంలో పుట్టిన పరిపూర్ణగారి జీవితం తన తోటి ఆడపిల్లలకు భిన్నంగా కనిపిస్తుంది. ఈనాటి ఆడపిల్లలతో పోల్చుకున్నప్పుడు కూడా ఆవిడ ఆనాడే ఎంతో ముందుకు నడిచినట్లు స్పష్టమవుతుంది.  ఆధిపత్య వర్గాల్లోని చాలామంది మహిళలకంటే కూడా పరిపూర్ణగారు మెరుగైన జీవితాన్ని గడిపారనే చెప్పవచ్చు.

అందుకు కారణం ఆవిడ చదువు, చురుకుదనం, ఉద్యమ నేపథ్యం, సామాజిక పరిస్థితుల పట్ల అవగాహనతో పాటు ఉపాధ్యాయుడైన తండ్రి, కమ్యూనిస్టు ఉద్యమాలతో మమేకమైన అన్నయ్య, మాలదాసు ( దాసుళ్ల) కుటుంబ నేపథ్యం, చర్చి స్కూల్‌ కూడా కారణం కావచ్చు.

సాఫీగా సాగని ఒడిదుడుకుల జీవితాన్ని ఆవిడ ఎదుర్కొన్న తీరు, సమాజాన్ని అర్థం చేసుకొన్న విధానం, తాను ఏర్పరచుకున్న విలువల్లో నడచిన విధం అందరికీ స్పూÛర్తిదాయకమే.

పరిపూర్ణగారిని నేను మొదట ఢిల్లీలో 2014లో చూసిన గుర్తు. అప్పుడు దాసరి అమరేంద్రగారు, పరిపూర్ణగారు ఢిల్లీ తెలుగుసాహితి, సాహిత్య అకాడెమీ, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక సంయుక్తంగా నిర్వహించిన సదస్సుకు వచ్చారు, ఆ సదస్సులో మొదటిసారి చూసాను. కానీ అప్పటికి అమరేంద్రగారితోగానీ , పరిపూర్ణగారితోగానీ పరిచయం లేదు. ఆనాడు ఆవిడలో నాకు మా పెద్దమ్మ రూపం కనిపించింది. ఆత్మీయంగా అనిపించారు.

ఆ తర్వాత దాసరి శిరీష అక్క పుస్తక ఆవిష్కరణ సభలో చూశాను. ఆత్మీయంగా పలకరింపులు.

అప్పుడనుకున్నాను ఆవిడ గురించి తెలుసుకోవాలని. వీలైతే రాయాలని. ఈలోగా ఆవిడ పుస్తకం వెలుగు దారులలో వచ్చింది. ఆవిడ గురించి ఆవిడే చెప్పడం, రాయడం కంటే గొప్పగా ఎవరైనా ఏమి రాయగలరు?!

వెలుగుదారులలో చదువుతున్నంత సేపు ఒక ఉద్వేగం. ఆడపిల్ల పద్యాలు పాడుతూ నటించడం ఊహకందని రోజుల్లో బాల పరిపూర్ణ ప్రహ్లాదుడిగా నటించడం గొప్ప విషయం. ఆడపిల్ల చదువుకోవడానికి, చదివించడానికి అవకాశాలు లేని కాలంలో, అనువుగా లేని పరిస్థితుల్లో ఆవిడ మద్రాసు చేరి చదువుకోవడం విశేషం.

తన 85 ఏళ్ల జీవితం- బాల్యం, సినిమా, రేడియో, చదువు, ఉద్యమం, ఉద్యోగం, వివాహ జీవితం, పిల్లలు కుటుంబ బాధ్యతలు ఆక్రమంలో ఎదుర్కొన్న అవమానం, వివక్ష వంటి అనేక జ్ఞాపకాలను అక్షరాలుగా గుది గుచ్చి మన ముందు ఉంచిన పుస్తకమే వెలుగుదారులలో…

ఆనాటి సమాజంలో ఆవిడ పుట్టిన కుటుంబం కొంత చైతన్యవంతమైన, చదువుకున్న, దేశభక్తి మెండుగా  ఉన్న కుటుంబం కావడం కూడా ఆమె అభ్యున్నతికి కారణం అనుకోవచ్చు. అయితే చదువుకోవడానికి, ఎదగడానికి వచ్చిన అవకాశాల్ని ఆవిడ వదులుకోలేదు. అట్లాగని తన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టలేదు.

పరిపూర్ణ గారు పెరిగిన ప్రాంతంలో స్వాతంత్రోద్యమ కాలంలో సంఘ సంస్కరణ ఉద్యమం నేపథ్యంలో వచ్చిన చైతన్యం ఆ తర్వాత కాలంలో కొరవడినట్లుగా అనిపించింది ఈనాటి పరిస్థితులను చూసినప్పుడు.

ఉద్యమ ప్రభావంతో ఆదర్శవంతులైన ఎందరో వ్యక్తుల పరిచయం, వారి స్నేహ సాంగత్యం పరిపూర్ణగారి వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మలిచి ఉంటుంది. ఉద్యమాల్లో, చైతన్యశీలురైన వ్యక్తులు కూడా పెళ్లి విషయానికి వచ్చేసరికి కులానికి, వర్గానికి బానిసై కోరి చేసుకున్న మహిళకు ద్రోహం చేయడం, తనను నమ్మిన మహిళను, పిల్లల్ని దూరం పెట్టడం, బాధ్యతల్ని విస్మరించడం పితృస్వామ్య ఆధిపత్య పోకడలను అద్దం పట్టింది.

గడ్డు పరిస్థితుల్లో కూడా ఆవిడ ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ముగ్గురు పిల్లల్నీ ఒంటి చేత్తో పెంచి ఉన్నత చదువులు చెప్పించి, ప్రయోజకుల్ని చేయడం, విలువైన వ్యక్తులుగా మలచడం సామాన్య విషయం కాదు. ఆధిపత్య లక్షణాలు లేని ఒక ఉద్యమ కార్యకర్తగా కనిపించే పరిపూర్ణ అమ్మకు నా శాల్యూట్‌.

                           **                                                 **                                             **                                     **

ఇప్పుడిక్కడ పరిపూర్ణగారి పొలిమేర నవల ముచ్చటించాలనిపిస్తున్నది. అది 208 పేజీల నవల.

ఊరి పొలిమేరల్లో ఉన్న జన జీవితం ప్రధాన నేపథ్యంగా సాగిన నవల పొలిమేర. ఈ నవల కథాంశంలోకి నేను పోవడంలేదు. నవలని చదివినప్పుడు నాకు కలిగిన భావనల్ని మాత్రమే పంచుకుంటున్నాను. కులాధిపత్యం, అంటరానితనం, అంటరాని వారిగా గుర్తించబడిన వారి దేవాలయ ప్రవేశంలోని డొల్లతనం, అధికారుల తీరు స్పష్టంగా తెలుపుతుంది రచయిత్రి.

కోటమ్మ వంటి తల్లులకు పిల్లలని ఆధిపత్య భూస్వామ్య కుటుంబాల్లోని పిల్లల్లాగా చదివించుకోవాలన్న కోరిక… చదివించలేని అశక్తత. ఆ సమయంలో క్రెస్తవ మిషనరీలు అడుగుపెట్టడం, చదువులకు మార్గాలు ఏర్పరచడం విద్యావంతులైన పొలిమేరల్లోని యువకుల అభ్యుదయ భావనలు. ఒకనాటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవనాన్ని మనకు పరిచయం చేస్తుంది నవల.

రచయిత ఎక్కడా ఒక వర్గంవైపు, ఒక అస్తిత్వం వైపు వకాల్తా పుచ్చుకున్నట్లు కనిపించరు. సమాజాన్ని, సంఘర్షణను నిష్కర్షగా చూపడం గమనిస్తాం.

నందిగ్రావ్‌ు గ్రామ పొలిమేరల్లో దేవాలయ ప్రవేశ సమయంలో జనం భయం చూసినప్పుడు 1998-99 కాలంలో నేను చూసిన సంఘటనలు నా ముందు నిలిచాయి. ప్రాంతాలు వేరైనా, కాలం మారినా పరిస్థితి అదే అణగారిన ప్రజల్లో గుడి ఛాయలకు వెళ్లడం అంటే అది పెద్ద సాహసమే. ధైర్యం కూడదీసుకుని తర్వాత జరగబోయే పరిణామాలకు సిద్ధపడాలి. ఆ అట్టడుగు ప్రజల జీవితం మరింత అస్తవ్యస్తం అవుతుందని, మరింత చిన్నాభిన్నం అవుతుందని వాళ్లకు తెలుసు. ఆ అనుభవాలు వారిని ముందుకు పోనీయకుండా కాళ్లకు బంధం వేస్తుంటాయి.

కులవర్గాలకు సంబంధించినంత వరకూ రాజ్యం ఎన్ని కుచ్చితాలు చేస్తుందో, ఎంత అహంకారం అధికారం ప్రదర్శిస్తుందో తెలుపుతుంది పొలిమేర. కులానికీ వర్గానికీ తలొగ్గే పాలనావ్యవస్థలు ఎవరివైపు మొగ్గుతాయో, అధికార యంత్రాంగం పాము చావకుండా కర్ర విరగకుండా ఎలా వ్యవహరిస్తుందో స్పష్టం చేసిన నవల ఇది.

బలిసిన జనంలోని ముఠా తగాదాలకు, వాళ్ల రాజకీయాలకు మధ్య బడుగుజనం బలిపశువులవడాన్ని చర్చిస్తుంది. అన్నదమ్ముల్లా మెలగాల్సిన వాళ్లు రెండు వర్గాలుగా చీలిపోయి పెద్దల ఆధిపత్య పోరులో వీళ్లు సమిధలవుతున్నారు. వాస్తవాన్ని వాళ్లు గ్రహించలేకపోతున్నారు.

మతం మనుషుల్లోకి ఎలా చొచ్చుకొస్తుందో తెలుపుతుంది. ఆయా సమూహాల్లో, కులాల్లో, వ్యక్తుల్లో ఉన్న ఆశల్ని, కోరికల్ని, బాధల్ని, అగాధాల్ని ఆధారంగా చేసుకుని మరో మతం ఏ విధంగా లోబరుచుకుంటుందో స్పష్టం చేస్తుంది. అదే విధంగా తామున్న మతంలో అందని విద్య ఇతర వసతులు, సదుపాయాలు మరో మతంలో అందడం ఒక కారణమైతే, అండగా నిలవడం, గౌరవించడం మరో కారణంగా కనిపిస్తుంది.

మతం మారినా ఇంతకు ముందు మతంలోని పండుగలు కూడా జరుపుకోవడం వంటి సాంస్కృతిక జీవనం చూపించారు. ఇప్పటికి కూడా మతం మారినవాళ్లు రెండు మతాల పండుగలు చేసుకోవడం కనిపిస్తుంది.

ముత్యాలు జేసుదాసుగా మరో మతంలోకి వెళ్లడానికి కారణాన్ని స్పష్టం చేస్తుంది నవల. అంటరానివారిగా బడి మెట్లకు దూరమైన సామాజిక వర్గాలకు చదువు అందితే వారు ఏ విధంగా ఎదుగుతారో తెలుపుతుంది. మిషనరీలు ప్రధానంగా మత ప్రచార లక్ష్యంతోనే పనిచేస్తున్నా వాటి వెనుక ఉన్న మానవీయ కోణం, బడుగు బలహీనవర్గాల అభివృద్ధి వికాసం కోసం చేసిన అపార కృషిని తెలుపుతుంది ఈ నవల.

పొలిమేరల్లోని యువత చదువుతో పాటు నాగరికత నేర్చుకుని న్యూనతా భావం నుండి బయటపడి స్వేచ్చగా బతకడం చూపుతుంది. అదే విధంగా కులం తమ కంటే కింది వారిని ఏ విధంగా చూస్తుందో ఎలా ప్రతిబంధకంగా మారుతుందో తెలుపుతుంది.

బడుగు జీవితాల్లోంచి పైకి ఎదిగినవారు కూడా తమ జాతిని పట్టించుకోని తత్వాన్ని, వారిలోని ఆధిపత్య భావజాలాన్ని ఎండగడుతూనే. కులాన్ని, వర్గాన్ని అధిగమించిన విద్యాధికులైన ఇద్దరు యువకులు ఉమ్మడి కృషితో గ్రామాభివృద్ధిని ఎలా సాధించారో చూపుతుంది.

గ్రామంలో విద్య, వైద్యం, తాగునీరు, పక్కా రోడ్లు, మురుగునీటి పారుదల సౌకర్యం వంటి ఏర్పాట్ల గురించి జరిగిన చర్చల్లో చదువుకున్న యువతుల ఆలోచనలకి చోటు కనిపిస్తుంది తద్వారా మహిళలకు అభివృద్ధిలో భాగస్వామ్యాన్ని కల్పిస్తుంది

ఒక సందర్భంలో కుల రిజర్వేషన్లను ప్రస్తావిస్తూ చదువులో చురుకైన వాళ్లు కులం కారణంగా ముందుకు పోలేకపోవడాన్ని చూపుతుంది. కులం మతం ఏదైనా ఆర్థికంగా మెరుగుపడిన వాళ్లు మనుషులుగా విలువ పెంచుకుంటారని చెబుతుంది పొలిమేర.

ఈ నవల ద్వారా సంపూర్ణగారి సామాజిక, ఆర్థిక, రాజకీయ, జెండర్‌ దృక్పథం, సమాజం పట్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంత జీవితాలపై ఆవిడకి ఉన్న అవగాహన స్పష్టమవుతుంది.

జీవితంలో ఎదురైన అవకాశాలనే కాదు. కష్టాలను, సుడిగుండాలను వ్యక్తిగా ఎదిగే శక్తులుగా మార్చుకున్నారు. సమాజం నుండి తనకు రావలసింది అందుకుంటూ, తన బాధ్యతగా సమాజానికి ఇవ్వాల్సింది ఇచ్చిన పూర్ణ వక్తిత్వం పరిపూర్ణ.

-వి. శాంతిపబ్రోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో